దళిత అనాథ యువతికి చిత్రహింసలు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

మంచిర్యాల జిల్లాలో దారుణం
భూతవైద్యం పేరిట చిత్రహింసలు
చావుబతుకుల్లో బాధితురాలు
దళిత సంఘాల ఆగ్రహం

కుందారం: సమాజం ఎంత ముందుకు పోయిన పీడిత వర్గాలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆధిపత్య భావజాలానికి మూఢనమ్మకాలు తోడుకావడంతో అణగారిన వర్గాలపై దారుణాలు ఆగుతలేదు. ముఖ్యంగా మహిళలు, బాలికలపై అకృత్యాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. తాజాగా మంచిర్యాల జిల్లా జైపూర్‌ మండలం కుందారం గ్రామంలో భూతవైద్యం పేరిట రజిత( 24) అనే దళిత అనాథ యువతిని చిత్రహింసలు పెట్టిన ఘటన మానవతావాదులను కలచివేసింది. భూత వైద్యుడిగా చెలామణి అవుతున్న దొంగల శ్యామ్‌ అనే వ్యక్తి బాలింత అన్న కనికరం లేకుండా విచక్షణారహితంగా కొట్టడంతో బాధితురాలు ఆస్పత్రి పాలై చావుబతుకుల్లో కొట్టుమిట్లాడుతోంది.

అపస్మారక స్థితిలో వెంటిలేటర్‌పై..
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలోని గద్దపాక గ్రామానికి చెందిన రజితను జైపూర్‌ మండలం కుందారం గ్రామానికి చెందిన సెగ్యం మల్లేశ్ ప్రేమ పేరుతో లోబర్చుకుని గర్భవతిని చేశాడు. పెళ్లి చేసుకున్న తర్వాత మూడు నెలల క్రితం రజిత ఓ పాపకు జన్మనిచ్చింది. అయినప్పటి నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న రజితను మల్లేశ్‌, అతడి కుటుంబ సభ్యులు హింసించడం మొదలు పెట్టారు. ఆమె వింతగా ప్రవర్తిస్తోందని ప్రచారం చేసి ఇంటికి భూతవైద్యుడిని పిలిపించారు.

రజిత చేతబడులకు గురైందని, ఆమెతో పూజ చేయించి నయం చేస్తానని చెప్పి మాంత్రికుడు దారుణంగా రజితను హింసించాడు. బాలింత అని కూడా చూడకుండా జుత్తు పట్టుకుని ఇష్టమొచ్చినట్టుగా కొట్టడంతో తట్టుకోలేక రజిత కుప్పకూలిపోయింది. వెంటనే కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రతిమ ఆస్పత్రికి తరలించగా వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇప్పుడామె అపస్మారక స్థితిలో ఉన్నట్లు వైద్యులు చెప్పారు. ఈ ఘటనపై జైపూర్‌ ఏసీపీ భూపతి నరేందర్‌ ఆదేశంతో ఓ పోలీసు బృందం మల్లేశ్‌ ఇంటికి వెళ్లి విచారణ చేపట్టి నిందితులను అరెస్ట్‌ చేసింది.

రజితను కాపాడండి
అనాథ దళిత యువతిని చిత్రహింసలకు గురిచేయడాన్ని దళిత సంఘాలు, మానవ హక్కుల కార్యకర్తలు తీవ్రంగా ఖండించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించి ఆమెను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రజితకు న్యాయం చేయాలని ఆమె సోదరుడు (పెదనాన్న కొడుకు) సోషల్‌ మీడియాలో విజ్ఞప్తి చేశాడు. అనాథ దళిత బిడ్డ అయిన రజితను కాపాడేందుకు, న్యాయం చేసేందుకు అందరూ కలిసి రావాలని వేడుకున్నాడు.

RELATED ARTICLES

Latest Updates