లాల్-నీల్ శక్తుల ఐక్యత – విభిన్న దృక్పథాలు.

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

కృష్ణార్జునరావు

మిత్రులారా!

గతితార్కికంగా విశ్లేషిస్తే

రెండు శక్తుల మద్య వుండేది శతృ వైరుధ్యమైతే అవి తాత్కాలికంగా కలిసినా  విడిపోడం అనివార్యం – అలాగే వాటి మధ్య ఉండేది మితృ వైరుధ్యమైతే అవి తాత్కాలికంగా  దూరంగా ఉన్నా ఐక్యం కావడం అనివార్యం.

లాల్ ఉద్యమం ప్రదానంగా ఆర్ధికాధిపత్యాన్ని ఎదిరిస్తూ ఉంటే  – నీల్ ఉద్యమం ప్రదానంగా సామాజికాధిపత్యాన్ని ఎదిరిస్తుంది. ఆధిపత్యాలు  ఏ రూపంలో ఉన్నా  వాటిని ఎదిరించాల్సిందే! అలా ఎదిరించే శక్తులన్నీ అభ్యుదయ కరమైనవే. అవి సామాజిక విప్లవ శక్తులే.

సామాజిక విప్లవ శక్తులు తమలో తాము ఘర్షణ పడితే సమాజానికి చాలా నష్టం –  ఆధిపత్యాన్ని ఎదిరించే శక్తుల మద్య వైరుధ్యం  చోటు చేసుకుంటే, అది ఆదిపత్య శక్తులకు మిక్కిలి ఉపయోగంగా ఉంటుంది. ఆధిపత్య శక్తులు మాత్రం ఎప్పుడూ సామాజిక విప్లవ శక్తుల మధ్య వైరుధ్యాలనే కోరుకుంటాయి. ఆ వైరుధ్యాలను ప్రోత్సహిస్తాయి కూడా!

లాల్-నీల్ శక్తుల మధ్య ఉన్నది ఎట్టి పరిస్థితుల్లోను శతృ వైరుధ్యం కాదు – అది ఖచ్చితంగా మితృ వైరుధ్యమే!

ఈ రెండు విప్లవ శక్తుల మధ్య ఐక్యత రానివ్వకుండా అడ్డు పడుతుంది మాత్రం ఈ ఉద్యమాలకు సంబంధించిన కొంత మంది నాయకుల స్వీయ మానసిక దోరణులే నని గట్టిగా చెప్ప వచ్చు!

ఇటు లాల్ నాయకుల్లో గానీ – అటు  నీల్ నాయకుల్లో గాని ఐక్యత పట్ల మూడు రకాల దోరణులను మనం గమనించ వచ్చు.

  1. ఐక్యత అసాధ్యం, అనవసరం, అసహజం,నష్టం అనే వ్యక్తులు.

2 ఐక్యత    సాద్యమే, అవసరం, సహజం, ఉపయోగం  అనే మిత్రులు.

  1. వీరు లాల్,నీల్ సంస్థల్లో ఉంటూ ఐక్యత కు అభ్యంతరం పెట్టరు. అందు కోసం ప్రత్యేకంగా కృషి కూడా ఏమీ చేయరు.

నీల్  ఉద్యమం గురించి మొదట పరిశీలిద్దాం.

1.A మొదటిరకం 

లాల్ తో ఐక్యత వద్దనే  నీల్ వ్యక్తులు వీరిలో అత్యధికులు ధనికులుగా  ఉండి ఏదో ఒక సందర్భంలోకమ్యూనిష్టులతో ఘర్షణ పడి వుంటారు. ఇంకొందరు  తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం లాల్ ను వ్యతిరేకిస్తూ ఉంటారు. మరి కొందరు వామపక్ష ఉద్యమాల్లో పాల్గొని, వ్యక్తిగతమైన లేదా నిర్మాణ పరమైన లేదా సైద్ధాంతిక పరమైన భేదాలతో ఆ పార్టీ నుండి బయటకు వచ్చిన వారుంటారు.

లాల్ పార్టీ నుండి బైటకు పోయిన వారి తప్పులను , వారు బైటకు పోయిన తర్వాత బహిరంగంగా ఏకరువు పెట్టటం – దానికి  కౌంటర్ గా బయట కొచ్చిన  నీల్ నాయకులు కూడా ప్రతిదాడి చేయడం సహజంగా జరుగుతూ ఉంటుంది.  ఆ వ్యక్తిగత అంశాలను వారు సైద్ధాంతిక అంశాలుగా మారుస్తారు.

ఇలాంటి వ్యక్తిగత కోపతాపాలతో ఉండే కొందరు నాయకులు వాటిని సిద్దాంత భేదాలుగా చూపిస్తూ ఐక్యతకు ఆటంకాలు కల్పిస్తుంటారు. వీరికి సమాజాన్ని అన్ని విధాలా అణిచి పెడుతున్న  అసలు ప్రమాదకర శత్రువును పక్కన పెట్టి లాల్ కు వ్యతిరేకంగా ఎక్కువగా విమర్శలు చేస్తుంటారు.

వీరికి ఎంతసేపు తమ వ్యక్తిగత ప్రయోజనాలే తప్ప తరతరాలుగా తమ  జాతులు ఎంత దుర్భర జీవితాలు గడిపాయో కసితో అర్ధం చేసుకుని, యికనైనా వాటిని అంతం చేయాలన్న పట్టుదల ఉండదు.

ఈనాడు మనువాద శక్తులు బరితెగించి దళితులు , గిరిజనులు ,మైనారిటీలు తదితర బలహీన వర్గాలపై దాడులు దౌర్జన్యాలు చేస్తుంటే ,  వీరు ఇప్పుడు కూడా తమ బాద్యతను గుర్తించడం లేదు.

నిరంతరం పాలకులతో పోరాడే లాల్ శక్తులను దూరం చేసుకోకూడదనే స్పృహ వీరికి ఏ మాత్రం ఉండటం లేదు.     ఎన్నో త్యాగాలు చేసిన సుందరయ్య, రాజేశ్వరరావు లాంటి  ఎంతో మంది లాల్ నాయకులను కూడా  వీరు నోటికొచ్చిన  విధంగా తూలనాడతారు.

అగ్రకులాలాల్లో  పుట్టటమే ఆ కామ్రేడ్స్ చేసిన పాపంగా భావించి, అగ్ర కులాల్లోని అందరినీ ఒకే గాటన కట్టి వారిని తమ వ్యతిరేకులుగా బావిస్తారు. చివరికి అగ్రకులాల్లోని పేదలను కూడా వీరు శతృవులుగా బావిస్తారు. వీరు ఐక్యతను పెంచటానికి బదులు మరింత తుంచే దానికే ఎప్పుడూ ప్రయత్నిస్తుంటారు.

1.B నీల్ తో ఐక్యత వద్దనే లాల్  వ్యక్తులు

వీరు లాల్ నాయకత్వం లో కీలక స్థానాల్లో ఉంటారు. 90%   అగ్ర కులాలనుండి వచ్చిన  మద్య తరగతి, ఎగువ మద్యతరగతికి చెందిన వారే దాదాపుగా ఈ నాయకులుగా ఉంటారు. సామాజిక అణచివేత అనుభవం లేని వారే వీరందరు. కుల వివక్షతలు ఇప్పుడెక్కడున్నా యి, అవి కొద్దో గొప్పో ఉన్నా ఆర్ధిక సమానత్వం సాధించటంతో అవే పోతాయంటారు.  కులం ఇప్పుడు సమస్యే కాదంటారు. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాలనే వారిని అవహేళన చేస్తారు. అట్టి వారికి కుల వాదులు, కుల అస్థిత్వ వాదులని ముద్రలు తగిలిస్తారు. తాము చేసేది అగ్రకుల  వాదమని ,  అగ్ర కుల అస్థిత్వ వాదమని   బావించరు.

తాము పుట్టుకతోనే కుల రహితంగా, అస్థిత్వ రహితంగా పుడుతామనే అసహజ, ఊహాజనిత భావన వారిలో గూడు కట్టుకొని ఉంటుంది.

బహుజనులచే ఆరాద్యుడుగా బావించబడుతున్న అంబేద్కర్ ను ” పెటీ బూర్జువా మేధావి ”  “కులతత్వ వాది” అంటూ అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ వ్యాసాలు, పుస్తకాలు   రాస్తున్నారు.  ఈ మేధావులు కుల వాదానికి కుల వ్యతిరేక వాదానికి ఉన్న తేడాను గమనించ లేక పోతున్నారు. ప్రజాతంత్ర విప్లవ దశలో  ఆర్ధిక రంగంలో కార్మికులు ఎంత ప్రాధాన్యమో, సామాజిక రంగంలో దళితులంత ప్రాధాన్యమని గుర్తించలేక పోతున్నారు.

బహుజనుల్లో ఒకరో,ఇద్దరో   సంపన్నులుంటే వారిని అగ్రకుల సంపన్నులతో సమానం చేసి మాట్లాడుతారు. వారు తరతరాలుగా సామాజిక అణచివేత, వివక్షతకు గురైన విషయాన్ని అసలు పరిగణలోకి తీసుకోరు.

ఎస్సీ,ఎస్టీ తదితర సామాజికంగా వెనుకబడి, అంటరానితనం, వివక్షతలకు గురైన వారు తమ హక్కుల రక్షణ కోసం పెట్టుకున్న దళిత బహుజన సంఘాలను  అస్థిత్వ సంఘాలని,  అవి పెట్టిన వారిని అస్థిత్వ వాదులని భావిస్తారు. పైగా  “అణచబడ్డ”  కుల అస్థిత్వ ఉద్యమాల వల్ల  వామపక్ష ఉద్యమాలకు ఆటంకమని  ప్రచారం చేస్తారు.  వారికి ఉన్న ఈ అవాస్తవికమైన అవగాహన లాల్ – నీల్ ఐక్యత కు పెద్ద అడ్డంకిగా వుంది.

2.A రెండవ వర్గం

 లాల్ తో ఐక్యత కావాలనే నీల్ మిత్రులు

వీరు నీల్ ఉద్యమంలో బహుజనుల కోసం నిబద్ధతగా, క్రియాశీలకంగా పనిచేస్తుంటారు. తమ వ్యక్తిగత ప్రయోజనాల కంటే సమాజ ప్రయోజనాలే ముఖ్యమని భావిస్తారు. ప్రమాదకరమైన పెద్ద శతృవును ఎదిరించడానికి ప్రస్తుతం నీల్ శక్తులకున్న బలం మాత్రమే చాలదని, తోటి అభ్యుదయ శక్తి గా ఉన్న లాల్ శక్తులను కూడా కలుపుకుని పోరాడాలని వాదిస్తుంటారు. లాల్ తో కొన్ని విషయాల్లో  అభిప్రాయ భేదాలున్నా, అవి విశాల ఐక్య కార్యాచరణకు ఆటంకాలు కావనే భావంతో ఉంటారు.

వీరు ప్రదానంగా ఆర్థికంగా మద్యతరగతి కి చెందిన వారుగా వుంటారు. సామాజిక అణచివేతకు గురై ఉంటారు. వీరికి లాల్  – నీల్ లు కలవాలని ఉంటుంది. కానీ దానిని బహిర్గత పర్చి, సమర్థించే నైపుణ్యం లేక పోవడంతో యిబ్బంది పడుతుంటారు. వీరు కమ్యూనిష్టులందరు కలిసి ఒకే పార్టీగా ఏర్పడాలని కోరుకుంటారు.

బహుజన సంఘాలన్నీ  ఒక వేదిక పైకి రావాలని ప్రయత్నిస్తుంటారు. అలాగే  లాల్ – నీల్ కలిసి , కనీస కార్యక్రమం రూపొందించుకొని, దేశవ్యాప్తంగా విస్తృత స్థాయిలో ప్రచారం జరిగితే తప్పక ఫలితాలు వస్తాయనే గాఢ విశ్వాసం కలిగి ఉంటారు.

2.B.నీల్ తో ఐక్యత కావాలనే  లాల్ మిత్రులు*

కమ్యూనిస్టు పార్టీల్లో రాష్ట్ర, కేంద్ర ప్రదాన నాయకత్వ మంతా దాదాపుగా అగ్ర కులాల  నుండి వచ్చిన కామ్రేడ్సే ఉంటారు. వీరిలో ‘డి క్లాస్ ‘ తోపాటు ‘డి క్యాస్ట్’ అయిన మిత్రులందరూ లాల్  – నీల్ ఐక్యతను హృదయ పూర్వకంగా కోరుకుంటారు. కానీ వీరి సంఖ్య చాలా పరిమితంగా ఉంటుంది.

ఇక పార్టీలో పూర్తి కాలం  కార్యకర్తలు,మండల కమిటీలు, తదితర క్రింది స్థాయి నాయకత్వమంతా దాదాపుగా ఎస్సీ,ఎస్టీ,బీసి తదితర బహుజన కులాల నుండే ఉంటారు. కాబట్టి  వీరంతా లాల్ – నీల్ ఐక్యతను సమర్థిస్తారు.

కమ్యూనిస్టుల మధ్య ఉన్న చీలికలను వీరు ఎంత మాత్రం సమర్థించరు. కమ్యూనిష్టులందరు వీలీనమై ఒకే పార్టీగా ఏర్పాడాలనే కాంక్ష కూడా వీరికి బలంగా ఉంటుంది. వీరు భారతీయ ప్రగతి వాదులైన బుద్దుడి నుండి అంబేద్కర్ వరకు ఉన్న మహనీయు లందరినీ స్వంతం చేసుకుంటారు.

ఈ కామ్రేడ్స్ సామాజిక  అణచివేతకు గురైన వ్యక్తులు,సంస్థల నుండి ఆదరాభిమానాలు పొందుతుంటారు. వీరు లాల్ శక్తుల మధ్య మైత్రి చాలా అవసరమని భావిస్తారు. అందుకోసం బాగా కృషిచేస్తారు. అలాగే ప్రజాతంత్ర విప్లవ దశలో కలుపుకు రావల్సిన ప్రధానమైన విప్లవ శక్తిగా నీల్ ఉద్యమాన్ని గుర్తిస్తారు.

3వ వర్గం. తటస్థ మిత్రులు

కమ్యూనిస్టుల ఐక్యత పట్ల తటస్థ భావం గల ఈ కామ్రేడ్స్ తమ తమ సంస్థలలో 90% పైగానే ఉంటారు. వీరు ఎక్కువగా ప్రధాన నాయకత్వానికి బాగా సన్నిహితంగా ఉంటారు. కానీ వ్యక్తిగతంగా ఐక్యతకు అనుకూలంగా ఉంటారు. ప్రజలు కమ్యూనిస్టుల ఐక్యత పట్ల ప్రభావితమైనప్పుడు పెద్ద సంఖ్యలో ఉన్న ఈ తటస్థ లాల్ మిత్రులు ప్రభావితం కాగలుగుతారు. అప్పుడు మాత్రమే లాల్ ఐక్యతకు మార్గం సుగమం అవుతుంది.

ఈ తొంభై శాతంగా ఉన్న తటస్థ లాల్ మిత్రులు నివురు గప్పిన నిప్పు లాంటి వాళ్లు, లేదా నిశ్శబ్ద విప్లవం వంటి వాళ్లు. ఈ కామ్రేడ్స్ ను ఐక్యత కోసం ఏ మేరకు ఆలోచింప చేయగలిగితే, ఆ మేరకు లాల్, నీల్ శక్తుల మధ్య మైత్రి  నెలకొంటుంది.

ఈ తటస్థ మిత్రులు ఐక్యత గురించి పైకి మాట్లాడక పోయినా వీరిలో దాని పట్ల అంతర్మదనం ఉంటుంది. గడియారంలో చిన్న ముల్లు లాగా వీరి స్పందనలు ప్రారంభ దశలో వేగంగా పైకి కనిపించవు.

కమ్యూనిస్టు ఉద్యమంలో లాల్, నీల్ మైత్రి పట్ల సానుకూలత బాగా పెరిగినప్పుడు నీల్ ఉద్యమం లోని తటస్థులు కూడా అన్ని అవరోధాలను తోసేసుకుని లాల్ శక్తులకు తమ స్నేహ హస్తాన్ని అందిస్తారు.

ఇప్పటికే లాల్, నీల్ ఐక్యతను గుర్తించిన ఎర్ర జెండా మిత్రులు అర్ధం చేసుకోవలసింది ఏమిటంటే!

కమ్యూనిస్టుల మైన మనం అంతర్జాతీయ శ్రామికవర్గ  దృక్పథానికి వారసులుగా ఉండటం వలన, అంబేడ్కర్ వాద మిత్రులను కలుపుకు రావలసిన గురుతరమైన బాధ్యత మన పైన ఎక్కువ ఉంటుందని గమనించుకోవాలి. అదే సందర్భంలో అంబేడ్కర్ వాద మిత్రులకు ఈ విషయంలో బాధ్యత తక్కువ ఉందని చెప్పటం దీని  ఉద్దేశం కాదని అర్ధం చేసుకోవాలి.

ఏ “కాన్సెప్ట్”  అయినా మొదట ఒక వ్యక్తి కో ,చిన్న గ్రూప్ కో వస్తుంది. అది ప్రచారముయ్యే కొద్దీ ప్రజల బుర్రల్లోకి వెళుతుంది. అదే  నెమ్మది  నెమ్మదిగా బౌతిక శక్తిగా మారుతుంది.

 లాల్ – నీల్ శక్తుల మైత్రీ ప్రయత్నాలు ఈనాటివి కావు.

బాబా సాహెబ్ అంబేద్కర్, మోరే కాలం నుండి దళిత ఫాందర్స్ ఉద్యమం దాకా ఇది కొనసాగుతూ వస్తూనే ఉంది.  ఆ తర్వాత సత్యమూర్తి, M ఓంకార్, బొజ్జా తారకం, బి. రామకృష్ణ, మా రోజు వీరన్న ఉసా వరకు ప్రవహిస్తూ ఉంది.

ప్రస్తుతం దేశంలోని ప్రగతిశీల శక్తులను బాగా ప్రభావితం చేస్తున్న యువ మేధావులు కన్నయ్య కుమార్, జిగ్నేష్ మేవానీ, ప్రకాష్ అంబేడ్కర్, ఆనంద్ తేల్డు తుంబులే, చంద్ర శేఖర్ ఆజాద్ రావణ్, తిరుమా వలన్ వంటి పోరాట యోధులు ఎంతో మంది లాల్, నీల్ మైత్రి ఆవశ్యకతను బాగా ప్రస్తావిస్తున్నారు. లాల్, నీల్  అవగాహనతో మహాజన ఫ్రంట్ పేరిట  ఒక రాజకీయ ప్రయోగం కూడా జరిగింది.

ఇటీవలి కాలంలో మార్క్స్, పూలే,అంబేద్కర్ ల ఆశయాల సాధనే లక్ష్యమని సిపియం తెలంగాణ కమిటి ప్రకటించడం అనేది భారత కమ్యూనిస్టు ఉద్యమం లోనే ఒక సంచలన పరిణామంగా భావించ వచ్చు.

”సామాజికన్యాయం-సమగ్ర అభివృద్ది” నినాదం తో తెలంగాణాలో 154 రోజుల పాటు తమ్మినేని వీరభద్రం తదితర నాయకులతో పాద యాత్ర జరిగింది.

లాల్ – నీల్ పార్టీల ప్రజాసంఘాలతో  పెట్టిన  టీ మాస్ , తదితర అభ్యుదయ పార్టీలతో బి ఎల్ ఎప్ ఏర్పాటు  లాల్ – నీల్ శక్తుల్లో పెద్ద ఆసక్తిని, ఉత్సాహాన్ని కలిగించింది.

MCPI (ఓంకార్ పార్టీ)  బహుజన సామాజిక న్యాయ సూత్రాలను తన రాజకీయ విధానాల్లోనే గాక వాటిని తమ పార్టీ నిర్మాణంలో కూడా వర్తింప చేసి ఆదర్శంగా నిలిచింది.

ఈనాడు దాదాపుగా అన్ని కమ్యూనిస్టు పార్టీల్లో కుల వివక్ష – అసమానతల గురించి,  సామాజిక న్యాయం గురించి బలంగానో, తేలికగానో చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలు మరింత లోతుగా, విస్తారంగా జరిగినప్పుడు అన్ని కమ్యూనిస్టు పార్టీలు కుల సమస్యను కూడా ప్రధాన ఎజెండాగా తీసుకుని పని చేయగలవు. అప్పుడు లాల్, నీల్ ఐక్యత గురించి కమ్యూనిస్టు పార్టీలకు బైట ఉన్న  మా లాంటి వ్యక్తులు మాట్లాడ వలసిన అవసరం  ఉండక పోవచ్చు.

అలాగే కొన్ని కమ్యూనిస్టు పార్టీలు గత కొంత కాలం నుండి కుల సమస్యపై పని చేసేందుకు కుల నిర్మూలనా పోరాట సంఘాలు, కుల వివక్ష వ్యతిరేక సంఘాలు, సామాజిక హక్కుల వేదిక వంటి సంఘాలను స్థాపించటమనేది, అవి లాల్ – నీల్ మైత్రికి దేహదపడే విషయాలే తప్ప, దానికి వ్యతిరేక మైనవి కాదని గ్రహించాలి.

చరిత్రలో ఇలాంటి విప్లవాత్మక ప్రయోగాలు  జరగడం – ఏవో కొన్ని కారణాలతో అవి తాత్కాలికంగా ఆగి పోవడం, లేదా కుంటుపడటం జరుగుతునే ఉంది.

భారత స్వాతంత్ర్య పోరాటంలో గానీ, ప్రపంచ విప్లవాల చరిత్రలో గానీ ఇలాంటి ఒడుదుడుకులు అనేకం మనం గమనించ వచ్చు.

సక్రమమైన, న్యాయమైన, ఆవశ్యకమైన పోరాటాలు తాత్కాలికంగా ఆగినా, వెనకడుగేసినా ,కొంత ఆలస్యమైనా అవి విజయం సాధించటం తథ్యం అనేందుకు చరిత్రే మనకు సాక్ష్యం. అందుకే లాల్, నీల్ ఐక్యత సాధ్యం – కుల-వర్గ రహిత సమాజం అనివార్యం.

@ ఎర్రజెండాలన్నీ  ఒక్కటిగా ఏకం కావాలి!
@ నీల్ జెండాలన్నీ ఒక్కటిగా ఏకం కావాలి!
@ లాల్ – నీల్ జెండాలు ఐకమత్యంతో ముందుకు సాగాలి.
@ మార్క్సిజం వర్ధిల్లాలి!
@ అంబేడ్కరిజం వర్ధిల్లాలి!
@ లాల్ – నీల్ మైత్రి వర్ధిల్లాలి!
@ మనువాద ఫాసిస్టు దోపిడీ శక్తులు నశించాలి!

గమనిక : పై వ్యాసంలో ఏమైనా మార్పులు – చేర్పులు అవసరమని మిత్రులు ఎవరైనా భావిస్తే వాటిని నా దృష్టికి తీసుకు రావలసిందిగా కోరుతున్నాను. వాటిని పునపరిశీలన చేసి తగు మార్పులు చేయటం జరుగుతుంది.

RELATED ARTICLES

Latest Updates