స్కీమ్‌ వర్కర్లకు రక్షణేదీ..?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

ఎన్‌హెచ్‌యంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఎఎన్‌యంలు, పారామెడికల్‌ సిబ్బందిని పర్మినెంట్‌ చేయకుండా సంవత్సరాల తరబడి కాలయాపన చేస్తున్నారు. ఇందిరాక్రాంతి పథంలో పనిచేస్తున్న వీఓఏలకు నెలల తరబడి వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు తిప్పికొట్టేందుకు సమైక్యంగా కదులుదాం. దేశవ్యాప్త ఉద్యమంలో సమరశీలంగా భాగస్వాములమౌదాం. సమ్మెను జయప్రదం చేద్దాం.

మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు మాత్రం గడప దాటడం లేదు అన్నట్టుగా ఉంది మోడీ పాలన. ఇందుకు కార్మికుల తిరోగమన బతుకులే సాక్ష్యం. కేంద్ర ప్రభుత్వం కార్మిక, ఉద్యోగ, ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నది. ఈ విధానాలపై కేంద్ర కార్మిక, ఉద్యోగ సంఘాలు మరో సమ్మె పోరాటానికి సిద్ధమయ్యాయి. ఆగస్టు 7, 8 స్కీమ్‌ వర్కర్ల దేశవ్యాప్త సమ్మె అందులో భాగమే.

పేద ప్రజలకు సంక్షేమ పథకాలు, పౌష్టికాహారం, విద్య, వైద్యం తదితర సేవలను అందిస్తూ, వివిధ స్కీమ్‌లలో అంగన్‌వాడీ, మధ్యాహ్న భోజనం, ఆశా, ఎన్‌హెచ్‌ఎం, సర్వశిక్షా అభియాన్‌, ఇందిరాక్రాంతి పథం వంటి స్కీమ్‌లలో దేశంలో కోటి మంది, తెలంగాణలో సుమారు 3లక్షల మంది పనిచేస్తున్నారు. కానీ పాలకులు స్కీమ్‌ వర్కర్లందరినీ కార్మికులుగా గుర్తించాల్సిన ప్రాధాన్యతను నిరాకరిస్తున్నారు. కనీస వేతనం రూ.21,000, పీఎఫ్‌, ఈఎస్‌ఐ సౌకర్యాలు కల్పించాలని, 45వ ఇండియన్‌ లేబర్‌ కాన్ఫరెన్స్‌ సిఫారస్‌లను గుర్తించాలని కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు. కానీ ప్రభుత్వం పేదలకు ఉపయోగపడే స్కీమ్‌లను ప్రయివేటీకరించ పూనుకుంటున్నది. స్కీమ్‌లకు అదనపు నిధులు సమకూర్చాల్సిన సమయంలో బడ్జెట్‌ కోతలు పెడుతున్నది. మౌలిక సదుపాయాల కల్పన ప్రభుత్వ స్పృహలో లేకుండా పోయింది.

కరోనా నివారణా చర్యల్లో ముందు వరుసలో పనిచేస్తున్న వారిని గాలికొదలేసింది. కరోనా సమయంలో చనిపోయిన స్కీమ్‌ వర్కర్ల వారసులకు రూ.50లక్షల ఇన్సూరెన్స్‌ కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ దాంట్లో నిర్థిష్టత లేదు. వారి కుటుంబ సభ్యు లకు ఉచిత కరోనా చికిత్స చేయాలని, కంటైన్మెంట్‌, రెడ్‌జోన్‌లలో పనిచేస్తున్న వారికి పీపీఈ కిట్స్‌ అందించాలని స్కీమ్‌ వర్కర్స్‌ చేస్తున్న డిమాండ్‌ను పెడచెవిన పెడుతున్నారు. 2020 ఆగస్టు 7, 8 తేదీల్లో దేశవ్యాప్త సమ్మెకు, ఆగస్టు 9న జైల్‌ భరో (సత్యాగ్రహం)కు కార్మికవర్గం సమాయత్తమవు తోంది. మన రాష్ట్రంలోని అన్నిరకాల స్కీమ్‌లలో పనిచేస్తున్న కార్మికులందరూ పాల్గొని ఈ విధానాలను ఐక్యంగా ప్రతిఘటించాలి.

ప్రపంచంలో మనదేశం ఆకలిలో 102వ స్థానంలో ఉంది. భారతదేశంలో సగం మంది పిల్లలు తక్కువ బరువుతో పోషకాహార లోపంతో ఉన్నారు. 79శాతం భారత మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. ఒక ఏడాదికి 75లక్షలమంది 5ఏండ్ల లోపు వయస్సు కల్గిన పిల్లలు చనిపోతున్నారు. మాతా, శిశు మరణాలను తగ్గించటం, పౌష్టికాహార లోపాన్ని, స్కూల్స్‌ డ్రాపౌట్స్‌ను తగ్గించటం, ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్య పెంచటంలో స్కీమ్‌ వర్కర్ల కృషి ఎనలేనిది. ఈ పథకాలను ప్రభుత్వ శాఖలుగా గుర్తిస్తే మరిన్ని మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. ఈ దిశలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టడం లేదు.

కరోనా వైరస్‌పై ముందు వరుసలో ఉండి పోరాటం చేస్తున్న స్కీమ్‌ వర్కర్ల రక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిందేమీ లేదు. ప్రభుత్వ పాఠశాలలు మూతపడడంతో వేలాది మంది మధ్యాహ్న భోజన, స్వచ్ఛ కార్మికులు ఉపాధి కోల్పోయారు. ప్రభుత్వం వారికి ఆర్థిక చేయూత ఇవ్వలేదు. కరోనాలో ముందు వరుసలో పనిచేస్తున్న ఆశా, అంగన్‌వాడీ, ఆరోగ్య శాఖలోని కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు కనీసం రక్షణ పరికరాలు మాస్కులు, శానిటైజర్లు, గ్లౌజులు, పీపీఈ కిట్లు కూడా అందించలేని దుస్థితి. ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌కి రూ.50లక్షల ఇన్సూరెన్స్‌ గురించి గొప్పలు చెప్పిన మోడీ ప్రభుత్వం అంగన్‌వాడీలను ఆ ఇన్సూరెన్స్‌ నుంచి మినహాయించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఇన్సెంటీవ్‌ రూ.5,000లు ఆశా, అంగన్‌వాడీ లకు ఇవ్వలేదు. చివరికి తక్కువ వేతనం పొందే కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు, అంగన్‌వాడీలకు కూడా వేతనాల్లో కోతలు పెట్టారు.

గ్రామీణ ప్రాంతాలలో ఉండే అట్టడుగువర్గాలైన ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, మైనార్టీలకు అందే కొద్దిపాటి సేవలను కూడా మోడీ ప్రభుత్వం వారికి దక్కకుండా చేస్తున్నది. పేదలకు అందుతున్న ప్రాథమిక హక్కులను కూడా తిరస్కరి స్తున్నారు. 73 సంవత్సరాల స్వాతంత్య్రానంతరం కూడా జనాభాలో అధిక సంఖ్యలో ఆహారం, ఆరోగ్యం, విద్యకు తగిన ప్రాధాన్యత లేదు. ప్రభుత్వ పాఠశా లలు, ఆస్పత్రులు ప్రాథమిక సేవలలో కీలకపాత్ర పోషిస్తున్న ఈ స్కీమ్‌ల సేవలను కుదిస్తున్నారు. కొద్ది రోజులు మాత్రమే సేవలు అందించే తాత్కాలిక పథకాలుగా వీటిని మార్చాలనే ప్రయత్నం చేయడం ద్వారా ఈ కొద్దిపాటి ఉపాధి పొందుతున్న స్కీమ్‌ వర్కర్లను కూడా ఇంటికి పంపే ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం స్కీమ్‌లకు కేటాయించే బడ్జెట్‌లలో కోత పెడుతున్నది. స్కీమ్‌ వర్కర్ల వేతనాలు, స్కీమ్‌లకు పెట్టే పోషకాహారం, మెడిసిన్‌, తదితర రోజువారీ ఖర్చులను రానున్న కాలంలో రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలని కేంద్రం చెప్తున్నది. ఈ పథకాలు ముఖ్యమైన పథకాలు కావనీ సాధారణ పథకాలుగా మార్చాలంటున్నది. కేంద్రం తీసుకొచ్చే విధానాలను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వ్యతిరేకించకపోగా మౌనంగా అంగీకరిస్తున్నది.

కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదార్లకు ప్రతి సంవత్సరం లక్షల కోట్ల రాయితీలు చెల్లిస్తున్నది. మరోవైపు ప్రజా సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేస్తున్నది. కరోనా కష్టకాలంలో కూడా ఆత్మనిర్భర్‌ భారత్‌ పేరుతో రూ.20లక్షల కోట్ల ప్యాకేజీని 5 దఫాలుగా ఆర్థికమంత్రి నిర్మాలా సీతారామన్‌ ప్రెస్‌మీట్ల ద్వారా ప్రకటించారు. ఇందులో ప్రజా ఆరోగ్యం, రక్షణ, పరికరాల కొనుగోలు, కరోనా పరీక్షలు, వెంటిలేటర్స్‌, హాస్పిటల్స్‌ మౌలికాభివృద్ధి గురించి నయాపైసా కూడా కేటాయించలేదు. రూ.18 లక్షల కోట్ల రూపాయలను బ్యాంక్‌ ద్వారా రుణాల రూపంలో పెట్టుబడిదారులకే కట్టబెట్టారు. స్కీమ్‌ వర్కర్ల కనీస వేతనం రూ.21,000, కరోనాలో ముందు వరుసలో పనిచేస్తున్న వారిని పర్మినెంట్‌ చేయడం, ఇతర సంక్షేమ చర్యల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు.

లాక్‌డౌన్‌లోనూ బడా పెట్టుబడిదారుల లాభాలను కాపాడేందుకే మోడీ ప్రభుత్వం కంకణం కట్టుకున్నది. సంఘం పెట్టుకునే హక్కులను, సమిష్టి బేరసారాల హక్కులను కాలరాసింది. కార్మిక చట్టాలను సస్పెండ్‌ చేయడం, పనిదినాన్ని 12 గంటలకు పెంచుతూ ఆర్డినెన్సులు తెచ్చారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను డీఏని ఫ్రీజ్‌ చేశారు. కీలక రంగాలైన బొగ్గు, రక్షణ, రైల్వే, ఇన్సూరెన్స్‌, బ్యాంకింగ్‌, ఫార్మా, విమానయానం, అంతరిక్షం, అటామిక్‌ ఎనర్జీతో సహా అన్ని రంగాల్లోకి విదేశీ పెట్టుబడులు, ప్రయివేట్‌ పెట్టుబడులకు అనుకూలంగా తలుపులు బార్లా తెరిచింది. ప్రభుత్వరంగ సంస్థలు, సహజ వనరులను తెగనమ్మటానికి కేంద్ర ప్రభుత్వం బరితెగించి నిర్ణయాలు చేసింది. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా స్కీమ్‌ వర్కర్ల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. అంగన్‌వాడీలను ఇంటికి పంపే జీఓ14ను రద్దు చేయడం లేదు. ఆశా వర్కర్లకు ఆంధ్రప్రదేశ్‌ వలే వేతనాలివ్వడం లేదు. మధ్యాహ్న భోజనం కార్మికులకు కేవలం నెలకి రూ.1,000 గౌరవ వేతనం, అది కూడా 10నెలలకు మాత్రమే ఇచ్చి వెట్టి చాకిరి చేయించుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 8,9,10 తరగతుల పిల్లలకు ఇచ్చే పౌష్టికాహారం బిల్లులు సకాలంలో చెల్లించదు. ఎన్‌హెచ్‌యంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఎఎన్‌యంలు, పారామెడికల్‌ సిబ్బందిని పర్మినెంట్‌ చేయకుండా సంవత్సరాల తరబడి కాలయాపన చేస్తున్నారు. ఇందిరాక్రాంతి పథంలో పనిచేస్తున్న వీఓఏలకు నెలల తరబడి వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు తిప్పికొట్టేందుకు సమైక్యంగా కదులుదాం. దేశవ్యాప్త ఉద్యమంలో సమరశీలంగా భాగస్వాములమౌదాం. సమ్మెను జయప్రదం చేద్దాం.

ఎస్‌.వి. రమ

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates