మనుషులు ‘బుక్కయ్యారు’!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • పిల్లలు, పెద్దల్లో పెరిగిన పుస్తక పఠనాభిలాష
  • లాక్‌డౌన్‌ తర్వాత కొత్తగా పుస్తకపఠనం మొదలు పెట్టినవారు 12 శాతం
  • వారానికి ఐదు నుంచి ఏడు గంటలు చదివేవారు ప్రస్తుతం తొమ్మిది గంటల సమయం కేటాయింపు
  • వ్యక్తిత్వ వికాసం, రాజకీయం, ఆధ్యాత్మికం, పంచతంత్ర కథలపై ఆసక్తి

హైదరాబాద్‌: కరోనా మహమ్మారి మనుషుల అలవాట్లు, ఆలోచనలను ముమ్మాటికీ మార్చేసింది. జీవనవిధానంలోనూ మార్పును తెచ్చింది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అనంతరం వర్క్‌ ఫ్రం హోమ్‌ చేయాల్సి రావడం, ఇంట్లోంచి బయటకు అడుగు బయటపెట్టే పరిస్థితి లేకపోవడం, విందులు, వినోదాలు లేకపోవడంతో పిల్లలు, పెద్దలంతా పుస్తకపఠనం వైపు మళ్లుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే… మనుషులు ‘బుక్కయ్యారు’.

వ్యక్తిత్వ వికాసం, ఆధ్యాత్మికం,రాజకీయంపై ఆసక్తి
లాక్‌డౌన్‌ అనంతరం 12 శాతం మంది కొత్తగా పుస్తకపఠనం వైపు మళ్లినట్లు జాతీయ సర్వేలు వెల్లడిస్తున్నాయి. వ్యక్తిత్వ వికాసం, ఆధ్యాత్మికం, దేశ రాజకీయం, ఉన్నత జీవనవిధానం, ఆర్థిక పరిస్థితుల పెరుగుదల వంటివాటిపై ప్రచురితమైన జాతీయ, అంతర్జాతీయ రచయితల పుస్తకాలను చదివేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని నీల్సన్‌ బుక్‌ ఇండియా కన్జ్యూమర్‌ రీసెర్చ్‌ స్టడీ వెల్లడించింది. పురుషులు రాజకీయం, స్వయం వికాసం, క్రైమ్, థ్రిల్లర్, హిస్టారికల్‌ ఫిక్షన్, మహిళలు ఫిక్షన్, రొమాన్స్‌ పుస్తకాలను చదువుతున్నారని వెల్లడించింది. ఇదివరకే పఠన అభిరుచి ఉన్నవారు వారానికి 5 నుంచి 7 గంటలపాటు చదివితే, లాక్‌డౌన్‌ తర్వాత 9 గంటలు చదువుతున్నారని వెల్లడించింది.

పిల్లలు ఏం చదువుతున్నారంటే…
ఎనిమిదేళ్ల వయస్సున్న పిల్లల కోసం చిత్రాలతో కూడిన పుస్తకాలు, జంతువుల కథలు, పంచతంత్ర కథల పుస్తకాలు, 9–17 ఏళ్ల పిల్లల కోసం స్పై, డిటెక్టివ్, మిస్టరీ, క్లాసిక్‌ కథలు చదివేలా తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నట్లు సర్వే వెల్లడించింది. ‘ఇంట్లో ఎప్పటి నుంచో ఉన్న పెద్ద బాలశిక్ష, మహాభారతం చదివేశా. ‘మీ జీవితం మీ చేతుల్లోనే’, ‘ప్రభావశీలుర అలవాట్లు’అనే పుస్తకాలను ఆన్‌లైన్‌లో తెప్పించుకొని చదివా. నాకు పుస్తకాలు చదవాలని కోరిక ఉన్నా ఇన్నాళ్లు తీరికలేక చదవలేదు’అని సంగారెడ్డి పట్టణానికి చెందిన 63 ఏళ్ల కాంతారెడ్డి పేర్కొన్నారు. ‘ఆన్‌లైన్‌ క్లాస్‌లు మధ్యాహ్నానికే పూర్తి అవుతుండటంతో మిగతా సమయంలో వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదువుతూనే, వీడియోలు చూస్తున్నా’అని అక్షయ అనే ఇంటర్‌ విద్యార్థిని తెలిపింది.
 
ఫ్లిప్‌కార్ట్‌లో అమ్ముడుపోతున్న పుస్తకాలివే..
ఫ్లిప్‌కార్ట్‌లో గొప్ప ఆలోచనలు సృష్టించే అద్భుతా లు, భగవద్గీత, లోపలి మనిషి వంటి పుస్తకాలకు డిమాండ్‌ ఎక్కువుంది. ఆధ్యాత్మిక ప్రసంగాల వీడియోలు, విజయగాథలు, ధైర్యం, విశ్వాసం, సుహృద్భావాన్ని పెంచే వీడియో సందేశాలకై సెర్చింగ్‌లు పెరిగాయని సర్వేల ద్వారా తెలుస్తోంది.

అమెజాన్‌లో బెస్ట్‌ సెల్లింగ్‌ పుస్తకాలు
అమెజాన్‌లో బెస్ట్‌ సెల్లింగ్‌ పుస్తకాల జాబితాలో ఇంగ్లిష్‌లో ఇండియన్‌ పాలిటిక్స్‌ మొదటి స్థానంలో ఉంది. ఇకిగాయి– ద జపనీస్‌ సీక్రెట్‌ టు ఎ లాంగ్‌ అండ్‌ హ్యాపీ లైఫ్, థింక్‌ అండ్‌ గ్రో రిచ్, మై ఫస్ట్‌ లైబ్రరీ, ద ఆల్కమిస్ట్, 101 పంచతంత్ర కథలు బాగా అమ్ముడుపోయాయి. ఎక్కువ మంది చదివినవాటిలో తెలుగులో వైఎస్‌ విజయారాజశేఖరరెడ్డి రాసిన ‘నాలో.. నాతో.. వైఎస్సార్‌’మొదటి స్థానంలో ఉండగా, రిచ్‌డాడ్‌–పూర్‌ డాడ్, సీక్రెట్, శ్రీ గురుచరిత్ర, ఒక యోగి ఆత్మకథ, ఇండియన్‌ ఎకానమీ, చాణక్యనీతి, అందరినీ ఆకట్టుకునే కళ వంటి పుస్తకాలు ట్రెండింగ్‌లో ఉన్నాయి.

Courtesy Sakshi

RELATED ARTICLES

Latest Updates