ఆరని కుంపట్లు!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
– సి.ఉదయ్‌ భాస్కర్‌
అణువిలయానికి 75 ఏళ్లు

ణ్వస్త్రాలు సృష్టించే విధ్వంసానికి సాక్ష్యాలుగా జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి నగరాలు నేడు మన ముందున్నాయి. మానవాళి అత్యంత ప్రమాదకరమైన అణుశకంలోకి అడుగు పెట్టిన రోజులుగా, ప్రపంచ చరిత్రలోనే దుర్దినాలుగా 1945 ఆగస్టు 6, 9 తేదీలు మిగిలిపోతాయి. రెండో ప్రపంచ యుద్ధం ముగింపు వేళ ఆగస్టు 6న అమెరికా ‘లిటిల్‌ బాయ్‌’ అనే అణుబాంబును హిరోషిమా నగరంపైనా, ‘ఫ్యాట్‌మ్యాన్‌’ పేరిట తయారు చేసిన అణ్వస్త్రాన్ని నాగసాకిపైనా ప్రయోగించింది. అమెరికా సృష్టించిన ఆ అణువిలయంలో లక్షా 29వేల మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. నాగసాకిపై ఆగస్టు 9న అణుబాంబు వేసి ఒక్కపెట్టున 40వేల మందిని పొట్టనపెట్టుకున్న అణు విలయానికి నేటికి 75 ఏళ్లు. అణు ధార్మిక ప్రభావం నుంచి బయటపడేందుకు ఆ నగరానికి ఏళ్ల సమయమే పట్టింది. అణు విధ్వంసం సృష్టించిన ప్రభావం కారణంగా నాలుగు నెలల కాలంలో ఆ రెండు నగరాల్లో మరో 97వేల మంది కన్నుమూయడం పెను విషాదం. విధ్వంసం మిగిల్చిన విషాదం నుంచి కోలుకొని ఇప్పుడు ఆ రెండు నగరాలూ పారిశ్రామిక రంగంలో దూసుకుపోతున్నాయి. ఆ దుర్ఘటనల ఫలితాలు ఎంత దారుణంగా ఉంటాయో తెలిసినా అనేక ప్రపంచ దేశాలు ఇప్పటికీ అణ్వాయుధాలను పట్టుకు వేలాడుతుండటం బాధాకరం.

యుద్ధాన్ని ద్వేషించి, యుద్ధకారణాలను పరిహరించినప్పుడే ఇలాంటి విషాదాలకు అడ్డుకట్టపడుతుంది. తమ బతుకులను బుగ్గిపాలు చేసిన అణువిలయం జపనీయులను ఇప్పటికీ కలవరపెడుతూనే ఉంది. అందుకే అణ్వస్త్రాలను పరిత్యజించి, ప్రపంచ దేశాలు శాంతిదిశగా అడుగులు వేయాలని కోరుతూ ఏటా ఆగస్టు 6, 9 తేదీల్లో జపనీయులు సద్భావన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అమెరికా అణుదాడికి హిరోషిమా, నాగసాకి నగరాలు 75 ఏళ్లక్రితం పూర్తిగా ధ్వంసమయ్యాయి. జపాన్‌ కాలమానం ప్రకారం ఆగస్టు 6న ఉదయం దాదాపు 8.30 గంటలకు తొలుత ‘ఎనోలా గే’ అనే బీ-29 బాంబర్‌ విమానం గగనతలంలో చక్కర్లు కొట్టి అణుబాంబును జారవిడిచింది. కొన్ని సెకన్లలోనే కనీవినీ ఎరగనంత భారీ విస్ఫోటం చోటుచేసుకుంది. ఆ ధాటికి హిరోషిమా శ్మశానంలా మారిపోయింది. బాంబు పేలగానే ఉష్ణోగ్రత 10 లక్షల సెంటీగ్రేడ్‌కు చేరింది. దాదాపు 15 కిలోమీటర్ల పరిధిలోని అన్ని భవనాలూ భస్మీపటలమయ్యాయి. ఆ భయంకర విస్ఫోటాన్ని తట్టుకొని ‘జన్‌బకూ డోమే’ అనే భవనం మాత్రమే పాక్షికంగా నిలిచింది. ఇది హిరోషిమా శాంతిచిహ్నంగా గుర్తింపు పొందింది. మూడు రోజుల తరవాత తొమ్మిదో తేదీన నాగసాకి పట్టణంపై అమెరికా మరో అణుదాడి జరిపింది. ఈ 75 ఏళ్ల కాలంలో అగ్రదేశాలు ప్రదర్శించిన సంయమనంవల్లో లేదా అనేకానేక శాంతి ఒప్పందాల కారణంగానో ఎలాంటి అణ్వస్త్ర దాడులూ జరగలేదు. ఇదే సంయమనం ఇకమీదటా కొనసాగుతుందా అంటే ఇదమిత్థంగా అవును అని చెప్పలేని పరిస్థితి నెలకొంది.

ప్రచ్ఛన్న యుద్ధకాలంలో దాదాపు 55 వేల ‘అణు వార్‌హెడ్‌’లు అమెరికా, రష్యాల వద్ద ఉండేవని సమాచారం. 1970నాటి అణ్వస్త్రవ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్‌పీటీ) చాలావరకు అణ్వాయుధాలను నియంత్రించిందనే చెప్పాలి. అమెరికా, నాటి సోవియట్‌ యూనియన్‌ల మధ్య కుదిరిన ఆ ఒప్పందం ప్రధానంగా అప్పట్లో జర్మనీ, జపాన్‌, ఇటలీలను అణ్వస్త్రాలు సమకూర్చుకోకుండా అడ్డుకునేందుకే ఉద్దేశించిందన్నది బహిరంగ రహస్యం. దాంతో అణ్వస్త్రాలు నాడు భద్రతా సమితిలోని అయిదు శాశ్వత సభ్య దేశాల (అమెరికా, రష్యా, యూకే, ఫ్రాన్స్‌, చైనా) గుత్తసొత్తుగా మారాయి. ఏ దేశ భద్రతకైనా ముప్పు ఉందని భావిస్తే అవి సాయానికి ముందుకొస్తాయనీ ఎన్‌పీటీలో పేర్కొన్నారు. తమ దగ్గర తప్ప మరెవరివద్దా అణ్వస్త్రాలు ఉండరాదన్న ఆ దేశాల వైఖరి తరవాతి కాలంలో తీవ్ర విమర్శలకు కారణమైంది. ఏ దేశానికాదేశం భద్రతా కారణాల పేరిట అణ్వస్త్రాలను రహస్యంగానో, అధికారికంగానో సేకరించుకోవడం మొదలైన నేపథ్యంలో ప్రపంచం క్రమంగా అణు కుంపట్లోకి జారుకుంటోందనే చెప్పాలి. చుట్టూ పొంచి ఉన్న పెనుముప్పును దృష్టిలో పెట్టుకొని 1974లో భారత్‌ అణుపరీక్షలు విజయవంతంగా నిర్వహించింది. దేశ సమగ్రత, భద్రతల పేరిట అణ్వస్త్రాలు కావాలని చాలా దేశాలు తపిస్తున్నాయి. అణ్వాయుధాలను తగ్గించాలని 1991లో రష్యా తీర్మానించింది. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వంగల అయిదు దేశాలు, అత్యంత సంపన్నమైన జి-20 రాజ్యాలు భద్రతా కారణాల పేరిట అణ్వాయుధాలు పోగేసుకున్నాయి. 2001 సెప్టెంబరులో అమెరికాలోని ప్రపంచ వాణిజ్య సంస్థపై జరిగిన ఉగ్రదాడి, 2008లో ముంబయిలో చోటుచేసుకున్న పాశవిక దాడి- ఎల్లలు దాటి విస్తరిస్తున్న ఉగ్రోన్మాదాన్ని ప్రపంచానికి పరిచయం చేశాయి. ఈ ఆగస్టు 3న ‘సమితి’ భద్రతా మండలికి ఐరాస సమర్పించిన రహస్య నివేదికలో ఉత్తర కొరియా అణు పరికరాలను అభివృద్ధి చేస్తున్న విషయాన్ని వెల్లడించింది. బాలిస్టిక్‌ క్షిపణుల వార్‌హెడ్‌లతో ప్రయోగించగల ఆయుధాలను ఉత్తర కొరియా రూపొందించినట్లు ఆ నివేదికలో వివరించారు.

హిరోషిమా, నాగసాకి నగరాలపై దాడి జరిగి 75 ఏళ్లయిన నేపథ్యంలో, ప్రస్తుతం అమెరికా-రష్యా, అమెరికా-చైనా మధ్య పెచ్చరిల్లుతున్న ఉద్రిక్తతలు ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి. అనేక దేశాలు అణ్వాయుధాలను వ్యూహాత్మక అవసరంగా భావిస్తుండటమే భయపెడుతున్న విషయం. కొన్ని దేశాలు అణ్వస్త్ర శక్తి సామర్థ్యాల కోసం దొంగదారుల్లోనూ ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఉత్తర కొరియాతోపాటు అనేక దేశాలు ఈ జాబితాలోకి వస్తాయి. ఎవరికివారు భద్రత కారణాల పేరిట అణ్వాయుధాలను గుట్టలు గుట్టలుగా పోగేసుకుంటూ వెళితే- మానవాళికి పెనుముప్పు తప్పదన్న సత్యాన్ని అవగతం చేసుకొని దేశాలన్నీ స్వచ్ఛందంగా అణ్వస్త్రాలను విడనాడాల్సిన తరుణమిది.

Courtesy Eenadu

RELATED ARTICLES

Latest Updates