పట్టణాలను ముంచుతున్న కబ్జాలు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

చెరువుల్లో నిర్మాణాలు నాలాలకు అడ్డంకులు
వానపడితే వరద… రోడ్లపైనే మురుగు
కాలనీలు జలమయం

హైదరాబాద్‌: చెరువుకు చేటొచ్చింది. నాలా నాశనమవుతోంది. ఫలితంగా ఊరు ఏరవుతోంది. బతుకు కన్నీరవుతోంది.వరంగల్‌ సహా రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో తాజా విషాదానికి మానవ తప్పిదాలే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. బాధ్యత లేని వ్యక్తులు చెరువులను ఆక్రమించి…కాలువల్ని మింగేసి పట్టణాలను ముంచేస్తున్నారు. స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అధికార యంత్రాంగం చేతులెత్తేస్తుండటంతో ఆక్రమణలు పట్టణాలకు ప్రాణాంతకంగా మారాయి. ఒక మోస్తరు వర్షం కురిసినా వాననీరు…మురుగునీరు కమ్మేస్తున్నాయి. భారీ వర్షాలు కురిస్తే బతుకు భయమే.. హైదరాబాద్‌ తర్వాత రాష్ట్రంలో అతిపెద్ద నగరమైన వరంగల్‌ వరద ముంపుతో సతమతమవుతుండగా ఆక్రమణల పుణ్యమా అని రాష్ట్రంలో పలు నగరాలు, పట్టణాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.

రియల్‌ ఎస్టేట్‌ ఊపులో పట్టణాలకు చేరువలోని చెరువులను ఆక్రమించి అక్రమ లేఅవుట్లు వేయడంతో పాటు నిర్మాణాలను భారీగా చేస్తుండటంతో భారీ వర్షాలకు అవి జల సంద్రాలుగా మారుతున్నాయి. చాలా చోట్ల చెరువులతో పాటు, చెరువుల నుంచి నీరు బయటకు వెళ్లే నాలాలను ఆక్రమించేశారు. రాష్ట్రంలో పట్టణాలు, నగరాల్లో చెరువులు, ఇతర జలవనరుల్లో పదిశాతం ఆక్రమణలు కూడా తొలగించకపోవడం గమనార్హం.
ఆక్రమణలు 1632 వరకూ ఉన్నట్లు గుర్తించినా 119 మాత్రమే తొలగించినట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. మురుగునీటి కాలువలపై శాశ్వత నిర్మాణాలతో పాటు తాత్కాలిక నిర్మాణాలు ఇబ్బడిముబ్బడిగా ఉన్నట్లు గుర్తించినా వాటిలో సగాన్ని కూడా తొలగించకపోవడం గమనార్హం. రాష్ట్రంలో పట్టణాలు, నగరాల్లో ఇలాంటివి 5820 ఆక్రమణలు ఉన్నట్లు గుర్తించినా 2059 మాత్రమే తొలగించినట్లు పురపాలక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.

అన్ని పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి!
* నిజామాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో మురుగు కాల్వలపై ఆక్రమ నిర్మాణాలు చేపట్టారు. కబ్జా చేసి మరీ కట్టడాలు నిర్మించడంతో ఒకోసారి మురుగు నీరు ప్రవహించడం కష్టం అవుతోంది. జోరు వాన కురిస్తే నీళ్లు వెళ్లకుండా రహదారులపై గంటల కొద్దీ నిల్వ ఉంటున్నాయి. నగరం రోజు రోజుకు విస్తరిస్తుండటంతో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేని కారణంగా ఇళ్లలోకి వరద నీరు వస్తోంది. నాలాలు కబ్జాకు గురైనట్లు గుర్తించినా తొలగింపులో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

  • రామగుండంలో పలు కాలనీల్లో మురుగు కాలువలు కబ్జాకు గురవవడంతో వర్షాలు కురిసినప్పుడు వరదనీరు ఆయా ప్రాంతాల్లోని ఇళ్లల్లో చేరడంతో పాటు రహదారులపై ప్రవహిస్తోంది. ప్రధానంగా పరుశరాంనగర్‌, కళ్యాణ్‌నగర్‌, మేదరిబస్తీ, విద్యానగర్‌, మార్కండేయకాలనీ అశోక్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో మురుగు కాలువలపైన నిర్మాణాలు చేయడంతో ఇలాంటి పరిస్థితులు నెలకొంటున్నాయి. మార్కండేయ కాలనీలోని మురుగు కాలువపైన శ్లాబు వేయడంతో భారీ వర్షాలు కురిసినప్పుడు వరద నీరు సమీపంలోని దుకాణాల్లోకి చేరుతోంది. గోదావరిలో కలిసే ప్రధాన మురుగు కాలువ సగానికి పైగా కబ్జాకు గురై పిల్ల కాలువలా మారింది.

  • ఖమ్మం నగరపాలకంలో మున్నేటి బఫర్‌జోన్‌ పరిధిలో నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఆ ప్రాంతంలో రిజిస్ట్రేషన్లు నిలుపుదల చేయకపోవడంతో అనుమతులు రాకున్నా నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో మున్నేటికి వరద వచ్చిన ప్రతిసారీ ఆయా ఇళ్లలోకి వరదనీరు రావడం సమస్యగా మారింది.

  • ఆదిలాబాద్‌ పట్టణం నడిబొడ్డున ఉన్న ఖానాపూర్‌ చెరువులో ఆక్రమణల పర్వం కొనసాగుతోంది. కొందరు చెరువు మధ్యలోనే నివాసాలు నిర్మించగా అవి ముంపునకు గురవుతున్నాయి. పెద్ద నాలాల్లో చెత్త చెదారంతో పూడిక పేరుకుపోవడంతో పాటు, చిన్న నాలాలపై ఇళ్లను నిర్మించుకోవడంతో వర్షపునీరు సక్రమంగా బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది.

  • కరీంనగర్‌ నగరపాలక సంస్థ పరిధిలో విలీన గ్రామాల్లో చెరువుల ఆక్రమణల పాలవుతున్నాయి. కరీంనగర్‌లో వరదకాల్వలు కుచించుకుపోవడంతో నీరంతా లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లకు చేరుతోంది.

  • మహబూబ్‌నగర్‌లో పాతికేళ్లుగా లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. పెద్దచెరువుకు 2 అలుగులతో కూడి రెండు వైపుల పెద్దవాగులు ఉండేవి. రెండు వాగులను పూర్తిగా ఆక్రమించి పూడ్చేసి కాలనీలు వెలిశాయి. వర్షాలు కురిసినప్పుడల్లా ఈ ప్రాంతాల వీధులు దాదాపు నీట మునుగుతాయి. పెద్దచెరువు కింద ఆక్రమణలు తొలగించలేదు.

  • నిజామాబాద్‌జిల్లా ఆర్మూర్‌ పట్టణ కేంద్రంలోని ప్రధాన చెరువుల్లో ఒకటైన మల్లారెడ్డి చెరువు ఆక్రమణలకు గురైంది. చెరువుకు వర్షాకాలంలో పూర్తిస్థాయిలో నీరు రావడం, ఉపకాలువలు మూసివేతతో ఇళ్లు నీట మునుగుతున్నాయి.

  • చేర్యాల పురపాలక సంఘం పరిధిలోని కు(గు)డిచెరువు రోజురోజుకు పూడుకుపోతోంది. ఈ చెరువు శిఖంలో నిర్మాణాలతో కుచించుకుపోతోంది.

  • వనపర్తి పురపాలికలో నల్లచెరువు ఆక్రమణకు గురయింది. పూర్తిస్థాయి నీటిమట్టంలో స్థిరాస్తి వెంచర్లు వెలిశాయి. చెరువు నిండగానే వాటికి ముంపు తప్పడంలేదు. తాళ్లచెరువు వాగు 60-80 అడుగుల వెడల్పు ఉండాల్సింది. చెరువు అలుగు నుంచే ఆక్రమణకు గురవుతూ 20 నుంచి 30 అడుగులకు కుచించుకుపోయింది.

వరంగల్‌ను ముంచింది ఆక్రమణలే..
* వరంగల్‌ నగరంలో వందలాది కాలనీలు జలమయమయ్యాయి. పదిహేనేళ్లుగా ఏటా ముంపు తప్పడం లేదు. వరంగల్‌, హన్మకొండ ప్రాంతంలో ప్రధాన నాలాలు ఆక్రమణకు గురికాగా వీటి తొలగింపులో ఉదాసీనతే తీవ్ర నష్టం తెస్తోంది. వరంగల్‌ నీట మునగడానికి నాలాల ఆక్రమణలే ప్రధాన కారణమని తేలింది.

  • హన్మకొండలోని నయీంనగర్‌ నాలా చుట్టూ ఆక్రమణలే. 2016 అక్టోబరులో చాలా వరకు అక్రమలు తొలగించినా గోడ కట్టలేదు. ఆరేడు నెలలు కాగానే మళ్లీ నిర్మాణాలు, పెద్ద పెద్ద భవంతులు వచ్చేశాయి. వరంగల్‌ ప్రాంతంలో హంటర్‌రోడ్‌ బొందివాగు, భద్రకాళి నాలాలు కీలకం. హంటర్‌రోడ్‌ బొందివాగు నుంచి భద్రకాళి చెరువు కట్ట వరకు అడుగడుగునా ఆక్రమణలే. రంగంపేట ప్రాంతంలో ఆక్రమణలను కూల్చకుండా వదిలేశారు. ఫలితంగానే శనివారం పలు కాలనీల్లో ఇళ్లు నీట మునిగాయి.

  • సాకరాశికుంట స్థలామంతా ప్లాట్లమయమైంది. మురుగునీళ్లు వెళ్లలేని పరిస్థితి ఉంది. కాజీపేట, హన్మకొండల్లోని వరదనీరు వెళ్లేందుకు బంధం చెరువు వరకు ఉన్న పాతకాలువ కుచించుకుపోవడం వల్ల సమీపంలో ఉన్న కాలనీలు నీటమునిగాయి. హన్మకొండ అలంకార్‌ పెద్దమోరి నుంచి పెద్దమ్మగడ్డ వరకు ఉండే నాలా చుట్టూ నిర్మాణాలు వచ్చాయి. అండర్‌బ్రిడ్జి పక్కనే నాలా ఆక్రమణకు గురైంది.

Courtesy Eenadu

RELATED ARTICLES

Latest Updates