రహస్య హింసకు అచ్చమైన అక్షరరూపం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

‘స్త్రీకి కూడా ఒక శరీరం ఉంటుంది.. దానికి వ్యాయామం ఇవ్వాలి. మెదడు ఉంటుంది.. దానికి జ్ఞానం ఇవ్వాలి. హృదయం ఉంటుంది.. దానికి అనుభవం ఇవ్వాలి’ అంటారు చలం. వందేండ్లకి ఆవల పరుగెత్తిన ఆయన ఊహాశక్తిలో తరాలెన్ని మారినా భూమిపై హింసను కచ్చితంగా ఎదుర్కొనేది ఒక్క స్త్రీ మాత్రమే అని గ్రహించి ఉంటారు. అందుకే అప్పుడూ, ఇప్పుడూ అనే తేడాలేకుండా నిలిచిపోయే ఆ మాటలు రాసి ఉంటారు. కులం, మతం, వర్గం, ఆర్థిక స్థిరతల ఆధారంగా ఒక స్త్రీ ఎదుర్కొనే హింసా తీవ్రతలో తేడా ఉండొచ్చునేమో కానీ, హింస మాత్రం కచ్చితంగా ఉంటుంది. ఇప్పటికీ స్త్రీలు రెండు రకాల హింసలను ఎదుర్కొంటున్నారు. అందులో కనిపించే హింస ఒకటైతే, కనిపించనిది రెండోది. ఈ రెండు అంశాలు వైద్యులకు ఉండే సహజమైన సునిశిత దృష్టిని ఎంతమాత్రం దాటిపోవు అనడానికి ఉదాహరణ డాక్టర్‌ గీతాంజలి. స్వతహాగా స్త్రీల లైంగిక సమస్యల వైద్యులూ, మానసిక నిపుణులూ అయిన ఆమె చైతన్యవంతమైన రచయిత్రి కూడా కావడంచేత అట్టడుగు స్థాయి నుంచి ఉన్నత వర్గాల దాకా… ఏ దశలో ఉన్న మహిళ అయినా హింస ను ఎదుర్కొనడంలో మినహాయింపు లేదనేది వీరి కథలు చదివితే కండ్లకు కట్టినట్లుగా అర్థమవుతుంది. ఒక స్త్రీ పరాయి పురుషుడి నుంచి ఎదుర్కొనే హింసనే కాదు. వివాహంతో ఒక్కటైన భార్యాభర్తల బంధంలో నెలకొనే చిన్నపాటి స్పర్థల నుంచి సంఘర్షణల స్థాయిదాకా అనేక అంశాలను పూర్తి సామాజిక స్పృహతో కథలుగా మలిచారు. గతంలో ‘హస్బెండ్‌ స్టిచ్‌ -1’ పేరుతో వచ్చిన కథల పుస్తకం స్త్రీల విషాద లైంగిక గాథలతో విస్తృత చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. అదే పుస్తకానికి కొనసాగింపుగా ‘స్టోమా’ హస్బెండ్‌ స్టిచ్‌-2 పేరిట మరో పుస్తకాన్ని ఇటీవలే ఆన్లైన్‌ వేదికగా విడుదల చేశారు.

వారసత్వ బూజు దులపడానికే…
ఈ పుస్తకంలో 14 కథలు ఉన్నాయి. స్త్రీ పురుష సంబంధాల్లోని అమాన వీయతను చర్చించడం ప్రధానాంశంగా ఈ కథలు సాగుతాయి. ఎక్కడా నాటకీయతకు తావు లేకుండా, వాస్తవికత అనే తాడుపై పట్టు కోల్పోకుండా సాగిన రచనలు ఇవన్నీ కూడా. స్త్రీల లైంగికతపై పురుషస్వామ్య వ్యవస్థ పీడనలను విడమర్చి చెప్పడంలో రచయిత్రి ఎక్కడా మొహమాట పడలేదు. మగవారికే కాకుండా, ఆడవారికి కూడా అందించిన పితృస్వామిక వ్యవస్థ వారసత్వ బూజు దులపడానికే గీతాంజలి పూనుకున్నారని అనిపిస్తుంది. ఆడవారు బయటకు చెప్పుకోడానికి జంకే రహస్య హింసకు అచ్చమైన అక్షరరూపం ఈ స్టోమా కథలు.

రంగులు వెలికితీసేందుకు

‘మరేమో… మరేమో… మా నాన్న రాత్రి పూట నా బట్టలు ఇప్పడుగా… అందుకనే మంచోడు’ అని అమాయకంగా చెప్పే ఏడేండ్ల చిన్నారి ఫలక్‌ కథ ‘మా నాన్నెందుకు మంచోడంటే..!’. ఈ రెండు మాటల్లోనే ఆ చిన్నారి ఎదుర్కొన్న లైంగిక హింస స్ఫురిస్తుంది. ఈ కథ నుంచి మొదలయ్యే హింసా కథల పర్వం ‘ఫేస్‌ ఆఫ్‌’ కథతో ముగుస్తుంది. రకరకాల యాప్‌ల పేరుతో వెల్లువెత్తిన సామాజిక మాధ్యమాల ద్వారా ముఖాలు దాచుకుని, ఆడవారిపై రకరకాలుగా వికారాలు ఒలకబోసే పురుషుల రంగులు వెలికితీసేందుకు ప్రయత్నించారు రచయిత్రి.

ఆసాంతం తినేసే దిగులు

‘భర్తకి ఇన్సులిన్‌ ఇంజెక్షనూ, మందులు ఇచ్చి భోజనం అతని మంచం పక్కన స్టూలుపై పెట్టి, తను బాక్సు కట్టుకుని ఉద్యోగానికి బయలుదేరే కళావతులను’, ‘ఒరే బామ్మర్ది మీ అక్క జాగ్రత్తరోరు. ఒక కంట కనిపెట్టుకుని ఉండు’ అని తమ్ముడికి అప్పగించి దుబారు ఫ్లైటులెక్కుతూ.. ‘ఏం ఆలస్యంగా తగలడ్డావూ షాపులో ఎవడ్నన్నా తగులుకున్నావా? కిరాణా కొట్టు రమణగాడు నీ అందం చూసి ఆపాడా?’ అని అడిగే రామనాథాలను మన ఇంటి పక్కనో, వెనకనో, ఎదురుగానో చూస్తూనే ఉంటాం. కాళ్ళూ చేతులు ఆడినన్నాళ్ళే వాళ్ళు భర్తలు కాదు, మంచాన పడ్డా కూడా భర్తలే. అటువంటి భర్తలకు ఒత్తాసు పలికే ‘చెప్పు.. నా తమ్ముణ్ణెందుకు కాదంటున్నావు, వాడికేం తక్కువనీ. కాలూ చెయ్యి పడిపోయినంత మాత్రాన మొగతనం పోయినట్లుకాదు. వాడి కెట్లా కావాలో అట్లా చెయ్యి’ అని పురుషస్వామికత్వాన్ని నరనరాన జీర్ణించుకుని గదమాయించే రామలక్ష్మి లను కూడా చూస్తూనే ఉంటాం. చెప్పుకుంటే సాధారణ సమస్యగా కనిపిస్తూనే మనిషి ఆసాంతం తినేసే దిగులు ఇటువంటి దౌర్జన్యాల్లో కనిపిస్తుందనేది ‘కర్ర’ కథ చదివితే అర్థమవుతుంది.

బతుకు భయానకం
కుల,మత, వర్గాల వారీగా కూడా ఆడవారు మానసికంగా ఎదుర్కొనే హింస తీవ్రత ఒకటే అయినా, హింసల్లో ఎంతోకొంత తేడా ఉండొచ్చు అని చెప్పే కథ. ఉదాహరణకు హిందూ స్త్రీలు ఎదుర్కొంటున్న హింసకూ, ముస్లిం స్త్రీలు ఎదుర్కొనే హింసకూ కొంత తేడా ఉంటుందనే విషయాన్ని ‘ఖత్నా’ చెబుతుంది. ఖత్నా అనేది ముస్లిం పురుషుల్లో సర్వ సాధారణమైన ఆచారం. లైంగిక సమస్యలు దాటడానికి ఖత్నా చేసుకోమని హిందూ పురుషులకు కూడా వైద్యులు సిఫారసు చేస్తుండడం తెలిసిందే. అయితే ఆడవారికి ఖత్నా అనేది అనవసరమైన, బతుకు భయానకం చేసే ఒక ప్రక్రియ. ఆడ వారికి ఖత్నా చేయడం అంటే జీవితాంతం వారిని నరక కూపంలోకి నెట్టి వేయడమే. ముస్లింలలోని అన్ని తెగలలో ఈ ఆచారం లేదు. ఒక వర్గంలో మాత్రమే ఉంది. వారు ఆడ పిల్లలకు ఖత్నా చేసి వారి కోరికలు అణచి వేస్తున్నామని భావించే పెద్దలు, ఆ తరువాత వారు ఎదుర్కొనే హింసను ఏమాత్రం లక్ష్య పెట్టకపోవడం ఏండ్లుగా ఒక ఆచారంగా కొనసాగుతూ వస్తున్న హింసా కాండ.

ఎన్ని విజయాలు సాధించినప్పటికీ
పెండ్లి తరువాత మహిళలపై అనేక రూపాల్లో హింస జరుగుతుంటుంది. లైంగిక హింస కావొచ్చు. ఆమెకు ఇష్టంలేని గర్భం కావొచ్చు. గర్భస్రావం, తొమ్మిది నెలలపాటు ఓర్పుగా బిడ్డను మోసి కనడం కావొచ్చు. బిడ్డ పుట్టడానికి జరిగే ఆపరేషన్‌ కావొచ్చు. ఆ తరువాత బిడ్డలు కావాలా? వద్దా? అనే నిర్ణయమైనా కావొచ్చు. బిడ్డకు పేరుపెట్టే విషయమో, పెంపకమైనా కావొచ్చు. మరే రూపంలోనైనా కావొచ్చు. బలహీనులు అనుకునే ఎవరిపైనైనా హింస జరుగుతూనే ఉంటుంది. తరతరాలుగా అబలగా గుర్తించబడిన స్త్రీ నేడు ఎన్ని పనులను చాకచక్యంగా నిర్వర్తిస్తున్నప్పటికీ, విజయం సాధిస్తున్నప్పటికీ చులకనతో కూడిన అభిప్రాయం మాత్రం ఇంకా చెరిగిపోలేదు.

జడలు విప్పిన హింస

సమ్మతి, చచ్చిన పాము, ఎందుకు ఎందుకకా..?, దోజఖ్‌, పెద్ద బాలశిక్ష, ఆక్సిజన్‌, అనెస్థీషియా, చావు వంటి కథలు కాలానికి అనుగుణంగా ఆడవారిపై జడలు విప్పిన హింసను పట్టిచూపుతాయీ కథలు. ఆర్థిక పరిపుష్టి కలిగిన స్త్రీలైనా పురుష దాష్టీకానికి బలైన గాథలకు ప్రతిరూపం ‘స్టోమా’ పుస్తకం. ఆడవారిపై జరుగుతున్న హింసను 180 డిగ్రీల కోణంలో ఆవిష్కరించిన సాహసి ఈ రచయిత్రి. పుస్తకం చదివిన ప్రతి ఒక్కరినీ ఆలోచనలో పడేయగల అద్భుత శైలి ఉన్న కథలు. పుస్తకంపై పురుషులకోసం అనే ట్యాగ్‌లైన్‌ను ప్రత్యేకంగా రాసి ఏ వర్గానికి ఇటువంటి పుస్తకం అవసరమో చక్కగా చెప్పారు. పుస్తకంలోని కథలు అన్నీ కూడా నిత్యం ఇళ్ళల్లో వాడే భాషలోనే సాగుతాయి. ప్రతి ఒక్కరికి తేలికగా అర్థమయ్యే రీతిలో రచన సాగడం విశేషం. కథలు చదవడం మొదలు పెట్టాక ఎంత గట్టి గుండె అయినా ఆ కథలోని వేదన వెంటాడుతూనే ఉంటుంది. మానసిక నిపుణులు కూడా కావడంతో బాధితుల ఘోషను క్షుణ్ణంగా చదివి మరీ రాసారు.
పుస్తకం పేరు: స్టోమా – స్త్రీల విషాద లైంగిక గాథలు, రచయిత్రి : గీతాంజలి (డా|| భారతి), వెల: రూ. 150/-, పుస్తకం లభించు స్థలం: నవోదయ బుక్‌ హౌస్‌, 8897791964లో సంప్రదించవచ్చు.

మై హస్బెండ్‌ హూ…

చదువుకుని, ఉద్యోగం చేస్తూ కాసిన్ని జీతం రాళ్ళు సంపాదిస్తున్న మహిళలపై హింస జరగడంలేదని కూడా చెప్పలేం. ఆమెను మనిషిగా కూడా చూడని వ్యక్తులు ఎందరెందరో ఉన్న సమాజం మనది. ఇటీవల జరిగిన ఒక సంఘటన ఇక్కడ ప్రస్తావించదలిచాను. ఇటీవలే పెండ్లయిన కొత్తజంటకు మధ్యలో కలహాలు వచ్చాయి. ఇద్దరూ ఇంజనీరింగ్‌ పూర్తి చేసి ఉద్యోగాలు చేస్తున్నవారే. కాస్తోకూస్తో సామాజిక స్పృహ కలిగి ఉండడం వారి బాధ్యతగా మనం భావిస్తుంటాం. కానీ అతడు తన భార్యను, తనకు కట్నంగా ఇచ్చిన బంగారు ఆభరణాలను, వరకట్నాన్ని కలిపి, ఎంత కాదని వాదించినా సరే… ‘మేరీ ప్రాపర్టీ హై, మై హస్బెండ్‌ హూు’ అనే అంటాడు. ఇప్పటి యువ సమాజంలోనైనా మార్పు వచ్చిందేమో అనే ఆశను చిత్రవధ చేశాడు ఆ కుర్రాడు.

బలవంతంగా రుద్దుతూ…

అంతంలేని భర్తల కోర్కెలు తీర్చడానికి ప్రాణాల మీదకు తెచ్చుకునే భార్యలు ఇప్పటికీ ఉన్నారు. నడి వయసుకు చేరినా విపరీతమైన లైంగిక కోర్కెలను ఆమెపై బలవంతంగా రుద్దుతూ ఆమె మర్మాంగాలకూ, గర్భసంచికీ తూట్లు పొడిచి, నిండు ఆరోగ్య వంతురాలిని చేజేతులా రోగిగా మార్చి నాలుగుగోడల మధ్య బంధించిన హింసకు ఏ సెక్షన్‌ ద్వారా శిక్ష వేయాలో. భర్తే నరకకూపంలోకి నెట్టిన తరువాత ఆమె తరఫున ఫిర్యాదు చేసేవారెవరైనా ఉంటారా అసలు? ఈ విషయాలను ‘స్టోమా’ కథ చర్చిస్తుంది.
– నస్రీన్‌ ఖాన్‌, 9652432981

RELATED ARTICLES

Latest Updates