కబ్జాల పాపమే.. వరంగల్‌ దుస్థితికి కారణం!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • చెరువులు మాయం.. కాలనీలు ప్రత్యక్షం
  • 248 చెరువుల్లో 55 పూర్తిగా కనుమరుగు
  • నాలాల బఫర్‌జోన్‌లనూ వదలని కబ్జాదార్లు
  • నేతల కనుసన్నల్లో ఆక్రమణల పరంపర
  • పట్టింపే లేని అధికార యంత్రాంగం
  • సీఎం హామీ ఇచ్చినా.. నెరవేరని మాస్టర్‌ప్లాన్‌

వానొస్తే నడుములబట్టి నీళ్ళొచ్చి, గిన్నెలు నెత్తినబెట్టుకుని.. గడ్డకు పోయి, వండుకుని తిని.. నీళ్ళు గుంజినంక ఇంటికస్తున్నరు. వరంగల్‌లో 80 కాలనీల్లో ఇదే పరిస్థితి. తెలంగాణలో హైదరాబాద్‌ తర్వాత ఇదే పెద్ద నగరం. మరి ఇట్లుంటే ఎట్లా..? వరంగల్‌ అంటే అద్దం లెక్కనుండాలే. మీరంతా సహకరిస్తే.. రెండుమూడేళ్లలో ఈ పరిస్థితిని మార్చేస్తా..!

– 2015 జనవరి 11న వరంగల్‌ నగరంలోని లక్ష్మీపురం బస్తీవద్ద ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్న మాటలివి..!

ఐదేళ్లు గిర్రున తిరిగాయి. 2020 ఆగస్టు 15న కుండపోత వర్షం. కాలనీలన్నీ చెరువులయ్యాయి. వరద చుట్టుముట్టడంతో ఇప్పుడు గిన్నెలు నెత్తిన పెట్టుకుని పోయే పరిస్థితి కూడా లేదు. మిద్దెలెక్కి బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన దుస్థితి. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ రంగంలోకి దిగి ప్రజలను రక్షించాల్సిన పరిస్థితి..! ఈ పరిస్థితులకు కారణమెవరు? వరద నీటిని చెరువుల్లోకి తీసుకెళ్లే నాలాల కబ్జాలు..! చెరువుల్లో వెలసిన కాలనీలు..! ఎఫ్‌టీఎల్‌లనూ ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలు..! స్వయానా సీఎం కేసీఆర్‌ వాగ్దానాలు చేసినా.. ఆక్రమణలకు వంతపాడుతున్న అధికార పార్టీ నాయకులు..! అధికారులే..! ఫలితాన్ని మాత్రం ప్రజలే అనుభవిస్తున్నారు.

వరంగల్‌ అర్బన్‌ : ఓరుగల్లు నగరం వర్షాలతో అతలాకుతలమైపోయింది. కాలనీలన్నీ జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరాయి. ప్రజలు మిద్దెలపైకెక్కి సాయం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. చెరువులు, నాలాల కబ్జాలు.. ఎఫ్‌టీఎల్‌ ప్రాంతాల్లో కాలనీలు, అపార్ట్‌మెంట్ల నిర్మాణాలు జరగడమే ఇందుకు ప్రధాన కారణం. వరంగల్‌ నగర పరిధిలో రెవెన్యూ రికార్డుల ప్రకారం 248 చెరువులు ఉండాలి. అయితే.. ఏకంగా 55 చెరువులు మాయం అయ్యాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అనధికారికంగా వీటి సంఖ్య మరింత ఎక్కువగా ఉంది. నగరంలో భారీ జలాశయాలైన వడ్డెపల్లి, భద్రకాళి, చిన్న వడ్డెపల్లి, కోట చెరువు, గోపాల్‌పూర్‌, భీమారంలోని సామల చెరువుల ఎఫ్‌టీఎల్‌ లెవల్‌లో కాలనీలు ఏర్పడ్డాయి. ఆ ప్రాంతాల్లోనే ఇప్పుడు వరద బీభత్సం తీవ్రంగా ఉంది. గత మూడు రోజులుగా ఆ ప్రాంతంలో బోట్లు తప్ప.. ఇతర వాహనాలు తిరిగే పరిస్థితి లేకుండా పోయింది. ఈ కాలనీల నిర్మాణం వెనక.. అధికార పార్టీల నేతల హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చిన్న వడ్డెపల్లి చెరువు ప్రాంతంలో ఏకంగా అపార్ట్‌మెంట్లు వెలుస్తున్నాయి. సీఎం ఆదేశాల తర్వాత తెరపైకి వచ్చిన మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం ఇక్కడ నిర్మాణాలు చేపట్టకూడదు. అయినా.. అధికార పార్టీ నేతల అండదండలతో యథేచ్ఛగా భారీ భవనాలు, కాలనీలు వెలుస్తున్నాయి. దీన్ని నియంత్రించాల్సిన మునిసిపల్‌ అధికారులు ప్రజాప్రతినిధుల ఒత్తిడితో చర్యలకు సాహసించడం లేదు.

నాలాల బఫర్‌జోన్‌లు హాంఫట్‌..!
నగరంలోని విశాలమైన నాలాలు కూడా కబ్జాలతో ఇప్పుడు పిల్లకాలువలను తలపిస్తున్నాయి. హన్మకొండ నయీంనగర్‌ ప్రాంతంలోని రెండు బడా విద్యాసంస్థలు నాలాలను ఆక్రమించి భారీ భవనాలను నిర్మించాయని అధికారులే చెబుతున్నారు. నాలాల వైశాల్యానికి, పరిస్థితులకు అనుగుణంగా కనీసం రెట్టింపు వైశాల్యంలో బఫర్‌ జోన్‌లు ఉండగా.. ఇప్పుడవన్నీ మాయమైపోయాయి. ఆ ప్రాంతాల్లో కాలనీలు వెలుస్తున్నాయి.

శిఖం భూములే కాలనీలు
పేదల కాలనీలన్నీ దాదాపుగా చెరువు శిఖం భూముల్లోనే వెలిశాయి. కమ్యూనిస్టు పార్టీలు గుడిసెలు వేయించాయి. దీంతో వర్షాలు పడ్డాయంటే.. ఈ కాలనీలు నీట మునుగుతున్నాయి. ప్రతి సంవత్సరం ఇక్కడి ప్రజలు నిరాశ్రయులవుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఐదేళ్ళ క్రితం ఇచ్చిన వాగ్దానంలో భాగంగా ఇక్కడ పక్కా ఇళ్ళ నిర్మాణం అనే హామీ.. అమలుకు నోచుకోలేదు. నాలాలు, చెరువులకు ఆక్రమణల చెరవీడితేనే.. నగరానికి జల ప్రమాదం తప్పుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

ఆ ప్రతిపాదనలేమయ్యాయి?

  • ఐదేళ్ల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్‌ మూడు రోజులు వరంగల్‌లో మకాం వేసి, వరంగల్‌ నగరాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. మౌలిక వసతుల కల్పన కోసం ప్రత్యేకంగా వరంగల్‌కు ఏటా బడ్జెట్‌లో రూ. 300 కోట్లను కేటాయిస్తామని చెప్పారు. ఈ లెక్కన మూడేళ్లుగా వరంగల్‌కు రూ. 900 అందాలి. కానీ.. ఇప్పటికి కేటాయించిన నిధులు రూ. 84 కోట్లే..!
  • వరంగల్‌ నగరాభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సీఎం ఆదేశించారు. ఇప్పటికీ అధికారులు ఆ దిశలో చర్యలు తీసుకోలేదు.
  • నగరాభివృద్ధికోసం కాకతీయ అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీని రూపొందించే మాస్టర్‌ ప్లాన్‌కూ దిక్కుమొక్కూ లేకుండా పోయింది.
  • అధికార పార్టీ నేతల సౌకర్యార్థం ఈ ప్లాన్‌లో అనేక సార్లు మార్పులుచేర్పులు చోటుచేసుకుంటున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.
  • ఈ ప్లాన్‌లో ఆలస్యం వల్ల.. ఇప్పటికీ 1971 లో రూపొందించిన మాస్టర్‌ ప్లాన్‌ మేరకే అభివృద్ధి జరుగుతోంది. 49 ఏళ్ళ తర్వాత కూడా మాస్టర్‌ ప్లాన్‌ లేక పోవడం వరంగల్‌ నగర అభివృద్ధి పాలిట శాపంగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates