విప్లవ సాహిత్య సాంస్కృతికోద్యమ శిఖరం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

హైదరాబాద్‌: ప్రముఖ విప్లవ కవి, కళాకారుడు వంగపండు ప్రసాదరావు ఈ ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. విజయనగరం జిల్లా పెదబొండపాడు ఆయన సొంతూరు. చాలా కాలంగా పార్వతీపురంలో ఉంటున్నారు. శ్రీకాకుళ పోరాట ఉత్తేజంతో ఆయన విప్లవ సాహిత్య, సాంస్కృతికోద్యమంలోకి వచ్చారు. అప్పటికే ప్రజల నుంచి ప్రజలకు విప్లవ సందేశాన్ని అందించేందుకు మౌఖిక, దృశ్య కళారూపాల అవసరాన్ని విప్లవ రచయితల సంఘం ముందుకు తీసుకొచ్చింది. విప్లవోద్యమ కవులు పాటను విప్లవ ఆవసరానికి తగినట్లు తీర్చిదిద్దుతున్నారు. ఆ సమయంలో వంగపండు ఉత్తరాంధ్ర అత్యద్భుత మాండలికంతో, నుడికారంతో, సహజ సౌందర్యవంతమైన ప్రజల బాణీలతో విప్లవ సాహిత్యోద్యమంలోకి ప్రవేశించారు. శ్రీకాకుళ పోరాట విశిష్టతనే కాదు, మొత్తంగా నక్సల్బరీ పంథాలో సాగుతున్న వర్గపోరాటాలను ఎత్తిపడుతూ ఏం పిల్లడో.. అనే అజరామరమైన పాటతో ఊపునందించారు.

ఎమర్జెన్సీ నాటికే ఆయన రాసిన భూమి భాగోతం విస్తృత ప్రచారమైంది. అప్పుడూ, ఆ తర్వాత వేలాది చోట్ల ప్రదర్శించారు. అప్పటికే ఆయన రాసిన పాటలు ఏరువాక పేరుతో విరసం ప్రచురించింది. అందులోని పాటలన్నీ శ్రీకాకుళ పోరాటం సెట్ బ్యాక్ తర్వాత విప్లవ రాజకీయాలను ఉత్తరాంధ్ర ప్రజానీకంలోకి తీసుకెళ్లడానికి గొప్పగా దోహదపడ్డాయి. ఆ కాలంలోనే ఆయన సిక్కోలు యుద్ధం ఒగ్గుకథ రాశారు. తద్వారా ఉత్తరాంధ్ర జన జీవితంలోని ఒగ్గుకథ కళా రూపం తెలుగు ప్రజలందరికీ పరిచయం అయింది. శ్రీకాకుళం నిప్పురవ్వను తిరిగి ప్రజ్వరిల్లచేయడంలో విప్లవ సాహిత్య సాంస్కృతికోద్యమం చేసిన యావత్తు కృషిలో ఉత్తరాంధ్ర నుంచి వంగపండు ఆట పాటల పాత్ర గణనీయమైనది. వంగపండు విప్లవ సాహిత్యోద్యమంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే ఉందర్రా మాలపేట అనే అద్భుతమైన పాట రాశారు. దళిత జీవిత విషాదాన్ని, పీడిత సాంఘిక అస్తిత్వాన్ని ఆ పాట పొడవునా ఆయన ఆర్ద్రంగా పలికించారు.

వెలివాడలను వర్గపోరాట కేంద్రంగా తీర్చిదిద్దాలనే అవగాహన విప్లవోద్యమానికి ఉన్నందువల్ల, అలాంటి ఆచరణ కొనసాగుతున్నందువల్ల వంగపండు ఆ పాట రాయగలిగారు. ఆయన పాటలన్నీ దాదాపుగా విప్లవోద్యమ అవగాహనలను, వైఖరులను అత్యంత కళాత్మకంగా చిత్రించినవే. దీనికి ఉందర్రా మాలపేట లాంటి అత్యుత్తమ ఉదాహరణ ఆరిందం పాట. విప్లవోద్యమం రూపొందించుకున్న వ్యవసాయక విప్లవం డాక్యుమెంట్ మొత్తాన్ని వంగపండు ఈ పాటలో తిరుగులేని విధంగా వర్ణించారు. అందుకే ఎమర్జెన్సీలోనూ, ఆ తర్వాత విప్లవ విద్యార్థులు గ్రామాలకు తరలండి క్యాంపెయిన్లోనూ ఈపాట ప్రధానంగా పాడేవారు. ఆరిందం పాట భూమిలేని నిరుపేదలను, దళితులను వ్యవసాయక విప్లవంలోకి సమీకరించేందుకు, ఉందర్రా మాలపేట పాట దళితులకు సాంఘిక సమస్యలపట్ల ఉత్తేజం కలిగించేందుకు ప్రధానంగా పాడేవారు.

విప్లవోద్యమం ఏ జీనవ క్షేత్రాల్లోకి విస్తరించిందో, ఏ ప్రజా సమూహాల్లోకి వెళ్లిందో ఆ ప్రజల జీవితాన్ని, ప్రత్యేక సమస్యలను, నిర్దిష్ట సాంస్కృతిక విశిష్టతలను పట్టుకొని ఉద్యమ వైఖరిని ప్రతిబింబిస్తూ వంగపండు వందలాది పాటలు రాశారు. ‘వంగపండు ఉరుములు’ ‘వంగపండు ఉప్పెన’ పేర్లతో ఆయన పాటల క్యాసెట్లు వేలాది గ్రామాలకు చేరాయి. లక్షలాదిమంది ప్రజల ముందు ఆయన ప్రదర్శనలు నడిచాయి. విరసం ఇరవై ఏళ్ల సభల సందర్భంలో కూడా ఆయన పాటల పుస్తకం, క్యాసెట్ విడుదలయ్యాయి. ఆయన కొన్ని కథలు కూడా రాశారు.

1990ల లోని ఆర్థిక పరిణామాలను వెంటనే వంగపండు పట్టుకొని కళారూపాలు రాశారు. ఆర్థిక సాంస్కృతిక రంగంలో తలెత్తిన ప్రతి సమస్య మీద అత్యుద్భుత కళా విలువలతో ఆయన పాటలు 1990లలో కూడా అంతే ప్రజాదరణ పొందాయి. పెట్టుబడి, సామ్రాజ్యవాద వ్యతిరేక అవగాహనను ప్రజల్లోకి తీసుకెళ్లాయి. పోరాట ఉత్తేజాన్ని అందించాయి.

రచనలో, ప్రదర్శనలో విప్లవోద్యమ రాజకీయ అవగాహనను అత్యంత ప్రతిభావంతంగా చిత్రించే వంగపండు సొంత జీవితంలో ఒకింత అమాయకంగా ఉండేవాడు. 1990ల చివరికి వచ్చేనాటికి ఆయన సొంత జీవితంలో సమస్యలు తలెత్తాయి. అవి రాజకీయ వైఖరుల్లో కూడా మార్పుకు కారణం అయ్యాయి. అయినా అనేక ప్రయత్నాల వల్ల 2005 రాష్ట్ర ప్రభుత్వానికి, విప్లవోద్యమానికి మధ్య జరిగిన చర్చల కాలం దాకా ఆయన విప్లవ రాజకీయాలతో కొనసాగారు. ఆ రోజుల్లో డజన్ల కొద్ది భారీ బహిరంగ సభల్లో ఆయన తొలినాళ్ల ఉత్తేజంతోనే ప్రదర్శనలు ఇచ్చారు. కొత్త రచనలు చేశారు.

ఆ తర్వాత క్రమంగా విప్లవ రాజకీయాలకు దూరమయ్యారు. బూర్జువా రాజకీయ మార్గాన్ని అనుసరించారు. ఆయన జీవితం రెండు దశలనుకుంటే మొదటిది విప్లవ సాహిత్య సాంస్కృతికోద్యమంలో నిత్య ఉత్తేజితమైనది. శాశ్వతమైనది. ఈ రెండు దశల మధ్య విప్లవ రాజకీయ వైఖరుల విషయంలో వివాదాస్పదంగా, ఊగిసలాటగా సాగిన కాలం కూడా ఉన్నది. చర్చల కాలంలో ఆయన నిర్వర్తించిన సాంస్కృతిక పాత్ర వల్లనైనా ఆయన ఈ సమస్య నుంచి బైటపడి ఉండాల్సింది. కానీ దానికి భిన్నంగా జరిగింది. ఈ రెండో దశలోనే ఆయన ఉత్తరాంధ్ర ప్రాంతీయ ఆకాంక్షల మీద పని చేశారు. శక్తివంతమైన పాటలు రాశారు. అలాగే ఉత్తరాంధ్ర సమస్యలపై రాజకీయ పార్టీ పెడుతున్నట్లు కూడా ప్రకటించారు.

ఈ వైఖరులు, ఒడుదుడుకులు విమర్శనీయమే అయినా ఆయనలోని కవి, కళాకారుడు మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తారు. అద్భుతమనిపిస్తారు. ఉత్తరాంధ్ర జన జీవిత సౌందర్యాన్ని, శ్రీకాకుళం ఆదివాసీ పోరాట పరిమళాన్ని కళా రంగంలో ఒడుపుగా పట్టుకున్న వాగ్గేయకారుడాయన. విప్లవ సాహిత్య సాంస్కృకోద్యమాన్ని శిఖర స్థాయికి తీసుకెళ్లడంలో ఆయన తొలి దశ పాత్ర చెరిగిపోనిది. వ్యక్తుల్లోని సృజనాత్మకతను వర్గపోరాటం తట్టి లేపుతుంది. వాళ్లదే అయిన వ్యక్తీకరణ శక్తికి, కళా దృష్టికి ఒక ఆకృతిని ఇస్తుంది. నిర్మాణయుతమైన సమిష్టి ఆచరణే వ్యక్తిలోని ప్రత్యేకతలు వెల్లివిరిసేలా చేస్తుంది. దీనికి వంగపండు ఉత్తమ ఉదాహరణ. ఆయన తొలి దశ పాటలు, కళారూపాలు, ప్రదర్శనలు అన్నీ ప్రజా పోరాటాల్లో, విప్లవ సాహిత్య సాంస్కృతికోద్యమంలో శాశ్వతంగా ఉంటాయి. ఆయనకు విరసం ఘననివాళి నర్పిస్తోంది.

అరసవెల్లి కృష్ణ (అధ్యక్షుడు)
బాసిత్ (ఉపాధ్యక్షుడు)
రివేరా (సహాయ కార్యదర్శి)

RELATED ARTICLES

Latest Updates