అమిత్‌ షాకు కరోనా

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • ఆస్పత్రిలో చేరిన కేంద్ర హోం మంత్రి.. 
  • బుధవారం కేబినెట్‌ భేటీకి హాజరు
  • ఆయనతో కాంటాక్ట్‌ అయిన వారిపై ఆరా
  • పీఎంవో, హోంమంత్రి కార్యాలయాల్లో కలకలం
  • కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పకు పాజిటివ్‌
  • యూపీ బీజేపీ చీఫ్‌, తమిళనాడు గవర్నర్‌కూ
  • కొవిడ్‌తో ఉత్తరప్రదేశ్‌ మహిళా మంత్రి మృతి
  • ప్రముఖులకు వైరస్‌.. కమలంలో కలకలం
  • దేశంలో 24 గంటల్లో 853 మంది మృతి
  • కొత్తగా 54,735 కొవిడ్‌ కేసులు నమోదు
  • ఒక్కొక్కరుగా.. వైరస్‌ బారిన ప్రముఖులు

రాజకీయ, సినీ రంగాల ప్రముఖులు ఒక్కొక్కరుగా కరోనా బారిన పడుతున్నారు. బాలీవుడ్‌ గాయని కనికా కపూర్‌తో ఈ పరంపర మొదలైంది. యువ సంగీత దర్శకుడు వాజిద్‌ ఖాన్‌ చనిపోవడం సంచలనం రేపింది. గత నెలలో బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌, ఆయన కుమారుడు అభిషేక్‌ బచ్చన్‌, కోడలు ఐశ్వర్యారాయ్‌కు పాజిటివ్‌ వచ్చింది. అమితాబ్‌ ఆదివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. అభిషేక్‌ మాత్రం ఇంకా కోలుకోలేదు. ఇక రాజకీయ ప్రముఖుల్లో అమిత్‌ షాకు తోడు కర్ణాటక సీఎం యడ్యూరప్ప, తమిళనాడు గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌, యూపీ బీజేపీ చీఫ్‌ స్వతంత్ర దేవ్‌సింగ్‌ తాజాగా కరోనా బారిన పడ్డారు. మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, ఆ రాష్ట్ర కీలక నేత జ్యోతిరాదిత్య సింధియా తదితరులు కొవిడ్‌ బారినపడ్డారు.

న్యూఢిల్లీ : కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా (55)కు కరోనా సోకింది. వైరస్‌ లక్షణాలు కనిపించడంతో ఆయన పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌ వచ్చింది. దీంతో వైద్యుల సూచన మేరకు గురుగావ్‌లోని మేదాంత ఆస్పత్రిలో చేరారు. కేంద్ర ప్రభుత్వంలో అత్యంత కీలకమైన వ్యక్తి కావడంతో.. అమిత్‌ షా ఆరోగ్యాన్ని పర్యవేక్షించేందుకు ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణదీప్‌ గులేరియా ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం మేదాంత ఆస్పత్రికి వెళ్లనుంది. కాగా, తన ఆరోగ్యం నిలకడగా ఉందని అమిత్‌ షా తెలిపారు. కొద్ది రోజులుగా తనతో కాంటాక్ట్‌ అయినవారంతా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. గత బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్‌ భేటీలో అమిత్‌ షా పాల్గొన్నారు. ఈ సమావేశానికి హాజరైనవారిని దృష్టిలో పెట్టుకునే ఆయన సూచన చేసినట్లు భావిస్తున్నారు. దీనికితగ్గట్లే కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌ కుమార్‌ భల్లా ఐసొలేషన్‌కు వెళ్లారు. అమిత్‌ షా వైర్‌సకు గురవడం.. ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో), హోం మంత్రి కార్యాలయాల్లో చిన్నపాటి కలకలం రేపింది. ఆయనను ఎవరెవరు కలిశారన్నదానిపై విస్తృతంగా ఆరా తీస్తున్నట్లు సమాచారం. అయితే, కేబినెట్‌ భేటీ సందర్భంగా కొవిడ్‌ నిబంధనలు కచ్చితంగా పాటించారని పీఎంవో వర్గాలు తెలిపాయి.

మరోవైపు ఉత్తరప్రదేశ్‌ సాంకేతిక విద్యా శాఖ మంత్రి కమలారాణి వరుణ్‌ (62) కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. గత నెల 18వ తేదీన పలువురు కుటుంబ సభ్యులతో పాటు తనకూ పాజిటివ్‌గా తేలడంతో ఆమె ఆస్పత్రిలో చేరారు. లఖ్‌నవూలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం చనిపోయారు. యూపీ కేబినెట్‌లో ఏకైక మహిళా మంత్రి అయిన కమలారాణి కాన్పూర్‌ జిల్లాలోని ఘటంపూర్‌ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆదివారం రాత్రి కర్ణాటక సీఎం బీఎస్‌ యడ్యూరప్పకు కరోనా నిర్ధారణ అయింది.  కేబినెట్‌ సహచరులకు వైరస్‌ సోకడంతో ఆయన కొన్ని రోజులుగా  ఇంటి నుంచే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.  అయినా పాజిటవ్‌ వచ్చింది. దీంతో ఆస్పత్రిలో చేరినట్లు సీఎం ప్రకటించారు. మరోవైపు ఉత్తరప్రదేశ్‌ జల్‌ శక్తి శాఖ మంత్రి మహేంద్రసింగ్‌, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు స్వతంత్రదేవ్‌ సింగ్‌లకు  వైరస్‌ సోకింది. తమిళనాడు గవర్నర్‌ బన్వరిలాల్‌ పురోహిత్‌ (80) వైరస్‌ బారినపడ్డారు. 90 మంది రాజ్‌భవన్‌ సిబ్బంది కొవిడ్‌కు గురవడంతో గత నెల 29వ తేదీ నుంచే బన్వరిలాల్‌ హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates