పర్యావరణానికి తూట్లు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– పెద్దల చేతుల్లోకి అటవీ భూములు
– గిరిజనులు, ఆదివాసీల హక్కుల్ని నిర్వీర్యం చేస్తున్న ఈఐఏ-2020
– అభివృద్ధిపై ప్రజలకు ఆర్థిక భ్రమలు…
– నోటిఫికేషన్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలి : పర్యావరణవేత్తలు
– కేంద్ర అటవీ శాఖ వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్‌పై 17లక్షల మంది అభ్యంతరం

న్యూఢిల్లీ: కేంద్రం ఇటీవల తెరపైకి తీసుకొచ్చిన ‘పర్యావరణ ప్రభావ మదింపు-2020’ (ఈఐఏ) ముసాయిదాను వెంటనే ఉపసంహరించుకోవాలని పర్యావరణవేత్తలు, వివిధ పార్టీల రాజకీయ నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. దేశ పర్యావరణ నియమావళిని మోడీ సర్కార్‌ విధ్వంసం చేస్తోందని ఆందోళన వ్యక్తమవుతున్నది. ‘ఈఐఏ నోటిఫికేషన్‌’ పర్యావరణానికి చేటు చేస్తుందే తప్ప ఏ విధంగానూ మేలు చేయదనీ, భారత్‌ ఇలాంటి విధానాలను గనుక ఎంచుకుంటే, ముందు ముందు మరిన్ని ప్రకృతి విపత్తులు సంభవిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అడవులపై ఆధారపడి జీవిస్తున్న, గిరిజనుల ప్రయోజనాల్ని ఫణంగా పెడుతున్నారనీ, కేవలం కొంతమంది ప్రయివేటు వ్యక్తులకు అటవీ భూముల్ని అప్పగించడానికే ‘ఈఐఏ-2020’ని తీసుకొస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నోటిఫికేషన్‌పై సూచనలు, అభ్యంతరాలు స్వీకరించే గడువు ఆగస్టు 11తో ముగిసింది. దీనిపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలవ్వగా, కేంద్ర ప్రభుత్వానికి కోర్టు నోటీసులు జారీచేసింది.

అభ్యంతరం ఏంటి?

వివిధ పరిశ్రమలు, రక్షణ, జాతీయ భద్రత, నిర్మాణరంగం, రహదార్లు, భవన నిర్మాణాలు, నీటిపారుదలప్రాజెక్టుల ఆధునీకరణ… మొదలైనవాటికి ‘ప్రజాభిప్రాయ సేకరణ’ లేకుండానే ఇకపై పర్యావరణ (ఈఐఏ-నోటిఫికేషన్‌ ప్రకారం) అనుమతులు ఇస్తారు. ప్రాజెక్టు చేపట్టిన ప్రాంతంలో స్థానికుల అభ్యంతరాలు చట్టపరంగా చెల్లవు. నోటిఫికేషన్‌లో బీ2-కేటగిరి కింద దాదాపు 40 రకాల పరిశ్రమలను జాబితాలో చేర్చారు. ఈ జాబితాలోని ప్రాజెక్టులకు…ఆదివాసీలు, గిరిజనుల ప్రయోజనాలు, హక్కులు పరిరక్షించే బాధ్యత నుంచి తప్పించారు. షెడ్యూల్‌ 5, 6 ప్రాంతాల్లో ఇష్టమొచ్చిన చోట భూసేకరణ చేపట్చొచ్చు. ఆగస్టు 11నాటికి ఈఐఏ-2020 నోటిఫికేషన్‌పై 17లక్షల మంది అభ్యంతరం వ్యక్తంచేశారు.

చట్టాలు నిర్వీర్యం
అడవులపై ఆధారపడి జీవించే ఆదివాసీలు, గిరిజనులకు భారత రాజ్యాంగం హక్కుల్ని కల్పించింది. అటవీ హక్కుల చట్టం-2006, పెసా చట్టం-1996, పంచాయతీల చట్టం-1996… మొదలైనవన్నీ ఇప్పటివరకూ అనేక విధాలుగా రక్షణగోడగా ఉన్నాయి. వీటిని నిర్వీర్యం చేసేవిధంగా ఈఐఏ-2020లో పలు నిబంధనలున్నాయని సామాజిక, పర్యావరణవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షెడ్యూల్‌ 5, షెడ్యూల్‌ 6 కింద నోటిఫై అయిన ప్రాంతాల్లో చట్టప్రకారం అక్కడున్న గిరిజనులకు, ఆదివాసీలకు కొన్ని ప్రత్యేక హక్కులు ఇచ్చారు. అటవీ భూములు, సంపద, సహజ వనరులు వాడుకోవాలంటే వారి అనుమతి తప్పనిసరి. వారి ప్రయోజనాలు, హక్కుల పరిరక్షణ నెరవేరిన తర్వాతే ప్రాజెక్టు పనులు మొదలుకావాలి.

సుప్రీం తీర్పులు ఉన్నా : తుషార్‌దాస్‌, భువనేశ్వర్‌
గ్రామసభ అనుమతి లేకుండా ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వడానికి వీల్లేదని ‘అటవీ హక్కుల చట్టం-2006′ చెబుతున్నది. అటవీయేతర పనుల కోసం భూముల్ని వినియోగిస్తే గ్రామ సభ అనుమతి తప్పనిసరి. ఇదే విషయాన్ని చెబుతూ…’నియమ్‌గిరి మైనింగ్‌’ కేసులో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. అటవీ వనరులకు, జంతువులకు, జీవవైవిధ్యానికి హాని కలుగుతుందని గ్రామసభ భావిస్తే, ప్రాజెక్టును నిలిపేయాల్సిందిగా ఆదేశించవచ్చునని అత్యున్నత న్యాయస్థానం 2013లో తీర్పు చెప్పింది. ఆ కేసుకు సంబంధించి, రాయగఢ్‌ జిల్లాలో 12 గ్రామ సభలు, కలహండి జిల్లాలో 5 గ్రామసభల అనుమతి తీసుకోవాలని చెప్పింది. అప్పుడే బాక్సైట్‌ తవ్వకాలు చేపట్టాలని ఆదేశించింది.
సామాజిక ప్రభావాన్ని పట్టించుకోరా..

సామాజిక ప్రభావం, అభివృద్ధి అంశాల్ని ఈఐఏ నోటిఫికేషన్‌ విస్మరించింది. గిరిజనులకు, ఆదివాసీలకు కల్పించిన హక్కుల్ని పూర్తిగా నిర్వీర్యం చేసేట్టుగా ఇది ఉంది. అడవి బిడ్డల పయోజనాల్ని కాలరాసింది. ఒకవేళ ఆదివాసీలు, గిరిజనులపై కేంద్రానికి ప్రేమ ఉంటే వివిధ భాషల్లో అందరికీ అర్ధమయ్యేట్టు నోటిషికేషన్‌ విడుదలచేసేవారు.
– రెబ్బాప్రగడ రవి, సామాజిక కార్యకర్త

కొత్త నిబంధనలు ఎవరికోసం !
‘ఈఐఏ-2020’లో ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌’ బిజినెస్‌ పేరుతో పర్యావరణ నిబంధనలన్నీ సరళతరం చేయటం వివాదాస్పదమైంది. ఇప్పటివరకూ చట్టపరంగా ఉన్న రక్షణలన్నీంటికీ ఇది తూట్లు పొడిచేదిగా ఉన్నదని వివిధ రాజకీయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. భూతాపం పెరగడానికి దోహదపడుతుందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. ప్రజలకు ఆర్థిక అభివృద్ధిపై భ్రమలు కల్పించీ, ఇప్పటికే మనదేశం పర్యావరణాన్ని, ప్రజల హక్కుల్ని దెబ్బతీశారనే విమర్శలున్నాయి. గత ఆరేండ్లుగా కేంద్రం పర్యావరణ పరిరక్షణ చట్టానికి తూట్లు పొడుస్తున్నదనీ, బడా కార్పొరేట్లకు బొగ్గువేలం ప్రాజెక్టులు అప్పజెప్పుతున్నారని పర్యావరణవేత్తలు అంటున్నారు.
ఈఐఏ-2020 ముసాయిదాలోని నిబంధనలు కాలుష్య కారకులకు క్లీన్‌చిట్‌ ఇచ్చి, పర్యావరణానికి హానితలపెట్టేలా ఉన్నాయి. ప్రయివేటురంగంలో ఎంపికచేసుకున్న కొంతమందికి విస్తారంగా అటవీ భూములను కట్టబెట్టేందుకు ద్వారాలు తెరిచినట్టైంది. ఈ ముసాయిదా నోటిఫికేషన్‌ పర్యావరణానికి చేటు చేస్తుందనీ, పర్యవసానాలు విపత్తుకు దారితీస్తాయని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు.

తీవ్రమైన నష్టం …
ఈ చట్టంతో గిరిజనులు, గిరిజన ప్రాంతాల్లోని ప్రజలు, పంచాయతీలకు చాలా నష్టం జరుగుతుంది. వాతావరణం దెబ్బతినడం ఒక సమస్య అయితే, షెడ్యూల్‌ గ్రామాల్లో పంచాయతీ తీర్మానం ఇప్పుడు అవసరం ఉండదు. నేరుగా జిల్లా పరిషత్‌ చేస్తే సరిపోతుంది. దీంతో కంపెనీలు నేరుగా ఆయా ప్రదేశాల్లో మైనింగ్‌ చేసేదాకా స్థానిక ప్రజలకు తెలియదు. అంతేగాక పరోక్షంగా గిరిజన ప్రాంత పంచాయతీలు ఆదాయం కోల్పోయి, అభివృద్ధికి దూరమవుతాయి. జిల్లా మినరల్‌ ఫండ్‌ నుంచి వీటికి నిధులు రావు. అంతేగాక గతంలో ఈ వ్యవహారాలను కేంద్ర మంత్రిత్వ శాఖ చూసేది, ఇప్పుడు ఏకంగా ప్రధానమంత్రి కార్యాలయంలోని స్పెషల్‌ సెల్‌ పర్యవేక్షిస్తున్నది. కొత్త చట్టం మూలంగా షెడ్యూల్‌ ప్రాంతాలేగాక మిగతా గ్రామాల్లోనూ పర్యావరణ ప్రభావాల అంచనా కమిటీ పర్యటించి నష్టాలు, ఇతర విషయాలు అవగాహన కల్పించిన తర్వాతే మైనింగ్‌ చేసేందుకు అనుమతించాలి. నూతన చట్టంతో ఆ అవకాశం కూడా స్థానిక గ్రామాలు కోల్పోతున్నాయి.
– మాజీ ఎంపీ మిడియం బాబూరావు

Courtesy Nava telangana

RELATED ARTICLES

Latest Updates