రైతు ఆదాయం రెెట్టింపయ్యేదెలా?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– 14 పుస్తకాలు రాసిన మోడీ సర్కార్‌ ‘కమిటీ’
– ఏమీ చేయలేక నగదు బదిలీతో సరిపెట్టింది : రాజకీయ విశ్లేషకులు
– లాక్‌డౌన్‌ వేళ అష్టకష్టాలతో ‘రబీ’ సాగు
– తాజా ఆర్డినెన్స్‌లపై ఆందోళన బాటలో కోట్లాదిమంది రైతులు

న్యూఢిల్లీ : ‘2022కల్లా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాం’..ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌..ఇలా అనేక రాష్ట్రాల్లో రైతులను తమవైపునకు తిప్పుకోవడానికి ప్రధాని మోడీ చేసిన వాగ్దానం ఇది. వరుస కరువు కాటకాలు, వ్యవసాయరంగంలో అనిశ్చిత వాతావరణంతో కలతచెంది ఉన్న రైతాంగంలో ప్రధాని వాగ్దానం ఎన్నో ఆశలు నింపింది. అయితే వారి ఆశలు నెరవేర్చడానికి మోడీ సర్కార్‌ కేవలం ఒక కమిటీ ఏర్పాటుచేసి చేతులు దులుపుకుంది. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయటమెలా? అన్నదానిపై 14 పుస్తకాలు రచించి 2018లో ఆ కమిటీ మోడీ సర్కార్‌ చేతిలో పెట్టింది. ఈమధ్యలో ‘నిటి ఆయోగ్‌’ ద్వారా ఒక మధ్యంతర నివేదికను విడుదల చేయించింది. చివరికి ఏం చేయాలో పాలుపోక ‘నగదు బదిలీ’ పథకాన్ని ప్రకటించిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఏడాదికి మూడు దఫాలుగా రూ.6వేలు ఇవ్వటంతో రైతు ఆదాయం రెట్టింపు చేసినట్టేనని కేంద్రం భావిస్తున్నదని వారు అంటున్నారు.
మనదేశంలో 14కోట్లమంది వ్యవసాయ కార్మికు లున్నారని ఒక అంచనా. సాగు భూమిలేకుండా కూలీలుగా జీవనం సాగిస్తున్న రైతులెంతో మంది ఉన్నారు. వీరిలో అత్యధికులు దళితులు, ఆదివాసీలే. వీరి జీవన స్థితిగతులు మెరుగుపడకుండా, వీరి ప్రస్తావన లేకుండా ‘వ్యవసాయ ఆర్థిక ముఖచిత్రం’ మారదని ఎన్నో అధ్యయనాలు, నిపుణుల సూచనలు చెబుతున్నాయి. ఓవైపు రైతుల ఆదా యం పెరగకుండా, ఈ రంగంలో ఆధారపడిన రైతు కూలీలు, వ్యవసాయ కార్మికుల జీవితాలు ఎలా మెరుగుపడతాయన్నది ప్రధానమైన సందేహం. ఖరీఫ్‌, రబీకాలంలోనే రైతు కూలీలకు పని దొరుకుతుంది. మిగతా సమయాల్లో వేరే పనులు చూసుకోవాల్సిందే. వీరి ప్రస్తావన లేకుండా కేంద్రం ఎన్ని పథకాలు తెచ్చినా ఫలితం దక్కదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు వ్యవసాయ ఉత్పత్తుల రంగంలో బడా వ్యాపారులకు, కార్పొరేట్లకు ఆహ్వానం పలుకుతూ మోడీ సర్కార్‌ పలు ఆర్డినెన్స్‌లు జారీచేయ్యటం వివాదాస్పదమైంది. ఈ ఆర్డినెన్స్‌లను దేశవ్యాప్తంగా రైతులు, వ్యవసాయ సంఘాల నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి విధానాలతో రైతు ఆదాయం రెట్టింపు ఎలా అవుతుందని వారు ప్రశ్నిస్తున్నారు.

స్వామినాథన్‌ సిఫారసు ఏమైంది?
గోధుమ సాగుకు అయిన ఖర్చు+దానిపై 50శాతం.. .కలుపుకొని కనీస మద్దతు ధర కల్పించాలని ఎం.ఎస్‌. స్వామినాథన్‌ కమిటీ సిఫారసు చేసింది. ఈ కమిటీ సిఫారసులను అమలుజేస్తామని ఎన్నికల వాగ్దానం చేసి బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ అంశం రాజకీయంగా బాగా కలిసివచ్చింది. అయినా… ఆరేండ్లుగా ఈ వాగ్దానంపై మోడీ సర్కార్‌ ఒక్కమాట మాట్లాడలేదు. గత ఏడాది రబీలో కోటీ 7 లక్షల టన్నుల గోధుమ పంటను రైతులు పండించారు. ఇది ఆల్‌టైం రికార్డ్‌. ఇదంతా కూడా మార్కెటు శక్తులు, దళారులు నిర్ణయించిన ధరకు రైతులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంది. 5నెలలు ఎన్నో కష్టనష్టాలు పడితే..గోధుమ రైతుకు పంట చేతికొస్తుందనే స్వామినాథన్‌ కమిటీ ‘కనీస మద్దతు ధర’కు పై సూత్రీకరణ చేసింది. బార్లీ, పప్పుధాన్యాలు, ఆవాలు…మొదలైన పంట ఉత్పత్తుల అమ్మకాల్లోనూ స్వామినాథన్‌ సిఫారసులు అమలుకావటం లేదని వ్యవసాయ సంఘాలు నిరసన బాట పడుతున్నాయి. ఎందులోనూ న్యాయం జరగటం లేదని రైతు ఆందోళనలు పెరుగుతున్నాయి.

పొంతనలేని ధరలు..
భారత్‌లో అత్యధికంగా రైతులు సాగుచేస్తున్న పంట వరి. గత ఖరీఫ్‌ సీజన్‌లో కోటీ 18లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. ఇది కూడా ఆల్‌టైం రికార్డ్‌. వరి ధాన్యం విషయంలోనూ కనీస మద్దతు ధర నిర్ణయంలో కేంద్రం రకరకాలుగా గిమ్మిక్కులు చేస్తున్నది. పంట దిగుబడిలో రైతుకు అయిన ఖర్చుకు, మార్కెట్లో అతడికి లభిస్తున్న ధరకు పొంతన ఉండటం లేదు. 2020-21 ఖరీఫ్‌లో కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధర రూ.1868. స్వామినాథన్‌ కమిటీ సిఫారసు ప్రకారం రైతుకు మార్కెట్లో లభించాల్సిన ధర రూ.2501. దేశంలో ఎక్కడా…ఏ మార్కెట్లోనూ ధాన్యానికి ఈ ధర దక్కలేదు. జోన్నలు, సజ్జలు, కందులు, నూనెగింజలను పండించిన రైతుల పరిస్థితి కూడా ఇంతే.

Courtesy Nava telangana

RELATED ARTICLES

Latest Updates