అన్ని త్యాగాలూ ఆదివాసులే చేయాలా?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

ఎస్.ఆశాలత

ఆదివాసుల మనుగడకు అన్నివైపుల నుండి ముప్పు కమ్ముకుని వస్తోంది. ఆదివాసులు లేనిదే అడవిలేదు, అడవి లేకపోతే మనకు బతుకులేదు అనే వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. ఈ నిజాన్ని గుర్తించి అడవిబిడ్డల సంక్షేమానికి రాజకీయ సంకల్పం నెలకొన్నప్పుడే ఆదివాసులకు చారిత్రక న్యాయం జరిగే ఆస్కారం ఉంది. 

ఈరాష్ట్రం, ఆ రాష్ట్రం అనే తేడా లేదు ఎక్కడ ఆనకట్టలు కట్టినా మునిగిపోయేది ఆదివాసుల గ్రామాలే. అడవుల పెంపకానికి వాళ్ళ భూములే కావాలి, పులుల్ని రక్షించటానికి ఆదివాసులు అభయారణ్యాలనుండి బయటికి రావాలి, బొగ్గు తవ్వటానికీ వాళ్ళ భూములు, ఊళ్లు ఖాళీచేసి వెళ్ళిపోవాలి. ఇవన్నీ పాతకథలే, కానీ అంతులేకుండా సాగుతున్న విషాదగాధలు. దేశం అభివృద్ధి చెందాలంటే ఎప్పుడూ ఆదివాసులు, పేదవాళ్ళే ఎందుకు త్యాగాలు చెయ్యాలని ఆ అభివృద్ధిఫలాల్ని అనుభవించే సెక్షన్ల ప్రజలు ఎన్నడూ ప్రశ్నించరు. అనేక ఉద్యమాలు, పోరాటాల ఫలితంగా ఆదివాసుల హక్కుల రక్షణ కోసం 2006లో వచ్చిన అటవీ హక్కుల గుర్తింపు చట్టం, ఈ దేశంలో ఆదివాసులకు చారిత్రకంగా చాలా అన్యాయం జరిగిందని నొక్కి చెప్పింది. ఆ అన్యాయాన్ని కాగితంపైన గుర్తించిన పాలకులు, దానిని సరిదిద్దటానికి వచ్చిన చట్టాలను అమలు చేయటంలో మాత్రం శ్రద్ధ చూపటం లేదు.

అటవీ హక్కుల గుర్తింపు చట్టం ఆదివాసులు సాగుచేసుకుంటున్న భూములను, వారి నివాస హక్కులను, సాముదాయక హక్కులను చట్టపరంగా గుర్తించాలని చెప్పింది. ఆదివాసుల పక్షాన పోరాడినవారు ఈ చట్టం అమలులోకి రావటమే ఆనాడు ఒక పెద్ద విజయంగా భావించారు. కానీ చట్టం వచ్చిన పద్నాలుగేళ్ల తర్వాత ఇవాళ కూడా ఆదివాసుల పరిస్థితి పెద్దగా మెరుగుపడిందేమీ లేదు. పైగా ఈ చట్టం భుజాలపైన తుపాకీ పెట్టి ఎటుతిరిగి ఆదివాసులను అడవులను వెళ్లగొట్టటానికే గురిపెడుతున్నారు. అటవీ హక్కుల గుర్తింపు చట్టం అమలులోకి రాగానే మొదటగా స్పందించింది పర్యావరణవాదులు, అటవీ సంరక్షణవాదులు. అడవినంతా ఆదివాసులకు పట్టాలుచేసి పంచి ఇచ్చేస్తే వన్యప్రాణులకు ముప్పు వాటిల్లుతుంది కదా అని వాపోయి సుప్రీం కోర్టులో కేసు వేశారు. ఆ కేసు పదేళ్లు పైగా నడిచిన తర్వాత 2019 ఫిబ్రవరిలో ఉన్నత న్యాయస్థానం ఒక దుర్మార్గమైన తీర్పు ఇచ్చింది. అటవీ హక్కుల చట్టం ప్రకారం సాగు భూముల కోసం పెట్టుకున్న అర్జీలు ‘తిరస్కరించబడి’న వారినందరినీ అడవులనుండి తొలగించాలి అనేది దాని సారాంశం. నిజానికి అర్జీలు ‘తిరస్కరించటం’, ‘తొలగించటం’ అనేవి అటవీ హక్కుల చట్టం స్ఫూర్తికే విరుద్ధం. ఈ తీర్పుకు తీవ్ర స్థాయిలో వ్యతిరేకత రావటంతో అది తాత్కాలికంగా వాయిదా పడింది. కానీ కోర్టు తీర్పుతో సంబంధం లేకుండానే క్షేత్ర స్థాయిలో వేధింపులు, తొలగింపులు జరిగిపోతూనే వున్నాయి.

కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ ఇచ్చిన నివేదిక ప్రకారం 2018 నవంబరు 30 నాటికి తెలంగాణలో అటవీహక్కుల కోసం మొత్తం 1,86,679 అర్జీలు పెట్టుకున్నారు. వాటిలో 83,757 అర్జీలను తిరస్కరించారు, అంటే మొత్తం అర్జీలలో దాదాపు 44% తిరస్కరించబడ్డాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో మొత్తం 1,81,508 అర్జీలు పెట్టుకోగా వాటిలో 98,049 హక్కు పత్రాలను మంజూరు చేసి పంపిణీ చేశారు. 75,927 అర్జీలను తిరస్కరించారు, అంటే మొత్తం అర్జీలలో 42% తిరస్కరించబడ్డాయి. పైన ఇచ్చిన గణాంకాల ప్రకారం ఇతర రాష్ట్రాలతో పోల్చినప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలలోనే అత్యధిక అర్జీలు తిరస్కరణకు గురయ్యాయి. సుప్రీంకోర్టు తీర్పు గనుక అమలుచేస్తే అర్జీలు తిరస్కరించబడిన లక్షన్నరకు పైగా ఆదివాసీ కుటుంబాలవారంతా అడవులనుండి తొలగించబడే ప్రమాదంలో వున్నారు. అర్జీల తిరస్కరణ జరిగితే చట్టం ప్రకారం అర్జీదారులకు రాతపూర్వకంగా తెలియజేయాలి, ఏ కారణం చేత తిరస్కరించారో తెలియజేయాలి, దానినిబట్టి వాళ్ళు తిరిగి అర్జీలు పెట్టుకునే అవకాశం ఉంటుంది. కానీ చాలాచోట్ల అటువంటి తిరస్కరణ నోటీసులేమీ అందలేదు. రెవిన్యూ, అటవీ శాఖల మధ్య చిరకాలంగా వున్న భూ వివాదాల కారణంగా అనేక జిల్లాలలో అటవీ హక్కుల అర్జీలు పెండింగ్లో ఉండిపోయాయి. ఈ సమస్యను పరిష్కరించటానికి రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దిష్టమైన చర్యలేవీ చేపట్టలేదు. అటవీ భూముల సర్వే జరిగి, మ్యాప్లు ఇచ్చి పట్టాలు రాకుండా వున్నవారు వేల సంఖ్యలో వున్నారు, వారు ఐటిడిఎల చుట్టూ, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరిగి తిరిగి చెప్పులు అరిగిపోయి నిరాశతో మిన్నకుండిపోయారు.

పోనీ ఇచ్చిన పట్టాలైనా సక్రమంగా ఇచ్చారా అంటే అదీ లేదు. ఒక్కొక్క కుటుంబం 2 లేదా 3 ఎకరాలకు అర్జీలు పెట్టుకుంటే 50 సెంట్లు, 60 సెంట్లకు పట్టాలిచ్చారు. మిగిలిన భూమికి పట్టాలిమ్మని ఎన్నిసార్లు దరఖాస్తులు పెట్టుకున్నా ఫలితం లేదు. స్త్రీలకు భూమి హక్కులను గుర్తించిన ఏకైక చట్టం అటవీ హక్కుల గుర్తింపు చట్టం ఒక్కటే. ఈ చట్టం ప్రకారం భార్య, భర్తలు ఇద్దరి పేరుమీద ఆ కుటుంబం సాగు చేసుకుంటున్న అటవీ భూమికి జాయింట్ పట్టా ఇవ్వాలి. కానీ అది కొన్నిచోట్ల మాత్రమే జరిగింది. సగానికి పైగా పట్టాలు పురుషుల పేరుమీదనే ఇచ్చారు. మహిళల పేరుమీద కొన్ని పట్టాలు వచ్చాయి కానీ ఇదంతా చట్టం నిర్దేశించిన ప్రకారం జరగలేదు. ఆ విధంగా పట్టాలు వచ్చిన పురుషులు చనిపోతే వారిపేరు మీద వున్న పట్టాలను భార్యల, పిల్లల పేరుమీద బదిలీ చేయటానికీ అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. అటవీ హక్కు పత్రాలు అన్నిటినీ ఆన్లైన్ భూ రికార్డులలో చేర్చకపోవటం మూలంగా చాలామంది పట్టాదారులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు రాలేదు. ఫలితంగా వ్యవసాయానికై వారికి రాష్ట్రప్రభుత్వాలు ఇచ్చే పెట్టుబడి సాయం (రైతు బంధు, రైతు భరోసా) అందటం లేదు. ఈ విధంగా కూడా పోడు వ్యవసాయం చేసుకునే ఆదివాసీ కుటుంబాలు నష్టపోతున్నాయి.

కొన్ని దశాబ్దాలుగా అటవీ భూములను సాగు చేసుకుంటున్నప్పటికీ పట్టాలు లేవనే కారణంతో ఆదివాసులను ఆ భూములనుండి వెళ్లగొట్టటానికి అటవీ శాఖ ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోవడం లేదు. ఆదివాసీ కుటుంబాలకు గతంలో ప్రభుత్వాలు ఇచ్చిన వివిధ రకాల పట్టాలను మోసం చేసి తీసుకుని, చేతిలో ఎటువంటి ఆధారం లేకుండా చేసి ఆ భూములలోకి అడుగుపెట్టకుండా వేధిస్తున్నారు. అత్యంత వెనుకబడిన ఆదిమ తెగలుగా గుర్తించిన(పివిటిజి) వారికి చట్టాలు అనేక హక్కులు కల్పించినప్పటికీ కొలాంలను, కొండరెడ్లను ఊళ్ళనుండి వెళ్లగొడు తున్నారు. వాళ్ళ ఇళ్లను కూల్చివేసి, తగులబెట్టి, బాలింతలని కూడా చూడకుండా మహిళలను బలవంతంగా ఎత్తి ట్రాక్టర్లలో వేసి లోతట్టు అటవీ ప్రాంతాలనుండి మైదాన ప్రాంతంలో పాడుపడిన భవనాలలో తెచ్చి పడవేసిన సం ఘటనలు కూడా నిత్యం జరుగుతున్నాయి. పోడు భూములలో వేసిన పంటలను నాశనం చేసి, కందకాలు, గోతులు తవ్వి మొక్కలు నాటుతున్నారు. ఆ భూముల్ని సాగు చేసుకునే ఆదివాసీ మహిళలు ట్రాక్టర్లకు, ప్రొక్లైన్లకు అడ్డం నిలిచి ఎదిరించి ‘‘ప్రాణాలైనా ఇస్తాం కానీ మా భూముల్ని వదులుకోము’’ అని పోరాడుతున్నారు. ఈ విధమైన వేధింపులు పట్టా భూములోనూ, పట్టాలు మంజూరయ్యే క్రమంలో వున్న భూములలోనూ కూడా జరుగుతున్నాయి. పచ్చదనం పెంచటానికంటూ నాటుతున్న హరితహారం మొక్కలు ఆదివాసుల బతుకుతెరువును బలితీసుకుంటున్నాయి.

పోలవరం ముంపు గ్రామాల్లో ముందుగా వారి అటవీ హక్కులను గుర్తించి, పట్టాలు ఇచ్చి తర్వాత వారికి భూసేకరణ చట్టం–2013 ప్రకారం నష్టపరిహారంగా భూమికి భూమి ఇవ్వాల్సి వుంది. కానీ చాలా గ్రామాల్లో ఎట్లాగూ మునిగిపోతాయి కాబట్టి అటవీ హక్కులు గుర్తించనక్కర లేదని వాళ్ళు సాగుచేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వలేదు. పట్టాలు ఇవ్వలేదు కాబట్టి భూమికి భూమి ఇవ్వక్కరలేదు. ఇప్పుడు నెలాఖరులోగా ఖాళీ చెయ్యాలని ప్రకటించి మైదాన ప్రాంతాలలో కట్టిన పునరావాస కాలనీలకు తరలిపొమ్మని బలవంతం చేస్తున్నారు. పునరావాసం, పునఃస్థాపన పూర్తిగా ఇవ్వకుండా ఊళ్లు ఖాళీ చేసేది లేదని ఆ గ్రామాల ప్రజలు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఇదిలావుండగా రాజకీయ లబ్ధి పొందటానికి ఆంధ్రప్రదేశ్లో అర్హులైన ఆదివాసులందరికీ అటవీ పట్టాలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ సంవత్సరం సంక్రాంతి లోపు అర్జీలు పెట్టుకోవాలని ఐటీడీఏలు నోటీసులు ఇచ్చాయి, ఉగాది వరకు పట్టాలిస్తామన్నారు. ఇప్పుడు ‘అడవుల్లో సాగుభూమి వున్న ప్రతి గిరిజనుడికీ అటవీ పట్టాలు ఇస్తాం, ఆగస్టు 9 ఆదివాసీ దినోత్సవం నాడు 50 వేల ఎకరాలకు పట్టాలు పంపిణీ చేస్తాం’ అని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు.

రాష్ట్రంలో 73 వేలకు పైగా అర్జీలు తిరస్కరణకు గురైతే వాటిని సెటిల్ చేయటానికి చట్టపరంగా వ్యవస్థాగత చర్యలు తీసుకోకుండా ఒక తేదీ ప్రకటించి అందరికీ పట్టాలు ఇస్తామనటం కూడా చట్టవిరుద్ధమే. 50 వేల ఎకరాలకు ఏ లెక్క ప్రకారం పట్టాలు ఇస్తారో ఎక్కడా వివరించలేదు. ఇప్పటికే 50 శాతానికిపైగా ఆదివాసుల భూములు ఆదివాసేతరుల చేతులలోకి వెళ్లిపోయాయి, దాని కారణంగా సాగుచేయటానికి భూములులేక ఆదివాసులు మళ్ళీ కొత్తగా పోడుకొట్టుకుని అటవీశాఖ వేధింపులు, అరెస్టులు, కేసులు బారినపడు తున్నారు. ఇది చాలదన్నట్లు షెడ్యూల్డు ప్రాంతాలలో ఉపాధ్యాయ పోస్టులకు 100 శాతం రిజర్వేషన్ కల్పించిన జిఓ నెంబర్ 3ను ఇటీవల సుప్రీంకోర్టు రద్దు చేసింది. దీనితో ఆ పోస్టులను ఆదివాసేతరులు చేజిక్కించుకుని ఆదివాసీ ప్రాంతాలలోకి వారి భూములలోకి మరింతగా జొరబడటానికి, ఆదివాసుల హక్కులను కబళించటానికీ మరింత అవకాశం ఉంటుంది. ఇది ఆదివాసులలో తీవ్రమైన ఆందోళనను రగిలిస్తున్నది. 1996లో వచ్చిన పీసా చట్టం గ్రామసభలకు పూర్తి అధికారాన్ని ఇచ్చింది. ‘మా ఊళ్ళూ మా రాజ్యం’ వస్తుందని ఆదివాసులు సంతోషపడ్డారు. కానీ అది కూడా కాగితానికే పరిమితమయింది. ఇంతవరకు అన్ని ఆదివాసీ గూడాలలో గ్రామసభలే ఏర్పడలేదంటే చట్టాల అమలులో అలసత్వం ఎంతగా ఉందో ఊహించవచ్చు. ఈ విధంగా ఆదివాసులకు అన్నివైపుల నుండి ముప్పు కమ్ముకుని వస్తుండగా వారి పక్షాన నిలబడి మాట్లాడేవారు, పోట్లాడేవారు చాలాతక్కువ మంది కనిపిస్తున్నారు. ఆదివాసులు లేనిదే అడవిలేదు, అడవి లేకపోతే మనకు బ్రతుకులేదు అని అందరూ గుర్తించిన నాడు, వారికీ నిజమైన న్యాయం అందించాలనే రాజకీయ స్థిర నిర్ణయం ఏర్పడిననాడే వారికి చారిత్రక న్యాయం జరగటానికి కొద్దిగానైనా తలుపులు తెరుచుకుంటాయి.

మహిళా రైతుల హక్కుల సంఘం

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates