దిక్కులేదు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

సోనియాపైనే మళ్లీ విధేయత ప్రకటించిన కాంగ్రెస్‌
7 గంటల హైడ్రామా తరువాత సీడబ్ల్యూసీ నిర్ణయం
6నెలల పాటు ఆమే అధ్యక్షురాలు… ఈలోగా కొత్త నేతకోసం అన్వేషణ
అధ్యక్షుడు ఖరారైయ్యాక
ఏఐసీసీలో లాంఛనంగా ఎన్నిక
పగ్గాలు చేపట్టేందుకు రాహుల్‌ ససేమిరా
అసమ్మతివాదులపై విరుచుకుపడ్డ అగ్రనేత
రాజీనామాకైనా, ఏ శిక్షకైనా మేం సిద్ధం
ఎప్పటికీ కాంగ్రెస్‌లోనే ఉంటాం: ఆజాద్‌
లేఖ రాసినవారిపై ద్వేషం లేదు
స్పష్టం చేసిన కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియా

న్యూఢిల్లీ: ఊహించినట్లే కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ సోనియాగాంధీ నాయకత్వంపైనే విధేయత ప్రకటించింది. 23 మంది సీనియర్‌ నేతలు (అసమ్మతివాదులు) సంధించిన లేఖాస్త్రంపై రేగిన సంక్షోభం 48 గంటల్లోనే చల్లారిపోయింది. దానిపై ఏడుగంటల పాటు వాడిగా చర్చించిన వర్కింగ్‌ కమిటీ- చివరకు ఆమెను ప్రస్తుతానికి అధ్యక్షురాలిగా కొనసాగించడానికే మొగ్గు చూపింది. విస్తృత చర్చ అనంతరం- పదవిలో కొనసాగాల్సిందిగా సోనియాను కోరుతూ మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఓ తీర్మానం ప్రవేశపెట్టారు. దాన్ని సీడబ్ల్యూసీ ఏకగ్రీవంగా ఆమోదించింది.

ఈ తీర్మానం ప్రకారం కొత్త అధినేత ఎంపిక ప్రక్రియ సాధ్యమైనంత తొందరగా మొదలు కావాలి. పరిస్థితులను బట్టి 6నెలల్లోగా ఏఐసీసీ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎన్నిక జరిగేట్లు చూడాలి. ‘లేఖాస్త్రం నన్ను బాధించినప్పటికీ, జరిగిందేదో జరిగిపోయింది. నాకు ఎవరి పట్లా ద్వేషం, దురభిప్రాయం లేవు. కాంగ్రెస్‌ ఓ కుటుంబం. అందరం కలిసి పార్టీని ముందుకు తీసికెళ్దాం’ అని సోనియా వ్యాఖ్యానించారు.

‘పార్టీ విశాల ప్రయోజనాల దృష్ట్యా ఆ లేఖ రాశాం తప్ప.. సోనియా, రాహుల్‌కు మేం వ్యతిరేకం కాదు. నిజంగా మేం చేసినది సరికాదంటే ఏ శిక్షకైనా సిద్ధం. కానీ మేం ఎప్పటికీ కాంగ్రె్‌సలోనే ఉం టాం’ అని అసమ్మతివాదుల తరఫున వకాల్తా పుచ్చుకున్న గులాం నబీ ఆజాద్‌ స్పష్టం చేశారు. దీంతో వ్యవహారం మొత్తం టీ కప్పులో తుఫాన్‌ మాదిరిగా తాత్కాలికంగా సద్దుమణిగింది.

ప్రారంభంలోనే రాజీనామా ప్రకటన
సోమవారం సీడబ్ల్యూసీ సమావేశం వీడియో కాన్ఫరెన్స్‌ పద్ధతిలో మొదలు కాగేనే సోనియా(73) రాజీనా మా నిర్ణయాన్ని ప్రకటించారు. ‘కొత్త అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియను వెంటనే మొదలుపెట్టండి’ అన్నారు. తన రాజీనామాకు కారణాలను, సీనియర్ల లేఖపై తన వివరణను ఏఐసీసీ ఇన్‌ఛార్జి కేసీ వేణుగోపాల్‌కు ఇచ్చి చదివి వినిపించమన్నారు.

ఆయన చదివాక తొలుత మాట్లాడిన మాజీప్రధాని మన్మోహన్‌సింగ్‌ ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ అధ్యక్షపదవిని వీడొద్దని కోరారు. సీనియర్ల లేఖను కూడా ఆయన తప్పుపడుతూ ఇలా రాయడం దురదృష్టకరమన్నారు. ఆయన మాటలతో ఏకీభవించిన మరో సీనియర్‌ నేత ఏకే ఆంటోనీ లేఖలోని అంశాలు క్రూరమైనవిగా అభివర్ణించారు.

ఇదా సమయం: రాహుల్‌
కల్పించుకున్న రాహుల్‌.. లేఖ రాసిన సమయం, సందర్భాన్ని తీవ్రంగా ప్రశ్నించారు. ‘ఓ పక్క రాజస్థాన్‌లో మనప్రభుత్వం తీవ్ర కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. అధ్యక్షురాలు కూడా అనారోగ్యంతో గంగారామ్‌ ఆసుపత్రిలో ఉన్నారు. ఆ సమయంలోనా లేఖ రాసేది? ఇది విపక్షాలకు ఊతమివ్వదా?’ అని ఆయన నిలదీసినట్లు సమాచారం.

‘విపక్షాలకు ఊతమివ్వదా..’ అన్న వ్యాఖ్య ‘బీజేపీతో కుమ్మక్యయ్యారని’ మీడియాలో వచ్చిందని కాంగ్రెస్‌ నేతలు కొందరు ఆ తరువాత వివరణ ఇచ్చారు. ‘ఏవైనా అభిప్రాయాలుంటే వాటిని పార్టీ వేదికపై చర్చించుకోవాలి తప్ప బహిరంగ చర్చ చేయరాదు.. మీడియాకు ఎక్కరాదు’ అని రాహుల్‌ అన్నారు.

రాజీనామాకు సిద్ధం: ఆజాద్‌
సమావేశంలో పాల్గొన్నవారంతా ఒకరి వెంట మరొకరు దాడి చేయడంతో రాజీనామాకు తాను సిద్ధమని గులాంనబీ ఆజాద్‌ ప్రకటించారు. లేఖ రాయడం సోనియా, రాహుల్‌ నాయకత్వాలను ప్రశ్నించడం కాద ని, అసలా ఉద్దేశమే తమకు లేదని ఆయన స్పష్టం చేశారు. ‘ఇందిరాగాంధీ, సంజయ్‌ సహా అనేక మంది హయాంలో దశాబ్దాలుగా పనిచేస్తున్నాను. నాకు పార్టీ యే ముఖ్యం’ అని ఆయన ఒకింత భావోద్వేగంతో అన్నారు. రాహుల్‌ వ్యాఖ్యలపై తాను రాజీనామాకు సిద్ధపడలేదని, అది వేరే సందర్భమని ఆజాద్‌ ఆ తరువాత వివరణ ఇచ్చారు.

లేఖపై సంతకం చేసిన ముకుల్‌ వాస్నిక్‌ కూడా భావోద్వేగంతో మాట్లాడారు. ‘సోనియాజీ నుంచి ఎంతో నేర్చుకున్నాను. పార్టీ వెంటే నడిచాను. నేను చేసినది తప్పయితే క్షమించండి’ అన్నారు. ఆనంద్‌శర్మ కూడా తప్పు అని భావిస్తే క్రమశిక్షణ చర్యను భరించడానికి సిద్ధమన్నారు. ఆజాద్‌ మాట్లాడుతున్నపుడు ప్రియాంక వాద్రా కల్పించుకుని ‘మీరు లేఖలో రాసినదొకటి, ఇప్పుడు చెబుతున్నది మరొకటి’ అని నిలదీశారు. లేఖలోని అంశాలపైనే తాను మాట్లాడుతున్నాని ఆజాద్‌ చెప్పుకొచ్చారు.

సోనియా, రాహుల్‌లే ప్రధాన గళాలు:
సీడబ్ల్యూసీ తీర్మానం
మోదీ ప్రభుత్వంపై పోరులో కాంగ్రె్‌సకు సంబంధించినంత వరకూ సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలే ప్రధాన గళాలని సీడబ్య్లూసీ తీర్మానం పేర్కొంది. పార్టీవాదులను సంప్రదించకుండా రాహుల్‌ కేంద్రంపై ట్వీట్లు చేయడం ఇబ్బందికరంగా ఉందన్న అసమ్మతివాదుల అభియోగం దరిమిలా ఈ స్పష్టీకరణ వెలువడడం విశేషం. ”సీనియర్‌ నేతల లేఖను వర్కింగ్‌ కమిటీ పరిగణనలోకి తీసుకుంది. రోజువారీ వ్యవహారాల్లో సోనియాకు సహకరించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయమైంది. పార్టీని, నాయకత్వాన్ని బలహీనపరిచే ప్రయత్నాలను సహించేది లేదు. సోనియా, రాహుల్‌ గాంధీల నాయకత్వాన్ని బలోపేతం చేయాలని పార్టీ ఏకగ్రీవంగా తీర్మానించిం ది’ అని సమావేశం తర్వాత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, అధికార ప్రతినిధి సూర్జేవాలా మీడియా సమావేశంలో ప్రకటించారు.

6 నెలలుగా వేలాది మందిని బలిగొన్న కరోనా మహమ్మారి, ఆర్థిక సంక్షోభం, పేదరికం, చైనా దురాక్రమణ వంటి సమస్యలపై కేంద్రాన్ని సోనియా ప్రశ్నించారని, ముఖ్యంగా లక్షలాది వలస కూలీల దుస్థితిపై ఆమె నిలదీసిన వైనం కేంద్రాన్ని కదిలించిందన్నారు. పార్టీ అంతర్గత అంశాలను బహిరంగంగా చర్చించడాన్ని వర్కింగ్‌ కమిటీ ఖండించిందని చెప్పారు.

బీజేపీతో కుమ్మక్కై లేఖ రాశారా?
నాయకత్వ మార్పును కోరుతూ లేఖాస్త్రం సంధించిన 23 మంది కాంగ్రెస్‌ ‘అసమ్మతివాదులు’ బీజేపీతో కుమ్మక్యయ్యారంటూ సీడబ్ల్యూసీ సమావేశంలో రాహుల్‌ గాంధీ విరుచుకుపడ్డట్లు సోమవారం మీడియాలో వార్తలు హల్‌చల్‌ చేశాయి. దీనిపై మాజీ మంత్రి కపిల్‌ సిబల్‌ ఓ ట్వీట్‌ చేశారు. ‘మేం బీజేపీతో కుమ్మక్కయ్యామని అంటున్నారు. రాజస్థాన్‌, మణిపూర్‌లలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలను నిలిపేందుకు న్యాయపోరాటం చేశాం.

అయినా మేం బీజేపీతో కుమ్మక్కయ్యాం!’ అని వ్యాఖ్యానించారు. ఈవిషయం రాహుల్‌ దృష్టికి వెళ్లగా, సిబ్బల్‌కు స్వయంగా ఫోన్‌ చేసి తాను ఆ మాట అనలేదని చెప్పారు. దీంతో సిబల్‌ తన ట్వీట్‌ను ఉపసంహరించుకున్నారు. హరియాణా పీసీసీ ఛీఫ్‌ కుమారి సెల్జా ఈ వ్యాఖ్య చేసినట్లు, ఆమె కూడా లేఖ రూపకర్తల్లో ఒకరైన తన రాష్ట్ర ప్రత్యర్థి భూపిందర్‌సింగ్‌ హూడాను ఉద్దేశించి అన్నట్లు వెల్లడైంది.

రాహులే రావాలి: సీనియర్లు
పార్టీ పగ్గాలను రాహుల్‌ చేపట్టాలని అహ్మద్‌ పటేల్‌ కోరారు. రాహుల్‌ను ఒప్పించాల్సిందిగా కర్ణాటక నేత సిద్ధరామయ్య సోనియాను కోరారు. హాజరైన 52 మందిలో మూడొంతుల మందికి పైగా నేతలూ అదే మాటన్నారు.

ఆసుపత్రిలో ఉన్నపుడు లేఖా?
ఓ పక్క రాజస్థాన్‌లో మన ప్రభుత్వం తీవ్ర కష్టాల్లో పడి కొట్టుమిట్టాడుతోంది. అధ్యక్షురాలు కూడా అనారోగ్యంతో గంగారామ్‌ ఆసుపత్రిలో ఉన్నారు. ఆ సమయంలోనా లేఖ రాసేది? విపక్షాలకు ఊతమివ్వదా.. ?
– రాహుల్‌ గాంధీ

రాహులే రావాలి: సీనియర్లు
సోనియా విముఖంగా ఉన్నందున పార్టీ పగ్గాలను రాహుల్‌ చేపట్టాలని అహ్మద్‌ పటేల్‌ కోరారు. ఆయనను అనేకమంది సమర్థించారు. కానీ రాహుల్‌ అందుకు తిరస్కరించారు. మే నెలలో తాను చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. రాహుల్‌ను ఒప్పించాల్సిందిగా కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య సోనియాను కోరారు.

హాజరైన 52 మందిలో మూడొంతుల మందికి పైగా ఇతర నేతలు కూడా అదే మాటన్నారు. లేఖను తయారుచేసినది ఆనంద్‌ శర్మ అని అంటూ- సీనియర్లు ఇలా లేఖలు రాయడం మానుకోవాలని అహ్మద్‌ పటేల్‌ కోరారు. లేఖ రాసినవారిపై ఏదో ఒక చర్య ఉండాలని అంబికా సోని కోరారు.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates