715 ఎకరాల అటవీభూమి హాంఫట్‌!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • రంగారెడ్డి జిల్లా చిలుకూరు ఫారెస్ట్‌ ల్యాండ్‌పై అక్రమార్కుల కన్ను
  • ఈ భూముల్లోనే జాతీయ మృగవని జింకల పార్కు
  • అమ్మకానికి అంతా సిద్ధం!
  • సీసీఎల్‌ఏ పేరిట నకిలీ ఉత్తర్వులు
  • ఐఏఎస్‌ సంతకాలు ఫోర్జరీ 
  • కొనడానికి పోటీపడిన బడా వ్యాపారులు
  • అసలు విషయం తెలిసి కంగుతిన్న వైనం

కరోనా వేళ రంగారెడ్డి జిల్లాలో భారీ భూదందాకు కొందరు అక్రమార్కులు తెరలేపారు. ఔటర్‌ రింగురోడ్డుకు ఆనుకుని ఉన్న కోట్ల విలువ చేసే చిలుకూరు అటవీ భూములనే ఏకంగా అమ్మేసేందుకు నకిలీ పత్రాలు సృష్టించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీసీఎల్‌ఏ సోమేశ్‌కుమార్‌ పేరు మీదే ఈ ఉత్తర్వులు తయారు చేయడం గమనార్హం. ఒకటి కాదు… రెండు కాదు ఏకంగా 715-13 ఎకరాల అటవీ భూములకు తామే హక్కుదారులమంటూ పత్రాలు సృష్టించి ఈ భూములను అమ్మకానికి పెట్టారు. సిటీకి దగ్గరగా ఉండడంతో ఈ భూముల్ని కొనడానికి పలువురు బడా వ్యాపారులు, బడానేతలు పోటీపడినట్లు తెలిసింది. కొనాలనుకునే కొందరు వ్యాపారులు తమకు సన్నిహితులైన అధికారులకు ఈ సమాచారాన్ని చేరవేశారు.  భూమికి సంబంధించిన పత్రాలను పరిశీలించాలని వారు అధికారులకు కోరారు. ఆ పత్రాలను చూసిన ఆఫీసర్లు షాక్‌ తిన్నారు. పత్రాలన్నీ నకిలీవని అధికారులు తేల్చారు. అంతేకాదు అమ్మకానికి  పెట్టిన సర్వే నంబరు భూముల్లో జాతీయ మృగవని జింకల పార్కు ఉండడడం గమనార్హం. మార్కెట్లో అమ్మకానికి పెట్టిన ఈ భూమి నకిలీ పత్రాలు ‘ఆంధ్రజ్యోతి’ చేతికి అందాయి. ఈ పత్రాలపై ఆరా తీస్తే మరిన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. యాదాద్రి జిల్లాకు సంబంధించిన ఓ ఫైల్‌ నంబరును వాడుకుని నకిలీ ఉత్తర్వూలు తయారు చేసి విలువైన భూములను అమ్మకానికి పెట్టారు. వీటిపై ఫ్రభుత్వ ఉన్నతాధికారులకూ సమాచారం అందడంతో విచారణ మొదలైనట్టు తెలిసింది.

నిజాం వారసులమంటూ…
నిజాం నవాబు భారత ప్రభుత్వానికి లొంగిపోయిన తర్వాత తనకు సంబంధించిన కొన్ని ఆస్తులను ప్రభుత్వానికి స్వాధీనం చేశారు. మరికొన్ని ఆస్తులను అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇలా ఆయనకు సంబంధించిన 15,964 ఎకరాలను సేకరించి… రూ.4లక్షలు అటవీశాఖ ద్వారా చెల్లించారు. ఇందులో మెయినాబాద్‌ మండలం చిల్కూరులోని సర్వేనంబరు1లో గల 1417-25 ఎకరాల అటవీ భూములు ఉన్నాయి. వీటిని 1956 ఫిబ్రవరి 28న అప్పటి హైదరాబాద్‌ కలెక్టర్‌ ద్వారా సేకరించి గెజిట్‌లో ప్రచురించారు. ఆ తర్వాత నిజాం వారసులమంటూ కొందరు తెరపైకి వచ్చారు. భూములకు సంబంధించిన పరిహారం తమకు అందలేదని న్యాయస్థానాల్లో కేసులు వేసి ఓడిపోయారు. ఏడెనిమిదేళ్ల కిందట 250 ఎకరాల భూమిని దొడ్డిదారిన రిజిస్ట్రేషన్‌ కూడా చేశారు. ఈ వివాదానికి సంబంధించి అప్పట్లో సబ్‌రిజిస్ట్రార్‌ కూడా సస్పెండ్‌ అయ్యారు. తరువాత మళ్లీ ఇపుడు ఈ భూముల వ్యవహారం తెరపైకి వచ్చింది.

ఈ పత్రాల్లో  ఏముందంటే..?
ఈ భూముల్లో  715-13 ఎకరాలకు తామే హక్కుదారులమంటూ కొందరు నకిలీ పత్రాలు సృష్టించారు. నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌.. 1952లో  ఈ భూముల్ని ఆయన కుమారుడు ఇమాదాద్‌ జహాబహుదూర్‌కు గిఫ్ట్‌ డీడ్‌ ఇచ్చారని సీసీఎల్‌ఏ సోమే్‌షకుమార్‌ పేరు మీద జారీ అయిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సప్లిమెంటరీ సేత్వారీ కూడా ఉన్నట్లు ఇందులో తెలిపారు. వీటిని ధ్రువీకరిస్తూ ఈ భూముల జోలికి వెళొద్దంటూ అటవీశాఖకు సీసీఎల్‌ఏ ఆదేశాలు జారీ చేసినట్లు పత్రాల్లో ఉంది. సీసీఎల్‌ఏ  సోమే్‌ష పేరుతో వెలువడిన ఈ ఉత్తర్వుల్లో సీసీఎల్‌ఏ సహాయక కార్యదర్శి  కె హేమలత పేరుతో (ఆమె కార్యదర్శిగా పని చేస్తున్నారు) సంతకం ఉంది. ఇలా ఈ ఐఏఎస్‌ అధికారి పేరు కూడా అక్రమార్కులు ఫోర్జరీ చేశారు.

యాదాద్రి జిల్లా ఫైల్‌ నంబర్‌తో దందా
ఈ నకిలీ పత్రాలపై ‘ఆంధ్రజ్యోతి’ ఆరా తీయగా ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. వాస్తవానికి సీసీఎల్‌ఏ జారీ చేసిన ఉత్తర్వుల నంబరు (పి3/135/ 2020)  యాదాద్రి జిల్లాకు సంబంధించినదిగా తేలింది. కొత్తగా ఏర్పడిన యాదాద్రి జిల్లాలోని బొమ్మలరామారం మండలం రామలింగంపల్లి, మేడ్చల్‌ జిల్లా కీసర గ్రామాల మధ్య సరిహద్దు వివాదానికి సంబంధించిన ఉత్తర్వులు ఇవి. ఈ ఏడాది ఫిబ్రవరి నాలుగో తేదీన ఇవి జారీ అయ్యాయి. ఇదే ఫైల్‌నంబర్‌ పేరుతో అటవీ భూములపై నకిలీ పత్రాలు సృష్టించి వీటికి తామే హక్కుదారులమంటూ అక్రమార్కులు అమ్మకానికి పెట్టారు. దీనిపై లోతుగా విచారణ చేస్తే మరిన్ని అక్రమాలు బయటపడే అవకాశాలు ఉన్నాయి.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates