దళిత బహుజనుల ను విస్మరించిన నూతన విద్యా విధానం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
Kumkum Roy

కరోనా మహమ్మారి విజృంభణ,లాక్ డౌన్ సమయంలో రూపొందించబడిన ప్రతిష్టాత్మక మరియు సంక్లిష్టమైన జాతీయ విద్యా విధానం రాబోయే రెండు దశాబ్దాల్లో అనుసరించవలసిన రోడ్ మ్యాప్ ని స్పష్టంగా తెలియజేసింది. ఐతే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆ విధానంపై చర్చలు జరపలేకపోయినప్పటికీ లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. ఎందుకంటే ఈ విద్యా విధానం వెనుకబడిన,అణచివేయబడిన వర్గాలు,వివిధ శాఖలు,స్వయంప్రతిపత్తి,రాజ్యాంగ విలువలు లాంటి అనేక అంశాలపై ప్రభావం చూపనున్నది.

ఈ విద్యా విధానం SEDG (సామాజికంగా,ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు) విభాగంలో ప్రస్తావించబడిన వారిపై ఏవిధమైన ప్రభావాల్ని చూపుతుంది?. అదీకాక ఒకచోట షెడ్యూల్డ్ క్యాస్ట్స్ గురించి నామమాత్రంగా ప్రస్తావించడం తప్పితే ఈ విద్యా విధానంలో ఎక్కడా కుల ప్రస్తావన లేదు. విద్యా సంస్థల్లో విద్యార్థులు,అధ్యాపకులు,ఇతర ఉద్యోగులకి సంబంధించిన రిజర్వేషన్లని కూడా ఎక్కడా ప్రస్తావించలేదు. మన దేశపు సామాజిక-ఆర్థిక పరిస్థితుల్లో గల అంతరాలని తగ్గించేందుకు రిజర్వేషన్లు ఓ అఫర్మేటివ్ యాక్షన్ (నిశ్చయాత్మక చర్య) గా పనిచేస్తాయి. మన అంతరాల వ్యవస్థకి రిజర్వేషన్లు అత్యవసరం. కాబట్టి ఈ విషయంపై జాతీయ విద్యా విధానం మౌనం వహించడం కలవరపరిచే అంశం.

చిన్నపిల్లలకి విద్యని అందించడం కోసమై ట్రైబల్ ప్రాంతాలలో స్థాపించబడిన విద్యా సంస్థల (ఆశ్రమశాలలు NEP 1.8) ని కూడా నామమాత్రంగానే ప్రస్తావించడం కలవరపరిచే మరో అంశం. ఈ విద్యా సంస్థల్లో ఏం జరగబోతోందో ఎవరికీ తెలియదు. సామాజికంగా,ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు (SEDG) ఉన్నత విద్యని అభ్యసించే సౌలభ్యాన్ని కల్పించే విధానాల్ని ఇందులో ప్రస్తావించినప్పటికీ (ఉదాహరణకి NEP 14.4) వాటికి నిర్దిష్టమైన కాలపరిమితి నిర్ణయించబడలేదు. ఈ నూతన విద్యా విధానం వ్యాపారీకరణకి పూర్తి భిన్నంగా విద్యని ప్రైవేటీకరణ చేయడాన్ని సమర్థించేదిగా ఉన్నది కాబట్టి కాలపరిమితి చాలా ముఖ్యం. ప్రైవేటీకరణ పెరిగి,ఉన్నత విద్యని బోధించే ప్రభుత్వ సంస్థలు పతనమైన పరిస్థితుల్లో ఈ విధానాలని ఏవిధంగా అమలు చేయగలరనేది కూడా ఆందోళనకు గురిచేసేదే.

ఈ విద్యావిధానంలో మల్టీ-డిసిప్లినరిటీ అనే పదం చాలాసార్లు ప్రస్తావించబడింది. విద్యార్థులు వివిధ కోర్సులని ఎంపిక చేసుకునే అవకాశాన్ని అందించే ఆకర్షణీయమైన,అనువైన ప్రతిపాదనగా మల్టీ-డిసిప్లినరిటీ చెప్పబడుతోంది. NEP 11.7 లో “దేశవ్యాప్తంగా ఉన్న ఉన్నత విద్యా సంస్థల్లో వివిధ శాఖలకి సంబంధించిన జ్ఞానాన్ని,విద్యని విద్యార్థులకి అందజేయడానికై భాషలు,సాహిత్యం,సంగీతం,తత్వశాస్త్రం,భారతదేశ చరిత్ర అధ్యయనం,కళలు,నృత్యం,థియేటర్,విద్య,గణితం, గణాంక శాస్త్రం,ప్యూర్ మరియు అప్లైడ్ సైన్సెస్,సోషియాలజీ (మానవ సమాజాల అధ్యయన శాస్త్రం),ఆర్థిక శాస్త్రం,ఆటలు లాంటి అనేక అంశాలకి సంబంధించిన శాఖలని ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది” అని పేర్కొనబడింది. ఈ జాబితాతో ఎలాంటి అభ్యంతరాలూ లేకపోయినప్పటికీ గత మూడు,నాలుగు దశాబ్దాల్లో వృద్ధి చెందిన మహిళలు,లింగపరమైన అంశాల్ని,సాంస్కృతిక అంశాలని,మీడియాని,దళితుల్ని,వివక్షల్ని,పర్యావరణాన్ని అధ్యయనం చేసే శాస్త్రాలని ప్రస్తావించకపోవడాన్ని ఖచ్చితంగా విమర్శించి తీరాలి. ఈ శాస్త్రాలన్నీ కూడా మల్టీ-డిసిప్లినరిటీ(ఇంటర్-డిసిప్లినరిటీ) ని అనేక విధాలుగా ఉపయోగించుకుని వైవిధ్యత,వైరుధ్యాలు,అస్తిత్వాలకి సంబంధించిన పలు సమస్యలని ప్రజల ముందుకు తీసుకువచ్చాయి. ఐతే ముందుచూపు గల విద్యా విధానంగా వర్ణించబడుతున్న నూతన విద్యా విధానం ఈ శాఖల్ని నిర్లక్ష్యం చేయడం అనుమానాలకి తావిస్తోంది.

ఈ నూతన విద్యా విధానం స్వయంప్రతిపత్తి,ఎంపికలకి ప్రాధాన్యత ఇచ్చినట్టే కనిపించినప్పటికీ ముఖ్యమైన పరిస్థితుల్లో కొన్ని పరిమితుల్ని సైతం విధించింది. ఉదాహరణకి మధ్యమ స్థాయి పాఠశాలల్లో వృత్తి విద్యా కోర్సుల ఎంపిక ని సరదా ఎంపికగా వర్ణించారు కానీ “స్థానిక వృత్తి విద్యా అవసరాలకి అనుగుణంగా రాష్ట్రాలు,స్థానిక సమాజాలు నిర్ణయించిన అంశాలకి లోబడి” ఆ ఎంపిక ఉండాలనే పరిమితిని విధించింది (NEP 4.8).

ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించబడే ప్రవేశ పరీక్షల నిర్వహణ బాధ్యతలని నిపుణులతో కూడిన,స్వయంప్రతిపత్తి గల నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి (NEP 4.38) కి అప్పగించారు. ఇది విద్యార్థులు,విశ్వవిద్యాలయాలు,కళాశాలలు,విద్యావ్యవస్థపై పడుతున్న భారాన్ని తగ్గిస్తుందని ఆశిస్తున్నారు. “ప్రబలమైన కేంద్రీకృత సంస్థ ఏర్పాటు కంటే ఒక వినూత్న విధానాన్ని రూపొందించడం ద్వారా వివిధ శాఖలలో సందర్భానుసారమైన,వైవిధ్యమైన మూల్యాంకన పద్ధతులకి స్థానం కల్పించే పరిస్థితులని కల్పించడానికి ఎవరూ ప్రయత్నించడం లేదు”.

మొత్తానికి ఇకనుంచీ ఉన్నత విద్యాసంస్థలని బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ (NEP 19.2) నిర్వహిస్తుంది. ఈ ప్రక్రియలో అవసరమైన చోట చట్టపరమైన మార్పుల సహాయం తీసుకుంటుంది. నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అథారిటీ (NHERA) ఏర్పాటు ద్వారా కేంద్రీకరణ మరింత విస్తృతం కానున్నది. ఇది ఆర్థిక సమగ్రత,సుపరిపాలన,ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ లో ఖర్చుల బహిరంగ ప్రకటన,విధివిధానాలు,అధ్యాపకులు/సిబ్బంది,కోర్సులు,పరీక్షా ఫలితాలు లాంటి ముఖ్యమైన అంశాల్ని ప్రభావవంతంగా నియంత్రిస్తుంది. ఇవి కాక ఇతర అంశాల్ని ఉన్నత విద్యా సంస్థలకే వదిలేస్తుంది. (NEP 20.4). ఐతే ఆ “ఇతర అంశాలు” ఏమిటన్నదే ఎవరికీ అర్థం కాని విషయం.

ఈమధ్య కాలంలో మనందరం ఆత్మనిర్భర్ భారత్ గురించి చాలా వింటున్నాం. కానీ ఈ నూతన విద్యా విధానం ఉన్నత విద్యా రంగంలోకి విదేశీ విశ్వవిద్యాలయాల ప్రవేశాన్ని సులభతరం చేసింది. అంతేకాక ఈ విదేశీ విశ్వవిద్యాలయాలు మిగతా విశ్వవిద్యాలయాలన్నింటికీ ఆదర్శమైనవని,కాబట్టి వాటిని అందుకోవడానికి ప్రయత్నించాలని చెబుతోంది.  యూఎస్ లోని ఐవీ లీగ్ విశ్వవిద్యాలయాల్లో ఉండే ప్రపంచస్థాయి విద్యా ప్రమాణాలని అందుకోవడానికై  MERU(Multidisciplinary Education and Research Universities) లు స్థాపించబడతాయి (NEP 11.10).

అనేక విశ్వవిద్యాలయాలు,ఉన్నత విద్యాసంస్థల్లో ప్రజాస్వామిక యంత్రాంగాలున్నాయి. వీటిలో విద్యాపరమైన,కార్యనిర్వాహక సంస్థలు కూడా ఉన్నాయి. ఇవి విధివిధానాలు,కోర్సులు,ఇతర సంస్థాగత అంశాల రూపకల్పన,చర్చ,అమలులో పాలుపంచుకుంటాయి.  సీనియారిటీ,రొటేషన్ పద్ధతుల్లో ఎన్నుకోబడిన విద్యార్థులు,అధ్యాపక సిబ్బంది ఉండడం వల్లే ఆయా విద్యాసంస్థలు శక్తివంతమైన కేంద్రాలుగా మారాయి. ఇలాంటి సంస్థలు,విధివిధానాలు,పద్ధతుల్ని వదిలేసి పైస్థాయి-కిందిస్థాయి పరిపాలనా విధానాలకి మొగ్గు చూపడం ద్వారా ప్రజాస్వామిక కార్యకలాపాల్లో ఎదురయ్యే సవాళ్లని ఎదుర్కొనే అవకాశాన్ని ఉన్నత విద్యా సంస్థల సభ్యులు కోల్పోతారు.

రాజ్యాంగానికి వాటిల్లే ముప్పు కూడా ఆందోళన కలిగించే అంశమే. దేశభక్తి,త్యాగం,అహింస,నిజం,నిజాయితీ,శాంతి,సత్ప్రవర్తన,క్షమాగుణం,సహనం,దయ,సానుభూతి,సహాయం అందించే గుణం,శుభ్రత,మర్యాద,సమగ్రత,బహుళత్వం, బాధ్యత,న్యాయం,స్వేచ్ఛ,సమానత్వం మరియు సౌభ్రాతృత్వం (NEP 4.23) లాంటి మానవ,రాజ్యాంగ విలువలకి సంబంధించిన జ్ఞానాన్ని సముపార్జించి ఆయా విలువల్ని పాటించాలని చెప్పిన ఈ నూతన విద్యా విధానం అక్కడక్కడా ప్రాథమిక విధులని సైతం ప్రస్తావించింది. కానీ ప్రాథమిక హక్కుల్ని మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. అంటే భవిష్యత్తు తరాల ప్రజల మెదళ్ల నుంచి ప్రాథమిక హక్కుల్ని పూర్తిగా తుడిచివేయబోతున్నారా?.

జాతీయ విద్యా విధానం అమలు గురించి వెలువడిన ప్రకటన సృష్టించిన ఉత్సాహపూరిత వాతావరణం తర్వాతైనా ఈ విధానం యొక్క దీర్ఘకాలిక పర్యవసానాల్ని పరిశీలించి,అవసరమైతే ఈ విధానం అమలు జరగక ముందే మరోసారి పునఃపరిశీలన చేసే అవకాశాలు లభిస్తాయని మనం ఆశించాలి.

RELATED ARTICLES

Latest Updates