ఏకరూప కోర్సుల వర్సిటీలకు చెల్లు!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • ఐఐటీ, ఐఐఎంల్లోనూ అన్ని కోర్సులు…
  • ప్రతి వర్సిటీలో బహుళ కోర్సులు
  • యూజీ నుంచి పీహెచ్‌డీ వరకు..!
  • కనీసం 3 వేల మందితో జిల్లాకో వర్సిటీ
  • నూతన విద్యావిధానంలో కీలక అంశం
  • అందరికీ అందుబాటులో ఉన్నతవిద్య: కేంద్రం
  • ప్రైవేటీకరించేందుకే: విద్యావేత్తలు

హైదరాబాద్‌: ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ఇంజనీరింగ్‌.. ఐఐఎంల్లో మేనేజ్‌మెంట్‌.. లా యునివర్సిటీలో న్యాయవిద్య.. ఇలా దేశవ్యాప్తంగా అనేక విశ్వవిద్యాలయాలు ఏకరూప కోర్సులను అందజేస్తున్నాయి. ఈ విధానానికి ఇక చరమగీతం పాడనున్నారు. ఐఐటీ, ఐఐఎంలతోపాటు లా యునివర్సిటీల్లోనూ ఆర్ట్స్‌, సైన్స్‌, హ్యుమానిటీస్‌, ఫారెన్‌ లాంగ్వేజెస్‌.. ఇలా అన్ని రకాల కోర్సులను నిర్వహించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని నూతన విద్యావిధానం(ఎన్‌ఈపీ)లో స్పష్టం చేశారు. ఉన్నత విద్యారంగం, విశ్వవిద్యాలయాల్లో తేవాల్సిన మార్పుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. అందరికీ విద్య అందుబాటులో ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్రం చెబుతుండగా.. ఉన్నత విద్యను ప్రైవేటీకరీంచేందుకే అని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టెక్నాలజీ రంగంలో అత్యుత్తమ విద్యాసంస్థలుగా ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీలు అంతర్జాతీయ స్థాయి నాణ్యతను కలిగి ఉండగా.. మేనేజ్‌మెంట్‌ విద్యలో ఐఐఎంలు, వ్యవసాయ విద్యలో అగ్రికల్చర్‌ వర్సిటీలు.. ఇలా వివిధ కోర్సులకు ప్రత్యేకంగా విశ్వవిద్యాలయాలు కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి. వీటిని సింగిల్‌ డిసిప్లినరీ వర్సిటీలుగా పేర్కొంటున్నాం. ఇక తప్పనిసరిగా ఇవన్నీ మల్టీ డిసిప్లినరీ కోర్సులను బోధించాల్సి ఉంటుంది. వచ్చే 20 ఏళ్లలో దేశంలో అన్ని విద్యాసంస్థలు అన్ని కోర్సులను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది.

ఎందుకీ నిర్ణయం..
దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని వర్సిటీలతో పాటు సెంట్రల్‌, డీమ్డ్‌, ప్రైవేట్‌ వర్సిటీలన్నీ కలుపుకొని 907 ఉన్నాయి. దేశంలో మొత్తం 739 జిల్లాలు ఉన్నాయి. వర్సిటీల సంఖ్య జిల్లాల కంటే ఎక్కువగానే ఉన్నప్పటికీ.. అన్ని రకాల కోర్సులు అందించే వర్సిటీలు చాలా తక్కువ. ఇవి రాష్ట్ర రాజధానులు, ప్రధాన నగరాల్లో ఉండడంతో ఉన్నత విద్య అందరికీ అందుబాటులో లేకుండా పోతోందన్నది కేంద్రప్రభుత్వ వాదన. వర్సిటీలు స్థానికంగా ఉంటే అందరికీ ఉన్నత విద్య అందుబాటులో ఉంటుందని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కేంద్రం భావిస్తోంది. సింగిల్‌ డిసిప్లినరీ నుంచి మల్టీ డిసిప్లినరీ కోర్సులుగా ఉంటే ప్రస్తుతం ఉన్న ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఎం, ఇతర కోర్సులు అందించే క్యాంప్‌సలోనే విద్యార్థులు వారికి కావాల్సిన కోర్సులను చదవొచ్చు. ప్రస్తుతం డిగ్రీ, ఆపైన కోర్సులకే విశ్వవిద్యాలయాల్లో అవకాశం ఉండగా.. ఇందులో అండర్‌ గ్రాడ్యుయేట్‌ (యూజీ) నుంచి పీహెచ్‌డీ వరకు కోర్సులుంటాయి. 2030లోగా ప్రతి జిల్లాకు ఒకటి, లేదా ప్రతి జిల్లాకు ఒక వర్సిటీ ఉండాలన్నది కేంద్రం లక్ష్యం.

ప్రైవేటు వర్సిటీలకు అవకాశం
మల్టీ డిసిప్లినరీ వర్సిటీలు నాణ్యమైన శిక్షణ, పరిశోధనతోపాటు సామాజిక భాగస్వామ్యం కూడా కలిగి ఉండాలి. ప్రతి వర్సిటీలో కనీసం 3 వేల మంది విద్యార్థులుండాలి. కొత్తగా ఏర్పాటయ్యేవాటిలో ప్రైవేటును కూడా ఆహ్వానిస్తారు. ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. విద్యా రంగాన్ని ప్రైవేటీకరించాలన్న లక్ష్యంలో భాగంగానే కేంద్రం ఈ విధానం తెచ్చిందనేది విద్యావేత్తలు, విద్యార్థి సంఘాల ఆరోపణ.

Courtesy Andharajyothi

RELATED ARTICLES

Latest Updates