కొవిడే కాదు జన్యువులూ కారణమే!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

అందుకే ఇన్ఫెక్షన్‌ సోకినవారిలో  ఒకే లక్షణాలు ఉండటం లేదు… సీసీఎంబీ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడి

కొవిడ్‌ వైరస్‌ అందరూ అనుకున్నంత ప్రమాదకరమైందా ? కొవిడ్‌ వల్లే రకరకాల లక్షణాలు బయటపడి, మరణాలు సంభవిస్తున్నాయా ? లేదంటే.. ఇతర కారణాలేవైనా ఉన్నాయా ? అనేది తెలుసుకునేందుకు హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ)కి చెందిన శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనల్లో అనేక ఆసక్తికర అంశాలు వెలుగుచూస్తున్నాయి. కరోనా సోకిన వారిలో బయటపడుతున్న అన్ని లక్షణాలకు వైరస్సే కారణం కాదని వారు స్పష్టం చేస్తున్నారు. కొవిడ్‌ సోకిన 40 మంది రోగుల జన్యువులపై పరిశోధనల అనంతరం ఈ నిర్ధారణకు వచ్చామని సీసీఎంబీ ప్రతినిధి డాక్టర్‌ సోమదత్తా తెలిపారు.  

కరోనా సోకిన వారందరిలోనూ ఒకే విధమైన రోగ లక్షణాలు ఉండటం లేదు. దీనికి రెండు విధాల కారణాలు ఉండొచ్చు. మొదటిది వైరస్‌ అందరిపైన ఒకే విధమైన ప్రభావం చూపకపోవడం కాగా, రెండోది ఇన్ఫెక్షన్‌ సోకిన వ్యక్తుల జన్యువులు ఈ లక్షణాలు కనబడటానికి లేదా కనబడకపోవడానికి కారణమవ్వాలి. కరోనా వ్యాప్తి మొదలైన తర్వాత సీసీఎంబీ శాస్త్రవేత్తలు ఆ వైర్‌సపై దృష్టిపెట్టారు. దాని జన్యు పటాలను సేకరించి విశ్లేషించడంతో ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి.

వైరస్‌ ఒక వ్యక్తిలోకి ప్రవేశించిన తర్వాత దాని ఆర్‌ఎన్‌ఏలో ఎటువంటి మార్పులు జరగడం లేదని తేటతెల్లమైంది. అంటే వైరస్‌ అందరిలోనూ ఒకే విధంగా ఉంటోంది. కానీ రోగ లక్షణాలు మాత్రం రకరకాలుగా ఉంటున్నాయి. ఉదాహరణకు కొవిడ్‌ సోకిన వారిలో 70 శాతం మందిలో ఎటువంటి లక్షణాలు బయటపడకపోగా, 30 శాతం మందిలోనే కనిపిస్తున్నాయి. వారిలోనే ఇన్ఫెక్షన్‌ తీవ్రత ఎక్కువగా ఉంటోంది. దీనికి వేర్వేరు కారణాలు ఉండొచ్చు. ఇక్కడ మనం మరో విషయాన్ని కూడా చెప్పుకోవాలి. మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థను ప్రభావితం చేసే అంశాలు అనేకం ఉన్నాయి. ఉదాహరణకు మంచి పౌష్టికాహారం తీసుకుంటే రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. కొన్నిసార్లు మందుల వల్ల కూడా రోగనిరోధక శక్తిని పెంచవచ్చు. ఇదే విధంగా మన రోగనిరోధక వ్యవస్థను జన్యువులు ప్రభావితం చేస్తాయి. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని సీసీఎంబీ శాస్త్రవేత్తలు పరిశోధనలు నిర్వహించారు. ఇప్పటి దాకా 40 మంది కొవిడ్‌ రోగుల జన్యు పటాలను విశ్లేషించారు. ఈ పరిశోధన పూర్తయితే కొవిడ్‌ సోకిన వారికి తీరొక్క లక్షణాలు ఎందుకు ఉంటున్నాయి అనే ప్రశ్నకు సమాధానం లభిస్తుంది. వైరస్‌ సోకిన తర్వాత శరీరంలో జన్యుమార్పులు జరగడం వల్లే లక్షణాల్లో వైవిధ్యం చోటుచేసుకుంటోందా ? అనే సందేహపు చిక్కుముడి కూడా వీడుతుంది. ఈ ఫలితాలు ప్రత్యక్షంగా కరోనా వైర్‌సపై ప్రభావం చూపలేకపోయినా.. పరోక్షంగా కరోనా కట్టడి ఔషధాల తయారీకి జరుగుతున్న పరిశోధనలకు ఊతమిస్తాయని డాక్టర్‌ సోమదత్తా ఆశాభావం వ్యక్తం చేశారు.

అసలు వైరస్‌ కనుమరుగైపోతోంది!
ఇన్ఫెక్షన్‌తో ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన ‘ఎల్‌’ రకం కొవిడ్‌ వైరస్‌ నెమ్మదిగా కనుమరుగవుతోంది. తాజాగా ‘ఫ్రాంటియర్స్‌ ఇన్‌ మైక్రోబయాలజీ’ జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయన నివేదికలోనూ ఈవిషయాన్ని ప్రస్తావించారని సీసీఎంబీకి చెందిన మరో శాస్త్రవేత్త గుర్తుచేశారు. ఈ అధ్యయనంలో 48,653 మంది నుంచి సేకరించిన కరోనా జన్యువులను విశ్లేషించారు. గత ఏడాది డిసెంబరులో కరోనా పుట్టినిల్లు వూహాన్‌లో తొలిసారి ఎల్‌ రకం కొవిడ్‌ వైర్‌సను గుర్తించారు. ఆ తర్వాత జన్యుమార్పులు జరిగి అది ఎస్‌, జీ, వీ రకాలుగా రూపాన్ని మార్చుకుంది. ‘‘వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి సోకినప్పుడు దానిలో కొన్ని జన్యుపరమైన మార్పులు వస్తాయి. ఇవి ఎక్కువగా ఉంటే వ్యాక్సిన్‌లను అభివృద్ధి చేయడం చాలా కష్టమవుతుంది. కొవిడ్‌ వైరస్‌ మూలరూపంలో మార్పులు పెద్దగా లేవు. కొన్ని మార్పులు వచ్చినా- వాటి వల్ల వైరస్‌ పనితీరులో ఎటువంటి మార్పు లేదు కాబట్టి వ్యాక్సిన్‌ అభివృద్ధికి ఎలాంటి ఆటంకాలు ఎదురవ్వవు’’ అని ఆ శాస్త్రవేత్త విశ్లేషించారు.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates