కోవిద్ కట్టడి కాకపోవటానికి ప్రధాన కారణం రాజకీయ వైఫల్యమే

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

కోవిద్ కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తూనే వుంది. సమస్యను హేతుబద్ధంగా కాక తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఒక సమూహాన్ని మాత్రమే ఎప్పుడైతే టార్గెట్ చేసారో అప్పుడే సమస్య పరిష్కారం కూడా జటిలమై ఇప్పుడు దాని విశ్వరూపం చూపిస్తోంది. వైరస్ దాడి చేయటానికి మత, కుల, వర్గ, జెండర్ తేడాలు వుండవనే కనీస ప్రాథమిక అవగాహన కూడా కొరవడి సాగించిన విద్వేష ప్రచారం ఏదైతే వుందో దాని పర్యవసానం ఇప్పుడు అన్ని వర్గాల్లో కనిపిస్తోంది. ప్రజల్లో అవగాహన కన్నా అపోహలు, భయమే ఎక్కువ అయ్యాయి. వైరస్ సోకిందని తెలిస్తే చుట్టుపక్కల వాళ్ళు దూరంగా పెడతారేమో అనే భయమే ప్రధానంగా కనిపిస్తోంది. వైద్యరంగంలో వున్నవారికి కూడా ఈ సమస్య తప్పడం లేదు. కనీసం పరీక్ష చేయించుకోవటానికి కూడా ఇంకా అనేకమంది జంకుతున్నారు. వివక్షకు గురికావలసి వస్తుందేమో అని భయపడుతున్నారు. ఈ భయంతోనే అనేకమంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇతరత్రా జబ్బులు ఉన్నవారి పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోంది.

వైరస్ శరీరం లోపల అన్ని అవయవాల మీద తీవ్ర ప్రభావం చూపిన తర్వాత చివరి క్షణాల్లోపరుగులు తీసినా ఫలితం వుండటం లేదు. ఇప్పటివరకూ ఒక్క హెచ్ఐవి, ఎయిడ్స్ జబ్బుతోనే అనేక రకాల సామాజిక సమస్యలు ఉండేవి. నిజానికి ఏ జబ్బు గురించి అయినా ఒకే విధంగా ఆలోచించాలి. కానీ, అవగాహనా రాహిత్యం హెచ్ఐవి, ఎయిడ్స్ బాధితులకు ఆరోగ్యసౌకర్యం లేకుండా చేసి అనేకమంది ప్రాణాలు పోవటానికి కారణమయింది. గుండెజబ్బులో, కాన్సరో వస్తే అందరికీ నిర్భయంగా చెప్పుకునే జనాలు కోవిద్ వస్తే మాత్రం ఎందుకు భయపడాలి? దీన్ని ఒక జబ్బుగా మాత్రమే అర్థంచేసుకుని, దాన్ని ఎలా తగ్గించుకోవాలనే వైపుగా ఆలోచించకుండా అపోహలూ, భయాలతో పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మారుస్తున్నారు. పిల్లలకు పోలియో చుక్కలు వేయటాన్ని ఎంత సహజంగా తీసుకున్నామో కోవిద్ పరీక్ష కూడా అంతే సహజంగా తీసుకుని ఏమాత్రం కోవిద్ లక్షణాలు(పొడిదగ్గు, జలుబు, వొళ్ళునొప్పులు, విరోచనాలు, జ్వరం మొదలైనవి) కనిపించినా గానీ వెంటనే పరీక్ష చేయించుకోవాలి. పాజిటివ్ వస్తే ఏమేం జాగ్రతలు తీసుకోవాలో డాక్టర్ల సలహా తీసుకోవాలి. మూడురోజుల కంటే ఎక్కువ ఏ లక్షణం కనిపించినా కోవిద్ అని అనుమానించి పరీక్ష చేయించుకోవటం మంచిది. నిర్లక్ష్యం ఖరీదు అత్యంత బాధాకరంగా మారుతుంది. మరో ముఖ్యమైన విషయం, చాలామందిలో ఉన్నది ఏమిటంటే, మేము ఎంతో జాగ్రత్తలు తీసుకుంటాం, మాకెందుకు కోవిద్ వస్తుంది అనే అపోహ. కోవిద్ కి తెలుసా ఎదురుగా వున్నది కవి, కళాకారుడు, రచయితా, రాజకీయ నాయకుడు, మంత్రి, సినిమా నటుడు అని! వినటానికే హాస్యాస్పదంగా ఉంటున్నాయి కొన్ని ఇలాంటి అనుభవాలు! ఉంటే అతి భయాలు, అపోహలు లేదంటే అతి నిర్లక్ష్యం. రెండూ నాణానికి రెండు పార్శ్వాలుగా మాదిరిగా కనిపిస్తున్నాయి.

ప్రజలకు కావలసింది భరోసా కల్పించే సమాచారం. కానీ, వాటిని అందించడంలో ప్రభుత్వం వైపు నుంచీ చాలా నిర్లక్ష్యం వుంది. న్యాయస్థానాలు ఆదేసించినా గానీ ఇప్పటికీ గాంధీ హాస్పిటల్ వంటి వాటిలో హెల్ప్ డెస్క్ ల ఏర్పాటుకు అధికారులు సంసిద్ధత చూపించటం లేదు. నిజానికి కోవిద్ చికిత్స చేసే ప్రతి హాస్పిటల్లో ప్రభుత్వ, ప్రైవేటు అనే తేడా లేకుండా ఈ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయటంలో తాత్సారం చేయకుండా నిర్ణయం తీసుకుంటే ప్రజలకు భయాలు తగ్గుతాయి. కోవిద్ పేషంట్ల పక్కన ఎవర్నీ ఉండనివ్వరు కాబట్టి, బయట వున్న వారి కుటుంబాలకు సమాచారం ఇచ్చే అనుసంధాన వ్యవస్థ లేకపోతే అటు రోగి- ఇటు బంధువులూ తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతారు. వైద్యులకు, కుటుంబ సభ్యులకు వారధిగా హెల్ప్ డెస్క్ వాలంటీర్లు పనిచేయగలుగుతారు. ఇందులో స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో ఈ వ్యవస్థను ప్రజలకు ఉపయోగపడేలా నిర్వహించవచ్చు. కానీ, అసలు చిక్కంతా అధికారయంత్రాంగం నుంచే వస్తోంది. ప్రజలకు సహాయకారిగా వుండే ఈ రకమైన వ్యవస్థల రూపకల్పన, నిర్వహణ మీద వారికి నమ్మకం వుండదు. బహుశా వారి అవకతవకలు, లొసుగులు బయటపడతాయనే భయమే ప్రధానం కావచ్చు.

ఇలాంటి పాండమిక్ (సమూహ వ్యాప్తి) సమయంలో మనలాంటి అత్యధిక జనాభా వున్న దేశంలో, ముఖ్యంగా పేదవర్గాల కోసం ప్రత్యేక శ్రద్ధతో ఆలోచించాల్సిన అవసరం వుంది. అత్యధిక జనాభా చిన్నచిన్న ఇళ్ళల్లో, ఒకే గదిలో ఎక్కువమంది నివసించే పరిస్థితులు వున్నాయి. అనేకమంది నిరాశ్రయులుగానే బతుకుతున్నారు. వారికి ఈ వ్యాధి వచ్చే అవకాసం ఎక్కువ. మరి వ్యాధి వచ్చినవారు తోటివారికి విడిగా వుండాల్సిన పరిస్థితిలో ఎక్కడికి వెళతారు? వారికి కమ్యూనిటీ ఐసోలేషన్ సెంటర్స్ ఎందుకు ఏర్పాటు చేయటం లేదు? ఇంత జనాభాకి ఎక్కడ చేయగలుగుతాము అని ఉన్నత స్థాయి వైద్యాధికారులు నిస్సిగ్గుగా ఎలా మాట్లాడగలుగుతున్నారు? అంటే, ఈ ప్రజలకు కోవిద్ వస్తే మాకేం బాధ్యత లేదు అని చెప్పదలుచుకున్నారా? నాలుగున్నర నెలల తర్వాత కూడా కోవిద్ సోకిన సామాన్య ప్రజలకు పద్నాలుగు రోజులు ఉండటానికి ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేయలేదంటే సమస్య పరిష్కారం పట్ల ప్రభుత్వ యంత్రాంగానికి వున్న బాధ్యతా రాహిత్యం తేటతెల్లమవుతోంది. నిజానికి గ్రామీణస్థాయిలో కూడా ఈ ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. కానీ, అంత చిత్తశుద్ధి పాలకులకు వుంటే కోవిద్ సమస్య ఈపాటికి చాలా వరకూ అదుపులోకి వచ్చి వుండేది.

మరో ముఖ్యమైన సమస్య, ప్రభుత్వ వైద్యవ్యవస్థల మీద నమ్మకం కోల్పోయేలా ఇప్పటివరకూ తీసుకున్న విధానాలు. ప్రభుత్వ వైద్యసౌకర్యాలకు అందించాల్సిన ఆర్ధిక, సాంకేతిక, మానవ వనరుల మద్దతులను కావాలని నిర్లక్ష్యం చేసి, సామాన్య ప్రజలకు ప్రభుత్వ వైద్యం అంటే విరక్తి పుట్టేలా చేసారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లటం అంటేనే ప్రాణాలు పోవటం అనే దురభిప్రాయాన్ని అన్ని వర్గాల్లో కల్పించారు. ప్రభుత్వాల నుంచీ అన్ని విధాలుగా సబ్సిడీలు తీసుకున్న కార్పొరేట్ వైద్య వ్యవస్థలు ఇప్పుడు ఈ అత్యవసర ఆరోగ్య పరిస్థితిలో ప్రజలనుంచీ లక్షలాది రూపాయలను నిర్లజ్జగా లాగేస్తున్నాయి. ప్రభుత్వం నియంత్రణ పెడితే వోప్పుకోమని తెగేసి చెబుతున్నారు. ఎక్కడినుంచీ వచ్చింది వీరికి ఈ తెగింపు?

కోవిద్ కట్టడికి ముఖ్యంగా కావలసింది ఈ వైరస్ గురించి ప్రజలకు అవగాహన కల్పించడం. ప్రజల భాగస్వామ్యం లేకుండా దీన్ని అదుపు చేయగలుగుతామనేది చాలా పెద్ద భ్రమ. అవగాహన కన్నా అపోహలు పెంచడంలో ప్రభుత్వమే కాదు మీడియా పాత్ర కూడా వుంది. ఇప్పుడిప్పుడే అవగాహన పెంచటానికి కొంత ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ, అవి సరిపోవు. ఇంకా పెద్ద ఎత్తున చైతన్య కార్యక్రమాల రూపకల్పన జరగాలి. సమూహ వ్యాప్తికి కారణమవుతున్న అన్ని అంశాల మీదా దృష్టి సారించాల్సిన అవసరం వుంది. ఇది కేవలం ప్రజలకు మాత్రమే చెప్పాల్సిన అంశం కాదు. రాజకీయ నాయకులకు కూడా వర్తిస్తుంది. మొత్తంగా చూస్తే కోవిద్ కట్టడి కాకపోవటం కేవలం ప్రజల నిర్లక్ష్యం వల్లే అనుకోవడం అంటే అంతకంటే దుర్మార్గం వుండదు. మొత్తంగా చూస్తే ఇది ఒక రాజకీయ వైఫల్యం. ప్రధాన బాధ్యత అధికార రాజకీయపక్షాలది. దురదృష్టమేమంటే కోవిద్ అంశం మీద నిర్మాణాత్మకమైన సూచనలు జాతీయ ప్రతిపక్ష రాజకీయ పార్టీలనుంచీ గానీ, ప్రాంతీయ పార్టీల నుంచి గానీ రాకపోవటం. నిజానికి పౌర, ప్రజాస్వామ్య సమూహాల నుంచీ నిర్దిష్టంగా జరుగుతున్న కార్యాచరణ కూడా వీరినుంచీ కొరవడటం.

కోవిద్ అనే ఆరోగ్య అత్యవసర స్థితిని ఎదుర్కోవటానికి అవసరమైన సమగ్ర చర్యల ప్రణాళికను ఏ పార్టీ కూడా ఇంతవరకూ విడుదల చేయలేదు. ప్రత్యామ్నాయ ఆరోగ్య వ్యవస్థల ఏర్పాటుకు ముందుకు రాలేదు. విమర్శే కాదు, ఆచరణ కూడా ఇప్పుడు అత్యంత ముఖ్యమైన అంశం. స్వచ్ఛంద సంస్థలు పూనుకుని హెల్ప్ లైన్ల ద్వారా వైద్యులు అందుబాటులో వుండటం, అంత్యక్రియల్లో సహాయం చేయటం, వైరస్ బారిన పడిన కుటుంబాలకు బలవర్ధకమైన ఆహారం అందించడం వంటి ఎన్నో కార్యక్రమాలు చేయగలుగుతున్నప్పుడు, రాజకీయ పార్టీలు పూనుకుంటే ప్రజలకు మరింత సహాయంగా వుండే అవకాశం వుంటుంది. ఈ అంశం మీద పనిచేస్తున్న పౌర సమూహాలేమీ వీటిని ఛారిటీగా చూడటం లేదు, అలా చేయటం కూడా లేదు. దీనిని ప్రజారోగ్యంతో ముడిపడిన రాజకీయ అంశంగానే అర్థంచేసుకుని పనిచేస్తున్నారు. అధికారం వుండటం ఉండకపోవటం అనేది అసలు విషయమే కాదు.

కె. సజయ
సామాజిక విశ్లేషకులు, స్వతంత్ర జర్నలిస్ట్

Courtesy Prajatantra

RELATED ARTICLES

Latest Updates