అందరికీ ఆరోగ్య సంరక్షణ హక్కు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– జనతా పార్లమెంటులో ఎంపీలు, ఆరోగ్య నిపుణుల డిమాండ్‌
– మరో 18 తీర్మానాలు ఆమోదం
– సమావేశాన్ని ప్రారంభించిన కేరళ వైద్య శాఖ మంత్రి కెకె శైలజ

న్యూఢిల్లీ : దేశ ప్రజలందరికీ ఆరోగ్య సంరక్షణ హక్కును కల్పించాలని పలువురు ఎంపీలు, ఆరోగ్య కార్యకర్తలు, వైద్యరంగానికి చెందిన నిపుణులు డిమాండ్‌ చేశారు. ఆన్‌లైన్‌ వేదికగా నిర్వహించిన ‘జనతా పార్లమెంటు’ వేదికగా వక్తలు దేశ ప్రజానీకానికి ఆరోగ్య సంరక్షణ హక్కు కల్పించాలనే డిమాండ్‌తో పాటు మరో 18 తీర్మానాలను ఆమోదించారు.

జన స్వాస్త్య అభియాన్‌ (జేఎస్‌ఎ), జన సర్కార్‌, పలు ప్రజాహక్కుల సంఘాలు సంయుక్తంగా ఈ సమావేశాన్ని నిర్వహించాయి. దీనిలో పలువురు లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు, ఆరోగ్య కార్యకర్తలు, వైద్యరంగానికి చెందిన నిపుణులతో పాటు కేరళ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కెకె శైలజ కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. కోవిడ్‌-19 కాలంలో ప్రభుత్వ వైద్యరంగం ఎదుర్కొంటున్న సవాళ్లు.. అధిక ఫీజులు, ప్రయివేటు ఆస్పత్రులపై నియంత్రణ.. మహమ్మారి కాలంలో అందరికీ ఆరోగ్య సంరక్షణ, ప్రజల అవస్థలు వంటి ఐదు అంశాలపై ఈ వెబినార్‌ జరిగింది.

గడిచిన ఆరు నెలలుగా కరోనా దెబ్బకు సాధారణ ప్రజల జీవితాలు అస్తవ్యస్థమయ్యాయని సమావేశంలో పాల్గొన్న వక్తలు అన్నారు. ఈ కాలంలో వారికెదురైన సవాళ్లు.. వారి వైద్య అవసరాలపై చర్చించారు. ముందస్తు ప్రణాళిక లేకపోవడం, ఆదరాబాదరాగా అమలుచేయబడిన విధానపర నిర్ణయాలు, అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడంలో ప్రభుత్వాలు సంసిద్ధంగా వ్యవహరించకపోవడం.. ప్రస్తుత ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాన్ని స్పష్టంగా బహిర్గతపరిచాయని వక్తలు వాపోయారు. ఇదే సమయంలో బలహీనమైన ప్రజారోగ్య వ్యవస్థ, ప్రయివేటు ఆస్పత్రుల దోపిడీ కూడా బట్టబయలైందని అన్నారు. దీనికారణంగా ప్రజల హక్కులు యధేచ్ఛగా ఉల్లంఘించారని వారు ఆరోపించారు. ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ఈ మహమ్మారి నొక్కిచెప్పిందని స్పష్టం చేశారు. కరోనా కాలంలో ప్రజలను విభజించడానికి కొన్ని వర్గాలు, రాజకీయ నాయకులు, మీడియా చేసిన కుట్రలను వెబినార్‌లో పాల్గొన్న వక్తలు ముక్తకంఠంతో ఖండించారు.

ఈ సందర్భంగా సమావేశాన్ని ప్రారంభించిన కెకె శైలజ మాట్లాడుతూ… కేరళలో కరోనాను కట్టడిచేసిన విధానాన్ని వివరించారు. అధికార వికేంద్రీకరణ, ప్రజల సహకారంతో రాష్ట్రంలో కరోనాను సమర్థవంతంగా అడ్డుకున్నామని ఆమె తెలిపారు. ప్రతి పౌరుడికీ ఆరోగ్య సంరక్షణ అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆమె నొక్కిచెప్పారు. ఎన్సీపీకి చెందిన రాజ్యసభ ఎంపీ వందన చవాన్‌ స్పందిస్తూ.. పేదలకు క్వారంటైన్‌ సేవలు పేలవంగా ఉన్నాయనీ, ఇది ప్రభుత్వ అసమర్థతను ఎత్తిచూపుతున్నదని అన్నారు. అందరికీ ఆరోగ్య హక్కు ఉండాలని ఆమె ఉద్ఘాటించారు. దీంతోపాటే లాక్‌డౌన్‌ కాలంలో గృహహింస పెరిగినదాన్నీ ఆమె గుర్తు చేశారు. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రవి ప్రకాశ్‌ వర్మ మాట్లాడుతూ.. ప్రజారోగ్య వ్యవస్థలో లోపాలను మహమ్మారి బట్టబయలు చేసిందని తెలిపారు. కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రాజీవ్‌ గౌడ మాట్లాడుతూ.. వైద్యరంగంపై ప్రభుత్వం చేస్తున్న ఖర్చు పెరగాలని సూచించారు. వచ్చే ఐదేండ్లలో జీడీపీలో దీన్ని మూడు నుంచి ఐదు శాతం దాకా పెంచాలని ఆయన డిమాండ్‌ చేశారు.

మరిన్ని తీర్మానాలు
ఆరోగ్య సంరక్షణ అందరికీ వర్తించేవిధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టం చేయాలి. జీడీపీలో వైద్యరంగానికి ఖర్చును 5 శాతం దాకా పెంచాలి. ప్రజారోగ్య వ్యవస్థను పటిష్టపరిచి దేశంలోని ప్రతి పౌరుడికీ ఉచితంగా వైద్యం అందించాలి. ప్రయివేటు ఆస్పత్రులు విధిస్తున్న రేట్లపై నియంత్రణ విధించి.. క్లినికల్‌ ఎస్లాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌ (2010)ను పకడ్బందీగా అమలుచేయాలి. ఆరోగ్య కార్యకర్తలకు, స్కీం వర్కర్లకు కరోనా నుంచి కాపాడుకోవడానికి అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాలి. వైద్యరంగంలో పరిశోధనలు, శిక్షణపై పెట్టుబడులు పెంచాలి. అసంఘటితరంగ కార్మికులకు ఈఎస్‌ఈని వర్తింపజేయాలనే 18 తీర్మానాలకు సమావేశంలో ఆమోదం తెలిపారు.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates