పద్ధతి మారకపోతే వేటే

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • కొన్ని ఆస్పత్రుల తీరు మానవాళికే కళంకం
  • రోజుకు లక్ష, రెండు లక్షల చొప్పున బిల్లులా?

కరోనా చికిత్సను ప్రైవేటు ఆస్పత్రులు వ్యాపారకోణంలో చూడొద్దు. ఆ ఆస్పత్రులను చికిత్సకు అనుమతించిన ఉద్దేశం వేరు..  అయినా అవి అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. రోగుల్లో విశ్వాసం కల్పిస్తారని ఊహిస్తే, అక్కడ మరొకటి జరుగుతోంది.
– వైద్య శాఖ మంత్రి ఈటల

  • ప్రజలను భయపెట్టి డబ్బులు వసూలు చేస్తారా?
  • 10రోజుల పాటు ఆక్సిజన్‌ పెట్టినా రూ.2,500 అవ్వదు
  • లక్షలు కడితేనే మృతదేహాన్నిస్తామనడం హేయం
  • ఒకట్రెండురోజుల్లో 2-3 ఆస్పత్రులపై చర్యలు
  • ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి డబ్బులు వృధా చేసుకోవొద్దు
  • కార్పొరేట్‌లోనైనా గాంధీ ఆస్పత్రిలోనైనా చికిత్స ఒకటే
  • లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు.. వెంటనే చికిత్సకు రండి
  • లక్షణాలుంటే యాంటీజెన్‌, లేకపోతే ఆర్టీపీసీఆర్‌: ఈటల

హైదరాబాద్‌ : కరోనా చికిత్స పేరుతో లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న ఆస్పత్రులపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగులను బిల్లుల పేరిట ఆస్పత్రులు వేధింపులకు గురిచేస్తున్నాయని, భయపెట్టి ఫీజులు వసూలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ పద్ధతిని ప్రైవేటు ఆస్పత్రులు మార్పుకోవాలని, లేదంటే వేటు తప్పదని హెచ్చరించారు. లక్షలు కడితేనే మృతదేహాన్ని అప్పగిస్తామని ఆస్పత్రులు పట్టుబట్టడం అత్యంత హీనమైన చర్య అని అన్నారు. కొన్ని ఆస్పత్రులు వ్యవహరిస్తున్న తీరు మానవాళికే కళంకం తెచ్చే విధంగా ఉందని మండిపడ్డారు. విచారణ కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు ఒకట్రెండు రోజుల్లో రెండు మూడు ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.  వైరస్‌ వస్తే బెంబేలిత్తిపోయి ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లొద్దని ప్రజలకు సూచించారు. మంగళవారం కోఠీలోని కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి ఈటల మాట్లాడారు. కరోనా చికిత్సను ప్రైవేటు ఆస్పత్రులు వ్యాపారకోణంలో చూడొద్దన్నారు. ప్రైవేటు ఆస్పత్రులను చికిత్సకు అనుమతించిన ఉద్దేశం వేరని, ప్రైవేటు ఆస్పత్రులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

రోగుల్లో విశ్వాసం కల్పిస్తారని ఊహిస్తే, అక్కడ మరొకటి జరుగుతోందన్నారు. పది రోజులపాటు ఆక్సిజన్‌ పెట్టినా రూ.2500 ఖర్చుకాదని.. ప్రైవేటు ఆస్పత్రులు మాత్రం చికిత్స కోసం రోజుకు లక్ష, రెండు లక్షల దాకా వసూలు చేస్తున్నట్లు తమకు ఫిర్యాదు వస్తున్నాయన్నారు. ఆస్పత్రులను మూసేయాలన్నది తమ ఉద్దేశం కాదని, ఉన్న సేవల్ని తొలగించాలని తాము కోరుకోవడం లేదన్నారు. కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు సీవియర్‌ కేసులను తీసుకోవడం లేదని, చనిపోతారనుకున్న రోగులను చివరి నిమిషంలో గాంధీ ఆస్పత్రికి పంపుతున్నాయని పేర్కొన్నారు. డబ్బుల్లేని రోగులను కూడా సర్కారీ దవాఖానాలకు పంపుతున్నాయని వ్యాఖ్యానించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ కరోనా మరణాలు సంభవిస్తున్నాయని, వాటి వివరాలను కూడా తెలుపుతామన్నారు. ప్రైవేటు ఆస్పత్రులపై ఫిర్యాదులుంటే తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలను కోరారు. కరోనా సోకితే ప్రైవేటుకు వెళితే బతుకుతామని,  ప్రభుత్వ దవాఖానాకు వెళితే చనిపోతామని ప్రజలు అనుకోవడం సరికాదన్నారు. కరోనాకు చికిత్స కార్పొరేట్‌ ఆస్పత్రిలోనైనా, గాంధీలోనైనా ఒకే విధంగా ఉంటుందన్నారు.

నిర్లక్ష్యం వద్దు…
కరోనా అనుమానిత లక్షణాలుంటేనే యాంటీజెన్‌ టెస్టులు చేయించుకోవాలని, లక్షణాలు లేనివారు ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేయించుకోవాలని మంత్రి ఈటల సూచించారు. ఇప్పటికే ఐదు లక్షల టెస్టులు చేశామని, ఎన్ని లక్షల పరీక్షలైనా చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారన్నారు. వానాకాలం కావడంతో జలుబు, జ్వరం, దగ్గు లాంటివి వస్తాయని.. ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్థానిక పీహెచ్‌సీకి వెళ్లాలని సూచించారు. నిర్లక్ష్యం చేసి 4-5 రోజుల తర్వాత వస్తే తీవ్ర శ్వాసకోశ సమస్యలు సంభవించి.. ఊపిరి ఆడకుండా ఉక్కిరిబిక్కిరయ్యే పరిస్థితులు ఉత్పన్నమవుతాయని చెప్పారు. చికిత్సకు వెంటనే వస్తే ప్రాణాపాయం ఉండదన్నారు.  అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచామని, కరోనాకు వేసుకునే మందులు రూ.1000లోపే ఉంటాయన్నారు. ఎక్కడా ఆక్సిజన్‌కు కొరత లేదన్నారు. ప్లాస్మా బ్యాంకు ఏర్పాటుకు  సన్నహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. గాంధీ ఆస్పత్రికి వస్తున్నవారంతా సీరియస్‌ రోగులనేనని, అక్కడ మరో 355 పడకల్ని ఐసీయూగా మారుస్తున్నామని చెప్పారు.

కేంద్రాన్ని 1400వెంటిలేటర్లను కోరగా, 900 వరకు వచ్చాయన్నారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ ఆస్పత్రుల్లో కరోనా రోగుల్ని ఉంచామన్నారు. గ్రామీణ స్థాయిలో ఉండే ఆర్‌ఎంపీలకు కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని, వారివద్దకు కరోనా అనుమానిత లక్షణాలున్న వారు వస్తే చికిత్స అందించకుండా వెంటనే స్థానిక పీహెచ్‌సీకు పంపాలని కోరామన్నారు. గ్రామస్థాయిలోనే ఆశాల ద్వారా జ్వరబాధితులను గుర్తించి, పీహెచ్‌సీ స్థాయిలో టెస్టులు నిర్వహించి, అక్కడే చికిత్స అందిస్తున్నామని  వెల్లడించారు. ఇక రోజుకు 4 వేల టెస్టులు చేసే కోబాస్‌ మిషన్‌ త్వరలో రాష్ట్రానికి రానుందని మంత్రి తెలిపారు. కరోనాపై ఒక అంచనాకు వచ్చామని, భయపడవద్దని, అంటుకోగానే చంపే వైరస్‌ కాదన్నారు. కరోనాకంటే భయంకరమైన జబ్బులు వచ్చినా… ఈ స్థాయిలో ప్రచారం జరగలేదన్నారు.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates