వర్ష బీభత్సం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • ఉమ్మడి వరంగల్‌, కరీంనగర్‌లో దంచికొట్టిన వాన
  • వరంగల్‌లో అధికంగా 20, కరీంనగర్‌లో 15 సెం.మీలు
  • నగరాలు జలమయం.. రాకపోకలు బంద్‌.. ఇళ్లలోకి వరద
  • వరంగల్‌ జిల్లాలో వరద ఉధృతికి ఇద్దరు మృతి
  • రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు
  • పొంగిపొర్లుతున్న చెరువులు, కుంటలు
  • 10 మంది రైతులను రక్షించిన ఆర్మీ హెలికాప్టర్లు
  • సిద్దిపేట జిల్లాలో వాగులో లారీ డ్రైవర్‌ గల్లంతు
  • ఓరుగల్లులో గత 20 ఏళ్లలో ఇదే పెద్ద వర్షం

భారీ వర్షానికి వరంగల్‌ నగరం ఉక్కిరిబిక్కిరైంది. ప్రధాన రహదారులపై నీళ్లు నిలవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. చాలాచోట్ల ఇళ్లు కూలిపోయాయి. కాలనీల్లో మోకాళ్ల లోతులో వరద నీరు ప్రవహిస్తోంది. ముంపు ప్రాంతాల్లోని ప్రజలను సహాయక సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కలెక్టర్‌ కార్యాలయంలో టోల్‌ ఫ్రీ నంబరును ఏర్పాటు చేశారు. వరంగల్‌ నగరంలో గత 20 ఏళ్లలో ఈ స్థాయిలో వర్షం పడటం ఇదే తొలిసారి అని అంటున్నారు. పట్టణంలోని కాశీబుగ్గ, ఏనుమాముల, లేబర్‌కాలనీ, ఎస్‌ఆర్‌నగర్‌, సాయి గణేశ్‌ కాలనీ తదితర కాలనీలు జలమయ్యాయి. కాజీపేట రహమత్‌నగర్‌లో ఇళ్లు కూలాయి. పోతననగర్‌, హంటర్‌ రోడ్డు జలమయమయ్యాయి.

రెండు రోజులుగా పట్టిన ముసురు వదల్లేదు. సరికదా అప్పటిదాకా సన్నగా కురుస్తున్న జల్లుల్లో వేగం పెరిగింది. చిరుజల్లులే ఇంతింత లావు చినుకులై ధారగా కురిశాయి. గంటల తరబడి కురిసిన వర్షానికి వరద పొటెత్తింది! ఆ ఉధృతికి మైదానాలు, పొలాలు, రోడ్లు, వాగులు, చెరువులు ఎటు చూసినా నీళ్లే కనిపించాయి! పొలం పనులకు వెళ్లిన కూలీలు.. పశువులను మేపేందుకు పోయిన కాపర్లు.. వంతెనల వద్ద వాహనదారులు నడుందాకా వచ్చిన నీళ్ల మధ్య చిక్కుకుపోయి అవస్థలు పడ్డారు. వరినాట్లు మునిగి పొలాలు, పత్తి, కంది, మొక్కజొన్న చేలన్నీ చెరువులను తలపించాయి! చెరువులేమో పూర్తిగా నిండి అలుగులు పోశాయి! కొన్నిచోట్ల గండ్లు పడతాయనే భయంతో చెరువు మత్తళ్లను తవ్వేశారు. పోటెత్తిన వరదలకు కొన్నిచోట్ల నిండు ప్రాణాలు బలయ్యాయి. చాలాచోట్ల మూగజీవాలూ మృత్యువాతపడ్డాయి. లోతట్టు ప్రాంతాల్లోనైతే ఇళ్లలోకి నీళ్లు చేరాయి! నివాసాల్లో మోకాళ్ల దాకా చేరిన నీళ్ల మధ్య ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు! కొన్నిచోట్ల పాత ఇళ్లు కూలిపోయాయి. ప్రధాన రహదారులు ధ్వంసమయ్యాయి.

ఏజెన్సీ ప్రాంతాల్లోని గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఫెళఫెళమనే ఉరుములు, జలదరింపజేసే మెరుపులు, బలమైన ఈదురుగాలులేమీలేకుండానే రాష్ట్రంలో వరుణుడు సృష్టించిన బీభత్సమిది. శనివారం రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడ్డాయి! ఉమ్మడి వరంగల్‌, ఉమ్మడి కరీంనగర్‌లో ఈ తీవ్రత ఎక్కువగా ఉంది. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో రికార్డుస్థాయిలో 20 సెంటీమీటర్ల వర్షం పడింది. ఎల్కతుర్తి మండలం కోతులనడుమ వాగులో ఓ లారీ కొట్టుకుపోయింది. వరంగల్‌ రూరల్‌ జిల్లాలో కటాక్షపూర్‌ చెరువు, చెన్నారావుపేట- నెక్కొండ మండలాల మధ్య వాగులు పొంగి ప్రవహిస్తుండడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. నడికూడ మండలం కంఠాత్మకూర్‌ సమీపంలోని వాగులో ప్రైవేట్‌ బస్సు చిక్కుకుపోయింది. బస్సులో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. జనగామ జిల్లా వ్యాప్తంగా 5.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మహబూబాబాద్‌ జిల్లాలో  కొత్తగూడ, గంగారం, గూడూరు, బయ్యారం, గార్ల మండలాల్లోని గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

జిల్లాలో 10.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గంగారం-బయ్యారం మండలాల నడుమ ఏడుబావుల జలపాతం, గూడూరు మండలంలోని భీమునిపాదం జలపాతం, మహబూబాబాద్‌, డోర్నకల్‌, మరిపెడ, చిన్నగూడూరు, నర్సింహులపేట, కేసముద్రం మండలాల్లో మున్నేరు, ఆకేరు, పాలేరు, రాళ్లవాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మహబూబాబాద్‌-భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నడుమ బయ్యారం సమీపాలన గల నామాలపాడు, గార్ల-బయ్యారం రోడ్డు, బయ్యారం-మొట్లతిమ్మాపురం, మిర్యాలపెంట, శుద్దరేవు, ఆల్లిగూడెం, కొత్తగూడ, వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని నర్సంపేట రోడ్డులోని చిలకమ్మనగర్‌ రోడ్లపై నుంచి వర్షపు నీరు భారీగా ప్రవహిస్తుండడంతో ఆయా రోడ్లపై రాకపోకలను నిషేధిస్తున్నట్లు ఎస్పీ కోటిరెడ్డి ప్రకటించారు. గార్ల, తొర్రూరు, నెల్లికుదురు మండలాల్లో ఎనిమిది ఇళ్లు కూలిపోయాయి.

భూపాలపల్లి జిల్లాలో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.  రేగొండ మండలం రూపిరెడ్డిపల్లి శివారులో చలివాగు పొంగిపొర్లడంతో రోడ్డుపైకి నీళ్లు చేరి రాకపోకలు నిలిచిపోయాయి. ములుగు జిల్లాలో 14.9సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. లక్నవరం సరస్సు మత్తడిపోస్తుండగా అందులోని దీవులను కలుపుతూ నిర్మించిన రెండు ఉయ్యాల వంతెనలు మునిగిపోయాయి. రామప్ప సరస్సు 35 ఫీట్ల పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకొని మత్తడి పోస్తోంది. కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా 10.8 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. హుజూరాబాద్‌ డివిజన్‌లో అత్యధికంగా 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హుజురాబాద్‌ మండలం చిలుకవాగులో జిన్నారావు అనే వ్యక్తి చిక్కుకుపోగా పోలీసులు వెళ్లి రక్షించారు.  చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి రేకొండ మధ్య వంతెన కూలిపోయింది. అల్గునూర్‌ వద్ద చేపలకాలనీలోకి వరద నీరు ప్రవేశించడంతో ఇళ్లలోకి నీళ్లు చేరాయి.

రామంచగ్రామానికి చెందిన దొబ్బల చిన కొమురయ్య అనే రైతుకు చెందిన నాలుగు గేదెలు, మోయతుమ్మెద వాగులో కొట్టుకుపోయాయి. పెద్దపల్లి జిల్లాలో మానేరు, హుస్సేనిమియా వాగు పొంగిపొర్లుతున్నాయి. మంచిర్యాల జిల్లా ఏదులబందం వద్ద లోలెవల్‌ కాజ్‌వే వంతెన నీట మునగడంతో ఆవలి వైపు ఉన్న ఎనిమిది గ్రామాలకు రాకపోకలు నిలిచి పోయాయి.  ఆసిఫాబాద్‌ జిల్లాలో బెజ్జూరు మండలంలోని సోమిని, సుశ్మీర్‌, ఇప్పలగూడ, నాగేపల్లి, మొగవెల్లి, పాత సోమిని, చింతలపల్లి, బండలగూడ, గెర్రెగూడ గ్రామాలకు రాకపోకలు  నిలిచిపోయాయి. చింతలమానేపల్లి మండలంలోని రుద్రాపూర్‌ వాగు, బాబాసాగర్‌ నాయికపుగూడ వాగు, చింతలమానేపల్లి వాగు, దిందా-కేతిని వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.

ఓరుగల్లులో గత 20 ఏళ్లలో ఇదే పెద్ద వర్షం
భారీ వర్షానికి వరంగల్‌ నగరం ఉక్కిరిబిక్కిరైంది. ప్రధాన రహదారులపై నీళ్లు నిలవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. చాలాచోట్ల ఇళ్లు కూలిపోయాయి. కాలనీల్లో మోకాళ్ల లోతులో వరద నీరు ప్రవహిస్తోంది. ముంపు ప్రాంతాల్లోని ప్రజలను సహాయక సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కలెక్టర్‌ కార్యాలయంలో టోల్‌ ఫ్రీ నంబరును ఏర్పాటు చేశారు. వరంగల్‌ నగరంలో గత 20 ఏళ్లలో ఈ స్థాయిలో వర్షం పడటం ఇదే తొలిసారి అని అంటున్నారు. పట్టణంలోని కాశీబుగ్గ, ఏనుమాముల, లేబర్‌కాలనీ, ఎస్‌ఆర్‌నగర్‌, సాయి గణేశ్‌ కాలనీ తదితర కాలనీలు జలమయ్యాయి. కాజీపేట రహమత్‌నగర్‌లో ఇళ్లు కూలాయి. పోతననగర్‌, హంటర్‌ రోడ్డు జలమయమయ్యాయి.

వరదలో 40 మంది
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పెంచికలపేట మండలంలోని బొక్కివాగు ఉగ్రరూపం దాల్చడంతో పెంచికలపేట-బెజ్జూరు మండలాల మధ్య రాకపోకలు స్థంభించిపోయాయి. బొక్కివాగు మత్తడి భారీగా ప్రవహించడంతో పాత ఎల్లూరు గ్రామానికి చెందిన 40 మంది వ్యవసాయ కూలీలు వరద ప్రవాహంలో చిక్కుకున్నారు. రెండు గంటల అనంతరం వరద ఉదృతి తగ్గడంతో స్థానిక గంగపుత్రుల సహాయంతో ఒడ్డుకు చేరారు.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates