12న రష్యా వ్యాక్సిన్‌ రిజిస్ట్రేషన్‌

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

తొలుత 1600 మందికి కరోనా వ్యాక్సినేషన్‌
వ్యాక్సిన్‌ను రిజిస్టరు చేసుకునే తొలి దేశం

న్యూఢిల్లీ, ఆగస్టు 8: అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కరోనా వ్యాక్సిన్‌ రేసులో రష్యా ముందడుగు వేసింది. కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ను రిజిస్టర్‌ చేయించుకున్న తొలి దేశంగా నిలిచేందుకు రంగం సిద్ధం చేసింది. ఆ దేశ రక్షణశాఖ, గమలేయ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లు సంయుక్తంగా అభివృద్ధిచేసిన కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ను ఈ నెల 12న రిజిస్టరు చేయనున్నారు. ఈవిషయం స్వయంగా రష్యా ఉప ఆరోగ్యశాఖ మంత్రి ఒలెగ్‌ గ్రిడ్నెవ్‌ ప్రకటించారు. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తికాగానే.. తొలుత దాదాపు 1,600 మందికి (వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, వయో వృద్ధులకు) వ్యాక్సిన్‌ను అందిస్తామని తెలిపారు. దాని ప్రభావంతో వారి ఆరోగ్యాల్లో చోటుచేసుకునే మార్పులు ప్రాతిపదికగా తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని గ్రిడ్నెవ్‌ స్పష్టం చేశారు. వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట పడటం, కేసులు తగ్గుముఖం పట్టడమే.. ఈ వ్యాక్సిన్‌ పనితీరుకు నిదర్శనంగా పరిగణిస్తామన్నారు. ప్రస్తుతం చిట్టచివరిదైన మూడో దశ ప్రయోగ పరీక్షల తుది అంకం నడుస్తోందని, అది తప్పకుండా సఫలమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, ఈవ్యాక్సిన్‌తో 76 మంది వలంటీర్లపై జూన్‌ 17న ప్రయోగ పరీక్షలు ప్రారంభమయ్యాయి. కరోనా వైర్‌సను తిప్పికొట్టేలా వారందరిలోనూ రోగ నిరోధక వ్యవస్థను చైతన్యవంతం చేయడంలో వ్యాక్సిన్‌ సఫలమైంది. కాగా, వ్యాక్సిన్‌ను త్వరగా విడుదల చేయాలనే తొందరలో రష్యా షార్ట్‌కట్‌లను అనుసరించి ఉండొచ్చని.. అలా చేస్తే వ్యాక్సిన్‌ సురక్షితంగా ఉండదని, పనితీరు కూడా ప్రభావవంతంగా ఉండకపోవచ్చని అమెరికాలోని జార్జ్‌టౌన్‌ వర్సిటీ ఆరోగ్యరంగ నిపుణులు లారెన్స్‌ గోస్టిన్‌ విశ్లేషించారు.

RELATED ARTICLES

Latest Updates