మహిళా ఉద్యోగులకు పది రోజుల ‘పిరియడ్‌ లీవ్‌’

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

‘ప్రియమైన మహిళా ఉద్యోగులారా.. మీరు చాలాసార్లు సెలవు కోసం మెసేజ్‌లు పెట్టి ఉంటారు. ఆ మెసేజ్‌లలో నలతగా ఉందనో, మరేదో నొప్పి అనో రాసి ఉంటారు. కాని నేను పిరియడ్స్‌లో ఉన్నాను… నాకు రెస్ట్‌ కావాలి అని నామోషీ లేకుండా రాశారా? ఇక మీదట రాయండి. పిరియడ్స్‌ సమయంలో కొందరిలో వచ్చే కడుపు నొప్పి ఎంత తీవ్రంగా ఉంటుందో నాకు తెలుసు. అందుకే ఇక మీదట మా సంస్థలో పని చేసే మహిళా ఉద్యోగులు సంవత్సరానికి పది రోజులు పిరియడ్‌ లీవ్‌ తీసుకోవచ్చు’ అని ప్రఖ్యాత ఫుడ్‌ డెలివరీ సంస్థ ‘జొమాటో’ సి.ఈ.ఓ దీపెందర్‌ గోయల్‌ తన ఉద్యోగులను ఉద్దేశించి తాజాగా లేఖ రాశారు. ఈ సౌలభ్యం వల్ల జొమాటోలో పని చేసే మహిళా ఉద్యోగులకు రెగ్యులర్‌ సెలవులతో పాటు పది రోజుల అదనపు సెలవు దొరికినట్టయ్యింది.

‘డియర్‌ మగ ఉద్యోగులూ… మన సంస్థలో పని చేసే మహిళా ఉద్యోగులు పిరియడ్‌ లీవ్‌ పెట్టినప్పుడు వారి పరిస్థితిని అర్థం చేసుకొని సహకరించండి. వారు తమకు విశ్రాంతి కావాలి అని చెప్పినప్పుడు మనం వారిని నమ్మాలి. నేను మహిళా ఉద్యోగులకు ఈ సౌలభ్యం కలిపిస్తున్నది బహిష్టు గురించి మనకు ముందు నుంచి ఉన్న పాతకాలపు భావనలు, నిషిద్ధ అభిప్రాయాలు సమసిపోవడానికే. స్త్రీల జీవితంలో ఒక భాగమైన విషయం పట్ల సంస్కారం అలవర్చుకోవడానికే. స్త్రీల సమస్యలు ఎలాంటివో స్త్రీలకు మాత్రమే తెలుస్తాయి. వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడే మనం సమష్టిగా సమర్థంగా పని చేయగలం’ అని కూడా దీపెందర్‌ గోయల్‌ ఆ లేఖలో రాశారు.

జొమాటో భారతదేశంలోని గుర్‌గావ్‌లో 2008లో మొదలయ్యి ఇవాళ 24 దేశాలలో సేవలందిస్తోంది. ఆ సంస్థలో 5 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. మన దేశంలో రుతుస్రావానికి సంబంధించిన ఎన్నో అపోహలు, విశ్వాసాలు ఉన్నాయి. రుతుస్రావంలో ఉన్న స్త్రీల మానసిక, శారీరక స్థితులను అర్థం చేసుకునే ప్రయత్నం పూర్తిగా నేటి వరకు కుటుంబం, సమాజం చేయనేలేదు. రుతుస్రావ యోగ్యత ఉన్న స్త్రీలను శబరిమల ఆలయ ప్రవేశానికి అర్హులుగా చేస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై చర్చ, అభ్యంతరం కొనసాగుతూనే ఉంది. ఇక స్వాతంత్య్రం వచ్చిన ఇన్నాళ్లకుగాని స్త్రీలకు శానిటరీ నేప్‌కిన్స్‌ సమకూర్చే ప్రచారం, ప్రయత్నం మొదలుకాలేదు. వీటన్నింటి నేపథ్యంలో జొమాటో తీసుకున్న ఈ నిర్ణయం స్త్రీల రుతుస్రావ సమయాలను వొత్తిడి రహితం చేసే ఒక మంచి ఆలోచనగా భావించవచ్చు.

Courtesy Sakshi

RELATED ARTICLES

Latest Updates