అనాథ బాలిక మృతిపై ఎన్నో అనుమానాలు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

ఏడాదిగా అఘాయిత్యం
అనాథ బాలిక మృతిపై ఎన్నో అనుమానాలు
శరణాలయంలో ఎందుకు తిరిగి చేర్చుకోలేదు?
ఆశ్రమాన్ని సీజ్‌ చేసిన పోలీసులు

హైదరాబాద్‌, పటాన్‌చెరు: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లోని ప్రైవేటు అనాథ శరణాలయంలో లైంగిక దాడికి గురై మరణించిన 14 ఏళ్ల బాలిక కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తనపై ఏడాది కాలంగా అఘాయిత్యానికి పాల్పడినట్టు వాంగ్మూలంలో చెప్పిందని పటాన్‌చెరు డీఎస్పీ రాజేశ్వరరావు వెల్లడించారు. కానీ, బాలిక మూత్ర సంబంధమైన సమస్యకు శస్త్రచికిత్స చేయించామని, తలకు చిన్న గాయమైతే పసుపు అద్దామని ఆశ్రమం నిర్వాహకులు పోలీసులతో చెప్పటం అనుమానాలకు తావిస్తోంది.

కరోనా సమయంలో మార్చి 21న బాలికను బంధువులు తమ ఇంటికి తీసుకెళ్లారు. నాలుగు నెలల తరువాత తిరిగి చేర్చుకోవాలని రెండుసార్లు కోరినా కరోనా నిబంధనల పేరిట నిర్వాహకులు నిరాకరించారు. లాక్‌డౌన్‌ సమయంలోనే 29 మంది పిల్లలకు ప్రవేశాలు కల్పించడం గమనార్హం. బాలికను బంధువులు సైతం కొట్టినట్లు బాలల సంరక్షణ కమిటీ (సీడబ్ల్యూసీ) గుర్తించింది. వారిపై జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌లో డీసీపీయూ ఫిర్యాదు చేసింది. అమీన్‌పూర్‌ ఆశ్రమాన్ని పోలీసులు గురువారం సీజ్‌ చేశారు. అక్కడి పిల్లలను ఇతర సంరక్షణ కేంద్రాలకు తరలించారు. ఈ కేసు దర్యాప్తు మహిళా భద్రతా విభాగం ఏడీజీ పర్యవేక్షణలో జరగనుంది. ఈ ఘటన నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రైవేటు ఆశ్రమాలను తనిఖీ చేయాలని మహిళాశిశు సంక్షేమశాఖ నిర్ణయించింది.

కేసు నమోదులో జాప్యమెందుకో?
బోయిన్‌పల్లి పోలీసులు జులై 31న జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి అమీన్‌పూర్‌ పోలీసులకు పంపించారు. వాస్తవానికి లైంగిక వేధింపులు, పోక్సో చట్టం కింద వెంటనే నాన్‌బెయిలబుల్‌ కేసు నమోదు చేస్తారు. అమీన్‌పూర్‌ పోలీసులు విచారణ పేరిట వారం రోజులు జాప్యం చేశారు. ఆగస్టు 7న నిందితులను అరెస్టు చేసినట్లు చూపించారు.

వీడియోలతో నిధుల సేకరణ
ఫార్మా పరిశ్రమలో టెక్నీషియన్‌గా పనిచేసే వేణుగోపాల్‌రెడ్డి వృద్ధులకు, అనాథలకు సాయం చేస్తున్నానంటూ భారీగా నిధులు సేకరించేవాడని సమాచారం. తాను చేస్తున్న సాయం గురించి బాలికలతో చెప్పించి.. ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో ఉంచేవాడు. ఈ అనాథాశ్రమాన్ని గతేడాది నవంబరులో మియాపూర్‌ నుంచి అమీన్‌పూర్‌ పట్టణ పరిధి హెచ్‌ఎంటీ స్వర్ణపురి కాలనీలోకి మార్చారు. చిరునామా మారిన తరువాత సంగారెడ్డి జిల్లా అధికారుల అనుమతులు తీసుకోలేదు.

నేటినుంచి ఉన్నతస్థాయి కమిటీ విచారణ
బాలిక మృతిపై విచారణకు రాష్ట్ర బాలల భద్రత కమిటీ నలుగురు సభ్యులతో ఉన్నతస్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఎస్‌సీపీసీఆర్‌ సభ్యురాలు బి.అపర్ణ, హైదరాబాద్‌ సీడబ్ల్యూసీ సభ్యురాలు అన్నపూర్ణదేవి, మహిళా భద్రతా విభాగాధికారి డి.ప్రతాప్‌, మహిళా శిశు సంక్షేమశాఖ ప్రాంతీయ సంచాలకురాలు జి.కె.సునంద ఇందులో సభ్యులు. ఈ కమిటీ గురువారం సమావేశమైంది. బోయిన్‌పల్లి, అమీన్‌పూర్‌ ఠాణాల్లో నమోదైన కేసుల వివరాలను తెలుసుకున్నారు. శుక్రవారం విచారణ ప్రారంభించనున్నారు.

ఆశ్రమం నిర్వాహకులపై పోక్సో కేసు
వేణుగోపాల్‌రెడ్డి ఏడాది కాలంగా అఘాయిత్యానికి పాల్పడినట్టు బాలిక తన వాంగ్మూలంలో చెప్పింది. ఆశ్రమం నిర్వాహకులపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసులు పెట్టాం. ఎస్పీ ఆదేశాలకు అనుగుణంగా మరిన్ని సెక్షన్లు పెట్టడానికి చర్యలు తీసుకుంటున్నాం.
– రాజేశ్వరరావు, పటాన్‌చెరు డీఎస్పీ

 

Courtesy Eenadu

RELATED ARTICLES

Latest Updates