కుబేరుల గుప్పెట్లోకి నల్ల బంగారం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

కేశవ్

మరో బతుకు పోరాటం కోసం…మరో ప్రపంచీకరణ వేటుకి వ్యతిరేకంగా, అస్థిరం కాబోతున్న శ్రామిక జీవితాలకు బాసటగా నిలవడం కోసం…మరో నినాదంతో బొగ్గు గనుల కార్మికవర్గం సిద్ధం అవుతున్నట్టుంది. అందులో భాగంగానే జూలై 3న నిరసన కార్యక్రమం కొనసాగింది. కేంద్ర ప్రభుత్వం గనుల ప్రైవేటీకరణకు చేపట్టిన నూతన సంస్కరణలకు వ్యతిరేకంగా సమ్మె కొనసాగింది. మోడీ ప్రభుత్వం ప్రపంచీకరణ కొరడాని పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకుల మీదా, పబ్లిక్‌ సెక్టార్‌ పరిశ్రమల మీదా విజయవంతంగా దులిపేసి, ఆయా పరిశ్రమలను, కార్మికుల జీవితాలను అస్థిరతకు గురిస్తోంది. అదే బాటలో నేడు గనులనూ, రైల్వేనూ కార్పొరేట్లకు వేలంపాట కోసం సిద్ధం చేస్తోంది. కరోనా కష్టకాలంలో సాధారణ ప్రజల జీవితాలు ఛిన్నాభిన్నం అవుతుంటే, మరోపక్క ఎంతో ప్రణాళికాబద్దంగా, అత్యంత లాభాల్లో ఉన్న బొగ్గు గనుల్ని మెల్లమెల్లగా ప్రైవేట్‌ చేతుల్లోకి పంపించెయ్యాలని చూస్తోంది.

 జాతీయీకరణ కార్మికుల హక్కు
ఒక పరిశ్రమ అయినా, పారిశ్రామిక రంగమైనా ప్రభుత్వం చేతుల్లోకి వెళ్ళడానికి వెనుక నిరంతరం శ్రామికవర్గం కృషి ఉంటుంది. ట్రేడ్‌ యూనియన్‌ పోరాటం ఉంటుంది. బ్యాంకులయినా, పరిశ్రమలయినా, రైల్వే అయినా, గనులయినా, విద్యా రంగం అయినా, వైద్యం అయినా జాతీయం అవ్వడానికి వెనుక ప్రజల హక్కుల సాధన ఉంటుంది. సంక్షేమ రాజ్యాల, ప్రజాస్వామ్య ప్రభుత్వాల బాధ్యత ఉంటుంది. ఏ రంగమయినా జాతీయం చెయ్యడం అంటేనే, ప్రజలకు న్యాయమైన జీవితం ఇవ్వడం. పెట్టుబడిదారుల దోపిడీ నుండి శ్రామికులను విడగొట్టి కాస్తయినా న్యాయమైన జీతం, మెడికల్‌ బెనిఫిట్లు, ఉద్యోగ విరమణ బెనిఫిట్లు, వేజ్‌ సెటిల్‌మెంట్లు వంటి మరెన్నో హక్కుల సాధన ఉంటుంది. వీటి నుంచి వైదొలగడం అంటేనే ప్రభుత్వాలు తమ బాధ్యతను విస్మరించడం. ‘సంక్షేమం’ నుండి ‘మార్కెటీకరణ’కు పయనించడం. సుస్థిరత నుండి అస్థిరత వైపుగా పయనించడం. ఒక సంస్థ జాతీయం అయి ప్రభుత్వం చేతులో ఉండడం ఒక సంస్థ ప్రైవేటు పెట్టుబడిదారుడి చేతుల్లోకి పోవడం ఆర్థికంగా ఒకే విధమైన ఫలితాలను ఇవ్వదు. రెండు రంగాల్లోనూ శ్రమ దోపిడీ ఉన్నప్పటికీ పబ్లిక్‌ సెక్టార్‌లో కనీసంగానైనా లభించే ఉద్యోగ హక్కులు, బెనిఫిట్లు, పెన్షన్‌ లాంటి ఎన్నో హక్కులు ప్రైవేటు రంగంలో కనుమరుగవుతాయి. సరిగ్గా బొగ్గు గనుల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బొగ్గు గనులను కార్పొరేట్లకు మెల్లమెల్లగా అందివ్వడంలో సహకరిస్తుంది.

బొగ్గు గనుల్లో ప్రపంచీకరణ పవనాలు
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం ముందుగా 41 బొగ్గు గనులు వేలంపాటకు సిద్ధమవుతాయి. ఇవి దాదాపుగా 16980 మిలియన్‌ టన్నుల నిధులు. ఇవి మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, మహారాష్ట్రలో ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లో 11, ఛత్తీస్‌గఢ్‌లో 9, జార్ఖండ్‌లో 9, మహారాష్ట్రలో 9 బొగ్గు బ్లాకులు ముందుగా వేలంపాటకు సిద్ధమవుతాయి. ఈ పర్వం విజయవంతమయితే, ముందుగా మరో 500 బొగ్గు బ్లాకులు ఇలానే వేలంపాటకు సిద్ధమవుతాయి. అంటే, ఒక్క మాటలో ప్రభుత్వం చేతులు దులుపుకొని…మార్కెట్‌ మంత్రాలు జపించడంతో ఇవి దేశ, విదేశీ పెట్టుబడుల హస్తాల్లోకి వెళ్ళిపోతాయి. ఇప్పటికే 30 శాతం భూగర్భ గనులు, 80 శాతం ఓపెన్‌ కాస్ట్‌ గనుల ప్రైవేటీకరణ జరిగింది.

బొగ్గు గనులు మొదట్లో ప్రైవేటు పెట్టుబడిదారుల చేతుల్లో ఉండేవి. వీరి చేతుల్లో శ్రామిక వర్గం అత్యంత దోపిడీకి గురయింది. వేదనాభరితమైన జీవితాన్ని అనుభవించింది. నల్ల బంగారాన్ని దేశానికీ ప్రపంచానికీ అందించింది. అయితే బొగ్గు గనులను మరింత సమర్థవంతంగా నిర్వహించడంలో భాగంగా 1956లో నేషనల్‌ కోల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌సిడిసి) ఏర్పడింది. 1971-72లో కుకింగ్‌ కోల్‌ జాతీయీకరణ చేస్తూ చట్టం వచ్చింది. ఇదే దిశలో మరింత ముందుకుపోయి 1973లో బొగ్గు గనుల జాతీయీకరణ చట్టం వచ్చింది. దేశంలోని బొగ్గు గనులన్నీ జాతీయం అయ్యాయి. బొగ్గు గనుల శ్రామికుల, పనివేళలు, వేతనాలు, ఇతర సదుపాయాలు మెల్లమెల్లగా క్రమబద్ధం అయ్యాయి. దేశం మొత్తం బొగ్గు గనుల్ని నిర్వహించే కోల్‌ ఇండియా కార్పొరేషన్‌ రూ.50 వేల కోట్ల పైచిలుకు టర్నోవర్‌తో నవరత్న కంపెనీగా రూపొందింది. ప్రపంచంలోని 6 పెద్ద కంపెనీలలో ఒకటిగా గుర్తింపు పొందింది.

ఇదే నేపథ్యంలో సింగరేణి కూడా ముందుకు నడిచింది. ఏటా 62 మిలియను టన్నుల బొగ్గును వెలికితీస్తుంది. మొత్తం బొగ్గులో 85 శాతం థర్మల్‌ విద్యుత్తు కేంద్రాలకూ మిగతా 15 శాతం బొగ్గు సిమెంటు ఫ్యాక్టరీలకూ అందుతోంది. సింగరేణి కంపెనీలో కేంద్రం వాటా 49 శాతం. రాష్ట్రం వాటా 51 శాతం. ఈ కంపెనీ ఆధ్వర్యంలో 48 బొగ్గు గనులున్నాయి. 29 అండర్‌ గ్రౌండ్‌ బొగ్గు గనులయితే, 19 ఓపెన్‌ కాస్ట్‌ గనులు. దాదాపుగా 50 వేల మంది కార్మికులు ఈ గనుల మీద ఆధారపడి జీవిస్తున్నారు. భారతదేశ జీడిపీలో 9.2 శాతాన్ని సింగరేణి ఒక్కటే అందిస్తోంది. అత్యంత ప్రతిభావంతంగా నిర్వహించబడుతున్న ఈ సింగరేణి కూడా మున్ముందుకు దేశీయ, విదేశీ పెట్టుబడిదారుల చేతుల్లోకి పోతుందేమో అనే భయం సింగరేణి కార్మికుల్లో కూడా చోటుచేసుకోవడమే వీరి సమ్మెలకు కారణం.

నయా ఉదారవాద విధానాల ఊబిలో…
ఆర్థిక సంస్కరణలు, ఆర్థిక సరళీకరణలు మొదలైన కొత్త పేర్లతో ప్రభుత్వాలు అంతర్జాతీయ సంస్థల నుండి విపరీతంగా రుణాలు తేవడం ఆయా సంస్థల సిఫారసులకు తలొగ్గడం కొనసాగుతూనే ఉంది. అంతర్జాతీయ పెట్టుబడికి రెక్కలొచ్చి భారతదేశం లాంటి దేశాల మీద పడి వాటికనుకూలంగా అక్కడి సంక్షేమ రాజ్యాల నియమాలను మార్చే ప్రక్రియ నడుస్తోంది. జాతీయీకరణ, పబ్లిక్‌ సెక్టార్‌ పరిశ్రమలు, సబ్సిడీలు నయా ఉదారవాదానికి గిట్టనివి. ప్రభుత్వాలు పరిశ్రమలను మార్కెట్‌ సూత్రాలకు అనుగుణంగా విడిచిపెట్టాలనేది నయా ఉదారవాదం నీతి. దాని ప్రకారం ప్రభుత్వాలు పరిపాలనా నిర్వహణ తప్ప పరిశ్రమలను తల మీద వేసుకోకూడదు. మార్కెట్‌ మంత్రాలకు విడిచిపెట్టి నూటికి నూరు శాతం విదేశీ పెట్టుబడులకు ఎర్రతివాచీ పరచాలి. ఈ విధానంలో భాగంగానే పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకులను మెల్లమెల్లగా బలహీనం చేశారు. బ్యాంకుల్లోని ప్రజాధనం రుణాల రూపంలో కార్పొరేట్లకు చేరి బ్యాంకుల ఎన్‌పీఏ లు పెరిగాయి. మరోవైపు జియో ఉచిత ఇంటర్నెట్‌ కానుకల ఫలితంగా, దేశీయ బీఎస్‌ఎన్‌ఎల్‌ దివాళా తీసింది. వేలకొలది శ్రామికులు స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణకు దరఖాస్తు చేసే పరిస్థితి వచ్చింది. ఇక కాస్తా కూస్తా పని చేస్తోన్న చిన్న పెట్టుబడిదారులు ఓడా ఫోన్‌, ఎయిర్‌టెల్‌, ఐడియా వంటివి ‘జియో’ కొత్త అవతారం ముందు చిరునామా కోల్పోయాయి. సుప్రీంకోర్టులో కోట్లకొలది చెల్లింపుల కోసం కేసు నడుస్తోంది. ఆయా సంస్థల వేలాది ఉద్యోగులు అస్థిరతకు గురయ్యారు. అత్యంత సమర్థవంతంగా నడుస్తోన్న ఇండియన్‌ రైల్వేల్లో కూడా ఈ ఉదారవాద సరళీకరణలు ప్రవేశించాయి.

జాతీయ అంతర్జాతీయ పెట్టుబడుల కోరల్లోకి మెల్లమెల్లగా దేశీయ కంపెనీలు ప్రవేశిస్తున్నాయి. కుబేరులను మరింత కుబేరులుగాను…పేదలను మరింత పేదలుగా మార్చెయ్యబోతున్నాయి. జోరుగా, హుషారుగా, ప్రణాళికాబద్దంగా, అమ్ముడుపోయిన మెజారిటీ ఎలాక్ట్రానిక్‌ మీడియా దన్నుతో, ముందుకు నడుస్తోన్న ప్రపంచీకరణ పవనాలను అర్థం చేసుకోవడం, చైతన్యవంతమై నిలువరించడం ద్వారా మాత్రమే సమస్యలు సరైన దిశలో పరిష్కారం కాగలవు.

Courtesy Prajashakti

RELATED ARTICLES

Latest Updates