ఈసి నియామకాలపై వివాదం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

సోషల్‌ మీడియా ఖాతాల నిర్వహణకు బీజేపీకి పనిచేసిన సంస్థలను నియమించుకున్న ఎన్నికల సంఘం

న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో భారత కేంద్ర ఎన్నికల సంఘం(సిఈసి) తీసుకునే నిర్ణయాలు వివాదానికి దారితీస్తున్నాయి. ఇదే సమయంలో ఈసి నిష్పక్షపాక్షికతపై పలు పలు ప్రశ్నలు వస్తున్నాయి. తాజాగా తన సోషల్‌ మీడియా ఖాతాల నిర్వహణకు సంబంధించి ఎన్నికల సంఘం నియమించుకున్న సంస్థల పేర్లు సమాచార హక్కు చట్టంతో వార్తల్లోకి వచ్చాయి. ఇందుకు కారణం ఆయా సంస్థలు అధికార బిజెపికి దగ్గరగా ఉండడమే. దీంతో ఓటర్ల డేటా భద్రతపై కూడా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి విధానపరమైన నిర్ణయాలతో పాటు ఇటువంటి అంశాల్లో కూడా ఈసి తీరుపై వివాదం రేగుతోంది. సమాచార హక్కు చట్టం కింద పారదర్శకత ఉద్యమకారుడు నీరజ్‌ శర్మ చేసుకున్న దరఖాస్తుకు ఈసి సమాచారం ఇచ్చింది. ఈసి తన ట్విట్టర్‌ ఖాతాను నిర్వహించేందుకు టిఎస్‌డి కార్పొరేషన్‌ అనే ఏజెన్సీని నియమించుకున్నట్లు తెలిపింది. ఇందుకుగానూ నెలకు ఏజెన్సీకి రూ.15,22,908 చెల్లించేలా ఒప్పందం చేసుకుంది.

ఇదే కంపెనీ 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో కూడా మార్చి 19 నుంచి మే 31 వరకు ఈసి ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలను నిర్వహించింది. ఇందుకుగానూ దాదాపు ఆ రెండు నెలల సమయానికి రూ.36,84,454 చెల్లించింది. ప్రభుత్వ అధీనంలోని ఎన్‌ఎఫ్‌డిసి లిమిటెడ్‌ ద్వారా టిఎస్‌డి కార్పొరేషన్‌ నియామకం జరిగింది. ఈ టిఎస్‌టి కార్పొరేషన్‌ క్లయింట్‌ల లిస్టులో అనేక మంది బిజెపి నేతలు, మోడీ కేబినెట్‌లోని మంత్రులు కూడా ఉండడం ఇక్కడ గమనించాల్సిన అంశం. క్లయింట్‌ల జాబితాలో ప్రధాని మోడీతో పాటు రాజస్థాన్‌ మాజీ సిఎం వసుంధరా రాజే, మహరాష్ట్ర మాజీ సిఎం ఫడ్నవిస్‌,కేంద్ర మంత్రులు ప్రకాశ్‌ జవదేకర్‌, ధర్మేంద్ర ప్రధాన్‌, స్మతి ఇరానీ, రవిశంకర్‌ ప్రసాద్‌, బిజెపి నేత రాజీవ్‌ ప్రతాప్‌ రూడీ, తదితరులు ఉన్నారు.

ఫేస్‌బుక్‌ అకౌంట్‌ నిర్వహణకు ప్రభుత్వ ఆధ్వర్యంలోని బ్రాడ్‌కాస్ట ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స ఆఫ్‌ ఇండియా ద్వారా ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీ ఎడిజి ఆన్‌లైన్‌ సొల్యూషన్స ప్రయివేటు లిమిటెడ్‌ను నెలకు రూ.2,35,803కు నియమించుకున్నట్లు ఈసి ఆర్‌టిఐ దరఖాస్తుకు తన సమాధానంలో తెలిపింది. ఈసి నియమించుకున్న ఈ సంస్థలు గతంలో బిజెపి కోసం పనిచేసినట్లు విమర్శకులు పేర్కొంటున్నారు. ఈ సంస్థలో బిజెపికి, మోడీ ప్రభుత్వానికి పనిచేశాయని, ఇప్పుడు ఈసికి పనిచేయనున్నాయని సాకేత్‌ గోకలే తన వరుస ట్వీట్లలో పేర్కొన్నారు. ఈసి స్వతంత్రంగా ఎందుకు వ్యవహరించలేకపోతోందని ఆయన ప్రశ్నించారు.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates