విప్లవ కవి వంగపండు కన్నుమూత

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

విజయనగరం: ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు (77) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విజయనగరం జిల్లా పార్వతీపురం వైకేఎంనగర్‌లోని తన నివాసంలో గుండెపోటుతో కన్నుమూశారు.

మూడు దశాబ్దాల పాటు 300కు పైగా జానపదపాటలు రచించిన వంగపండు.. పేద ప్రజలు, గిరిజనులను ఎంతో చైతన్య పరిచారు. విప్లవ కవిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు పొందారు. 1943లో పార్వతీపురం సమీపంలోని పెదబొండపల్లిలో జన్మించిన వంగపండు ‘అర్ధరాత్రి స్వాతంత్ర్యం’ సినిమాతో సినీప్రస్థానం ప్రారంభించారు. ‘ఏం పిల్లడో ఎల్దమొస్తవ’ పాటతో ఉర్రూతలూగించారు. ఉత్తరాంధ్ర జానపదాలకు గజ్జెకట్టి ఆడిపాడారు. 1972లో పీపుల్స్‌ వార్‌ సాంస్కృతిక విభాగం అయిన జననాట్యమండలిని స్థాపించారు. ఉత్తరాంధ్ర గద్దర్‌గా పేరు తెచ్చుకున్న  వంగపండు 2017లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి కళారత్న పురస్కారం అందుకున్నారు. 30కి పైగా సినిమాలకు పాటలు రాశారు. ఉత్తరాంధ్ర జానపదానికి కాణాచిగా నిలిచిన వంగపండు చివరి వరకు  జన పదమే.. జానపదమని నమ్మారు.విప్లవ కవి వంగపండు మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు.

వంగపండు మృతికి  సీఎం సంతాపం
ప్రజాకవి వంగపండు ప్రసాదరావు మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. వంగపండు ఇక లేరన్న వార్త ఎంతో బాధించిందని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. ఉత్తరాంధ్ర ఉద్యమానికి వంగపండు అక్షర సేనాధిపతిగా పనిచేశారని గుర్తు చేశారు. తెలుగువారి సాహిత్య కళారంగాల చరిత్రలో మహాశిఖరంగా నిలిచిపోతారని కొనియాడారు. వంగపండు కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

చంద్రబాబు, లోకేశ్‌ సంతాపం
వంగపండు మృతి పట్ల తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్‌ సంతాపం తెలిపారు. ‘‘వంగపండు తన సాహిత్యం ద్వారా తెలుగు ప్రజలను జాగృతం చేశారు. తన గొంతు, పదాలతో అశేష ప్రజానీకాన్ని ఉర్రూతలూగించారు. ప్రజా చైతన్యానికి వంగపండు ఎనలేని కృషి చేశారు. ఆయన సాహిత్యం అనేక భాషల్లోకి అనువదించడం తెలుగు జాతికే గర్వకారణం. వంగపండు మృతి తెలుగు జానపద సాహిత్య లోకానికి తీరని లోటు. చివరి శ్వాస వరకు గొంతెత్తి వదల జానపదాలకు గజ్జెకట్టారు. ఆయన మృతి ప్రజా ఉద్యమాలకు తీరని లోటు’’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు.

Courtesy Eenadu

RELATED ARTICLES

Latest Updates