ఎవరయ్యా దేశద్రోహులు?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

ఇటీవల బీజేపీ ఎంపీ అనంత్‌ కుమార్‌ హెగ్డే బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులను దేశద్రోహులు అంటూ సంబోధించడం అత్యంత ఆక్షేపణీయం. అయితే మొత్తం బీజేపీ ప్రభుత్వమే ఈ దేశ ద్రోహులు అనే పదాన్ని తమ నినాదంగా ముందుకు తీసుకొచ్చింది. ప్రభుత్వానికి నచ్చని వారిని, ప్రభుత్వం అప్రజాస్వామికంగా చేస్తున్న పనులను అడ్డుకున్న వారిని, ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్న వారిని, ప్రభుత్వానికి నచ్చని వారినందరిని దేశద్రోహులుగా పిలవడం బీజేపీకి పరిపాటిగా మారింది. ఇక ఎంపీ అనంత కుమార్‌ హెగ్డే వ్యాఖ్యలకు వస్తే.. నిజంగానే బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులు సంస్థను కావాలని దివాళా తీయించారా? వారు ఉద్దేశపూర్వకంగా వారి సంస్థలను నిర్వీర్యం చేయగలరా? మొత్తంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ దానంతట అదే దివాలా తీసిందా? అనేది ఆలోచించాల్సిన విషయం.

బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రజల పన్నులతో నిర్మింపబడిన దేశం గర్వించదగిన ప్రతిష్టాత్మక ప్రభుత్వ రంగ సంస్థ. ఈ దేశ పౌరులకు మొదటగా టెలికాం సేవలు అందిస్తూ ప్రజల్లో మమేకమైన బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులు ఈరోజు దేశద్రోహులు ఎట్లా అయ్యారు? ప్రభుత్వం టెలికామ్‌ సేవలను ప్రయివేటు పరం చేయడాన్ని నిరసిస్తూ ఆ సంస్థను కాపాడు కోవడానికి తమ గొంతుకను బలంగా వినిపించడమే వారిని దేశద్రోహులను చేసిందా..? అయినా ప్రభుత్వం తన అధికార బలంతో బీఎస్‌ఎన్‌ఎల్‌ను ప్రయివేటు పరం చేస్తూ వేల మంది ఉద్యోగులును బలవంతంగా ఇంటికి గెంటి వేసింది. అయితే ఇట్లా ప్రభుత్వ సంస్థల ను నిర్వీర్యం చేసి వాటి స్థానే ప్రయివేటు సంస్థలను ప్రోత్సహించడం ఇప్పుడే మొదలు కాలేదు. ఈ కోవలో బీఎస్‌ఎన్‌ఎల్‌ మొదటిదీ కాదు చివరిదీ కాదు.

ప్రపంచీకరణ మొదలైన ఆదిలోనే ప్రయివేటీకరణ వల్ల పోటీ వస్తుందని చెప్పిన పాలకులు అసలు పోటీయే లేకుండా కేవలం ప్రయివేటు సంస్థలు ఉండే విధంగానే వారి యొక్క పాలనా విధానాలను రూపొందించడం మనం గమనిస్తూనే ఉన్నాము. బీఎస్‌ఎన్‌ఎల్‌ మెరుగైన సేవలు అందించడంలో దానంతట అదే వెనుకబడి పోలేదు. టెలికమ్యూనికేషన్‌ సేవలకు కావలసినటువంటి అత్యాధునిక మైనటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రయివేటు సంస్థలకు కూడా అందించే ”ట్రాయి”నీ నిర్వహించేది భారత ప్రభుత్వమే. ప్రయివేటు సంస్థలకు ఇచ్చినటువంటి అత్యాధునికమైనటువంటి 4జి, 5జి సేవలను ప్రభుత్వరంగ సంస్థ అయిన బీఎస్‌ఎన్‌ఎల్‌కి మాత్రం సరిపడా పూర్తి స్థాయిలో అందించకపోవడంలో ఆంతర్యమేమిటి? లక్షల కోట్ల రూపాయలతో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించి ప్రయివేటు సంస్థలకు అమ్ముతున్నటువంటి ప్రభుత్వాలు ప్రభుత్వ సంస్థలకు అందించడానికి మాత్రం వెనుకాడుతున్నాయి.

ఇలా బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవలను ప్రభుత్వమే కావాలని కుదించి దాని ప్రయివేటీకరణను వేగవంతం చేయడానికి, ప్రభుత్వ కుట్రలను కప్పి పుచ్చుకోవడానికి, ఉద్యోగుల అసమర్థత వల్లే బీఎస్‌ఎన్‌ఎల్‌ దివాలా తీస్తుందని అవాస్తవాలు ప్రచారం చేస్తూ, సంస్థను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్న ఉద్యోగులపై నింద వేస్తున్నారు. నిజానికి ఏ ప్రభుత్వ రంగ సంస్థ అయినా ఆయా ప్రభుత్వాలు తీసుకునే విధాన నిర్ణయాల మీదనే వాటి యొక్క పురోభివద్ధి ఆధారపడి ఉంటుంది. ప్రజల యొక్క పన్నులతో నిర్మింపబడినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి కొంతమంది ప్రయివేట్‌ వ్యక్తులకు అప్పనంగా అప్పజెప్పడానికి ప్రభుత్వాలు మూడు రకాలుగా ప్రయత్నం చేస్తాయి.. ఒకటి నిధులను తగ్గించడం, రెండవది లాభాలలో ఉన్నటువంటి సంస్థల వాటాలు విక్రయించడం, మూడవది కావాలని సంస్థలను విస్మరించడం. నిధులు తగ్గించి నిర్వీర్యం చేస్తున్న వాటిలో బీఎస్‌ఎన్‌ఎల్‌, లాభాల్లో ఉన్న సంస్థల్లో వాటాలు విక్రయిస్తున్న వాటిలో ఎల్‌ఐసీ, ఓఎన్‌జీసీ, భారత్‌ పెట్రోలియం, కావాలని అలసత్వంతో విస్మరిస్తున్న వాటిలో బీహెచ్‌ఈఎల్‌, హెచ్‌సీఎల్‌, హెచ్‌ఏఎల్‌ వంటి సంస్థలు కేవలం ఉదాహరణలు మాత్రమే. ఇటువంటివి అనేకం కలవు.

‘నిటి ఆయోగ్‌’ ఏర్పాటు తర్వాత వ్యాపారాలు చేయడం ప్రభుత్వాల పని కాదని విధానంగా పెట్టుకున్నటువంటి ప్రభుత్వం రైల్వే శాఖలో టెలికాం సేవలు అందిస్తున్న బీఎస్‌ఎన్‌ఎల్‌ను కాదని జియోకి టెలికాం సేవలు అప్పగించింది. ఎయిర్‌ ఇండియాని అమ్మకానికి పెట్టింది. యుద్ధ విమానాల తయారీలో హెచ్‌ఏఎల్‌నీ కాదని అనిల్‌ అంబానీ భాగస్వామిగా ఉన్న దస్సాల్ట్‌ ఏవియేషన్‌ ఆఫ్‌ ఫ్రాన్స్‌ కంపెనీకి అప్పగించింది. ప్రభుత్వ రంగ భీమా సంస్థ స్థానంలో ప్రయివేటు బీమా సంస్థలకు లాభాలు చేకూర్చడానికి ఎల్‌ఐసీలో వాటాలు విక్రయించింది. రైల్వే రంగాన్ని అమ్మకానికి పెడుతున్నది. త్వరలో రాబోతున్నటువంటి జియో బ్యాంకు కోసం బ్యాంకుల ప్రయివేటీకరణకు దారులు వేస్తున్నది. విద్యా, వైద్యం, గనుల ప్రయివేటీకరణను ప్రోత్సహిస్తున్నది. రక్షణ రంగంలో ప్రయివేటు పెట్టుబడులను ఆహ్వానిస్తున్నది. అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోలో కూడా ప్రయివేటు పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నారు. ”ప్రజల యొక్క పన్నులతో నిర్మింపబడిన ప్రభుత్వ రంగ సంస్థలు ప్రజల యొక్క ఆస్తులు”. ఈ ప్రజల యొక్క ఆస్తులను కొంతమంది వ్యక్తుల లాభార్జన కోసం విక్రయిస్తున్న చర్యలను ప్రశ్నిస్తున్న వారిని ఈ ప్రభుత్వం దేశద్రోహులను చేస్తున్నది.

బీజేపీ పాలనలో ఈ దేశద్రోహుల జాబితా బీఎస్‌ఎన్‌ఎల్‌తోనే ముగిసిపోదు. గనుల ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తున్న కార్మికులు, విద్యా ప్రయివేటీకరణను వ్యతిరేకించే ఉపాధ్యాయులు విద్యార్థులు, వైద్యం ప్రయివేటీకరణను వ్యతిరేకించే వైద్యులు, సమస్త రకాల సేవలను ప్రజల పన్నులతో నిర్మింపబడిన సంస్థలు ఆస్తులను ప్రయివేటీకరించడాన్ని వ్యతిరేకించే వారందరూ దేశద్రోహుల జాబితాలో చేరుతారు. ఒక్క మాటలో చెప్పాలంటే ”ప్రయివేటీకరణను వ్యతిరేకించే ప్రతిఒక్కరూ దేశద్రోహులే”నని పాలకుల విధానం. నిజానికి ఎవరు దేశ ద్రోహులు? దేశ ప్రజలందరికీ చెందిన దేశ సంపదను, సహజ వనరులను కొంతమంది ప్రయివేటు వ్యక్తుల చేతుల్లో పెడుతున్న పాలకులా? లేక దేశ సంపదను, సహజవనరులను కాపాడడానికి, ప్రభుత్వాలు అవలంబిస్తున్న అప్రజాస్వామిక విధానాలను ప్రశ్నించిన వారా? సేవలను వ్యాపార కోణంలో చూసే రాజకీయ దక్కోణం వల్లనే ప్రభుత్వరంగ సంస్థలను విక్రయించడం పాలకులు ఒక విధానంగా తీసుకున్నారు. ”ప్రజల యొక్క పన్నులతో నిర్మితమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు అంటే ప్రజల యొక్క ఆస్తులు అని అర్థం.” ఈ ప్రజల ఆస్తులైన ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాల్సిన ప్రభుత్వమే కొంతమంది ప్రయివేటు వ్యక్తుల చేతులలో పెట్టడాన్ని ప్రజలందరూ వ్యతిరేకించాలి.

బీజేపీ ప్రభుత్వం కేవలం ప్రభుత్వ రంగ సంస్థలనే కాక ప్రజల శ్రేయస్సు కోసం రూపొందించిన ప్రజాస్వామిక సంస్థలను సైతం తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నది. వారి పాలనా విధానాలకు అనుగుణంగా ఆయా సంస్థలలో మార్పులు తీసుకు వస్తూ వాటి యొక్క అసలు లక్ష్యాలను నీరుగారుస్తున్నది. ప్రజలు వారి హక్కులకు, ప్రయోజనాలకు భంగం కలిగినప్పుడు మాత్రమే కాక వారి పన్నులతో నిర్మింపబడినటువంటి ప్రభుత్వరంగ సంస్థలకు, ప్రజల శ్రేయస్సు కోసం నిర్మింపబడినటువంటి ప్రజాస్వామిక వ్యవస్థలకు ప్రమాదం పొంచి ఉన్నప్పుడు కూడా ప్రభుత్వాలను ప్రశ్నించాలి. ప్రభుత్వ విధానాలను నిలదీయాలి. అప్పుడే అనంత్‌ కుమార్‌ హెగ్డే లాంటి వ్యక్తులు హద్దులు మీరకుండా, ఈ ప్రభుత్వాలు అప్రజాస్వామికంగా వ్యవహరించకుండా నిరోధించగలం. నిజాలను తెలుపడమే కాక ప్రభుత్వాలు చెప్పే అబద్దాలను ఎండగట్టడం కూడా మనందరి బాధ్యత. ప్రజల ఆస్తులు అయినటువంటి ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటు పరం కాకుండా కాపాడుకోవడమే కాక ప్రజాస్వామిక వ్యవస్థను, ప్రజాస్వామిక వాతావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా నేడు ప్రజలదే.
వి. దిలీప్‌

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates