దేశాన్ని రక్షించుకుందాం..

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో 1942 ఆగస్టు 9 నాటి ‘క్విట్‌ ఇండియా’ ఉద్యమం ఒక ముఖ్యమైన ఘట్టం. ఆ ఆగస్టు 9న ‘సేవ్‌ ఇండియా’ పేరిట భారత శ్రామికవర్గం సమరశంఖం పూరించు తున్నది. 73సంవత్సరాల స్వతంత్ర దేశం మళ్ళీ పరాధీనతవైపు ప్రయాణిస్తున్న వేళ ‘సేవ్‌ ఇండియా’ ఉద్యమం అవసరమైందని భారత ట్రేడ్‌ యూనియన్‌ ఉద్యమం భావించింది. మహాకవి గురజాడ ‘దేశమంటే మట్టి కాదోరు’ దేశమంటే మనుషులోరు’ అన్నారు. కానీ మోడీ ప్రభుత్వం దేశమంటే సామాన్య జనం కాదని, దేశమంటే అంబానీ, అదాని లాంటి వంద మనుషులోరు’ అంటున్నది. ఆక్స్‌ఫామ్‌ లెక్కల ప్రకారం దేశ సంపదలో (2017) 73శాతం ఒక శాతం మంది ధనికుల చేతుల్లోకి వెళ్ళింది. నూటికి 99శాతం మందిలో సగం మంది (67 కోట్లు) మరింత పేదరికంలోకి నెట్టి వేయబడ్డారు. ఇవి ప్రభుత్వ విధానాల వల్ల పెరిగిన ఆర్థిక అసమానతలు. దేశంలో ఉత్పత్తి రంగం కుదేలు అయ్యింది. నిరుద్యోగం మరింత పెరిగింది. వలస కూలీలతో కలుపుకొని 24కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోతే వారు మనుషులుగా కనపడటం లేదు.

ఈ విపత్కర స్థితిలో కూడా కేంద్రం ప్రయివేటు కార్పొరేటు శక్తుల సంపదలు పెంచడం కోసం ప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీకరణ, రైల్వేలు, విమానయాన రంగం, ఎల్‌ఐసీ, బొగ్గుబావులు, ఖనిజాలు, ఒక్కమాటలో చెప్పాలంటే అండర్‌ గ్రౌండ్‌ నుంచి అంతరిక్షం వరకు అన్నింటిని స్వదేశీ, విదేశీ కార్పొరేట్లకు కట్టబెడుతున్నది. అడ్డొస్తున్న కార్మిక చట్టాలను మార్చుతున్నది. ప్రతిపక్షాల, ప్రజాస్వామిక వాదుల, ప్రజాతంత్రవాదుల గొంతునొక్కుతున్నది. ప్రజల అసంతృప్తిని ప్రక్కదారి పట్టించడానికి ఎన్‌ఆర్‌సీ, సీఏఏ లాంటివి ముందుకు తెచ్చింది. గోరక్షణ హంతక ముఠాలను ప్రోత్సహించింది. ప్రపంచంలో కరోనా విస్తరిస్తున్న సమయంలో మైనారిటీలపై దాడులు (ఢిల్లీ), దళితులపై అత్యాచారాలు కొనసాగుతున్నాయి. పేద రైతులు, వ్యవసాయ కార్మికులు, అసంఘటిత కార్మికులు అర్ధ్థాకలితో బతుకులీడుస్తున్నారు. అయినా మోడీ ‘అచ్చెదిన్‌’ ఆ వంద మంది కోసమే.

స్వాతంత్య్రం సిద్ధించిన తొలినాళ్ళలో భారత పెట్టుబడిదారుల (టాటా, బిర్లా తదితరుల) సంపద రూ.315 కోట్లు. నేడు 2019కి కేవలం వంద మంది సంపద 32లక్షల కోట్లు. కరోనా కాలంలో ఉపాధి కోల్పోయి పేదలు మరింత పేదలుగా అవుతుంటే ఈ బడాబాబుల ఆస్తులు ఎలా పెరిగాయి. దేశంలో ప్రత్యక్ష పన్నులు కట్టని కుటుంబాలు 95శాతం ఉన్నాయి. వీరికి కరోనా పరిస్థితుల నేపథ్యంలో 6మాసాల పాటు నెలకు రూ.7500 ఇవ్వాలని అన్ని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. ఈ లెక్కన 1.8లక్షల కోట్లు అవుతుంది. ఆరు మాసాలకు 10లక్షల 80వేల కోట్లు అవుతుంది. కేంద్రం ప్రకటించిన 20లక్షల కోట్ల ప్యాకేజీలో 8కోట్ల మంది వలస కార్మికులకు రూ.500 చొప్పున రూ.3500 కోట్లు మాత్రమే విదిల్చింది.

మరోవైపు కార్పొరేట్‌ టాక్స్‌ తగ్గించి రూ.1.45లక్షల కోట్లు ధనికులకు అందులోనూ 5 కోట్లపైన ఆదాయం గల కేవలం 3600 మందికి మోడీ ప్రభుత్వం లబ్దిచేకూర్చింది. బడాబాబులకు 68 వేల కోట్ల బ్యాంకు అప్పులు మాఫీ చేశారు. మొత్తం నాలుగేండ్ల కాలంలో 3.4లక్షల కోట్ల అప్పులు మాఫీ చేశారు. కానీ దేశంలో 56 శాతం మందికి జీవనోపాధికల్పిస్తున్న వ్యవసాయ దారులు, రైతుల యొక్క రుణాలను మాఫీ చేయడానికి నిరాకరిస్తున్నారు. రైతుల పంటల పెట్టుబడికి అదనంగా 50శాతం కలిపి మద్దత్తు ధర కల్పిస్తామన్న మోడీ వాగ్దానం నెరవేర్చలేదు. వ్యవసాయ రంగంలో సంక్షోభం వల్ల కేంద్ర హోంశాఖ లెక్కల ప్రకారం 2016లో 11,379 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రతి నెలకు 948 మంది, రోజుకు 31మంది రైతులు ప్రాణాలు వదులుతున్నారు. ఇవి కూడా బాగా తక్కువ చేసిన లెక్కలు. మోడీ దృష్టిలో ప్రజలంటే కార్పొరేట్లే తప్ప రైతులు కాదు. వ్యవసాయ కార్మికులకు ఉపాధి కోసం ఏడాదికి 200 రోజులు పని కల్పించి, రోజు కూలీ రూ.600 చేయాలని కోరితే పట్టించుకోవడం లేదు. ఉపాధి హామీ నిధులను తగ్గించడమో, పక్కదారి పట్టించడమో చేస్తున్నారు.

వీటన్నింటికీ మౌనమే సమాధానం అవుతున్నది. 44 కేంద్ర కార్మిక చట్టాలను 4 కోడ్‌లుగా మార్చి హక్కులన్నీ హరిస్తున్నారు. చారిత్రకంగా పోరాడి సాధించుకున్న 8గంటల పనిదినాన్ని 12 గంటలకు అనేక రాష్ట్రాలు పెంచేశాయి. కరోనాను ఆసరగా చేసుకొని బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాలు మూడేండ్ల పాటు కార్మిక చట్టాల అమలును సస్పెండ్‌ చేస్తూ ఆర్డినెన్స్‌లు తెస్తున్నారు. 11 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్న 6.3కోట్ల చిన్న తరహా పరిశ్రమలను ఆదుకోకపోవడంతో 15శాతం వరకు మూతపడ్డాయి. వీరికి కేటాయించిన 3లక్షల కోట్లు కూడా అప్పులే. వలస కార్మికుల దుస్థితి చూశాం. ప్రయాణాలలో ఆకలి వల్ల 971మంది చనిపోయారు. వారిని ఆదుకునే స్థితి లేదు.

రైల్వేల ప్రయివేటీకరణతో ప్రయివేటీకరణ ప్రక్రియ పరాకాష్టకు చేరింది. మోడీ ప్రభుత్వం 12 క్లష్టర్లలో 151 ప్రయివేటు రైళ్ళకు అనుమతించింది. 151 ప్యాసింజర్‌ ట్రైన్స్‌ 109 రూట్లను అప్పగించుతున్నది. మన సికింద్రాబాద్‌తో సహా ప్రయివేటు శక్తుల చేతుల్లోకి వెళ్తుంది. రోజుకు 2.3కోట్ల మందికి సేవ చేస్తున్న సంస్థను ప్రయివేటీకరించడం వల్ల పేదలకు తక్కువ ఖర్చుతో రవాణా సదుపాయం లేకుండా చేస్తున్నది. 500 బొగ్గు బావులను ఈ-వేలం వేస్తున్నారు. బొగ్గు రంగంలో 100శాతం విదేశీ పెట్టుబడికి అనుమతించారు. రక్షణ రంగంలో ఉత్పత్తి సంస్థలు 41 ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలను కార్పొరేటు శక్తులకు అప్పగిస్తున్నారు. ఫ్రాన్స్‌తో 58,000 కోట్లతో 36 రాఫెల్‌ యుద్ధ విమానాల ఒప్పందం వల్ల మన హెచ్‌ఎఎల్‌ నడ్డి విరిచింది. మన ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలు తయారు చేసే ఆయుధాలను అమెరికా, ఇజ్రాయిల్‌, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్‌, ఇంగ్లాండు కంపెనీలతో ఒప్పందం చేసుకోవడం వల్ల రక్షణ బడ్జెట్‌ అంతా కొల్లగొట్టబడుతున్నది. రక్షణరంగ కార్మికవర్గమంతా నిరవధిక సమ్మెకు సిద్ధమవుతున్నది. స్వదేశీ నినాదం బూటకం అని తేలింది. ఇన్సూరెన్స్‌ రంగంలో కీలక సంస్థ ఎల్‌ఐసీలో ప్రయివేటీకరణకు గేట్లు తెరిచింది. ఎయిర్‌ ఇండియా, పోర్టులు, డాక్‌లు, ఖనిజరంగాలు, అంతరిక్షరంగంలో మనం కష్టపడి సాధించిన వాటిలో ప్రయివేటు భాగస్వామ్యం కల్పించబోతున్నారు. ఏప్రిల్‌ 17న లాక్‌డౌన్‌ కాలంలో విద్యుత్‌ సవరణ చట్టం 2020 బిల్లును తెచ్చి విద్యుత్‌ వినియోగదారులపై, రైతులపై భారాలు వేయడానికి పూనుకున్నారు. విద్యుత్‌ రంగం ప్రయివేటీకరణ వలన ఉద్యోగ భద్రత లేకుండా పోతున్నది.

సేవారంగాలలో కీలకమైనది విద్యా, వైద్య రంగం. కరోనాతో ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌గా వున్న వైద్య ఆరోగ్య సిబ్బంది ఆశా, అంగన్‌వాడీ, సానిటేషన్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలి. రూ.25,000 వేతనం ఉండాలని అడిగితే పట్టించుకోవడం లేదు. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినా దేశంలో పెట్రోల్‌, డీజిల్‌పై ప్రభుత్వం రూ.16 వరకు రేట్లు పెంచింది. ట్రాన్స్‌పోర్టు రంగం కార్మికుల ఉపాధికి దెబ్బకొట్టింది. ప్రజారవాణా వ్యవస్థపై భారాలు మోపి ప్రయివేటీకరణకు అవకాశం కల్పించింది. కోవిడ్‌ను అరికట్టడంలో విఫలమయ్యారు. దేశంలో కేరళ వామపక్ష ప్రభుత్వం ప్రపంచంలో సోషలిస్టు దేశాల అనుభవాలను స్వీకరించడానికి సిద్ధంగా లేరు. అయినా కార్పొరేటర్లకు సేవ చేయాలనే దాహం కేంద్ర ప్రభుత్వానికి తీరలేదు. క్విట్‌ ఇండియా ఉద్యమం పిలుపు ‘కరెంగేయామరెంగే’ను ఉంటంకిస్తూ పార్లమెంట్‌ లో మోడీ మాట్లాడుతూ ‘కరేంగే ఔర్‌ కర్‌ కే రహెంగే’ (చస్తాం, లేదా చేస్తూనే వుంటాం) అని పిలుపునిచ్చారు. కానీ ఇది స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారుల కోసం అనేది అర్ధం చేసుకోలేక ఆనాడు అందరూ భ్రమపడ్డారు. 2020 నాటికి 99శాతం మంది కోసం కాకుండా ఒకశాతం మంది ధనికుల కోసమే ఆయన ప్రభుత్వమున్నదని స్పష్టమవుతోంది. అందుకే కేంద్ర కార్మిక సంఘాలతో బాటు సీఐటీయూ, అఖిల భారత రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రతిఘటిస్తున్నాయి. క్విట్‌ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 9న జరుగనున్న ‘సేవ్‌ ఇండియా’ ఉద్యమంలో శ్రామికులంతా పాల్గొని జయప్రదం చేద్దాం.

భూపాల్‌

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates