నష్టం 100 కోట్లు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • శ్రీశైలం విద్యుత్తు కేంద్రంలో పూర్తిగా కాలిన నాలుగో యూనిట్‌
  • ఆరో యూనిట్‌లో ప్యానల్‌ బోర్డు దగ్ధం
  • 3, 4 యూనిట్లకు పాక్షికంగా నష్టం
  • ఒకటి, రెండు మాత్రం పూర్తి సురక్షితం
  • ప్రాథమికంగా అంచనా వేసిన జెన్‌కో
  • విచారణ కమిటీ బృందం, సిబ్బందితో
  • సీఎండీ ప్రభాకర్‌రావు భేటీ

హైదరాబాద్‌/ నాగర్‌కర్నూల్‌ : శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్తు కేంద్రంలో జరిగిన ప్రమాదంతో సుమారు రూ.100 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని టీఎస్‌ జెన్‌కో ప్రాథమికంగా అంచనా వేసింది. పవర్‌హౌ్‌సలో మొత్తం ఆరు యూనిట్లు ఉండగా.. అందులో నాలుగోది పూర్తిగా కాలిపోయిందని, ఆరో యూనిట్‌లో ప్యానల్‌ బోర్డు దగ్ధమైనట్లు గుర్తించింది. మూడు, ఐదో యూనిట్లకు కొంత ఇబ్బంది ఏర్పడినా.. పెద్దగా నష్టం జరగలేదని, ఒకటి, రెండు యూనిట్లు మాత్రం పూర్తి సురక్షితంగా ఉన్నాయన్న అంచనాకు వచ్చింది. జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు బుధవారం శ్రీశైలం జల విద్యుత్తు కేంద్రాన్ని సందర్శించారు.

సర్వీస్‌ బే, ఆరు యూనిట్ల జనరేటర్లు, కంట్రోల్‌ ప్యానెల్స్‌, ట్రాన్స్‌ ఫార్మర్లు, ఇండోర్‌ గ్యాస్‌ సబ్‌ ేస్టషన్‌, మెయిన్‌ కంట్రోల్‌ రూమ్‌ల్లో తిరుగుతూ అగ్ని ప్రమాద ప్రభావానికి గురైన పరికరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. శాఖా పరమైన విచారణ జరుపుతున్న ఎస్పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డి నాయకత్వంలోని బృందంతోనూ చర్చించారు. అక్కడే ఉండి సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్న జెన్‌కో డైరెక్టర్లు వెంకటరాజం, సచ్చిదానందం, అజయ్‌, చీఫ్‌ ఇంజినీర్లు ప్రభాకర్‌రావు, సురేశ్‌ తదితరులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విద్యుత్తు పరికరాలకు జరిగిన నష్టాన్ని మదింపు చేశారు. ఆరు యూనిట్లలో నాలుగు (1, 2, 3, 5) దాదాపు సురక్షితమన్న అభిప్రాయానికి వచ్చారు. పూర్తిగా కాలిపోయిన నాలుగో యూనిట్‌లో జరిగిన ఆస్తి నష్టమే ముఖ్యమైంది. ఇందులో ప్యానల్‌ బోర్డు, జనరేటర్‌కు జరిగిన నష్టాన్ని సమగ్రంగా పరిశీలించి అంచనా వేయనున్నారు. జనరేటర్‌కు జరిగిన నష్టం ఎక్కువ ఉంటే ఆ మేరకు పునరుద్ధరణ వ్యయం కూడా పెరిగే అవకాశముంది. అయితే కొత్త జనరేటర్‌ తీసుకురావాల్సిన అవసరం ఉండకపోవచ్చని, ఉన్న దాన్నే మరమ్మతు చేస్తే సరిపోతుందనే భావనకు వచ్చారు.

ఆరో యూనిట్‌లో కొత్త ప్యానల్‌ బోర్డు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. కృష్ణా నదికి భారీ వరదలు వచ్చిన నేపథ్యంలో శ్రీశైలం కుడి జల విద్యుత్తు కేంద్రం (ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఉంది) 1998, 2009లో మునిగిపోయింది. ఇందులో 110 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 7 యూనిట్లు ఉన్నాయి. 2009లో ఒక యూనిట్‌లో 39  రోజుల్లోనే విద్యుదుత్పత్తిని పునరుద్ధరించారు. శ్రీశైలం ఎడమగట్టులో ఆరు యూనిట్లు ఉన్నాయి. ఒక్కొక్కదాని సామర్థ్యం 150 మెగావాట్లు. ఇందులో రెండు యూనిట్లు (1, 2) పూర్తి సేఫ్‌ కావడంతో వీటిని పక్షం రోజుల్లోనే పునరుద్ధరించగలమని టీఎస్‌ జెన్‌కో చెబుతోంది. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ప్రభాకర్‌రావు డైరెక్టర్లు, ఇంజినీర్లకు సూచించారు. ఈనెల 20వ తేదీ రాత్రి చోటు చేసుకున్న అగ్నిప్రమాదంతో విద్యుత్తు కేంద్రం నిలిచిపోయి చీకట్లు నెలకొన్నాయి. ఊట నీరు, ట్రాన్స్‌ఫార్మర్లను కూలింగ్‌ చేసే నీటిని బయటకు పంపే ప్రక్రియ కూడా ఆగిపోయింది.

దీనికితోడు మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది దాదాపు 120 గ్యాలన్ల నీటిని వినియోగించడంతో విద్యుత్తు  కేంద్రంలో సుమారు 27 అడుగుల మేర నీరు నిలిచింది. టర్బైన్లు ఉన్న ఫ్లోర్‌ (మూడు అంతస్తు కన్నా దిగువ) మునిగిపోయింది. దాదాపు 15 అడుగుల మేర నీటిని ఇప్పటికే బయటకు పంపించారు. మరో 10-12 అడుగుల వరకూ ఉన్న నీటిని బయటకు పంపే పని గురువారానికి పూర్తికావొచ్చని అంచనా వేస్తున్నారు. డీవాటరింగ్‌ చేసే పంపులు నీటిలో మునిగిపోయాయని, వాటిని మరమ్మతుకు పెద్దగా ఖర్చుకాకపోవచ్చని భావిస్తున్నారు. అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు విద్యుత్తు కేంద్రంలోకి వెళ్లలేని పరిస్థితి ఎందుకు ఏర్పడిందన్న కోణంలో విచారణ జరుపుతున్నారు.

పునరావృతం కానీయం: ప్రభాకర్‌రావు
విద్యుత్‌ ఉద్యోగుల భద్రతకు మరిన్ని పకడ్బందీ చర్యలు తీసుకుంటామని, ఇలాంటి దుర్ఘటనలు మళ్లీ జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని సీఎండీ ప్రభాకర్‌రావు హామీ ఇచ్చారు. ఉద్యోగులు ఏమాత్రం అభద్రతా భావానికి లోనుకాకుండా మరింత అంకితభావంతో పనిచేసి, రాష్ట్ర ప్రజలు నమ్మకాన్ని నిలబెట్టాలని పిలుపునిచ్చారు. ప్లాంట్‌లో విధులు నిర్వర్తించే 200 మంది సిబ్బందితో ఆయన సమావేశమయ్యారు. ‘‘అత్యంత దురదృష్టకరమైన సంఘటనలో ఉద్యోగుల ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. తోటి వారు మరణించినప్పుడు కొంత అభద్రతా భావం నెలకొంటుంది. దీన్ని నేను అర్థం చేసుకోగలను. నేను కూడా ఎంతో బాధపడుతున్నాను. ఇలాంటి సమయంలోనే మరింత పట్టుదలతో, గుండె నిబ్బరంతో పనిచేయాలి. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగుల భద్రత కోసం తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటాం. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవడానికి సీఎం కేసీఆర్‌ సిద్ధంగా ఉన్నారు. వారిని ఎలా ఆదుకోవాలనే విషయాన్ని పరిశీలిస్తున్నాం’’అని చెప్పారు.

సోదరుడి అంత్యక్రియల నుంచే…
అగ్ని ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులను సోమవారం పరామర్శిస్తున్న సందర్భంలోనే..  సీఎండీ ప్రభాకర్‌రావు సోదరుడు శ్రీనివా్‌సరావు వరంగల్‌లో మరణించినట్లు సమాచారం అందింది. వెంటనే అక్కడి నుంచి ఆయన వరంగల్‌ బయల్దేరారు. మంగళవారం సోదరుడి అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రభాకర్‌రావు ముందుగా ఖరారైన షెడ్యూల్‌ ప్రకారంగానే బుధవారం శ్రీశైలం వెళ్లారు. తన అన్న మరణించిన దుఃఖాన్ని దిగమింగుకుని తమకు ధైర్యం చెప్పడానికి వచ్చిన సీఎండీ ప్రభాకర్‌రావుకు పలువురు ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు.

జెన్‌కో అధికారి తీరే కారణమా?
శ్రీశైలం జల విద్యుత్తు కేంద్రంలో నిర్వహణ పేరుతో కమీషన్లకు కక్కుర్తి పడుతూ ఓ అధికారి వ్యవహరించిన తీరే.. ప్రమాదానికి కారణమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మంగళవారం రాత్రి శ్రీశైలం జెన్‌కో కాలనీలో మృతుల సంతాప సభ జరిగింది. ఈ సందర్భంగా సదరు అధికారి కమీషన్ల బాగోతాన్ని విద్యుత్తుసిబ్బంది, వివిధ రాజకీయ పార్టీల నేతలు… జెన్‌కో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావడం చర్చనీయాంశమైంది. పవర్‌హౌస్‌ నిర్వహణ, లైటింగ్‌ వ్యవస్థ, కాలం చెల్లిన బ్యాటరీల మార్పు, జనరేటర్ల డీజిల్‌ కోసం జెన్‌కో లక్షలాది రూపాయలను ఖర్చు చేస్తుంది. ఈ క్రమంలో ఇటీవల వరకూ నిర్వహణ బాధ్యతలు చూసిన అధికారి.. ప్రతి పనికి పది శాతం పర్సంటేజీ వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. చాలా పనులకు టెండర్లు ఆహ్వానించకుండానే తమ ఇష్టం వచ్చిన ఏజెన్సీలకు బాధ్యతలు అప్పజెప్పారని  సిబ్బంది ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం విచారణ జరిపిస్తే అక్రమాలు బహిర్గతమవుతాయని చెబుతున్నారు.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates