కరోనా బారిన ల్యాబ్‌ టెక్నీషియన్లు 110 మందికి వైరస్‌

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • సెలవుల్లేకుండా విధులు
  • ఇప్పటికే ఇద్దరు మృతి
  • నమూనాల సేకరణా కష్టమే

హైదరాబాద్‌ : కొవిడ్‌-19 నిర్ధారణలో కీలక పాత్ర పోషించే ల్యాబ్‌ టెక్నీషియన్‌(ఎల్టీ)లు కరోనా బారినపడుతున్నారు. గడిచిన 15 రోజుల్లో రాష్ట్రంలో ఏకంగా 110 మంది ఎల్టీలకు కరోనా సోకింది. రాష్ట్రంలో తొలి కేసు నమోదైన మార్చి 2కు ముందు నుంచే ల్యాబ్‌ టెక్నిషీయన్లపై తీవ్రమైన పనిభారం పడింది. ప్రజారోగ్య సంచాలకుడు, డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ), తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ పరిధిలో మొత్తం 1,060 ఎల్టీ పోస్టులుండగా.. 208 మంది మాత్రమే రెగ్యులర్‌ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. మరో 290 మంది కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తుండగా.. 562 ఖాళీలున్నాయి. ప్రస్తుతం పనిచేస్తున్న 498 మంది సెలువుల్లేకుండా అవిశ్రాంతంగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఆదివారాలు కూడా సెలవుల్లేకుండా పనిచేస్తున్నారు. నిజానికి మూడ్రోజులు విధులు నిర్వర్తించి, మరో మూడ్రోజులు క్వారంటైన్‌లో ఉండాలనే డిమాండ్‌ ఎప్పటి నుంచో ఉన్నా.. సిబ్బంది కొరత నేపథ్యంలో అధికారులు కూడా ఏమీ చేయలేకపోతున్నారు.  ఇద్దరు ల్యాబ్‌ టెక్నీషియన్లు కొవిడ్‌-19 బారిన పడి ఛాతీ ఆస్పత్రిలో ఒకరు, వరంగల్‌ ఎంజీఎంలో మరొకరు మృతిచెందడంతో.. మిగతావారిలో భయాందోళనలు నెలకొన్నాయి. వైరస్‌ బారినపడే వైద్యులు, పారామెడికల్‌ సిబ్బందికి నిమ్స్‌లో మెరుగైన చికిత్సలు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. ఆ దిశగా చర్యలే లేవు.

రిస్క్‌ అలవెన్స్‌ ఇవ్వాలి
కరోనా వార్డుల్లో పనిచేసే ఇతర వైద్య సిబ్బందికి రిస్క్‌ అలవెన్స్‌ ఇస్తున్నారు. నమూనాల సేకరణ మొదలు, పరీక్షల దాకా ముందుండే ఎల్టీలకే కరోనా సోకే అవకాశాలు ఎక్కువ. అలాంటి మాకు రిస్క్‌ అలవెన్స్‌ ఇవ్వకపోవడం చాలా అన్యాయం. నెలకు రూ.3 వేల రిస్క్‌ అలవెన్స్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నాం. ఎల్టీలందరికీ క్వారంటైన్‌ సెలవులు ఇవ్వాలి. పీపీఈ కిట్లు, ఎన్‌-95 మాస్కులు ఇవ్వాలి.
– మంచాల రవీందర్‌
ఎల్టీల అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి

వారే కీలకం..
కరోనా నిర్దారణ పరీక్షలను సర్కారు మరింత విస్తృతం చేసింది. అందుకు తగ్గట్లుగా క్షేత్రస్థాయిలో ల్యాబ్‌ టెక్నిషీయన్లు లేరు. పీహెచ్‌సీల్లో నమూనాల సేకరణ, పరీక్ష, డేటా ఎంట్రీ వంటివన్నీ ఎల్టీలే చేస్తున్నారు. రోజూ రెండు షిఫ్టు (12 గంటలకోషిఫ్టు)ల్లో పనిచేస్తున్నారు. ఖాళీ పోస్టులు ఎక్కువగా ఉండటంతో.. ఉన్నవారిపైనే పనిభారం పడుతోంది.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates