సమాఖ్య స్ఫూర్తికి సమాధి…

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

భారత రాజ్యాంగంలో మన దేశం యొక్క పేరు ”యూనియన్‌ ఆఫ్‌ స్టేట్స్‌” (రాష్ట్రాల సమాఖ్య) అందుకే మన రాజ్యాంగం ఫెడరల్‌ వ్యవస్థకు పెద్దపీట వేసింది. కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తాన్ని దృష్టిలో పెట్టుకొని విధానపర మైన నిర్ణయాలను పార్లమెంటు ద్వారా చట్టం రూపంలో ప్రకటిస్తుంది. ఇట్టి విధానాలను స్థానిక అవసరాలకు సరిపడేలా అమలు పరచడం రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. సమాఖ్య వ్యవస్థలో ప్రత్యేకమైన విధులను బాధ్యతలను నిర్వచించి కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలుగా విభజించడం జరిగింది. కేంద్ర జాబితాలోని అంశాలపై తుది నిర్ణయం కేంద్రమే తీసుకుంటుంది. వీటిని రాష్ట్రాలు అమలు పరుస్తూ ఉంటాయి.

రాష్ట్ర జాబితా విషయంలో రాష్ట్రానిదే అంతిమ నిర్ణయం. ఉమ్మడి జాబితాలోని అంశాలపై కేంద్ర రాష్ట్ర యంత్రాంగం కలిసి కార్యాచరణ నిర్ణయిస్తాయి. ఈ రకమైన పరిపాలనను ఫెడరల్‌ వ్యవస్థగా పిలుస్తున్నాం. అయితే అత్యవసర పరిస్థితుల్లో రాష్ట్ర జాబితాలోని అంశాలపైన లేదా ఉమ్మడి జాబితాలోని అంశాలపైన కేంద్రం ప్రత్యేక నిబంధన ద్వారా, చట్ట సభల్లో చర్చలు జరిపి కావలసిన మార్పులు చేర్పులు సవరణలూ చేయవచ్చు. ఈ విధంగా కేంద్రం పైచేయి సాధించే అవకాశం కూడా ఉన్నది. కామన్‌ వెల్త్‌ దేశాల రాజ్యాంగాలలో ఈ రకమైన ప్రత్యేకత భారత్‌కు మాత్రమే ఉన్నది. ఈరకంగా రాష్ట్రాల పాలనా హక్కులను హరించడానికి కేంద్రమెప్పుడైనా తెగబడవచ్చు. అనగా సమాఖ్య వ్యవస్థలో మొదటిది ప్రధానమైనది అయిన ”శాసన నిర్మాణం” ద్వారా ఏ దశలోనైనా, పార్లమెంటు ద్వారా గానీ లేదా ఆర్డినెన్సుల ద్వారా గానీ తామనుకున్నది చేసుకుంటూ పోతున్నది కేంద్రం. దీనికి ఉదాహరణ- ఆటోమెటిక్‌ రూట్లలో రక్షణ రంగంలో సహా ప్రభుత్వ రంగాల్లోకి ఎఫ్‌డీఐని అనుమతివ్వడం.

సమాఖ్య వ్యవస్థలో కార్య నిర్వహణ తరువాతది న్యాయ వ్యవస్థ. పాలనలో రాజ్యాంగ బద్దమైన పద్ధతి తప్పినప్పుడు జోక్యం చేసుకోవాల్సిన కోర్టులు రాజ్యాల జోక్యంతో లేదా వారికనుకూలంగా తీర్పులివ్వటం పారిపాటి చేసుకున్నాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కావటానికి ముందు ప్రభుత్వంపై, అప్పటి ప్రధాన న్యాయమూర్తిపై రోడ్డెక్కి ధర్నా చేశారు. ఈయన పదవి ముగియగానే అధికార పార్టీ ద్వారా రాజ్యసభ సభ్యులయ్యారు. సమాఖ్య వ్యవస్థలో ఇలాంటి సర్దుబాటు లుంటున్నాయా అని అనుమానం కలుగక మానదుగా! ఇక నాలుగవ స్తంభం(ఫోర్త్‌ పిల్లర్‌) మీడియా. వార్తలు చేరవేయాల్సిన మీడియా అభిప్రాయాలను వ్యక్తీకరిస్తున్నదన్న విమర్శ నుంచి పరిపాలనా దక్షుల కట్టుకథలకు కార్యరూపమిచ్చేలా ప్రభుత్వాలే శాసిస్తున్నాయి. ఒక టీవీ వ్యాఖ్యాత అర్నాబ్‌ గోస్వామి మహారాష్ట్ర ముఖ్యమంత్రిని ”ఖబర్దార్‌ ఉద్దవ్‌” అని సవాలు చేసేంతగా ఎవరు బలమిస్తున్నారు? జాతీయ మీడియా ప్రజల పక్షాన, రాష్ట్ర ప్రభుత్వాల పక్షాన ఉండకుండా కంట్రోల్‌ చేయబడుతున్నది.

గవర్నర్‌ పదవి రాజ్యాంగ బద్దమైనది, రాజకీయాలకతీతం అనేది పుస్తకాలకే పరిమితమై కేంద్రం అదుపాజ్ఞలలో నడుచుకునే ఒక ప్రతినిధి వ్యవస్థలా మారి రాష్ట్ర ప్రభుత్వాన్ని మాయల ఫకీరు చిలకలా అడించడానికి ఉపయోగ పడుతున్నది. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఇందిరా గాంధీ ఆధ్వర్యంలో గవర్నర్‌ రాంలాల్‌ ద్వారా అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఎన్‌.టి. రామారావుని బర్తరఫ్‌ చేయించిన సంఘటన నుంచి మొన్నటి మహారాష్ట్రలో రాత్రికి రాత్రే రాష్ట్రపతి పాలనను రద్దు చేయించి తెల్లారకముందే సంఖ్యాబలం లేని వారి ప్రమాణ స్వీకార సంఘటనా చూశాం. మధ్యప్రదేశ్‌లో కరోనా కాలు దువ్వుతున్నా కాదని బల పరీక్ష నిర్వహింపజేసి ప్రభుత్వాన్ని పడగొట్టటం, నేడు రాజస్థాన్‌లో అసెంబ్లీ నిర్వహించడానికి అదే కరోనాని చూపిస్తూ అనుమతినివ్వకపోవడం చూస్తున్నాం. అంతకు మునుపు ఢిల్లీ ముఖ్యమంత్రి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఇంట్లోనే ధర్నా చేయడంతో సహా గోవా, కర్నాటక, హర్యానా రాష్ట్రాల్లోనూ ఇలాంటివెన్నో చూశాం. ప్రజాస్వామ్యం ద్వారా ఎన్నుకోబడిన రాష్ట్ర ప్రభుత్వాలకు స్వేచ్ఛ లేకుండా చేయడమే లక్షంగా గవర్నర్ల వ్యవస్థ ఉన్నదా అన్నంత అధ్వాన్నంగా ఫెడరల్‌ వ్యవస్థ తయారైంది.
విద్యా వ్యాప్తి, వైద్యాభివృద్దిపై ఇప్పుడున్న చాలీ చాలని వేగంతో మొదుకెళ్తే రాబోయే మరో 50ఏండ్ల వరకూ విద్య వైద్యంలో 100శాతం సంతప్తిని సాధించలేక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అని నిరూపణ అవటం ఖాయం! దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్భై ఏండ్లు దాటింది అయినప్పటికీ అక్షరాస్యతలో 70శాతం దాటలేదు. విద్య ఉమ్మడి జాబితాలో ఉన్నది.

కేంద్ర, రాష్ట్రాల విద్యా విధానాల మధ్య అనుసంధానం లేదు. హిందీ మాట్లేడే రాష్ట్రాలతో నైనా అది సాధ్యపడలేదు. కాబట్టి దేశంలో ఒకే విద్యార్హత కలిగిన వారిలోను అసమానతలు ఉన్నాయి. ఇప్పుడు కేంద్ర క్యాబినెట్‌ కమిటీ ద్వారా ప్రకటించబడిన నూతన విద్యావిధానం(2020)లో, మాత భాషలో బోధన, అల్పాహారం, బడ్జెట్లో ఆరుశాతం కేటాయింపులు వంటివి ఆశాజనకంగా ఉన్నప్పటికీ రాష్ట్రాల అసెంబ్లీల్లో, పార్లమెంటులో చర్చకు పెడితేగాని క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సవాళ్ళు తెలుస్తాయి. తమిళనాడు దీన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా బహిరంగంగా ప్రకటించింది. ఐదవ తరగతి వరకు మాత భాషా బోధన తప్పనిసరి అన్నారు. కాబట్టి మెట్రో పాలిటన్‌ పట్టణాల్లో భాషా ప్రాతిపదికన ప్రాథమిక/ ప్రాథమికోన్నత పాఠశాలలు విడివిడిగా తెరవాల్సి వస్తుంది. విద్యార్హతకు ఉపాధి అవకాశాలకు వివిధ రాష్ట్రాల్లో ఒక్కో విధంగా ఉన్నది. కేంద్ర స్థాయిలో ఉపాధ్యాయుల శిక్షణా విధానాన్ని రూపొందిస్తామన్నారు. ఉపాధ్యాయుల అధ్యాపకుల నియామకాలు, శిక్షణ, జీతాల చెల్లింపుల్లో ఇప్పుడు రాష్ట్రాలదే బాధ్యతగా నడుస్తున్నది. ఇత్యాధి అనేక సూక్ష్మ అంశాలపై రాష్ట్రాల అభిప్రాయలను పక్కన పెట్టడం ఫెడరల్‌ వ్యవస్థను అగౌరవ పరచటమే. దీనివలన క్షేత్ర స్థాయి అభివద్దిలో సమతుల్యత కూడా సాధ్య పడదు.

135 కోట్ల జనాభాలో ఇప్పటి వరకు 20లక్షల మందికిపైగా కరోనా సోకింది. ఈ ఇరవై లక్షల మందికి సరిపడా వైద్య సదుపాయం అందించే స్థితిలో దేశం లేదు. ఇది మరింత విజంభిస్తే పరిస్థితేంటి? వైద్యం రాష్ట్ర జాబితాలో ఉన్నది కాబట్టి వైఫల్యానికి రాష్ట్రాలను బాధ్యులను చేద్దామా? లేక ఆయుశ్మాన్‌ భారత్‌ అంటూ నూటా ముప్పై ఐదు కోట్ల జనాలకు బడ్జెట్లో రెండు వేల కోట్లు కేటాయించి చేతులు దులుపుకున్న కేంద్రానిదా బాధ్యత? వైద్య విద్య, కుటుంబ నియంత్రణ వంటివి ఉమ్మడి జాబితాలో ఉన్నవి కాబట్టి మొత్తం వైద్యాన్ని ఉమ్మడి జాబితాలో చేర్చాలని పదిహేనవ ఆర్థిక సంఘం నియమించిన ఉన్నత స్థాయి కమిటీ నివేదించింది. దీనర్థం వైద్యం నిర్లక్షం చేయబడుతున్నదని, దాంట్లో కేంద్రం పాత్ర ఉండాలన్నదేగా? కుర్చీ కాపాడుకునే రాజకీయ లబ్ది కోసం రాష్ట్రాలు వైద్యంపై తూతూ మంత్రంగా ఉన్నాయి. అయితే కేరళ రాష్ట్రం ఇందుకు భిన్నంగా వైద్య సదుపాయాలు విస్తరింపజేయటంలో ప్రపంచ ఖ్యాతిని పొందింది. ఇది ఎలా సాధ్యమైందంటే వైద్యమందించడమనేది ఒక అచార సంస్కారంగా అక్కడి ప్రజలందరూ స్వీకరించడం, అంతే స్థాయిలో ప్రభుత్వాలు సహకరించడం వల్ల మాత్రమే. ఇలాంటి అభివృద్ధి మోడల్‌ను దేశమంతటా విస్తరించే ఆలోచన చేయకుండా ”ఆయుశ్మాన్‌ భారత్‌” అనే నినాదంతో అబ్రకదబ్రా… అని మంత్రమేసి, కరోనాని ఎదుర్కోలేకపోతున్నారంటూ రాష్ట్రాలపై కన్నెర్రచేయడం ఫెడరల్‌ వ్యవస్థను నడిపిస్తున్న వారికి తగునా?

రాష్ట్రాల అవసరాల మేరకు అప్పులు తీసుకోవడానికి నియమనిబంధనలు చెప్పేదే ”ఫిజికల్‌ రెస్పాన్సిబిలిటీ అండ్‌ బడ్జెట్‌ మేనేజ్మెంట్‌” (ఎఫ్‌.ఆర్‌.బి.ఎమ్‌). దీని ప్రకారం రాష్ట్రాల ద్రవ్యలోటు జీడీపీలో మూడు శాతానికి మించరాదు. కరోనా కాలంలో ఏర్పడిన సంక్షోభం వల్ల ఈ ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితిని ఐదు శాతానికి పెంచమని రాష్ట్రాలు కేంద్రాన్ని అడిగాయి. దానికి, ఆర్‌బీఐ ద్వారా ఎన్నో షరతులు కేంద్రం పెట్టింది. ముఖ్యంగా సంస్కరణలు చేయాలని, అందులోనూ విద్యుత్‌ శాఖను పూర్తిగా సంస్కరించి కేంద్ర అజమాయిషీకి అప్పజెప్పేలా సూచించింది. రాష్ట్ర స్థాయిల్లోని పన్ను వసూళ్ళలోను సంస్కరణలు చేయాలని చెప్పింది. అంతేకాకుండా ప్రతి అరశాతానికి ఒక ప్రత్యేక నిబంధనను పెట్టి ప్రజలపై పన్నులు వేసి ఆదాయాన్ని పెంచుకోవాలని షరతులు పెట్టింది. జీఎస్‌టీ ప్రవేశ పెట్టిన రోజు రాష్ట్రాలకు పన్ను రాబడి తగ్గకుండా చూస్తామనీ, పదిహేను శాతం వరకు కాంపెన్షన్‌ ఇస్తామని ప్రకటించిన కేంద్రం నేడు చేతులెత్తేసిందని రాష్ట్రాలు వాపోతున్నాయి. ఒక కేంద్ర ప్రభుత్వం, ఐఎంఎఫ్‌- వరల్డ్‌ బ్యాంకు లాగా షరతులతో కూడిన అనుమతులు ఇవ్వడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అందుకే తెలంగాణ రాష్ట్రం నిర్ద్వందంగా తోసిపుచ్చింది. లాక్‌డౌన్‌ విధించేది కేంద్రం కానీ తద్వారా జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి రాష్ట్రాలకు అనుమతిని ఇవ్వమంటే మాత్రం నిరాకరిస్తున్నారు. ఇది సమాఖ్య స్ఫూర్తి ఎలా అవుతుంది? అందుకే ఎవరైనా ఎలాగైనా చావనీ అన్న చందాన కరోనా మహమ్మారిని పట్టించుకోకుండా కేసీఆర్‌ సచివాలయం కట్టుకుంటున్నారు, జగన్‌ సచివాలయాలను మారుస్తున్నారు. రాష్ట్రాల సంగతులు మాకెందుకని ఢిల్లీలో పార్లమెంటూ నిర్మితమౌతోంది. ఇక రానున్న ఐదేండ్లు ప్రజలు ప్రశ్నించడానికి అవకాశమే లేకుండా రామ మందిర నిర్మాణ కార్యక్రమాలు మొదలయ్యాయి. పరిపాలనలో కాకపోయినా నిర్మాణాల్లో సమాఖ్య స్ఫూర్తి పాటించబడుతున్నది సుమా!.

వ్యవసాయరంగం రాష్ట్ర జాబితాలో ఉన్నది. అయినప్పటికీ నిబంధన చివరాఖరున ఉన్న ఒక వెసులుబాటును ఆసరాగా చేసుకొని ఆర్టికల్‌ 249 ప్రకారం వ్యవసాయ రంగంలో అనూహ్యమైన సంస్కరణలను ప్రతిపాదించింది కేంద్రం. తద్వారా స్థానిక రైతులకు స్థానిక పరిస్థితులతో సంబంధం లేకుండా దేశం మొత్తానికి వర్తించే విధానాలను నెత్తిన రుద్దడం అన్నమాట. సహకార బ్యాంకులను నిర్దేశించడం రాష్ట్రాల బాధ్యత. కరోనా సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయని భావించిన కేంద్రం బ్యాంకుల అజమాయిషీ ఆర్‌బీఐ ద్వారా తన గుప్పిట్లోకి తీసుకున్నది. ఈ సహకార బ్యాంకుల నిర్వహణ రాష్ట్రాల పరిధిలో ఎందుకు ఉండాలి అంటే వీటి ద్వారానే చిన్న సన్నకారు రైతులకు, స్వయం ఉపాధి దారులకు సహాయాన్ని అందించే విధంగా రాష్ట్రం సహకార బ్యాంకులను ఆదేశించే అవకాశం ఉంది. అయితే ఈ సహకార బాంకుల నిర్వహణ కోసం రాష్ట్రాలు ఎన్నికలు నిర్వహించి ఒక రాజకీయ వేదిక చేసి అధికార పార్టీకి అనుసంధానమైనదిగా తయారు చేశాయి. దీన్ని అధిగమించి రిజర్వు బాంకు లేదా నాబార్డ్‌ ఆధ్వర్యంలో స్వతంత్రంగా పని చేయించాలి. సమస్యను పరిష్కరించకుండా సాంతం కేంద్రమే లాగేసుకుంటానంటే సరికాదు కదా..!

దేశం గురించి చెప్పుకోవడం వరకే ఏకత్వం, పాలనా పరమైన విధానాల్లో అంతా భిన్నత్వమే ఉన్నది. లాక్‌డౌన్‌ ప్రకటించింది కేంద్రం, దానిని ధిక్కరించకుండా లేదా అంతకన్నా కఠినంగా అమలు పరిచేందుకు మాత్రమే రాష్ట్రాలకు అధికారం ఉన్నది. ఇప్పుడు లాక్‌డౌన్‌ తీసేసింది కేంద్రం, అయినప్పటికీ వ్యవహారాలు ఊపందుకోవడం లేదు. కారణం ఎవరు? కేంద్రమా? రాష్ట్రమా? ఈ లాక్‌డౌన్‌ పాటించడం/తొలగించడం ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉన్నది. దేశం గురించి ప్రస్తావించినప్పుడు నా దేశం బ్రహ్మాండంగా ఉంది అని చెప్పే జాతీయ నేతలే తమ పార్టీ అధికారంలోలేని రాష్ట్రాలకు వచ్చినప్పుడు సదరు రాష్ట్రాన్ని సర్వనాశనమైన రాష్ట్రంగా వర్ణిస్తుంటారు. ఇది పరస్పర విరుద్ధమైన ప్రకటన కాదా? దీని ప్రకారం కేంద్రం పెద్దల దృష్టిలో దేశం వెలిగిపోతుంది కానీ సగానికి పైగా రాష్ట్రాల్లో అభివృద్ది లేదు. ఇలాంటి అభిప్రాయ వ్యక్తీకరణల్లోనే ఫెడరల్‌ వ్యవస్థకు మొదటి నష్టం ఉన్నది. ఆ తరువాత నిధుల కేటాయింపుల్లో, విడుదలల్లో వివక్ష చూపడంతో రెండవ కష్టం మొదలవుతున్నది. నీటి వినియోగం మొదలు బడ్జెట్‌ కేటాయింపులూ, కొత్త పరిశ్రమలూ/అకాడమీల స్థాపనలూ వంటి వాటికన్నింటికీ ఆదేశిక సూత్రాలున్నప్పటికీ ఏలిక వారికున్న చివరి నిర్దేశిత విచక్షణ(డిస్క్రెషన్‌)అధికారంతో పక్షపాత వైఖరి స్పష్టంగా బయటపడుతున్నది. అయితే సమాఖ్య స్ఫూర్తికి కట్టబడుతున్న సమాధికి కేంద్రాన్ని నిలదీయకుండా రాష్ట్రాలూ ఓ చేయి వేస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

జి. తిరుపతయ్య

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates