అవుట్‌ సోర్సింగ్‌ మాయ, మోసం!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

సౌకర్యాలు ఎగ్గొట్టేందుకే ఈ రూటులో భర్తీ
జీహెచ్‌ఎంసీలో శానిటరీ సిబ్బంది శ్రమదోపిడీ
అవుట్‌ సోర్సింగ్‌ విధానం రాజ్యాంగ ఉల్లంఘనే
98మంది కొలువులు క్రమబద్ధీకరించాలి
ప్రభుత్వానికి,
జీహెచ్‌ఎంసీకి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్‌: అవుట్‌ సోర్సింగ్‌ విధానంలో దీర్ఘకాలంపాటు పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల సర్వీసులను క్రమబద్ధీకరించకుండా జీహెచ్‌ఎంసీ మాయ, మోసపుటెత్తులకు పాల్పడుతోందని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. చట్టాలను గౌరవించాల్సిన ప్రభుత్వం, దాని అజమాయిషీలోని సంస్థలే వాటిని ఉల్లంఘిస్తున్నాయని ఆక్షేపించింది. పారిశుధ్య కార్మికులకు కనీస వేతనాలు చెల్లించకుండా శ్రమదోపిడీ చేస్తోందని అభిప్రాయపడింది. జీహెచ్‌ఎంసీలో పదేళ్లు, అంతకన్నా ఎక్కువ కాలంపాటు అవుట్‌ సోర్సింగ్‌ కింద పనిచేస్తున్న 98మంది పారిశుధ్య కార్మికుల సర్వీసులను క్రమబద్ధీకరించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎంఎస్‌ రామచంద్రరావు ఇటీవల తీర్పు ఇచ్చారు. అవుట్‌ సోర్సింగ్‌ విధానంలో శానిటరీ సిబ్బంది, ఇతర కేటగరీల ఉద్యోగులను నియమించడం రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14, 16, 21లను ఉల్లంఘించడమేనని జడ్జి స్పష్టం చేశారు. ఉమాదేవి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు ఇది వ్యతిరేకమని తేల్చిచెప్పారు. అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో సిబ్బంది నియామకాలు చేయడం పెద్ద మాయ, మోసపు ఎత్తుగడ అనీ, చట్ట ప్రకారం లభించాల్సిన పదోన్నతులు, ఇంక్రిమెంట్లు, రిటైర్మెంట్‌, తదితర సర్వీ సు ప్రయోజనాలను ఎగవేసేందుకే ఇలాంటి ఎత్తుగడ వేస్తున్నారని న్యాయమూర్తి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కోర్టు ఆదేశాలు అందిన రెండు నెలల్లో వారి సర్వీసులను క్రమబద్ధీకరించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. కోర్టును ఆశ్రయించిన తేదీ నుంచి పిటిషనర్లకు ఆయా పోస్టులకు నిర్దేశించిన కనీస టైం స్కేల్‌ వేతనాన్ని చెల్లించాలని ఆదేశించింది. పిటిషనర్లకు ఇప్పటికే చెల్లించిన మొత్తాలను మినహాయించుకుని మిగిలిన బకాయిలు ఈ ఏడాది జూలై 31వరకు లెక్కించి సెప్టెంబరు 15లోగా చెల్లించాలని స్పష్టం చేసింది.

ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే
అవుట్‌ సోర్సింగ్‌ విధానంలో జీహెచ్‌ఎంసీలో పనిచేస్తున్న జి. శ్రీనివాసాచారి, మరో 97 మంది కార్మికులు తమ సర్వీసులను క్రమబద్ధీకరించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. తామంతా జీహెచ్‌ఎంసీలో 2008, 2010, 2011లో విధుల్లో చేరామని, అప్పటినుంచి తమకు వేతనాలు అవుట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీల ద్వారా చెల్లిస్తున్నారని కోర్టుకు తెలిపారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ వాదించారు.  పిటిషనర్లు నైపుణ్యం గల కార్మికులని, వారికి సమాన పనికి సమాన వేతనం చెల్లించాల్సి ఉందన్నారు. జీహెచ్‌ఎంసీ అవుట్‌ సోర్సింగ్‌ పేరుతో కార్మికులతో వెట్టి చాకిరీ చేయిస్తోందని అన్నారు. ఇలా చేయించడం రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14, 16, 19, 21, 23లలో కల్పించిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొన్నారు.

క్రమబద్ధీకరణకు అర్హులు కారు: జీహెచ్‌ఎంసీ
ఈ వ్యాజ్యాన్ని గతంలో విచారించిన హైకోర్టు… పిటిషనర్లకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని పేర్కొంటూ 2018 డిసెంబరు 31న మధ్యంతర ఆదేశాలు జారీచేసింది. ఈ ఆదేశాలను కొట్టివేయాలని కోరుతూ జీహెచ్‌ఎంసీ  పిటిషన్‌ దాఖలు చేసింది. పిటిషనర్లు అవుట్‌ సోర్సింగ్‌  కార్మికులని, నగరపాలక సంస్థ వారిని నేరుగా నియమించుకోలేదని జీహెచ్‌ఎంసీ కౌంటర్‌లో తెలిపింది. వారికి కనీస పే స్కేల్‌, సర్వీసు క్రమబద్ధీకరణకు అర్హత లేదని పేర్కొంది. అయితే వారికి ఈఎ్‌సఐ, పీఎఫ్‌, బీమా సౌకర్యాలు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కల్పిస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ తెలిపింది.

ఆ శాఖకు అధికారాలుంటాయి: హైకోర్టు
జీహెచ్‌ఎంసీ వాదనలను జస్టిస్‌ రామచంద్రరావు తోసిపుచ్చారు. జీహెచ్‌ఎంసీ… చట్టం ద్వారా ఏర్పాటైన ఒక సంస్థ అని, అది రాష్ట్ర ప్రభుత్వ సంస్థ కిందికే  వస్తుందని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా చూపేందుకు వీరి సేవలను ఘనంగా వినియోగించుకుంటున్న జీహెచ్‌ఎంసీ… పనికి తగిన వేతనాలు చెల్లించడంలో విముఖత చూపుతోందని వ్యాఖ్యానించారు. కొవిడ్‌-19 మహమ్మారి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో వీరి సేవలకు ప్రాధాన్యం పెరిగిందన్నారు. ము నిసిపల్‌ శాఖ కార్యదర్శికి కిందిస్థాయి సిబ్బందిని నియమించే అధికారాలు ఉంటాయని, దాని ప్రకారం వీరి సర్వీసులను క్రమబద్ధీకరించవచ్చన్నారు. జీహెచ్‌ఎంసీ దాఖలు చేసిన కౌంటర్‌లో పోస్టులు, భర్తీకి సంబంధించి వివరాలు లేవని న్యాయమూర్తి పేర్కొన్నా రు. జీహెచ్‌ఎంసీ వాస్తవాలు తొక్కిపెట్టినట్లు స్పష్టంగా అర్థమవుతోందని, దీనిపై మునిసిపల్‌ శాఖ కౌంటర్‌ కూడా దాఖలు చేయకపోవడం కూడా అంతే తప్పని జడ్జి స్పష్టం చేశారు. కార్మికులను ప్రైవేటు ఏజెన్సీల ద్వారా తీసుకోవడం, కాంట్రాక్టర్‌ తన కమీషన్‌ మినహాయించుకుని వారికి వేతనాలు చెల్లించడం వల్ల వారికి కనీస వేతనాలు అందవని పేర్కొన్నారు. ఎప్పటికైనా క్రమబద్ధీకరిస్తారన్న ఆశతో పనిచేస్తున్న కార్మికులను శ్రమ దోపిడీ చేస్తున్నారని జడ్జి వ్యాఖ్యానించారు. పిటిషనర్లకు కనీస వేతనాలు చెల్లించకపోవడం రాజ్యాంగంలోని 21వ ఆర్టికల్‌ కింద హక్కులను ఉల్లంఘించడమేనని అభిప్రాయపడ్డారు. ప్రభు త్వం, ప్రభుత్వ నియంత్రణలోని సంస్థలే చట్టాలను ఉల్లంఘించడం విస్మయం కలిగిస్తోందని జడ్జి వ్యాఖ్యానించారు.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates