పుట్టుక పట్టణాల్లో.. మరణం పల్లెల్లో

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • మహిళలకంటే పురుషుల మరణాలు 59% అధికం
  • 2018 గణాంకాల విడుదల

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికమంది పట్టణాల్లో జన్మిస్తున్నారు. ఎక్కువమంది పల్లెల్లో చనిపోతున్నారు. కేంద్ర గణాంకవిభాగం తాజాగా విడుదల చేసిన 2018 సివిల్‌ రిజిస్ట్రేషన్‌ సిస్టం గణాంకాలు ఈ వివరాలను వెల్లడించాయి.  దేశంలో సంభవించే జనన మరణాల నమోదు ఆధారంగా వీటిని లెక్కించారు. దీని ప్రకారం  రాష్ట్రంలో 2018లో గ్రామీణప్రాంతాల్లో 2,66,846 మంది,  పట్టణప్రాంతాల్లో 4,93,870 మంది జన్మించారు.

గ్రామీణప్రాంతాల్లో కంటే పట్టణాల్లో 85% జననాలు అధికంగా నమోదయ్యాయి. మరణాలు మాత్రం పల్లెల్లో 80% అధికంగా సంభవించాయి. ఆ ఏడాది పల్లె ప్రాంతంలో 2,41,783 మంది కన్నుమూయగా, 1,33,994 మంది పట్టణాల్లో మరణించినట్లు లెక్కలు వెల్లడించాయి. శిశుమరణాలు మాత్రం  గ్రామీణ (741) ప్రాంతాల్లో కంటే పట్టణాల్లో (7,074)  అధికంగా చోటుచేసుకున్నాయి.

* 2018 సంవత్సరం మధ్య నాటికి ఆంధ్రప్రదేశ్‌ జనాభా 5,27,01,000గా కేంద్ర గణాంక విభాగం అంచనావేసింది.  ఆ ఏడాది 8,43,223 జననాలు సంభవించనున్నట్లు అంచనావేయగా వాస్తవంగా నమోదైన జననాలు  మాత్రం 7,60,716 మాత్రమే. మరణాలు 3,53,100కి పరిమితం అవుతాయని  అంచనా వేయగా, తీరా నమోదు పూర్తయ్యేసరికి 3,75,777కి పెరిగాయి.
* రాష్ట్రంలో మృతిచెందేవారిలో అత్యధికులు 70 ఏళ్లపైబడినవారే ఉన్నారు. మొత్తం మరణాల్లో ఈ వయసువారి వాటా 33% ఉంది. అతితక్కువ మరణాలు 1-4 ఏళ్లలో సంభవిస్తున్నాయి.
* మహిళలకంటే పురుషుల మరణాలు 59% అధికంగా ఉన్నాయి. 2018లో రాష్ట్రంలో 2,31,000 మంది పురుషులు, 1,44,800 మంది మహిళలు కన్నుమూశారు.
* 90%కి పైగా జననాలు, మరణాలు నమోదవుతున్న రాష్ట్రాలు తొమ్మిదే ఉన్నాయి. అందులో ఆంధ్రప్రదేశ్‌ ఒకటి.
*  ఆంధ్రప్రదేశ్‌లోని జననాల నమోదులో హెచ్చుతగ్గులు కనిపించాయి. 2015లో 8,51,499 నమోదుకాగా, ఆ తర్వాతి సంవత్సరాల్లో అది వరుసగా 8,14,754, 8,18,165, 7,60,716గా ఉంది.

Courtesy Eenadu

RELATED ARTICLES

Latest Updates