సంక్షోభాన్ని మరింత తీవ్రం చేస్తున్న ప్రభుత్వ విధానాలు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

ఈ ఏడాది జూన్‌ నెల ఆర్థికాభివృద్ధిని గురించి ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు దిగజారుతున్న దేశ ఆర్థిక దుస్థితిని వెల్లడిస్తున్నాయి. ఆర్థికాభివృద్ధిని కొనసాగించటానికి, ప్రజలకు ఉపాధి కల్పించటానికి రూ. 20.79 లక్షల కోట్ల ప్యాకేజిని ప్రకటించామని ప్రభుత్వం చెప్పుకుంటున్న గొప్పలు ఎందుకూ కొరగాకుండా పోయాయని ఈ అంకెలు స్పష్టం చేస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థకు, ప్రజలకు ఎదురౌతున్న సమస్యల పరిష్కారం లక్ష్యంగా కాకుండా…కేవలం ప్రజలను మభ్యపెట్టటం కోసం ప్రకటించిన ఈ పథకం లక్ష్యాల సాధనకు ఏ మాత్రం ఉపయోగపడలేదని కూడా స్పష్టమౌతున్నది. కోవిడ్‌-19 మహమ్మారిని అరికట్టటం, దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దటంలో ప్రభుత్వం ఏ మాత్రం శ్రద్ధ చూయించకపోవటంతో దేశ ఆర్థిక పరిస్థితి, ప్రజల పరిస్థితులు కూడా క్షీణిస్తున్నాయి. ప్రభుత్వ వ్యవహార సరళితో సామాన్య ప్రజలు కనీవినీ ఎరుగని విధంగా కష్టాలను ఎదుర్కొంటున్నారు. జూన్‌ నెల నాటికి లాక్‌డౌన్‌లో గణనీయంగా సడలింపులు ఇచ్చినప్పటికీ లాక్‌డౌన్‌ అనంతరం కూడా పరిస్థితుల తీవ్రతలో మార్పు రాలేదన్న విషయాన్ని కూడా ఈ వివరాలు స్పష్టం చేస్తున్నాయి.

గత సంవత్సరం నిత్యావసర సరుకుల ధరలు 7.3 శాతం పెరుగుదలను నమోదు చేయగా, ఈ సంవత్సరం జూన్‌ నెలలో ధరల పెరుగుదల రేటు 2.0 శాతానికి తగ్గిందని ప్రభుత్వం ప్రకటించింది. నిత్యావసర సరుకుల ధరల పెరుగుదల తగ్గి, ప్రజలకు తక్కువ ధరలకు నిత్యావసర సరుకులు అందుతుంటే సంతోషించాల్సిందే. కాని వాస్తవం ఏమిటంటే ప్రజల వద్ద కొనుగోలు శక్తిలేక నిత్యావసరాల ధరల పెరుగుదల రేటు తగ్గింది మినహా ప్రజలందరూ తమ అవసరాల మేరకు కొనుగోలు చేసినప్పటికీ నమోదైన తగ్గుదల కాదు ఇది. దేశంలోని వివిధ ప్రాంతాలలో అనేక స్వచ్ఛంద సంస్థలు చేసిన సర్వేలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు వెల్లడైనాయి. ప్రభుత్వం అర్ధాంతరంగా విధించిన లాక్‌డౌన్‌ కారణంగా పట్టణాలు, నగరాల నుండి గ్రామాలకు తిరిగి వచ్చిన కార్మికులకు గ్రామాలలో ఉపాధి దొరకటం కష్టమైపోయింది. లాక్‌డౌన్‌ వలన పట్టణాలు, నగరాలలో కూడా అన్ని విధాలైన కార్యకలాపాలు స్థంభించిపోవటంతో అక్కడ మిగిలిపోయిన కార్మికులు కూడా పనులు లేక అల్లాడిపోతున్నారు. కార్మికులతో పాటు వివిధ రకాలైన స్వయం ఉపాధి పనులు చేసుకుంటూ రోజువారీ ఆదాయాలపై ఆధారపడి జీవిస్తున్నవారు కూడా తమ జీవనాధారాల్ని కోల్పోయి, నిరాధారులుగా మిగిలిపోయారు. వీటితో పాటుగా మొత్తం పారిశ్రామిక కార్యకలాపాలు స్థంభించిపోవటంతో కార్మికులంతా నిరుద్యోగులుగా మారిపోయారు. పరిశ్రమలు మూసివేసినా కార్మికులకు వేతనాలు చెల్లించాలని ప్రభుత్వం యజమానులకు విజ్ఞప్తి చేసింది. కాని పరిశ్రమల యజమానులెవరూ ప్రభుత్వం చెప్పిన మాటలను పట్టించుకోలేదు. లాక్‌డౌన్‌ ముగిసిన వెంటనే కార్మికులతో అవసరం ఉంటుందనుకున్న యజమానులు కొందరు అక్కడే ఉన్న కార్మికులకు కొద్దిమొత్తం అడ్వాన్సులుగా ఇచ్చారు. తిండికి అల్లాడుతున్న కార్మికులలో కొద్దిమందికి కొందరు యజమానులు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు భోజనాలు ఏర్పాటు చేశారు. కార్మికులందరికీ వేతనాలు చెల్లించాలని చెప్పిన ప్రభుత్వం యజమానులు వేతనాలు చెల్లించకపోయినా వారిని హెచ్చరించి, కార్మికులకు వేతనాలు ఇప్పించటానికి ఎటువంటి చర్యలూ తీసుకోలేదు.

రేషన్‌కార్డుతో నిమిత్తం లేకుండా ప్రతి కుటుంబానికి 10 కిలోల బియ్యం, రూ.500 అందిస్తానని ప్రభుత్వం చెప్పినప్పటికీ అనేకచోట్ల సగం మందికిపైగా కార్మికులకు ప్రభుత్వ సహాయం అందలేదు. ఉపాధి హామీ పనులకు ప్రభుత్వం తగిన మొత్తం కేటాయించలేదు. రాత్రికి రాత్రే 12 కోట్ల మందికి పైగా వలస కార్మికులు, వ్యవసాయ కార్మికులు ఉపాధి కోల్పోతే కేవలం రూ.50 వేల కోట్లు మాత్రమే ఉపాధి హామీ పథకానికి అదనంగా కేటాయించింది. వ్యవసాయ కార్మికులు, వలస కూలీలందరికీ పనులు కల్పించటం లక్ష్యం కాకుండా సంకుచిత ఎన్నికల దృష్టితో 116 జిల్లాలకు మాత్రమే పనులను పరిమితం చేశారు. ఇటువంటి పరిస్థితులలో పనులు, ఆదాయాలు లేక ప్రజల కొనుగోలు శక్తి హరించుకుపోయింది. ఉపాధి లేకపోవటం వలన తమకు ఆదాయాలు రాకపోవటంతో కోట్లాది మంది ప్రజానీకానికి కనీసంగా కడుపు నింపుకోవటానికి అవసరమైన ఆహారం, నిత్యావసరాలను కూడా కొనుక్కోలేని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగానే నిత్యావసరాల ధరల పెరుగుదల రేటు గత సంవత్సరం కన్నా తగ్గటం జరిగింది. అందువలన ప్రభుత్వం ప్రజల కొనుగోలు శక్తిని పెంచటానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి. అందుకు అవసరమైన మేరకు నిధులను కేటాయిస్తూ ప్యాకేజి ప్రకటిస్తే ఉపయోగం ఉంటుంది మినహా ప్రజలకు ఉపయోగపడని నకిలీ ప్యాకేజిలు ఎన్ని ప్రకటించినా వాటి వలన ప్రజలకు ఉపయోగం ఉండదు. అటువంటి ప్యాకేజిలు ఆర్థికాభివృద్ధికి కూడా దోహదం చేయవు.

కీలకరంగాల నేలచూపులు
దేశ ఆర్థికాభివృద్ధిలో కీలకంగా ఉన్న ప్రధాన రంగాలన్నీ నేలచూపులు చూస్తున్నాయి. ఆర్థికాభివృద్ధిలో కీలకంగా పరిగణించే ఎనిమిది రంగాలు గత సంవత్సరం జూన్‌ నెలలో 3.8 శాతం అభివృద్ధిని నమోదు చేయగా ఈ సంవత్సరం జూన్‌ నెలలో 23.4 శాతం ప్రతికూలాభివృద్ధిని నమోదు చేశాయి. శుద్ధి చేసిన ఉత్పత్తులు మైనస్‌ 1.5 నుండి మైనస్‌ 21.3 శాతంకు, బొగ్గు 1.7 శాతం వృద్ధి నుండి మైనస్‌ 14.0 శాతంకు, ఉక్కు 13.3 శాతం వృద్ధి నుండి మైనస్‌ 48.4 శాతానికి, సిమెంటు 2.8 శాతం వృద్ధి నుండి మైనస్‌ 22.2 శాతానికి పడిపోయాయి. ముడిచమురు ఉత్పత్తి మైనస్‌ 6.9 శాతం నుండి మైనస్‌ 7.1 శాతానికి, సహజ వాయువు మైనస్‌ 0.1 శాతం నుండి మైనస్‌ 16.8 శాతానికి, విద్యుత్‌ ఉత్పత్తి 7.4 శాతం పెరుగుదల నుండి, ఈ సంవత్సరం జూన్‌ నెలలో మైనస్‌ 15.6 శాతానికి పడిపోయాయి. ఎరువుల ఉత్పత్తి మాత్రమే మైనస్‌ 1.0 శాతం నుండి 7.5 శాతం అదనంగా పెరిగింది. మొత్తంగా దేశ ఆర్థిక వ్యవస్థ ఎంత సంక్లిష్ట పరిస్థి తులను ఎదుర్కొంటున్నదో కీలకరంగాలలో దిగజారిన ఉత్పత్తి స్పష్టం చేస్తున్నది. ఈ రంగాలలో ఉత్పత్తి పడిపోవటం మిగతా రంగాల అభివృద్ధికి విఘాతం కలిగిస్తుంది. కాబట్టి కీలక రంగాలలో ఉత్పత్తి పడిపోవటాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి, ఆ రంగాలలో ఉత్పత్తిని పెంచటానికి, మిగతా రంగాలలో అభివృద్ధికి తగిన చర్యలు తీసుకోకపోతే మరింత తీవ్రమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. కోవిడ్‌ 19 మహ మ్మారితో లాక్‌డౌన్‌ ప్రకటించటానికి ముందే దేశంలో గత 45 సంవత్సరాలలో లేని విధంగా నిరుద్యోగం పెరిగింది. లాక్‌డౌన్‌ విధించటానికి ముందు 2020 మార్చి నెలలో 8.8 శాతంగా ఉన్న నిరుద్యోగం ఏప్రిల్‌లో 23.50 శాతానికి చేరింది. దేశంలో పని చేయగలిగిన వారిలో నాలుగవ వంతు నిరుద్యోగులుగా ఉన్నారని పై అంకెలు స్పష్టం చేస్తున్నాయి. కాబట్టి లాక్‌డౌన్‌ కారణంగా మూతపడిన పరిశ్రమలన్నింటినీ తిరిగి పని చేయటానికి అవసరమైన చర్యలు తీసుకోవటం, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు అవసరమైన సబ్సిడీలను అందజేయటం, పారిశ్రామికోత్పత్తిని పునరుద్ధరించటం, నిరు ద్యోగులకు ఉద్యోగాలను కల్పించటం చేయాలి. ఆ విధంగా మాత్రమే నిరుద్యోగాన్ని తగ్గించటం సాధ్యమౌతుంది. అప్పటికి కూడా ఉద్యోగాలు దొరకని వారికి నిరుద్యోగ భృతి చెల్లించాలి.

విదేశీ వాణిజ్యం

2020 జూన్‌నెలలో విదేశీ వాణిజ్యంలో 0.8 బిలియన్‌ డాలర్ల మిగులు ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. గత అనేక సంవత్సరాలుగా విదేశీ వాణిజ్యంలో మనదేశం ఎప్పుడూ లోటులోనే ఉంటున్నది. మనదేశం చేస్తున్న ఎగుమతులు పెరగటం వలన కాక, మనం చేస్తున్న ఎగుమతుల కన్నా దిగుమతులు ఎక్కువగా పడిపోవటంతో జూన్‌ నెలలో వాణిజ్యంలో మిగులు సాధ్యమైంది. గత సంవత్సరం జూన్‌నెలలో వాణిజ్యలోటు 15.3 బిలియన్‌ డాలర్లుగా ఉంది. అటువంటిది ఈ సంవత్సరం జూన్‌లో వాణిజ్యంలో మిగులు ఉండటానికి కారణం మన ఎగుమతులు 12 4 శాతం పడిపోయి, 21.9 బిలియన్‌ డాలర్లకు పరిమితం కాగా, దిగుమతులు 47.6 శాతం పడిపోయి, 21.1 బిలియన్‌ డాలర్లకు తగ్గిపోయాయి. మన ఎగుమతులు పడిపోయిన దానికన్నా దిగుమతులు నాలుగు రెట్లు వరకు పడిపోయాయి. దిగుమతులలో ముడిచమురు దిగుమతులు 55.3 శాతం పడిపోగా, చమురేతర దిగుమతులు 44.7 శాతం పడిపోయాయి. భారీ స్థాయిలో దిగుమతులు పడిపోవటం, ముఖ్యంగా ముడిచమురు దిగుమతులు ఎక్కువగా పడిపోవటం ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సంక్షోభం యొక్క తీవ్రతను తెలుపుతున్నది.
సామాన్య ప్రజానీకం, దేశ ఆర్థికవ్యవస్థ ఇటువంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటుండగా, పరిష్కారానికి చర్యలు తీసుకోవటానికి ప్రభుత్వం సిద్ధం కావటం లేదు. ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టటం కోసం ప్రకటించిన రూ. 20.79 లక్షల కోట్ల ప్యాకేజీ ఈ సమస్యల పరిష్కారానికి ఉపయోగపడదు. ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించటం, ప్రజలకు ఉపాధి కల్పించటానికి బదులుగా కోవిడ్‌-19 మహమ్మారి విజృంభణను ఉపయోగించుకొని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వారికి కట్టబెడుతున్నది. మేకిన్‌ ఇండియా నినాదంపై ప్రజలకు భ్రమలు తొలగుతుండటంతో దానిని పక్కన పెట్టి, ఆత్మనిర్భర్‌ భారత్‌ నినాదాన్ని ప్రభుత్వం ముందుకు తెస్తున్నది. ప్రజల దృష్టి మళ్ళించటం కోసం మతోన్మాదాన్ని రెచ్చగొట్టటం చేస్తున్నది. ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ విధానాలు దేశాన్ని మరింత ఆర్థిక, సామాజిక సంక్షోభంలో ముంచటానికి, మైనారిటీలపై దాడులు పెరగటానికి, ప్రజల పరిస్థితులు మరింత దిగజారటానికి దారితీస్తాయి.

ఎ. కోటిరెడ్డి

RELATED ARTICLES

Latest Updates