కుల, వర్గ జమిలి పోరాట సిద్ధాంతకర్త ఉసా

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

సుజాత సూరేపల్లి

ఉ.సా (ఉప్పుమావులూరి సాంబశివ రావు 1951-2021) తెలుగు రాష్ట్రాలలో, మార్క్సిస్టు లెనినిస్ట్, బహుజన ఉద్యమాలలో పరిచయం అక్కర్లేని పేరు. అయన గురించి ఒక్క వ్యాసంలో, ఒక్క మీటింగ్ లో చెప్పడం, రాయడం అసాధ్యమైన పని. ఒక విధంగా అది ఒక పెద్ద సాహసం అనే చెప్పాలి. జీవితాంతం ప్రజా ఉద్యమాలని నమ్మి, ఆ క్రమంలో అనేక ఉద్యమ శ్రేణులని కలిసి, ఉద్యమాలని నిర్మించి, ఉద్యమకారులని తయారు చేసిన ఆయన ఒక్కో సమయంలో, ఒక్కో సందర్భాన్ని బట్టి తీసుకున్న చారిత్రకమైన నిర్ణయాలు నేటి తరం వాళ్ళకి చాలా సులువుగా ముందుకు పోవడానికి దోహద పడుతున్నాయి.

ఉసా స్వస్థలం బ్రాహ్మణ కోడూరు, బాపట్ల తాలూకా, గుంటూరు జిల్లా. అయినా తెలంగాణలో ఉంటూ, అనేక పోరాటాలలో భాగస్వామి అయి, తనదంటూ ఒక శైలి, బాణీ, సిద్ధాంతం నిలుపుకున్న వాడు. ఒకే మనిషిలో ఇన్ని పార్శ్వాలుండడం చాలా అరుదు. అది కూడా ఒక బహుజన జీవితాల నుంచి ఎదిగిన వ్యక్తిలో. కవి, గాయకుడు, రచయితా, కార్యకర్త , సిద్ధాంత కర్త, పరిశోధనా కారుడిగా విప్లవోద్యమాల నుండి కుల ఉద్యమాల వరకు అనేక చారిత్రిక అనుభవాల సారాన్ని ఒడిసిపట్టుకున్న మహా మేధావి. ఉద్యమాలకారులకి, ఉద్యమాలకి దశ దిశా చూపిన గురువు. విద్యార్ధులకి, కుల సంఘాలకి, ప్రజా, రాజకీయ సంఘాలకి రాజకీయ తరగతులని, పూలే అంబెడ్కర్ సిద్ధాంతాలని భోదిస్తూ ఉద్యమాల ఉపాధ్యాయుడిగా పేరు తెచ్చుకున్నాడు. మాట ప్రాస, లోతైన అవగాహన, ఆయనకున్న భాష పై పట్టుని తెలియ చేస్తాయి.

ఉసా తెలుగు నేలపై అడుగిడని నేల, సృజించని సామాజిక అంశాలు ఉన్నాయంటే అనుమానమే నాకు. కొండమొదలు గిరిజనుల భూ పోరాటం నుండి నిన్నటి నల్లమల యురేనియం తవ్వకాలు, గ్రానైట్ తవ్వకాలలో మాయం కానున్న కరీంనగర్ సర్వాయి పాపన్న గుట్టలు, పౌరసత్వ చట్టం, కాశ్మీర్, రామజన్మ భూమి అంశం వరకు అయన ప్రయాణం సాగుతూనే ఉంది. కుల నిర్మూలనకి సంబంధించిన ఏ పోరాటం అయినా, ఎంత కష్టం అయినా ఎప్పుడూ ముందుండే నడిపించే వాడు. నేను ‘ఉసా సార్’ (నేను ఇష్టంగా, గౌరవంగా పిలిచే పేరు) గురించి నాలుగు ముక్కలు రాయడం అంటే కేవలం నాకు పరిచయం ఉన్న మేరకు మాత్రమే రాసే సాహసం చేయగలను. నాలాంటి శిష్యులు ఎందరో. కానీ తానెప్పుడూ బొటన వేలు దక్షిణ అడగలేదు. నాకంటే ముందుగా అనేక ఉద్యమాలలో అనేక మంది రచయితలని, సామాజిక కార్యకర్తలని, నాయకులని తయారు చేశారు. వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ఉద్యమానుభవాలను రాస్తే బహుశా ఒక చరిత్ర క్రమం తయారవుతుంది. నిర్మాణం జరుగుతుంది. ఒక్కో కాలానికి, ఒక్కొక్క ప్రాంతానికి, నాయకులని తయారు చేసిన ఘనత, మిగిల్చి పోయిన అనుభవ పాఠాల గౌరవం ఉసా సార్ కే దక్కుతుంది.

నేను రాసే ఈ కొద్దీ మాటలు సముద్రంలో నీటి బిందువు లాంటి ప్రయత్నం మాత్రమే. ఎవరు రాసినా సంక్షిప్త అనుభవం లోంచి మాత్రమే రాయగలరేమో. అయితే మొదటి నుండి చివరి వరకు పరిచయం ఉండి పని చేసి, పరిశోధిస్తున్న వాళ్ళు సమగ్రంగా రాసే వీలుంటుంది.

గాయకుడు, కవి:
ఉసా ఉద్యమ క్రమాన్ని, జీవితాన్ని తెలంగాణ ఉద్యమానికి ముందూ తరువాత 1986కి ముందు తరువాత అంటే కారంచేడుకి ముందు తరువాతగా ఉసా గారిని చూస్తే బాగుంటుందేమో. మొదట తరిమెల నాగిరెడ్డి గారికి కొరియర్ గా పని చేస్తూ ఎమర్జెన్సీలో జైలు జీవితం(1975) గడిపేటప్పుడే జైలులో తనని నేరస్తుడిగా అక్కడ అందరూ చూస్తున్నప్పుడు ‘మేమెందుకిలా మారామో తెలుసా…? అన్న పాటని జైలు గోడల మీద రాసి పాడితే అక్కడ ఉన్న వాళ్ళందరూ కదిలిపోయి బాగా చూసుకున్నారు అని ఈ మధ్య కాలంలో రాజమండ్రి దగ్గర బక్కి శ్రీను అనే దళితుడిని మామిడికాయలు దొంగతనం చేశాడన్న నెపంతో చంపి వేసినప్పుడు నిజ నిర్ధారణ కోసం వెళ్ళినప్పుడు చెప్పారు. పాత రోజులు గుర్తుకు తెచ్చుకుని అప్పుడప్పుడు బాగా పాటలు పాడే వారు.

ఉస్మానియా యూనివర్సిటీలో బీఫ్ ఫెస్టివల్ జరుగుతున్నప్పుడు విద్యార్ధులకి మద్దతుగా వెళ్లడం, ‘ఆహార సంస్కృతి’ గురించి అయన చెప్పే అద్భుత విశ్లేషణ వేరే వారికి చెప్పడం సాధ్యం కాదు. ఒక సారి అయన ఉపన్యాసం వింటే ఇంకా మరిచిపోవడం అంటూ కుదరదు ఎవరికైనా. ఎపుడో రాసిన ‘ఎద్దు కూర తిన్నోడే భలే ముద్దు ముద్దుగున్నాడే … పాట పాడేవాడు. ఆయన పాటలు, నాటక రచనలు పుస్తకంగా తీసుకురావాల్సి ఉంది. ఇంకా అందరికీ నచ్చిన, చాలా ప్రాచుర్యంలోకి వచ్చిన పాట ‘జోలాలి పాడాలి ..’. రైతాంగ గిరిజన పోరాటాలు, వెట్టి చాకిరీ, తెలంగాణలో కరువుపై పని చేసిన ఉసా అనుభవం కారంచేడు నుండి కులం వైపు మళ్లిందని చెపుతుంటాడు.

1985 ‘కారంచేడు దళితులపై అగ్రకుల ‘కమ్మ’ భూస్వాముల మారణ కాండ’ అని కరపత్రం తెచ్చినందుకు, ‘కమ్మ’ భూస్వాముల దాడి అని కులం ప్రస్తావన తెచ్చినందుకే ఆయనని పార్టీ నుండి (యూ.సి. సి.ఆర్. ఐ (ఎం ఎల్ ) బహిష్కరించారన్నది అందరికీ తెలిసిన విషయం. చాలాసార్లు ఆయన మాతో పంచుకున్నారు.

సాధారణంగా ఒక సిద్ధాంతాన్ని నమ్మి, దాంట్లో ఇమిడే అంశం వచ్చినప్పుడు మాత్రమే అక్కడికి పోయి, పాల్గొని, స్పందిస్తారు చాలామంది. కానీ ప్రతి అంశం కూడా అన్ని కోణాలలో చూడాలని, విడిగా ఏది ఉండదని ముందుకు పోయే దృక్పథం ఉసా సార్ కి మాత్రమే ప్రత్యేకం. ఒక సంస్థలో విభేదించి కానీ, అనేక కారణాల వల్ల కానీ బయటకి వచ్చిన వాళ్ళు అప్పటివరకు తాము నమ్ముకున్న సిద్ధాంతం మీద దుమ్మెత్తి పోస్తూ ఉంటారు. కానీ సార్ ఎప్పుడు విప్లవ పార్టీల గురించి సద్విమర్శ నే చేసేవాడు కానీ తప్పుగా కానీ, అవసరం లేదని కాని ఎప్పుడు ఎవరికీ చెప్పలేదు.

ఉసాతో దాదాపు రెండు దశాబ్దాల పరిచయం. కానీ పోలేపల్లి 2007 ప్రత్యేక ఆర్థిక మండళ్లపై జరిగిన భూ పోరాటం నుండి ఇప్పటి వరకు దాదాపు కలిసే పని చేస్తున్నాం. మాలాంటి వాళ్లకి ఉద్యమ తీరుతెన్నులు చెపుతూ, ఉద్యమ క్రమంలో రాజ్యంతో, ఇతర సంఘాలతో సమస్యలు ఎదురైనప్పుడు ఆయన తనకున్న అపార అనుభవంతో చాలా సులువుగా సమాధానం చెప్పేవారు. అట్లా మాలాంటి వాళ్లకి, ఉద్యమాలకి పెద్ద దిక్కు అయినాడు. మాలాంటి వాళ్లకి సైద్ధాంతిక అవగాహన, ఉద్యమ నిర్మాణం, ముందు తరువాత చేసే పనులు అన్నిటిలో ఉసా గారున్నారు. ఆయన నిరంతరం చాలా ఉత్సాహంగా ఉండటానికి కారణం వ్యక్తిగత జీవితం నుండి కాక ప్రజలని, ఉద్యమాలని విపరీతంగా ప్రేమించడమే కారణం కావచ్చు. కుల నిర్మూలన దృక్పథం లేనిదే ఈ దేశం లో ఏ ఉద్యమం ఫలితాలివ్వదని బలంగా నమ్మిన వారు ఉసా. దాని కోసం అన్ని ఉద్యమ శ్రేణుల్ని ఐక్యం చేయడానికి నిరంతరం శ్రమించాడు.

ఆయన ఉద్యమ ప్రయాణం మొదట నాస్తిక వాదం. తరువాత హేతువాదం. మావో వాదం నుండి పూలే, అంబేడ్కర్ వాదం వరకు వచ్చి, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రాజకీయ పోరాటాలే బహుజనులకు కుల పీడన నుండి కాపాడుతాయి అని చెప్పేవారు. అదే ఆచరణలో కూడా పెట్టారు. తెలంగాణలో కమ్యూనిస్ట్, విప్లవ పార్టీలలో కులం ప్రస్తావన తెచ్చింది మారోజు వీరన్న. అప్పుడు వచ్చిన నినాదం దొరల తెలంగాణ కాదు, బహుజన తెలంగాణ కావాలని. దళిత బహుజన శ్రామిక విముక్తి పార్టీ స్థాపనలో కీలక పాత్ర వహించి, బహుజన కమ్యూనిస్ట్ పార్టీ అవగాహనలలో మార్పుకి దోహదం చేశారు. కారంచేడు నుండి నేటి పాతపల్లి, కందికట్కూరు దళితుల భూ పోరాటం, సెంట్రల్ యూనివర్సిటీ రోహిత్ వేముల హత్య, గూడూరు శుశ్రుత, దేవాంశ్, మిర్యాలగూడెం ప్రణయ్, అమృత నుండి నిరంతరం కొనసాగుతున్న దళిత ఉద్యమాలలో ముందున్నారు.

తెలంగాణా రాష్ట్రం తరువాత పూర్తిగా కుల నిర్మూలన కొరకు, కులాంతర, ప్రేమ వివాహాల హత్యలపై నిత్యం స్పందిస్తూ రావడమే కాకుండా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చార్టర్ అఫ్ డిమాండ్స్ పెట్టి, ఒక చిన్న పుస్తకం వేసినరు. అదే క్రమంలో కులాంతర వివాహాల ద్వారా కుల నిర్మూలన సాధ్యం అని విపరీతమైన ప్రచారం చేయడమే కాకుండా, హై కోర్ట్ లో పిల్ కూడా వేసి సుదీర్ఘ పోరాటానికి తెరతీయడం ఒక్క ఉసా కమిట్మెంట్ కి నిదర్శనం. తెలంగాణా లో జరిగిన అనేక కుల హత్యలు, హింస, దోపిడీ పోరాటాలో పాల్గొంటూనే వాటిని దేశీ దిశ యూట్యూబ్ ఛానెల్ ద్వారా డిజిటల్ మాధ్యమంలోకి వెళ్ళేటట్టు చూసేవారు. పోలేపల్లి నుండి నేను నేర్చుకున్నది ముఖ్యంగా తెలంగాణ జరిగే ఉద్యమాలు అన్ని డిజిటైస్ చేయడం, భావి తరాలకి అందించడం, చరిత్రని భద్రపరచడం. బహుజన ఉద్యమాలు, కుల నిర్మూలన ఉద్యమాలు ఎప్పుడూ అనుకున్న స్థాయిలో రికార్డ్ చేయబడలేదు. చేయరేమో కూడా. ఆ బాధ్యతని దేశీ దిశ యూట్యూబ్ ఛానెల్ ద్వారా పూర్తి చేసే ప్రయత్నం మాత్రం 2017 నుండి ప్రారంభం అయింది.

బహుజన ప్రతిఘటన వేదిక:
ప్రొఫెసర్ ఐలయ్య పై హిందూత్వ దాడులను ఖండిస్తూ అటు ఆంధ్రాలోనూ ఇటు తెలంగాణ లోను ఉసా ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. బహుజన ప్రతిఘటన వేదిక బ్యానర్ పై జిలుకర శ్రీనివాస్, పసునూరి రవీందర్, నేను ఇతర మిత్రులు మొదటి కార్యక్రమం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అనేక సంఘాలు, వ్యక్తుల మధ్యలో జరపడం తరువాత దాని కొనసాగింపు తెలంగాణ సాంస్కృతిక వేదిక కేంద్రంలో ఒక సమాఖ్య గా దాదాపు 60 సంఘాలకి పైగా భాగస్వామ్య సంఘాలతో జరిగింది. దానికి నన్ను కన్వీనర్ గా, ఉసా గారిని కూడా కో ఆర్డినేటర్ గా కంచె ఐలయ్య గారు ఇతరులు ప్రతిపాదించారు. అక్కడ మొదలైన బ.ప్ర. వే నేటి వరకు అనేక కార్యక్రమాలని చేస్తూ ఉంది. యూనివర్సిటీలో లెఫ్ట్ విద్యార్థులకి, మనువాద విద్యార్థి సంఘాలకి ఘర్షణ జరిగినప్పుడు ఉసా హుటాహుటిన వెళ్లి అక్కడ పొలీసు వారితో, ప్రెస్ వారితో మాట్లాడి ధైర్యాన్ని నింపే వాళ్ళు. బహుజన ఉద్యమాలని ఈ వేదిక ద్వారా అంతర్జాతీయ స్థాయిలో కూడా తీసుకుపోవడమే కాకుండా అనేక పరిశోధనలు జరపడానికి ఉపయోగపడుతున్నది కూడా.

ప్రయివేట్ చదువులు, విద్యా సంస్థలలో ఇదివరకు లాగా రాజకీయ విద్యార్థి సంఘాలు కానీ లేకపోవడం, వాళ్లకి ఇతరత్రా వేరే అంశాల పై అవగాహన ఉండడం ఈ కాలంలో కష్టం. ఇట్లాంటి సందర్భంలో ఉసా లాంటి వారు సమాజానికి, విద్యార్థుల చైతన్యానికి, ఎదుగుదలకి అవగాహన కల్పించడానికి చాలా అవసరం. తెలంగాణ వచ్చిన తరువాత తెలుగు అకాడెమి వాళ్ళు తెలంగాణ ఉద్యమం పై పోటీ పరీక్షల కోసం పుస్తకం ఒక వేస్తే అందులో తెలంగాణ ఉద్యమం భోనగిరి, వరంగల్, సూర్యాపేట డిక్లరేషన్ పై తప్పులున్నాయని గమనించి అవి రాస్తున్న ప్రొఫెసర్లకు అవగాహన కల్పించడం నాకు ఇంకా గుర్తు ఉంది. వెంటనే సూర్యాపేట డిక్లరేషన్ పై ఒక పుస్తకం కూడా తీసుకొచ్చారు.

ఆయన కుల వర్గ సిద్ధాంతాలకు వారధిగా ఉంటూ, సమకాలీన ఉద్యమాలలో మమేకమయ్యే వారు. బ్రాహ్మణ భావజాలానికి వ్యతిరేకంగా జ్ఞానం ఎప్పుడు పది మందికి పంచాలన్నది ఆయన ముఖ్యోద్దేశ్యం. ఎప్పుడూ సమాజానికి సంబంధించిన పుస్తకాలు కొనిస్తూనో, పంచి పెడుతూనో, భోదిస్తూనో ఉండే వాడు. ఇప్పటికి ఇతర దేశాలలో ఉన్న వాళ్ళు కులం, వర్గం మీద పరిశోధన కొరకు వస్తే ఖచ్చితంగా ఉసా దగ్గరికి రావాల్సిందే. ప్రతి ఒక్కళ్ళు చెప్పేది ఆయన పేరే. రెండు ఉద్యమాలలో ప్రత్యక్ష అనుభవం అపారంగా ఉండడం, ఎటువంటి భేషజాలు లేకుండా అన్ని వయసు వాళ్ళ ని దగ్గరికి తీసుకుంటూ, నిరంతరం తనని తానూ అందరికి అందుబాటులో ఉంటూ, అతి సులువైన భాషలో అందరికి అర్థం అయేటట్టు మాట్లాడుతూ, ఉపన్యసిస్తూ, ఆర్ధికంగా , హార్థికంగా అండగా ఉంటూ ఉద్యమకారుగాడిగా, మేధావిగా కొనసాగుతున్నది ఉసా ఒక్కడే.

పరిశోధనా రంగం:
ఉసా గురించి చాలా మందికి తెలియని విషయం, ఆయన ఒక గొప్ప స్కాలర్. కుల వర్గ దృక్పథం మీద ఏ యూనివర్సిటీ, పరిశోధనా సంస్థలలో రీసర్చ్ జరుగుతుందో జరగదో గానీ ఉసా ఆఫీసులో, ఇంట్లో 30 ,40 ఏళ్ల క్రితం నుండి చర్చలు, కరపత్రాలు, వ్యాసాలూ, పుస్తకాలు మాత్రం దొరుకుతాయి. దాదాపుగా ఇంగ్లిష్, తెలుగు పది పేపర్లు, పత్రికలూ తెప్పించి ప్రతి రోజు అన్ని చదవడమే కాకుండా, ముఖ్య అంశాలకి సంబంధించిన వాటిని ఒక దగ్గర పెట్టి బైండింగ్ చేయించడము, విడిగా డిజిటైస్ కూడా చేయించే వారు. రేపటి తరానికి అన్నీ ఒక దగ్గర దొరకాలని అయన తపన. ఉదాహరణకి ఒక పౌరసత్వ చట్టం మీద ఉద్యమం జరుగుతుంది అంటే దాని మీద లోతైన అవగాహన కోసం అనేక పత్రికలూ, గ్రంథాలు తెప్పించి చూసే వారు, రాసేవారు. చిన్న వేదికలో మాట్లాడడానికి అయినా పూర్తి సమాచారంతో, నోట్స్ తో ఉండేవారు. అది కూడా నేటి తరం నేర్చుకోవాల్సిన ముఖ్య విషయం. సత్యమూర్తి కాలం నాటి ఎదురీత నుండి నేటి దేశీ దిశ త్రై మాసిక పత్రిక దాకా ఒక సుదీర్ఘ ప్రయాణం చేస్తూ కుల, వర్గ సమస్యలపై వచ్చిన భిన్న దృక్పధాలను ఆన్లైన్ లో అందరికి అందుబాటులో ఉంచే ప్రయత్నం జరుపుతున్నారు. ఇన్ని పనుల మధ్య ఒక పత్రికకి సంపాదకుడుగా ఉండడం అంటే మామూలు విషయం కాదన్నది మనకి తెలుసు. ఒక వైపు పత్రిక పని, అనేక పుస్తకాల రచన, ప్రచురణ చేపట్టేవారు. బహుశా ఉసా గారికి 24 గంటలు సరిపోవేమో అనిపించేది.

విస్తృతమైన వ్యక్తిత్వం:
ఉసా గారు కనిపించే మనిషి వేరు, ఆయన వచ్చిన కుటుంబ నేపధ్యం, ఉద్యమ నేపధ్యం చూస్తే ఒక విధమైన భావన కలుగుతుంది. కానీ మనకి కనిపించని ఎన్నో భిన్న కోణాలు ఉన్న మనిషి ఉసా. ఆయన మార్క్సిస్టు శిబిరం నుండి పూలే, అంబేడ్కర్ శిబిరం వరకు వచ్చి మద్దతు నివ్వడం, ఆంధ్ర ప్రాంతానికి చెందినా తెలంగాణాకి అది కూడా సామాజిక తెలంగాణ నినాదంతో తెలంగాణ ప్రాంతం అంతా తిరిగి పరిచయం చేయడం, సామాజిక తెలంగాణ ఎందుకు, ఏమిటి అని ఒక పుస్తకం తేవడం, ముఖ్యంగా ఎస్సిలకు బీసీలకు మధ్య ఘర్షణ జరిగితే బీసీ అయి కూడా ఎస్సి ల వైపే ఉండడం ఉసా గొప్ప పర్సనాలిటీకి నిదర్శనం. తన వయసుకు తగ్గ ఆలోచనలు ఉన్నా లేకపోయినా అన్ని వయసు వాళ్లకి దగ్గర అవడం, సమానంగా చూడడం, తన ఆలోచన ల వైపు మళ్లించడం చూడొచ్చు. ఇక స్త్రీల ఉద్యమంలో మగవాళ్ళు ఫెమినిస్ట్ దృక్పథంతో పని చేయడం కూడా చాలా అరుదు. అందుకే కుల, వర్గ, జెండర్ , మతాలకి భిన్నంగా ఉసాకు అభిమానులు ఉండడంలో ఆశ్చర్యం ఏమి లేదు.

దాదాపుగా 60 సంఘాలకి పైగా స్థాపించి పని చేశారని చెపుతుంటారు అంటే అన్ని శ్రేణుల్ని, అన్ని సందర్భాలని కల గలుపుకు పోవాలని ఆరాటం. మొన్నటికి మొన్న కాపులని బీసీలలో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ పోరాటం నిర్మించడం , ఒక పుస్తకం కూడా తీసుకొచ్చారు. తరువాత బీసీ మానిఫెస్టో రెండు సార్లు ముద్రణ అయింది. బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ లో సామాజిక అవగాహన తరగతులు నిర్వహించే వారు కూడా. కమ్యూనిస్టు కార్యకర్తలంతా మన వాళ్ళే కదా అనే వాళ్ళు.

ఈ దేశంలో వర్గ పోరాటాలు మాత్రమే విప్లవ పోరాటాలు అని, రక్తపుటేరులు పారనిదే ఉద్యమం కాదనే వాదాన్ని బుద్ధుడు, ఫూలే అంబేడ్కర్ వాదులు ఒప్పుకోవడం కష్టం. పైగా సామాజిక పోరాటాలని అస్తిత్వ ఉద్యమాలకి కుదించి, ఆర్ధిక అంశాలు పునాది అని, కులం సామాజిక అంశాలు ఉపరితలానికి చెందినవని సూత్రీకరణ చేసారు. అట్లా అయితే పూలే, అంబేడ్కర్ ల ఉద్యమాలని ఎట్లా అర్థం చేసుకుందాం? అక్కడ రక్తపాతం లేదా అంటే నిరంతరం ఉంటుంది. ఈ వ్యాసం రాసే సమయంలో కూడా దళిత, ఆదివాసీలపై ఎక్కడో ఏదో ఒక నేరం, ఘోరం జరుగుతూనే ఉంటుంది.

దేశీ దిశ -2015:
2015లో మార్క్స్, పూలే , అంబేడ్కర్ సైద్ధాంతిక అవగాహనతోని, ఎదురీతకి కొనసాగింపుగా ఒక పత్రిక ఉండాలని దాదాపు ఒక ఆరు నెలలు చర్చోపచర్చలు చేసి ఒక త్రైమాసిక పత్రికని తాను వ్యవస్థాపక సంపాదకుడిగా, నన్ను సంపాదకురాలిగా పెట్టి పత్రిక తీసుకు రావడం జరిగింది. సత్యమూర్తి ద్వారా నేను ఎదురీతకి ఎడిటర్ ని అయ్యాను, నా ద్వారా నువ్వు దేశీ దిశకు అవుతున్నావు, నా కొనసాగింపు నువ్వు అని ఎన్నో సార్లు చెప్పెవారు. ఈ పత్రిక ఆవిర్భావ సభకి పూణేలో ఉన్న సామాజిక కార్యకర్త విలాస్ సోనావానే, ఆంధ్ర జ్యోతి ఎడిటర్ కె. శ్రీనివాస్, అల్లం నారాయణ వచ్చి మొదటి పత్రిక విడుదల చేశారు. పెద్ద నోట్ల రద్దు, హిందుత్వ శక్తుల దాడులు, నయీమ్ హత్య పై కొన్ని సంచికలు తీసుకుని రావడం తరువాత యూట్యూబ్ ఛానెల్ , వెబ్సైట్, స్థూడియో కూడా అనేక వ్యయ ప్రయాసలకోర్చి పెట్టారు. తెలుగు రాష్ట్రాలలో జరిగే అన్ని ప్రజాస్వామిక పోరాటాలని, సమావేశాలని ఒక దగ్గర పెట్టాలని ఇద్దరం కోరుకునే వాళ్ళం. పాత పుస్తకాలు, ఎదురీత సంచికలు అన్ని కూడా డిజిటైస్ చేసే కార్యక్రమం నిత్యం జరుగుతుంది. ఎన్నో అరుదైన పుస్తకాలతో ని ఒక ఉచిత లైబ్రరీ కూడా పెట్టారు. ప్రజలకి అందుబాటులో ఉండాలని తన కోరిక.

నిరంతర పఠన శీలిగా ఉంటూ, అన్ని సమకాలీన అంశాలపై పత్రిక రావాలని అనే వాడు, భాస్కర్ బొడ్డు గారు వర్కింగ్ ఎడిటర్ గా వచ్చాక వెబ్సైట్ తెలుగు పాఠకులకి జాతీయ, అంతర్జాతీయ వార్తలని అందించేదిగా తయారు అవుతుంది. ఇంగ్లీష్ లో వచ్చిన చాలా ముఖ్యమైన సమాచారం ఉన్న పుస్తకాలు, ఆర్టికల్స్ తెలుగులో రావాలని, ఎంత ఖర్చు అయినా వెనకాడకుండా తెలుగులోకి తీసుకొచ్చి వెబ్సైట్ లో పెట్టేవారు. ఈ మధ్య కాలంలో అనేక అంశాలపై స్థూడియోలో చర్చలు kaikaluru.infoలో చూడొచ్చు.

ఇంకొక ముఖ్య మైన విషయం, ఇప్పటి తరం వారు తమకు, తమ కుటుంబానికి తరతరాలకు సంపాదన మిగుల్చుకోవాలని చూస్తే , తనకు ఉన్న ప్రతి పైసా కూడా ప్రజా ఉద్యమాలకి, సహాయం కోరి వచ్చే వారికి, దేశదిశ కి ఖర్చుపెట్టడం ఉసాకే సాధ్యం. ఎంత వెతికినా, చూసినా మళ్ళీ రారు అటువంటి మహానుభావులు అనిపిస్తుంటుంది. ఆయన జీవితంలో 24 గంటలు ప్రజలకే అంకితం.

చివరి సంభాషణలో కోవిడ్ టెస్ట్ కోసం పోతున్నా అని చెపుతూ ‘అమ్మా నువ్వు కోవిడ్ అవగాహన కొరకు పని చేస్తున్నావు కదా మన దేశీ దిశలో కూడా ఒక ప్రత్యేక మైన విభాగంగా ప్రజలకి అవగాహన కొరకు పెడదాం’ అని చెప్పారు. బహుశా కోవిడ్ కి బలి అయితా అని సార్ అనుకోని ఉండక పోవచ్చు. ఇంతకన్నా తన నిబద్ధతకి ఏమి తార్కాణం చెపుతాం. తెలుగు, బహుజన సమాజం ఒక మేధావిని కోల్పోయింది. వ్యక్తిగతంగా, సామాజిక ఉద్యమాలకి పెద్ద లోటు. కానీ ఖచ్చితంగా ఆయన ఆశయాలని కొనసాగిస్తాం. అందరు ప్రాజాస్వామికవాదులు కుల, వర్గ జమిలి దృక్పథంతో పని చేయడంపై ఆలోచిస్తే అదే ఆయనకి ఘన నివాళి.

సుజాత సూరేపల్లి
సామాజిక కార్యకర్త. శాతవాహన యూనివర్సిటి , కరీంనగర్, సామాజిక శాస్త్రం విభాగాధిపతి. ఉస్మానియా యూనివర్సిటి నుండి ‘దళిత మహిళా సాధికారత’ పై పి.హెచ్. డి చేసారు. కులం, జెండర్, పర్యావరణం, మానవ హక్కుల పై అనేక వ్యాసాలు, పుస్తకాలు వేసారు. అనేక సామాజిక ఉద్యమాలలో ప్రత్యక్షంగా పాల్గొంటూ, నిర్మిస్తూ బహుజన ప్రతిఘటన వేదిక, భూమి రక్షణ సంఘం కన్వీనర్ గా ఉన్నారు. ‘దేశి దిశ’ పత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Courtesy Kolimi

RELATED ARTICLES

Latest Updates