అవి సర్కారీ హత్యలే….

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

-సకాలంలో వైద్యమందక కరోనాతో ప్రముఖుల మరణాలు
– ప్రాణాలు కోల్పోతున్న వారియర్లు

హైదరాబాద్‌: కరోనా తీవ్రమైన, ప్రాణాంతకమైన వ్యాధి కాదు. 80 శాతం మందికి పైగా వారికి వారే కోలుకుంటారు. మరో 15 శాతం మందికి సాధారణ చికిత్స సరిపోతుంది. ఇక మిగిలిన ఐదు శాతంలోపున్న వారికి మాత్రమే సకాలంలో వైద్యం అందించగలిగితే ప్రాణాపాయస్థితి నుంచి తప్పించే అవకాశమున్నది. అయినా ప్రతి రోజూ మరణాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. సామాన్యులతో పాటు ప్రముఖులు, వారియర్స్‌ కూడా మత్యువాత పడుతున్నారు. కరోనాతో ఎవరికి ఎక్కువ ప్రమాదమో గుర్తించిన వైద్యారోగ్యశాఖ ఆ మేరకు ప్రజలను జాగ్రత్తగా ఉండాలని చెబుతూ వస్తున్నా, ఆ మేరకు ప్రభుత్వపరంగా తగిన చర్యలు తీసుకోకపోవడంతో ఇంకా మరణాలు కొనసాతున్నాయనేవిమర్శలున్నాయి. పదేండ్లలోపు చిన్నారులు, 60 ఏండ్లపైబడ్డ వయస్సులో ఉన్నవారు, హైపర్‌ టెన్షన్‌, మధుమేహం, గుండె, మూత్రపిండాలు, శ్వాసకోశ తదితర జబ్బులున్నవారికి కరోనా సోకితే అత్యవసర పరిస్థితి ఏర్పడే ప్రమాదముందని చెబుతున్నారు. కరోనాతో మరణించిన వారిలో 53.87 శాతం మంది ఇతర వ్యాధులున్న వారున్నట్టు ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి.

కరోనాతో ఇప్పటికే జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ సభ్యులు, హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షులు సర్వేశ్వర్‌ రావు, ప్రజానాట్యమండలికి చెందిన ప్రముఖ జానపద కళాకారులు నిస్సార్‌, బహుజన ఉద్యమకారులు ఉ.సాంబశివరావు, బాలల హక్కుల సంఘం అధ్యక్షులు అచ్యుతరావు మరణించిన సంగతి తెలిసిందే. వీరే కాకుండా నగరానికి చెందిన బంగారు నగల వ్యాపారులిద్దరు, సీనియర్‌ ఫిజిషియన్‌, చెస్ట్‌ ఆస్పత్రిలో వారం రోజుల్లో పదవీ విరమణ చేయాల్సిన హెడ్‌ నర్సు, వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో సీనియర్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌ తదితరులు కూడా ప్రాణాలు కొల్పోయారు. పోలీసు, మీడియా విభాగాల్లోనూ మరణాలు చోటు చేసుకున్నాయి. పలువురు సకాలంలో టెస్టులు చేయకపోవడం, చేసిన టెస్టులకు రిపోర్టులు కూడా వెంటనే ఇవ్వకపోవడం, రిపోర్టులు వచ్చాక ఆస్పత్రులు చేర్చుకునేందుకు నిరాకరించడంతో పుణ్యకాలం కాస్తా గడిచిపోయి మత్యువాత పడ్డట్టు తెలుస్తున్నది. ఒకవైపు వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, ఆలస్యమే ప్రాణాలు తీస్తున్నది. లక్షణాలు కనిపించిన వెంటనే టెస్టులు చేయించుకుని, తగిన చికిత్స చేయించుకోవాలని పదే పదే కోరుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు తగ్గ పరిస్థితులు కల్పించకపోవడంతో ఒకరి తర్వాత మరొకరన్నట్టు మత్యు ఒడిలోకి చేరిపోతున్నారు.

ప్రజలకు తగిన జాగ్రత్తలు చెబుతూ వైద్యారోగ్యశాఖ మాత్రం అందుకు తగిన ఏర్పాట్లు చేయకపోవడం గమనార్హం. ఇందుకు సర్వేశ్వర్‌ రావు, నిస్సార్‌ తదితరులు మరణానికి ముందు టెస్టుల కోసం, ఆస్పత్రుల్లో చేరేందుకు, చికిత్స కోసం తల్లడిల్లిన ఉదంతాలే ఉదాహరణ. బంజారాహిల్స్‌ ఎస్‌ఐ విషయంలోనూ ఇదే పరిస్థితి. లక్షణాలు బయటపడిన తర్వాత కూడా వెంటనే టెస్టులు చేసేందుకు ఇప్పటికీ క్షేత్రస్థాయిలో సిబ్బంది నిరాకరిస్తున్నారు. పరిమిత సంఖ్యలో కిట్లను సరఫరా చేస్తుండడంతో వచ్చిన కిట్ల కన్నా టెస్టుల కోసం వచ్చే వారి సంఖ్య ప్రతి రోజూ అత్యధికంగా ఉంటుండడంతో ఎక్కువ మందిని వెనక్కి పంపిస్తున్నారు. దీంతో పరీక్షల కోసమే రోజుల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితుల్లో రిస్క్‌ గ్రూపులోకి వచ్చేవారు ప్రమాదంలోకి బలవంతంగా నెట్టేయబడుతున్నారు.

వెయిటింగ్‌
ప్రభుత్వాస్పత్రుల్లోనే కాదు… కార్పొరేట్‌, ప్రయివేటులోనూ వెయిటింగ్‌ కొనసాగుతున్నది. నగరంలోని ఒక ప్రముఖ రోగ నిర్ధారణ కేంద్రంలో పేరు నమోదు చేసుకుంటే వారం రోజులకు గాని పరీక్ష చేసే పరిస్థితి లేదని జవాబు వస్తుండడంతో ప్రజలు ఒక చోటు నుంచి మరో చోటికి వెళుతూ మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. దీంతో సర్కారు ఆలస్యంతోనే చోటు చేసుకుంటున్న ఈ మరణాలు సర్కారు చేసే హత్యలే కాని కరోనాతో జరిగే మరణాలు కావని ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు విమర్శిస్తున్నాయి. రిస్క్‌ గ్రూపులో ఉన్న వారికి ప్రాధాన్యతాక్రమంలో వెంటనే పరీక్షలు చేసే సౌకర్యాన్ని కల్పిస్తే ఈ మరణాలను తగ్గించే అవకాశముందనిపలువురు మేధావులు, వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates