తగ్గిన ఆదాయాలు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
ప్రభాత్‌ పట్నాయక్‌
ప్రభాత్‌ పట్నాయక్‌

కరోనా మహమ్మారి విజృంభణ, దానితో వచ్చిన లాక్‌డౌన్‌ ఫలితంగా మన దేశ జిడిపి చాలా పెద్దఎత్తున పడిపోతున్నది. అయితే మన దేశ ఆర్థిక వ్యవస్థలో అంతకు ముందునుంచే చాలామంది శ్రామిక ప్రజల ఆదాయాలు పడిపోతున్న వాస్తవం మనం విస్మరించకూడదు. దీనిని సూచించే పలు పరిణామాలు మన ముందున్నాయి.

మామూలుగా ప్రతి ఏడూ రెండు లేక మూడు శాతం చొప్పున పెరుగుతూ వచ్చే నిరుద్యోగం 2018-19 నాటికి ఏకంగా 6 శాతానికి చేరింది. ఇది గత 45 సంవత్సరాలలోకెల్లా అత్యధికం. ఇక గ్రామీణ ప్రాంతంలోని ప్రజల తలసరి ఖర్చు (2017-18 లో చేసిన జాతీయ సర్వే ప్రకారం) 2011-12 తో పోల్చినప్పుడు 9 శాతం తగ్గింది. మన దేశంలో అత్యధిక శాతం ప్రజలు గ్రామాల్లో ఉంటున్నారు. వీరు పెట్టే ఖర్చు ఇంత భారీగా తగ్గడం ఇంతకు ముందెన్నడూ లేదు. ఈ సర్వే ఫలితాలు ఎంత ఆందోళన కరమైనవంటే కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆ సర్వే ఫలితాలను మరుగుపరిచేందుకు పూనుకుంది. ఆ సర్వే ఫలితాలు నమ్మదగ్గవిగా లేవంటూ ఒక వివరణ ఇచ్చింది. మన దేశంలో ఒక క్రమ వ్యవధిలో నిర్వహించే ఈ సర్వే ప్రపంచంలోనే అతి పెద్ద శాంపిల్‌ సర్వే. దశాబ్దాలుగా ఈ ప్రక్రియ మన దేశంలో సాగుతోంది. ఇందులో ఇంకా చాలా పరిమితులు వుండొచ్చుగాక. కాని ఇన్ని సంవత్సరాలుగా పనికొచ్చిన ఈ తరహా సర్వే ఈ ఒక్కమారూ నమ్మదగ్గదిగా లేదనడం అర్ధంలేదు. దీనిని బట్టి మన దేశ ఆర్థిక వ్యవస్థలో చాలా తీవ్రమైన పరిణామాలేవో జరుగుతున్నాయని అనిపిస్తోంది. ఆ వివరాలు ప్రజలకు తెలియకుండా దాచిపెట్టాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది.

మన ఆహార ఆర్థిక వ్యవస్థలో ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు ఈ వాస్తవాన్ని స్పష్టం చేస్తున్నాయి. నయా ఉదారవాద విధానాలు మన దేశంలో అమలు జరగడం మొదలైనప్పటి నుంచీ – అంటే 1991 నుంచీ ఇప్పటిదాకా మన దేశ జనాభా ఏ మేరకు పెరుగుతూ వచ్చిందో దాదాపు అంతే మేరకు మన ఆహార ధాన్యాల ఉత్పత్తి కూడా పెరుగుతూ వచ్చింది. 1991 నుంచి 2018 మధ్య కాలంలో జనాభా ప్రతి ఏడూ 1.6 శాతం చొప్పున పెరుగుతూ వస్తే ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరుగుదల 1.8 శాతం చొప్పున పెరిగింది. ఇక్కడ మనకి రెండు రకాల ధోరణులు ఆసక్తి కలిగించేవి కనపడుతున్నాయి. ఈ కాలంలో భారతీయ ఆహార సంస్థ (ఎఫ్‌సిఐ) సేకరించే ఆహారధాన్యాల శాతం పెరుగుతూ వచ్చింది. మరీ ముఖ్యంగా 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత కాలంలో మరీ ఎక్కువగా పెరిగింది. 1991 నాటికి ఉత్పత్తి అయిన మొత్తం ఆహార ధాన్యాలలో కేవలం 12.7 శాతం మాత్రమే సేకరించిన ఎఫ్‌సిఐ 2017 నాటికి ఏకంగా 29.6 శాతం సేకరించింది. 2001 -2008 మధ్య కాలంలో సగటున 22.4 శాతం సేకరిస్తే 2012-2017 మధ్య అది 28.5 శాతానికి పెరిగింది. ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు వంటి వ్యవసాయ సరుకుల వ్యాపారంలో అంతకంతకూ ఎక్కువగా పట్టు పెంచుకుంటున్న ప్రైవేటు పెట్టుబడిదారులు దేశీయ ఆహార ధాన్యాల వ్యాపారంలో మాత్రం అంతకంతకూ ఆసక్తి కోల్పోతూ వస్తున్నారు.

ఇక రెండవ అంశం-మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తితో పోల్చితే ప్రభుత్వం దగ్గర నిల్వ ఉండే ఆహార ధాన్యాల శాతం కొట్టవచ్చినట్టుగా పెరుగుతూ వస్తోంది. మామూలుగా అవసరమైన నిల్వల కన్నా ఇది బాగా ఎక్కువగా ఉండడమే గాక అది కూడా వేగంగా పెరుగుతోంది. 2017 జూన్‌ నెలలో 5 కోట్ల 57 లక్షల టన్నుల నిల్వలుంటే 2018 జూన్‌లో అది 6 కోట్ల 81 లక్షల టన్నులకు, 2018 జూన్‌ లో 7 కోట్ల 43 లక్షల టన్నులకు, 2019 జూన్‌ లో 8 కోట్ల 35 లక్షల టన్నులకు పెరుగుతూ వచ్చింది. నికర ఉత్పత్తి పెరిగిన దానికన్నా చాలా ఎక్కువ వేగంగా నిల్వల పెరుగుదల ఉంది. మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో 25 శాతం దాకా నిల్వలు ఉంటున్నాయి. ఇదే 1970 దశకంలోనైతే 12 శాతం, 1990 దశకంలో 15 శాతం వరకు నిల్వలు ఉండేవి.

అటు ప్రభుత్వ సేకరణ శాతం పెరగడం, ఇటు నిల్వలు పెరగడం- ఈ రెండూ పరస్పరం సంబంధం కలిగి వున్నాయి. మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌ కన్నా ఎక్కువగా ఆహార ధాన్యాల సప్లై ఉన్నదని ప్రభుత్వం దగ్గర పేరుకుపోతున్న నిల్వలు సూచిస్తున్నాయి. అందువల్లే ప్రైవేటు వ్యాపారులకు ఈ ఆహారధాన్యాల వ్యాపారం అంత ఉత్సాహం కలిగించడం లేదు. డిమాండు లేనప్పుడు పెద్దఎత్తున స్టాక్‌ నిల్వ ఉంచుకోడం వారికి దండగమారిపని. అందుకే ఆ పనేదో ప్రభుత్వమే చేయడం మంచిదని వారు వదిలిపెట్టారు. పైగా వారు కొనుగోలు చేసే భాగాన్ని కూడా తగ్గించుకున్నారు. దాంతో ప్రభుత్వం సేకరణ పెరగక తప్పలేదు.
జనాభా పెరిగిన రేటుకన్నా ఆహారధాన్యాల ఉత్పత్తి రేటు పెరుగుదల పెద్దగా ఎక్కువేమీ లేదు.

అటువంటప్పుడు ఆహారధాన్యాల మార్కెట్‌లో ఈ సప్లై అదనంగా ఎక్కడి నుంచి వచ్చిందన్నది ఇక్కడ మనకు ఎదురయ్యే ప్రశ్న. ఒకవైపు నయా ఉదారవాద కాలంలో మన ఆర్థిక వ్యవస్థ అంతకుముందు కాలంలో ఉండిన దానికన్నా చాలా ఎక్కువ వేగంగా పెరుగుతూ వచ్చిందని నయా ఉదారవాదులంతా తెగ సంబరపడుతున్నారు. దానర్థం తలసరి ఆదాయం పెరుగుతోందని, అంటే తలసరి ఆహారధాన్యాల వినిమయం కూడా పెరుగుతోందని భావించాలి కదా. కాని ఆహార ధాన్యాల డిమాండ్‌ తగ్గడమేమిటి? ఇక్కడ నయా ఉదారవాద సమర్థకులు ఒక వాదన ముందుకు తెస్తున్నారు. ఆదాయాలు పెరగడంతో మన ఆహారంలో తీసుకునే ఆహారధాన్యాల భాగం తగ్గి పాలు, మాంసకృత్తులు భాగం పెరిగిందని, అందుకే ఆహార ధాన్యాల వినిమయం తగ్గిందని వారి వాదన. ఈ వాదన సరికాదు. ఒకవేళ పాలు, మాంసం వినిమయం పెరిగినా, వాటిని ఉత్పత్తి చేయడానికైనా ఈ ఆహార ధాన్యాలు ఎక్కువగా వినియోగించాల్సిందే. ఫాస్ట్‌ఫుడ్స్‌ వంటి వినియోగం పెరిగినా వాటికీ ముడిసరుకుగా ఈ ఆహారధాన్యాలు ఉపయోగించాల్సిందే. నిజానికి ప్రపంచంలో ఏ దేశంలోనైనా సరే, తలసరి ఆదాయాలు పెరిగినప్పుడల్లా తలసరి ఆహార ధాన్యాల డిమాండ్‌ పెరిగిందే తప్ప తగ్గలేదు- ఒక్క మన దేశంలో తప్ప.

మన దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి పెద్దగా పెరిగిందేమీ లేదు. నయా ఉదారవాద సమర్థకులు చెప్పుకుంటున్నట్టు తలసరి ఆదాయాలు బాగా పెరిగాయనుకుంటే మార్కెట్‌లో ఆహార ధాన్యాల డిమాండ్‌ బాగా పెరిగి వుండాలి. కాని దానికి పూర్తి విరుద్ధంగా డిమాండ్‌ ఎందుకు తగ్గింది? ప్రపంచంలో ఆహార ధాన్యాల మార్కెట్‌లో మన దేశం తరచూ ఎగుమతులకు ఎందుకు పూనుకుంటోంది?
మన జిడిపి పెరుగుదల రేటు ఎక్కువగా ఉన్న మాట నిజమే. కాని అదే సమయంలో శ్రామిక ప్రజల తలసరి ఆదాయం మాత్రం పెరిగిందేమీ లేదు. నిజానికి ఇటీవల కాలంలో వారి తలసరి ఆదాయాలు పడిపోయి వుండాలి. అందుకే ప్రభుత్వం దగ్గర ఆహారధాన్యాల నిల్వలు బాగా పెరిగింది కూడా ఇటీవల కాలంలోనే.

ఈ నయా ఉదారవాద కాలంలో శ్రామిక ప్రజల తలసరి ఆహారధాన్యాల వినియోగం బాగా తగ్గివుండాలి. దేశ ప్రజలందరి సగటు లెక్కవేసి చూస్తే తలసరి ఆహారధాన్యాల లభ్యతలో 1991 నుంచీ ఇప్పటిదాకా పెద్దగా మార్పేమీ లేదు. 1991లో 510 గ్రాములు లభిస్తే 2018లో 494 గ్రాములు లభించాయి. మధ్యలో 2007లో కాస్త తగ్గి 442 గ్రాములు మాత్రమే లభించాయి. అయితే ఈ కాలంలో ఆదాయాల్లో వ్యత్యాసాలు మాత్రం విపరీతంగా పెరిగాయి. సంపన్నుల వద్ద ఆదాయం పెరుగుతూ వస్తే పేదల ఆదాయం తగ్గుతూ వచ్చింది. సంపన్నులు వినియోగించిన ఆహారధాన్యాల భాగం కూడా బాగా పెరిగి వుండాలి. ఆ మేరకు పేదల ఆహార వినియోగం తగ్గి వుండాలి. వారి ఆహార వినియోగం తగ్గిందంటే వారి ఆదాయాలు తగ్గి వుండాలి.

పౌష్టికాహార లభ్యతకు సంబంధించిన గణాంకాలు ఈ వాస్తవాన్ని ధృవపరుస్తున్నాయి. గ్రామీణ ప్రాంతంలో…తలసరి రోజుకు 2200 కేలరీల పోషకాహారం లభిస్తున్న వారు 1993-94లో 42 శాతం ఉంటే 2011-12లో 32 శాతం మాత్రమే ఉన్నారు. అదే పట్టణ ప్రాంతాల్లో రోజుకు తలసరి 2100 కేలరీల పోషకాహారం పొందగలిగినవారు 1993-94లో 43 శాతం ఉంటే 2011-12 వచ్చేసరికి 35 శాతం మాత్రమే ఉన్నారు.

2011-12 తర్వాత పరిస్థితి ఇంకా దిగజారింది. నిజానికి దేశ ప్రజలందరికీ సగటున తలసరి రోజువారీ ఆహార ధాన్యాల లభ్యత 2012లో 463.8 గ్రాములు ఉంది. ఆ తర్వాత సంవత్సరాల్లో వరుసగా 491.9, 489.3, 465.1. 486.8, 488.7, 494.1 గ్రాములు 2018 వరకు లభ్యత ఉంది. అయితే సంపన్నులకు, పేదలకు మధ్య ఆదాయాల్లో తేడాలు బాగా పెరిగిపోతూ వచ్చింది కూడా ఈ కాలంలోనే.

మోడీ ప్రభుత్వ హయాంలో ఈ వ్యత్యాసాలు ఇంకా వేగంగా పెరుగుతూ వస్తున్నాయి. అందుచేత శ్రామిక ప్రజల ఆహారధాన్యాల వినియోగం కూడా తగ్గుతూ వస్తోంది. వారి ఆదాయాలు బాగా తగ్గిపోవడం తప్ప ఇందుకు వేరే కారణమేమీ లేదు. ఇటీవల బాగా పెరిగిన నిరుద్యోగం, గ్రామీణ ప్రాంతాల్లో 2011-18 మధ్య కాలంలో తలసరి వినిమయం తగ్గిన వైనం దీనికి తార్కాణాలు.

ఈ పరిస్థితుల్లో ప్రజల చేతుల్లో అదనంగా డబ్బు ఉండేలా చేసి వారి వినిమయ శక్తిని పెంచాల్సినది పోయి మోడీ ప్రభుత్వం అదనపు ఆహారధాన్యాల నిల్వలను ఎథనాల్‌ తయారీకి మళ్ళించాలని పథకాలు రూపొందిస్తోంది. అయితే మోడీ ప్రభుత్వ ధోరణిని బట్టి ఇదేమీ ఆశ్చర్యం కలిగించే విషయం మాత్రం కాదు.

Courtesy Prajashakti

RELATED ARTICLES

Latest Updates