బిల్లు చెల్లించలేదని మృతదేహం అప్పగించని ఆస్పత్రి

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

 హైకోర్టును ఆశ్రయించిన బాధితుడు
 వెంటనే అప్పగించేలా చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశం

హైదరాబాద్‌: కరోనాతో చనిపోయిన ఓ మాజీ సైనికుడి మృతదేహాన్ని బాధిత కుటుంబానికి వెంటనే అప్పగించేలా చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. మాజీ సైనికుడు రామ్‌కుమార్‌ శర్మ గత నెల 24న కరోనాతో సికింద్రాబాద్‌లోని సన్‌షైన్‌ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. అయితే బిల్లు చెల్లించలేదన్న కారణంగా మృతదేహాన్ని ఇవ్వడానికి ఆస్పత్రి యాజమాన్యం నిరాకరించిందంటూ ఆయన కుమారుడు నవీన్‌కుమార్‌ శర్మ సోమవారం సెలవు కావడంతో హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌ విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది ప్రతాప్‌ నారాయణ్‌ సంఘి వాదనలు వినిపిస్తూ.. కరోనా చికిత్స నిమిత్తం ఆస్పత్రి రూ.8,68,832 బిల్లు వేసిందన్నారు. బాధితుడు ఆదివారం సాయంత్రం 4.40 గంటల ప్రాంతంలో మృతి చెందినప్పటికీ బిల్లు మొత్తం చెల్లించేదాకా మృతదేహాన్ని అప్పగించబోమన్నారని తెలిపారు.

అప్పటికే రూ.4 లక్షలు చెల్లించామని.. మాజీ సైనికులకు కేంద్ర ప్రభుత్వ బీమా ఉంటుందని, దాన్ని ఆస్పత్రి యాజమాన్యం అంగీకరించలేదని చెప్పారు. మొత్తం బిల్లు చెల్లించేవరకు మృతదేహాన్ని ఇవ్వడానికి నిరాకరించిందన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ సహాయ న్యాయవాది ఎ.మనోజ్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ పిటిషనర్‌ నుంచి పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. పిటిషన్‌ దాఖలు చేయడంతోనే సమాచారం అందిందన్నారు. కొవిడ్‌తో రామ్‌కుమార్‌ శర్మ మృతి చెందగా ఆస్పత్రివర్గాలు ఆదివారమే పోలీసులకు సమాచారమిచ్చాయని, మృతుడి బంధువులకు ఫోన్‌ చేసినా ఎవరూ స్పందించలేదని చెప్పారు. వాదనలను విన్న న్యాయమూర్తి మృతదేహాన్ని వెంటనే అప్పగించేలా చర్యలు తీసుకోవాలని రామ్‌గోపాల్‌పేట పోలీసులకు, వైద్యఆరోగ్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నిర్దిష్ట మొత్తం కంటే ఎక్కువ ఛార్జీల వసూలు, కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకం వర్తింపజేయకపోవడంపై వివరాలు తెలుసుకోవాల్సి ఉందని.. అందువల్ల కేంద్ర ప్రభుత్వాన్నీ ప్రతివాదిగా చేర్చుతూ ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ విచారణను సెప్టెంబరు 11కు వాయిదా వేశారు.

Courtesy Eenadu

RELATED ARTICLES

Latest Updates