పోలియో వాక్సిన్‌ చరిత్ర చూపిన ఆదర్శం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

జైదీప్ ఉణుదుర్తి

ఆల్బర్ట్ సబిన్, మిఖయేల్ ఛుమకోవ్ ల మధ్య ఏర్పడ్డ స్నేహం జీవితాంతం కొనసాగింది. వాళ్లిద్దరి సంయుక్త కృషిని వారి ప్రభుత్వాలు గుర్తించడమే కాక, పరిశోధనా పద్ధతులనూ, పరీక్షల నిర్వహణనూ, ఫలితాల డాటానూ రెండు దేశాలూ భాగస్వాములుగా పంచుకున్నాయి. మరింత త్వరితగతిన ఉత్తమ స్థాయి పరిశోధనలు నిర్వహించడానికి ఆనాటి సమిష్టి కృషి తోడ్పడింది. 

సోవియట్ యూనియన్, అమెరికాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు కూడా పోలియో నివారణకై ఆ రెండు దేశాల శాస్త్రవేత్తలూ, ప్రభుత్వాలూ సహకరించుకున్న తీరుని గుర్తుచేసుకోవడం నేటి పరిస్థితులలో సముచితంగా ఉంటుంది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత, సోవియట్ రిపబ్లిక్‌లో పోలియో కేసుల సంఖ్య గణనీయంగా పెరగడం మొదలైంది. తత్ఫలితంగా, 1950లలో పోలియో వాక్సిన్‌పై పరిశోధనలకుగాను,  ఆనాటి సోవియట్ ప్రభుత్వం అప్పటికే అంటువ్యాధుల నివారణపై విశేషంగా కృషిచేస్తూన్న డాక్టర్ మిఖయేల్ ఛుమకోవ్ (1909–-1993) ఆధ్వర్యంలో మాస్కోలో ఒక ప్రత్యేక సంస్థను నెలకొల్పింది.

అప్పటికే అమెరికాలోని ఒహైయో రాష్ట్రంలో ముప్ఫై మంది ఖైదీలపై డాక్టర్ ఆల్బర్ట్ సబిన్ (1906-–1993) పోలియో వాక్సిన్ పరీక్షల్ని నిర్వహించి ఉన్నాడు. డాక్టర్ సబిన్ అసలుపేరు అబ్రహాం సాపెర్ స్టీన్. అతను పదిహేనేళ్ల బాలుడుగా ఉన్నప్పుడు అతని కుటుంబం పోలెండ్ నుండి అమెరికాకు వచ్చి స్థిరపడింది. ఛుమకోవ్, మరో అగ్రశ్రేణి పరిశోధకురాలైన అతని భార్య మరినా వోరోషిలోవాలు, ఆల్బర్ట్ సబిన్‌ని 1956లో అమెరికాలో అప్పటికే నిర్వహించిన సాక్ వాక్సిన్ పరీక్షలపై అవగాహన కోసం జరిగిన ఒక సదస్సులో కలుసుకోవడం తటస్థించింది. అయితే సాక్ వాక్సిన్ తయారీలో కట్టర్ అనే ఫార్మా సంస్థ చేసిన తప్పిదం మూలంగా పెద్ద ఎత్తున జరిగిన ఆ పరీక్షలు బెడిసికొట్టాయి. మరిన్ని పరీక్షల్ని నిర్వహించేందుకు అమెరికన్ వైద్య పరిశోధనా విభాగం నిరాకరించింది. ఈలోగా జీవ సహిత క్రిములను తగు మోతాదులో ఇవ్వడం ద్వారా పోలియో వాక్సిన్ మరింత సమర్థంగా పనిచేస్తుందని సబిన్ పరిశోధనలు తెలిపాయి. పైగా, అటువంటి వాక్సిన్ను నోటితో మింగించవచ్చు. కట్టర్ మందుల కంపెనీపై రేగిన దూమారంతో అమెరికాలో పరీక్షలు నిర్వహించడం అసాధ్యం అయిపోయింది. సోవియట్ యూనియన్లో ఆ పరీక్షల్ని కొనసాగించేందుకు ఛుమకోవ్ చొరవ చూపాడు. సోవియట్ ప్రభుత్వం అతని ప్రతిపాదనను ఆమోదించింది.

ఛుమకోవ్, అతని భార్య మరినా వోరోషిలోవాలు మొట్టమొదట తమ పిల్లలచేత పోలియో వాక్సిన్‌ను మింగించారు. వారి కుమారుడు పీటర్ ఛుమకోవ్ నేడొక ప్రముఖ వైరాలజిస్టు. కోవిడ్- 19కు వాక్సిన్ కనుక్కొనే ప్రయత్నంలో అతని పాత్ర కూడా ఉన్నది.

1959లో ఆల్బర్ట్ సబిన్ను సోవియట్ ప్రభుత్వం ఆహ్వానించింది. పరీక్షలు నిర్వహించిన తీరును, ఫలితాలను పరికించిన సబిన్ సంతోషం వ్యక్తపరిచాడు. అంత పెద్ద స్థాయిలో, అంత తక్కువ వ్యవధిలో అమెరికాలో ఆ పరీక్షలను నిర్వహించడం సాధ్యపడేది కాదు అని అతడు అభిప్రాయ పడ్డాడు. 1960నాటికి ఏడు కోట్ల డెబ్భై లక్షలమంది (ఇరవై ఏళ్లలోపు వయస్సు గల) సోవియట్ పౌరులకు వాక్సిన్ ఇవ్వడం జరిగింది. ఇదంతా సోవియట్ ప్రచారం అని కొన్ని వర్గాలు భావించాయి. సోవియట్ యూనియన్‌లో సత్ఫలితాలు కనిపించడంతో 1960లలోనే అమెరికాలో కూడా పిల్లలకు పెద్ద ఎత్తున పోలియో ఓరల్ వాక్సిన్ ఇవ్వడం మొదలైంది.

ఆల్బర్ట్ సబిన్, మిఖయేల్ ఛుమకోవ్ల మధ్య ఏర్పడ్డ స్నేహం జీవితాంతం కొనసాగింది. వాళ్లిద్దరి సంయుక్త కృషిని వారి ప్రభుత్వాలు గుర్తించడమే కాక, పరిశోధనా పద్ధతులనూ, పరీక్షల నిర్వహణనూ, ఫలితాల డాటానూ రెండు దేశాలూ భాగస్వాములుగా పంచుకున్నాయి. మరింత త్వరితగతిన ఉత్తమ స్థాయి పరిశోధనలు నిర్వహించడానికి ఆనాటి సమిష్టి కృషి తోడ్పడింది.

1963లో సోవియట్ ప్రభుత్వం చుమకోవ్కి ఆ దేశపు అత్యున్నత పురస్కారమైన లెనిన్ అవార్డుని ఇచ్చింది. అది మన ‘భారత రత్న’కు సమాన స్థాయి కలిగినదని చెప్పుకోవచ్చు. ఆ అవార్డు, తనకు మాత్రమే కాకుండా, సబిన్‌కు కూడా దక్కి ఉండాల్సిందని ఛుమకోవ్ భావించాడు. ఆ సందర్భంగా అతడు తన అమెరికన్ స్నేహితుడికి వ్రాసిన ఉత్తరంలో, ‘‘సోవియట్ వైద్య శాస్త్రవేత్తలూ, పోలియో బారినుండి బయటపడ్డ కోట్లాది మంది పిల్లలూ, వారి తల్లిదండ్రులూ మీకు శాశ్వతంగా ఋణపడి ఉంటారు’’ అన్నాడు.

ఈ కథ ఇంతటితో అయిపోలేదు. సబిన్ తన వాక్సిన్కు పేటెంటు తీసుకోవడానికి నిరాకరించాడు. దాని పై సర్వ హక్కులనూ ప్రపంచ ఆరోగ్య సంస్థకు కట్టబెట్టాడు. తద్వారా మందుల కంపెనీలు వాక్సిన్ అమ్మకాలపై లాభాలు చేసుకోకుండా నిరోధించాడు. తానొక రూపాయి కూడా మిగుల్చుకోలేదు. అతి తక్కువ ధరకే అన్ని దేశాలలోనూ వాక్సిన్ అందుబాటులోకి రావడానికి సబిన్ తీసుకున్న నిర్ణయం దోహదపడింది. సుమారు ఏభై ఏళ్ల తరవాత, నేడు ప్రపంచవ్యాప్తంగా పోలియో వ్యాధిని పూర్తిగా నిరోధించడం సాధ్యం అయింది. రెండు, మూడు దేశాలను మినహాయిస్తే ఎక్కడా కూడా పోలియో కేసులు నమోదు కావడం లేదు.

ఆనాటి అంతర్జాతీయ సహాయ, సహకారాల్ని, ఆదర్శవాదాన్ని ప్రేరణగా తీసుకొని వైద్యరంగాన్ని ప్రజాహితంగా పునరుద్ధరించుకోవలసిన సమయం ఇది. అయితే మనదేశం వంటి దేశాలలో ప్రజల్ని భయపెట్టి, తప్పుదోవ పట్టించి, నిలువునా దోచుకొనే ఆస్పత్రులు, దోపిడీ వైద్య వ్యవస్థ రాజ్యమేలుతున్నాయి. మరో వైపు ‘వాక్సిన్ జాతీయవాదం’ వెర్రితలలు వేస్తోంది. ‘ఏ దిశగా మనం ప్రయాణిస్తున్నాం?’ అనేది నేడు అందరం వేసుకోవాల్సిన ప్రశ్న.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates