అయోధ్య : రాజ్యం, మతం, రాజకీయాల అపవిత్ర కలయిక

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

అయోధ్యలో రామ జన్మ భూమి ట్రస్టు ఆధ్వర్యంలో జరిగిన రామ మందిర నిర్మాణ భూమి పూజ… ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌, సీఎంల సమక్షంలో… ప్రధాని నరేంద్ర మోడీ పునాది రాయి వేయడంతో… ఒక ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా మారింది. ఆవిధంగా, ఆగస్టు 5న మందిరం నిర్మాణానికి శంకుస్థాపన హిందూత్వ రాజకీయ ప్రాజెక్టులో ఒక ముఖ్యమైన ఘట్టంగా నిలిచింది. బాబ్రీ మసీదు స్థానంలో రామ మందిరాన్ని నిర్మించడం ద్వారా హిందూత్వ మెజార్టీ దేశంగా మార్చాలనుకునే వారి వ్యూహానికి మరింత పదును పెట్టారు. చరిత్రలో హిందువులకు వ్యతిరేకంగా తప్పు జరిగిందని ప్రచారం చేస్తూ బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ల ద్వయం ‘అయోధ్యలో మందిర నిర్మాణం హిందువుల హక్కు’ అని చెబుతూ, రామ మందిర నిర్మాణాన్ని ఒక జాతీయ గౌరవంగా మర్చారు. రాముడు ఒక దేవుడు మాత్రమే కాదని, జాతీయ చిహ్నం అని పేర్కొంటున్నారు.

అయోధ్యలో మసీదు ఉన్న ప్రాంతంలో రామమందిరాన్ని నిర్మించడమే తన ముందున్న లక్ష్యమని బీజేపీ 1989లో ఎల్‌.కె అద్వానీ నేతత్వంలో పాలమూరు తీర్మానం చేసింది. ఎల్‌.కె అద్వానీ రథయాత్రతో భారీ హిందూత్వ శక్తుల సమీకరణ ద్వారా రాజకీయ హిందూత్వ మత ప్రయాణం ప్రారంభమైంది. వేలాది మందిని పొట్టన పెట్టుకున్న మత హింస, బాబ్రీ మసీదు విధ్వంసం నేపథ్యంలో ఈ రథయాత్ర మరింత భయంకరమైన హింసకు బాటలు వేసింది. అనంతరం అయోధ్య ఆలయ నిర్మాణానికి చట్టబద్ధమైన అనుమతులు పొందేందుకు హిందూత్వ శక్తులు అనేక యుక్తులు పన్నాయి. 2019లో బీజేపీ అధిక మెజార్టీతో అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ కేసుపై రోజువారీ విచారణ చేపట్టింది. అనంతరం న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా ఉంది. ఒకవైపు మసీదు కూల్చివేత తీవ్రమైన చట్ట ఉల్లంఘన అని చెబుతూనే ఆలయ నిర్మాణం కోసం 2.77 ఎకరాల మొత్తం స్థలాన్ని అప్పగించే విధంగా తీర్పునిచ్చింది.

రాముడిపై విశ్వాసం ఉన్న భారీ సంఖ్యలో హిందువులు ఆలయ నిర్మాణాన్ని స్వాగతించారు. అయితే ఇక్కడ కీలకమైన భారత గణతంత్ర (రిపబ్లిక్‌) లక్షణం మారుతోందన్న భయంకరమైన వాస్తవాన్ని గమనించాలి. ‘రిపబ్లిక్‌’ అనే పదానికి (ప్రజలే ప్రభుత్వం.. రాచరికం కాదు అని అర్థం) లౌకికం అని అర్థం కాదు. ఉదాహరణకు ‘ది ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ ఇరాన్‌’ ఇస్లామిస్టు భావజాలం నుంచి చట్టబద్ధతను నిర్వచించింది. తమ దేశంలో ఉన్న అరబ్బులను రెండవ తరగతి పౌరులను చేయడం ద్వారా యూదు రాజ్యంగా మారాలని ఇజ్రాయిల్‌ ఆశిస్తోంది. అయోధ్యలో ఇప్పుడు రామ మందిర నిర్మాణానికి భూమి పూజ నిర్వహించడం ద్వారా భారత్‌లో కూడా దేశాన్ని హిందూత్వ మెజార్టీ రాజ్యంగా మార్చాలన్న రాజకీయ ప్రాజెక్టు కొంత మేర విజయం సాధించింది. మసీదును ధ్వంసం చేయడం ద్వారా నిర్భయంగా చట్టాన్ని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన వారిపై ఎటువంటి శిక్షలు లేవు. అయోధ్యలో భూమి పూజ సందర్భంగా మోడీ ప్రసంగిస్తూ రాముడిని జాతి గౌరవంగా, దేశ ఐక్యతకు చిహ్నంగా చెప్పుకొచ్చారు. రామ మందిర నిర్మాణం అనేది దేశ ప్రజల సెంటిమెంట్‌కు ఒక గుర్తు అని పేర్కొన్నారు. అయితే విభజనపూరిత, హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఆలయ నిర్మాణాన్ని చేపట్టడం ద్వారా పాలకులు చెబుతున్న సోదర భావం, ఐక్యత పూర్తిగా కపటమైనది. అయోధ్యలో ప్రధాని మోడీ వ్యవహరించిన తీరు దేశాన్ని… రాజకీయాలు, మతంతో విలీనం చేసినట్టుగా ఉంది. గుజరాత్‌లో సోమనాథ్‌ ఆలయ నిర్మాణం విషయంలో అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ తీసుకున్న వైఖరికి దీనికి ఎంతో వ్యత్యాసం ఉంది. ఆలయ నిర్మాణానికి ప్రభుత్వం నుంచి నిధులను నిరాకరించిన ఆయన ఆలయ శంకుస్థాపనకు సంబంధించి తనకున్న అభ్యంతరాలను రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్‌కు తెలియజేశారు. మతపరమైన ప్రార్థనా స్థలాలకు లౌకిక దేశంగా ఎటువంటి మద్దతు లేదా నిధులను ఇవ్వకూడదన్న స్పష్టమైన సూత్రానికి ఆయన నిలబడ్డారు.

మతం, జాతి పరంగా ప్రజలను సమీకరించే ఈ విధమైన జాతి, మతపరమైన జాతీయవాదం… స్వాతంత్య్ర పోరాటం, స్వతంత్ర భారతంతో కూడుకున్న వలస వ్యతిరేక జాతీయవాదానికి పూర్తి వ్యతిరేకంగా ఉంది. మైనార్టీలే టార్గెట్‌గా ప్రతీకార రాజకీయాలతో కూడుకున్న ఈ సంకుచిత జాతీయవాదం అనేది మితవాద నిరంకుశ పాలకులకు ముఖ్య లక్షణంగా మారింది. మందిర నిర్మాణానికి మోడీ శంకుస్థాపన చేసే రెండు వారాల ముందు జులై 24న, టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌ ఇస్తాంబుల్‌లోని ప్రపంచ ప్రసిద్ధి చెందిన హగియా సోఫియాలో మొదటిసారిగా శుక్రవారం ప్రార్థనలు నిర్వహించారు. ఈ చారిత్రక చర్చి నిర్మాణాన్ని 6వ శతాబ్దంలో ప్రస్తుతం ఇస్తాంబుల్‌గా పిలుస్తున్న అప్పటి కాన్‌స్టాంటినోపుల్‌లో బైజాంటైన్‌ చక్రవర్తి జుస్టీనియన్‌ నిర్మించాడు. దాదాపు 900 సంవత్సరాల పాటు చర్చిగా కొనసాగిన ఈ నిర్మాణం కాన్‌స్టాంటినోపుల్‌ను 1453లో ఒట్టోమాన్‌ స్వాధీనం చేసుకున్న తర్వాత మసీదుగా మార్చబడింది.

బలహీనమైన ఒట్టోమాన్‌ల నుంచి పాలనను స్వాధీనం చేసుకున్న తర్వాత కెమాల్‌ అటాటుర్క్‌ దేశాన్ని లౌకిక రాజ్యంగా మార్చేందుకు విప్లవాత్మక చర్యలు చేపట్టారు. 1500 ఏండ్ల చరిత్ర కలిగిన మతపరమైన నిర్మాణాన్ని మ్యూజియంగా మారుస్తూ 1934లో మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ అద్భుతమైన నిర్మాణం గత నెల వరకూ ఒక మ్యూజియంగా ఉంది. టర్కీని పాలిస్తున్న అధికార ఇస్లామిస్టు ఏకేపీ పార్టీ హగియా సోఫియాను తిరిగి మసీదుగా మార్చాలన్న డిమాండ్‌ను ముందుకు తెచ్చింది. ఈ నేపథ్యంలో 1934లో మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం పూర్తిగా చట్టవిరుద్ధమైనదని ‘ది అడ్మినిస్ట్రేటివ్‌ కోర్టు ఆఫ్‌ టర్కీ, కౌన్సిల్‌ ఆఫ్‌ స్టేట్‌’ ఏకగ్రీవంగా తోసిపుచ్చుతూ తీర్పునిచ్చింది. మసీదుగా దాని స్థితిని పునరుద్ధరించారు. అదే రోజున ఎర్డోగాన్‌ ఆదేశాలు జారీ చేశారు. మోడీ మాదిరిగా ఎర్డోగాన్‌కు కూడా ఇది జాతీయ గౌరవాన్ని రక్షించేందుకు వేసిన అడుగుగా ఉపయోగపడింది.

ఇజ్రాయిల్‌లో మోడీ సైద్ధాంతిక మిత్రుడు నెతన్యాహు నేతత్వంలో నడుస్తున్న జాతి-జాతీయవాద ప్రభుత్వం టెంపుల్‌ పర్వతం కింద శతాబ్దాల క్రితం నిర్మించిన మొట్టమొదటి యూదు ఆలయంలో దశాబ్దాల నాటి అవశేషాలను వెలికి తీసేందుకు తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ పర్వతంపై ముస్లిములకు మక్కా, మదీనా తర్వాత పవిత్రంగా భావించే ఆల్‌ అక్సా మసీదు ఉంది. అక్కడ ఉన్న మసీదును కూల్చివేసి ఆ స్ధానంలో యూదు ఆలయాన్ని నిర్మించాలని యూదు అతివాద శక్తులు దీర్ఘకాలంగా డిమాండ్‌ చేస్తున్నారు. యూదులు, క్రిస్టియన్లు, ముస్లిములు పవిత్రంగా భావించే ఈ పర్వతం పాలస్తీనియన్లు, అరబ్బులకు వ్యతిరేకంగా పావులు కదిపేందుకు యూదు అతివాద శక్తులకు కేంద్ర బిందువుగా మారింది.
అయోధ్యలో రామమందిర నిర్మాణానికి మార్గం సుగమం అవడం ద్వారా… మత సమీకరణ ప్రభావం తగ్గుతుందన్న భావన పూర్తిగా తప్పు. ఎందుకంటే హిందూత్వ రాజకీయాలపై ఆధారపడే వారు అధికార దాహంతో ఇటువంటి అంశాలను నిరంతరం రేకెత్తిస్తుంటారు. వారికి ఆ అవసరం కూడా ఉంది. లేకుంటే వారి మనుగడ కష్టతరంగా మారే అవకాశం ఉంది. ఉదాహరణకు 1992 ప్రార్థనా స్థలాల చట్టం ప్రకారం 1947, ఆగస్టు 15 నాటికి మతపరమైన ప్రదేశాలు యథాతథంగా ఉండాలని ఉంది. అయితే ఈ పరిధిలోకి అయోధ్య స్థలాన్ని తీసుకు రాలేదు. స్వతంత్రానికి ముందు నుంచి కూడా దీన్ని ఒక వివాద స్థలంగా పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌- వీహెచ్‌పీల ప్రచార ప్రధాన ఉద్దేశం అయోధ్య స్థలాన్ని స్వాధీనం చేసుకోవడమే కాక… కాశీ, మధురలో మసీదులు ఉన్న ప్రాంతాలను కూడా తమ చేతుల్లోకి తీసుకోవాలన్నది వారి వ్యూహం. సదరు వివాదాలను రేకెత్తించేందుకు హిందూత్వ శక్తులకు చట్టం అడ్డంకిగా మారింది. చివరిగా, అయోధ్యలో భూమి పూజ నిర్వహించిన తేదీని (ఆగస్టు 5) గుర్తుంచుకోవాలి. గతేడాది ఈ తేదీననే జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసి రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చారు. అయోధ్య రామమందిర నిర్మాణ వేడుకలకు సంబంధించి కొంత మంది కాంగ్రెస్‌ నేతలు, లౌకిక రాజకీయవేత్తలు రాముడి మీద తమ విశ్వాసాన్ని తెలుపుతూ గొంతు కలపడం ఒక హెచ్చరిక లాంటిది. ఇలాంటి అవకాశవాదాన్ని ఆశ్రయించడం ద్వారా… దేశాన్ని హిందూత్వ రాజ్యంగా మార్చాలన్న వారికి మద్దతు ఇచ్చినట్టు అవుతుంది.

– పీపుల్స్‌ డెమోక్రసీ సంపాదకీయం

RELATED ARTICLES

Latest Updates