వైరస్‌కంటే భయం మా చెడ్డది!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • కరోనా కన్నా భయంతోనే పోతున్న ప్రాణాలు
  • గాంధీలో 800 మంది రోగులకు మానసిక సమస్యలు
  • బాధితుల్లో ఆగ్రహం, ఆదుర్దా, నైరాశ్యం, భయాందోళనలు
  • కోలుకున్న తర్వాత కూడా పలు మానసిక రుగ్మతలు
  • తగ్గుతున్న రోగనిరోధక శక్తి
  • ధైర్యంతోనే మహమ్మారిపై గెలుపు సాధ్యం: వైద్యులు

హైదరాబాద్‌ సిటీ : ‘‘దెయ్యం కంటే భయం మా చెడ్డదండీ’’.. ఓ తెలుగు సినిమాలో డైలాగ్‌ ఇది. ప్రపంచవ్యాప్తంగా జడలు విప్పుకొని విజృంభిస్తున్న కరోనా అనే దెయ్యం విషయంలోనూ ఇది నూటికి నూరుపాళ్లు వర్తిస్తుంది. భయపడుతూ బతికే మనిషికి అల్సర్‌ కూడా ప్రాణాపాయమే. తెగించి ఎదుర్కొనేవాడికి కేన్సర్‌పై కూడా విజయం సాధ్యమే. కరోనా రోగుల్ని పక్కన పెడితే.. పక్కింటివాడికి కరోనా వచ్చిందని తెలిస్తే, రానివాళ్లే గడగడలాడిపోతున్నారు. లేని ఆదుర్దాను తెచ్చుకుని వెంటనే కరోనా పరీక్షలకు పరిగెత్తేవారికి కొదవే లేదు. ఇటీవల ఓ వ్యక్తి ఇదే తరహాలో నమూనాలను పరీక్షలకు ఇచ్చాడు. ఫలితాలు రాక ముందే.. తనకు పాజిటివ్‌ వస్తుందేమోనన్న భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు. మరో ఘటనలో.. కరోనా బారిన పడిన ఓ టీవీ జర్నలిస్టు, వైరస్‌ తీవ్రత మరీ ఎక్కువగా లేకపోయినా విపరీతమైన ఆందోళనకు లోనుకావడంతో కన్నుమూశారు.

నా జీవితం ఇక్కడితో ముగిసినట్లేనా..? నా భార్యాపిల్లలు, కుటుంబం పరిస్థితి ఏమిటో! ఇలాంటి ఎన్నో ప్రశ్నలు కరోనా రోగుల్ని అల్లకల్లోలం చేస్తుంటాయి. శరీరం ఓవైపు వైర్‌సతో పోరాడుతుంటే.. మానసికంగా వారు తమ ఆందోళనలతో, భయాలతో పోరాటం చేయాల్సి వస్తోంది. ఈ పోరాటంలో అలిసిపోయిన వారు కన్నుమూయడమో, మానసిక రుగ్మతలపాలు కావడమో జరుగుతోంది. అందుకే.. కరోనా చికిత్సతో పాటే వీరికి మానసిక ధైర్యాన్నివ్వాల్సిన అవసరం ఉంది. కరోనా సోకిన వారిని చూసేందుకు.. నాలుగు మంచిమాటలు చెప్పేందుకు కూడా మనుషులు కరువే. ఇది రోగుల మానసిక స్థితిపై ప్రభావం చూపిస్తోంది. నీకు ఏం కాదు. మేమంతా ఉన్నాం. ఈ కష్టం  తాత్కాలికమే అని ధైర్యం చెప్పేవారు లేక రోగులు కుంగిపోతున్నారు. ఈ పరిస్థితే వారిలో అనేక రుగ్మతలకు, నైరాశ్యానికి దారి తీస్తోంది.

800 మందికి మానసిక రుగ్మతలు
కరోనా పాజిటివ్‌గా నిర్ధారణై గాంధీ ఆస్పత్రిలో చేరిన వారిలో దాదాపు 800 మంది మానసిక సమస్యలతో సతమతమయ్యారని అక్కడి వైద్యులు తెలిపారు. వారి ప్రకారం.. ఒక్కో రోగిదీ ఒక్కో తరహా ఇబ్బంది. చాలామంది రోగులు చిత్ర విచిత్రంగా ప్రవర్తించారు. తమకు కరోనా రావడంతో.. తమ కుటుంబాన్ని కూడా అంటరానివాళ్లుగా చూస్తారనే భయాందోళనలు వారిలో కనిపించాయి. మరికొంతమందిలో.. కరోనా నయం అవుతుందో లేదోనన్న ‘ఇరిటబిలిటీ డిజార్డర్‌’ కనిపించిందని పేర్కొన్నారు. ఈ తరహా రోగుల్లో ఒక్కసారిగా చురుకుదనం తగ్గిపోవడం, అపనమ్మకం, నైరాశ్యానికి లోనుకావడం వంటి లక్షణాలు తలెత్తాయని తెలిపారు. ప్రతి విషయానికి చిరాకు పడటం, అందరిపై కసురుకోవడం, కోపంగా మాట్లాడడం, మందులు వేసుకోకపోవడం వంటి సమస్యలను వీరిలో పరిశీలించామని చెప్పారు.

కరోనా తగ్గినా.. సైకోసిస్‌తో ముప్పు
కరోనా వచ్చిన ఓ మహిళ మూడు రోజుల క్రితం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయి ఇంటికి చేరింది. మరుసటి రోజు నుంచే ఆమె, తనను ఎవరో చంపడానికి వస్తున్నారంటూ ఇంటి తలుపులు మూసుకోవడం, వాషింగ్‌ మిషన్‌లో దాక్కోవడం వంటి చిత్రమైన చేష్టలను చేస్తోంది. భయపడిన ఆమె భర్త వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. పరీక్షల అనంతరం.. ఆమె ‘సైకోసిస్‌’ అనే రుగ్మతకు లోనైందని వైద్యుడు తెలిపారు. ఇలాంటి స్థితిలో ఉన్నవారు, ఒక్కోసారి తమకు తామే ప్రమాదకరంగా మారతారు.

రోగ నిరోధక శక్తి తగ్గుతుంది
వైర్‌సను శరీరం ఎదుర్కొనేందుకు రోగ నిరోధక శక్తి అత్యావశ్యకం. ఎప్పుడైతే రోగి ముందుగానే కరోనాకు భయపడి కుంగిపోతాడో.. అప్పుడే అతడిలోని రోగ నిరోధక శక్తి కూడా వైర్‌సపై పోరాటంలో నెమ్మదించే అవకాశం ఉంటుందని  వైద్యులు స్పష్టం చేస్తున్నారు. మానసిక భావనలకు తగ్గట్టుగా శరీరం స్పందిస్తుందనడంలో సందేహం లేదని, ధైర్యంగా ఎదుర్కొంటే కరోనాపై విజయం సాధ్యమేననేది వారి మాట. కుమిలిపోతే కరోనా నుంచి బయటపడగలమా? భయపడితే ప్రాణాల్ని కాపాడుకోగలమా? ఈ ప్రశ్నలను కరోనా బాధితులు తమకు తాము వేసుకుని, ధైర్యాన్ని కూడదీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కౌన్సెలింగ్‌ ఇస్తే రోగుల్లో ధైర్యం పెరగవచ్చు. రోగులు వందల సంఖ్యల్లో ఆస్పత్రులకు వస్తుండటంతో వారిలో ధైర్యం నింపేందుకు వైద్యులు సమయం కేటాయించలేకపోవడం సమస్యగా మారింది.

రోగులతో మాట్లాడేది 5నిముషాలే అయినా, వారికి ఏం కాదని, కరోనా తగ్గిపోతుందని భరోసా ఇస్తే పరిస్థితి కొంచెం మెరుగవుతుందని   నిపుణులు సూచిస్తున్నారు. గాంధీ ఆస్పత్రిలో ఇద్దరు మానసిక నిపుణులు, మరో ఇద్దరు సీనియర్‌ రెసిడెంట్స్‌, తొమ్మిది మంది పీజీలు కరోనా రోగుల మానసిక రుగ్మతలకు చికిత్సలు అందిస్తున్నారు.  రోగులందరూ ఏదో ఒక మానసిక సమస్యతో బాధపడుతుండటంతో ఒక్కో వైద్యుడు రోజుకు  20కంటే ఎక్కువమంది రోగులకు మానసిక చికిత్స అందించడం కష్టంతో కూడుకున్న పని.  దీన్ని అధిగమించాలంటే.. డిప్యుటేషన్‌పై వైద్యులను రప్పించడం, ఒప్పంద ప్రాతిపదికన మానసిక వైద్యులను నియమించుకోవడం వంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.

కాగ్నిటివ్‌ బిహేవియర్‌ థెరపీ చేస్తున్నాం
పాజిటివ్స్‌కు కాగ్నిటివ్‌ బిహేవియర్‌ థెరపీతో రోగుల ఆలోచన విధానాన్ని మారుస్తున్నాం. మానసిక స్థితిని నియంత్రణలో ఉంచుకోవడానికి మైండ్‌ టెక్నిక్‌ అభివృద్ధి చేస్తున్నాం. గతంలో వారు గడిపిన సంతోష క్షణాల్ని గుర్తు చేసుకునేలా చేస్తున్నాం. ఇష్టమైన వ్యక్తులకు ఫోన్‌ చేసి మాట్లాడించి వారిలో ఒత్తిడి తగ్గిస్తున్నాం. ప్రాణాయామం, శ్వాస సంబంధిత వ్యాయామం చేయిస్తున్నాం. శ్రావ్యమైన సంగీతం వినిపిస్తున్నాం. ఎక్కువగా సమస్య ఉన్న వారికి ఫార్మో థెరపీ ఇస్తున్నాం.
డా. అజయ్‌, గాంధీ ఆస్పత్రి

వీడియో కన్సల్టేషన్‌ కల్పించాలి
మానసిక వైద్యులు ప్రతి రోగి వద్దకూ వెళ్లి కౌన్సెలింగ్‌ చేయడం కష్టం. అందుకే ప్రతి అంతస్తుకు వీడియో కన్సల్టేషన్‌ సదుపాయం కల్పించాలి. రోగుల ప్రవర్తనను వైద్యుడు వీడియో ద్వారా పరిశీలించి, కౌన్సెలింగ్‌ ఇచ్చేలా ఈ ఏర్పాటు ఉండాలి.
 డా. హరిణి, , కేర్‌ ఆస్పత్రి

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates