భవన నిర్మాణ కార్మికులకు రక్షణ ఏది..?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

ప్రపంచ వ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న కరోనా మహమ్మారి మనదేశంలో, రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తున్నది. మార్చి 24 నుంచి లాక్‌డౌన్‌ ఉండటంతో చేయడానికి పనులులేక, కుటుంబ ఖర్చులు తీరక నిరుపేదలైన తాపీ మేస్త్రీలు, మట్టి పనివాళ్ళు, కార్పెంటర్స్‌, పెయింటర్స్‌, ఫ్లంబర్స్‌, కరెంట్‌ వర్కర్స్‌, మార్బుల్‌ వర్కర్స్‌, రాడ్‌ బెండర్స్‌, ఆడ, మగ కూలీలు, ఇటుక బట్టీల కార్మికులు తదితర 5రకాల వృత్తులు చేసే రాష్ట్రంలోని 20లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు గత 4 నెలలుగా సరైన తిండిలేక పనులు నడవక పస్తులతో జీవిస్తున్నారు.

కరోనా బారి నుంచి భవన నిర్మాణ కార్మికులను ఆర్థికంగా ఆదుకోవడం కోసం రాష్ట్రాల వెల్ఫేర్‌ బోర్డుల నుంచి ఆర్థిక సహాయం అందించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాలను అనుసరించి ఢల్లీీ రాష్ట్ర ప్రభుత్వం రెండు దఫాలుగా రూ.10,000, పంజాబ్‌ ప్రభుత్వం మూడు దఫాలుగా రూ.9,000, హర్యానా ప్రభుత్వం వారానికి రూ.1,000 చొప్పున ఐదు వారాలు రూ.5,000, కేరళ ప్రభుత్వం రూ.3,000, 17రకాల నిత్యావసర వస్తువులు పంపిణీ, రాజస్థాన్‌ ప్రభుత్వం రూ.3,500, మధ్యప్రదేశ్‌, అస్సాం, మహారాష్ట్ర, తమిళనాడు ప్రభుత్వాలు రూ.2,000 చొప్పున, త్రిపుర, బీహార్‌, ఒడిస్సా, మణిపూర్‌, ఉత్తరప్రదేశ్‌, జమ్మూ కాశ్మీర్‌ తదితర రాష్ట్ర ప్రభుత్వాలు శక్తిమేరకు ఆ రాష్ట్ర వెల్ఫేర్‌ బోర్డుల నుంచి ఆర్థిక సహాయాలను అందించి భవన నిర్మాణ కార్మికులను ఆదుకున్నాయి. ధనిక రాష్ట్రం అని గొప్పలు చెప్పుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం మాత్రం వెల్ఫేర్‌ బోర్డులో నిధులు పుష్కలంగా ఉన్నా నేటికీ పైసా కూడా అందజేయకపోవడం విచారకరం.

”దారి మళ్ళించిన రూ.1,000 కోట్ల నిధులు”
ఏప్రిల్‌ 1న వెల్ఫేర్‌ బోర్డులో పేరు నమోదు చేసుకునన్న ప్రతి కార్మికుడికి రూ.1,500 ఇవ్వాలని బోర్డు నిర్ణయించి, ఏప్రిల్‌ 3న కార్మిక భవన్‌ నుంచి విడుదల చేసింది. అన్ని జిల్లాల కార్మికశాఖ అధికారులు ఏఎల్‌ఓలు కార్మికుల ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డు, బోర్డు ఇన్సూరెన్స్‌ కార్డు, బ్యాంక్‌ ఎకౌంట్‌ నెంబర్‌ జిరాక్స్‌లు స్థానిక ఏఎల్‌ఓ ఆఫీసులో అందజేయాలని కార్మికులకు వాట్సాప్‌ మెసేజ్‌లు పెట్టారు. కార్మికులంతా వారంరోజుల వ్యవధిలో అధికారులకు తమ ఐడి కార్డులను అందజేసి రూ.1,500 వస్తాయనే ఆశతో ఎదురు చూశారు. నాలుగు నెలలు గడిచినా కార్మికుల అకౌంట్లలో డబ్బులు పడకపోవడంతో భవన నిర్మాణ కార్మికులంతా నిరాశ చెందారు. సంక్షేమ బోర్డు నిర్ణయించిన రూ.1,500 కార్మికులకు అందిచకపోగా, సంక్షేమ బోర్డులో ఉన్న రూ.1,000 కోట్ల రూపాయలు అక్రమంగా, కేంద్ర చట్టం నిబంధనలకు విరుద్ధంగా, రాష్ట్ర వెల్ఫేర్‌ బోర్డు గైడ్‌లైన్స్‌ను ఉల్లంఘించి దొడ్డిదారిన తెలంగాణ ప్రభుత్వం దారి మళ్ళించింది. దారిమళ్ళించిన రూ.1,000 కోట్ల నిధులను తిరిగి వెల్ఫేర్‌ బోర్డులో జమచేసి, వెల్ఫేర్‌ బోర్డులో పేరు నమోదు చేసుకున్న ప్రతి కార్మికునికి రూ.5,000 ఇవ్వాలి. కార్మిక సంఘాలు ప్రతిపక్ష రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండించినా, పలు దఫాలుగా కార్మిక శాఖ కార్యాలయం వద్ద నిరసనలు తెలిపినా చెవిటివాడి ముందు శంఖం ఊదిన చందంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది.
వెల్ఫేర్‌ బోర్డు నుంచి సివిల్‌ సప్లై శాఖకు మళ్ళించిన రూ.1,000 కోట్లు ముఖ్యమంత్రి నిధులు కావు, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు చెందినవి కావు. ప్రతి భవన నిర్మాణ కార్మికుడి నుంచి రూ.10లక్షల పైన వ్యయంతో నిర్మించే ప్రతి నిర్మాణం నుంచి నూటికి రూ.1 చొప్పున వసూలైన సెస్సు నిధులు. కార్మికుల కష్టంతో జమచేసిన నిధులను ”అత్త సొమ్ము – అల్లుడు దానం” చేసినట్టుగా ముఖ్యమంత్రి రేషన్‌ కార్డు ఉన్న కుటుంబానికి రూ.1,500 ఇస్తానని ప్రజలకు హామీనిచ్చి, ఆ హామీని నెరవేర్చుకు నేందుకు భవన నిర్మాణ కార్మికుల నోట్లో మట్టికొట్టి సంక్షేమ బోర్డు నుంచి రూ.1,000 కోట్లు దారి మళ్ళించడం న్యాయమా? రేషన్‌కార్డు ద్వారా ఇచ్చే రూ.1,500కు, వెల్ఫేర్‌ బోర్డు నిర్ణయించిన రూ.1,500కు లింకుపెట్టి బోడి గుండుకు మోకాలికి ముడేసినట్టు సీఎం వెల్ఫేర్‌ బోర్డు నిర్ణయించిన రూ.1,500 కూడా నిర్మాణ కార్మికులకు ఇవ్వకపోవడం అన్యాయం. రేషన్‌కార్డు లేకుండా భవన నిర్మాణ వెల్ఫేర్‌ బోర్డు కార్డు ఉన్నవారు 2లక్షల మందికిపైగా ఉన్నారు. నెలనెలా బియ్యం తీసుకోనివారు 8లక్షల మంది ఉన్నారు. సుమారు 10లక్షల మందికి ప్రభుత్వం ఇచ్చిన ఏ సహాయం అందలేదు. వీరిలో అత్యధికులు భవన నిర్మాణ కార్మికులు, వలస కార్మికులే.

తెలంగాణ భవన, ఇతర నిర్మాణ సంక్షేమ బోర్డులో 2014 నుంచి 2020 మార్చి నాటికి రూ.22,14,17,85,047లు జమ అయినాయి. ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణకు రావాల్సిన వాటా రూ.450 కోట్లు బ్యాంకులో జాయింట్‌ ఖాతా క్రింద మూలుగుతున్నాయి. ఈ ఆరు సంవత్సరాలలో అన్నిరకాల నష్టపరిహారాలు కలిపి కార్మికుల కోసం ఖర్చు చేసింది రూ.400 కోట్లు మాత్రమే. భవన నిర్మాణ సంక్షేమ బోర్డులో ఇంకా రూ.2,214 కోట్ల పైగా నిధులు ఉన్నా కరోనా కష్ట కాలంలో నిర్మాణ కార్మికులను ఆదుకోవడంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ భవన నిర్మాణ కార్మికుల కడుపులు మాడుస్తున్నది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఈ ఆరు సంవత్సరాలుగా హైదరాబాద్‌ నగరం, రంగారెడ్డి, మేడ్చల్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో సెస్సు వసూలు చేయడంలేదు. 2017 నుంచి 2019 వరకు మూడు సంవత్సరాలలో ప్రభుత్వం పర్మిషన్‌ ఇచ్చి నిర్మించిన భవనాలు 40 వేలు, వాటిలో 83 నిర్మాణాల నుంచి మాత్రమే సెస్సు వసూలు చేశారు. మిగతా నిర్మాణాల నుంచి సెస్సు వసూలు చేసి సంక్షేమ బోర్డులో జమచేయడంలో జిహెచ్‌ఎంసి అధికారులు, కార్మికశాఖ అధికారులు ఒకరి మీద ఒకరు పెట్టుకొని తాము వసూలు చేయలేమని చేతులెత్తేశారు. మెట్రో రైలు, ఎల్‌ అండ్‌ టి రూ.162 కోట్లు, మిషన్‌ భగీరథ కాంట్రాక్టర్లు రూ.368 కోట్లు, కాళేశ్వరం ప్రాజెక్టు, ప్రగతి భవనం, మంత్రులు, ఎంఎల్‌ఏల వసతి గృహాలు, ప్రభుత్వ, ప్రయివేట్‌ కట్టడాల నుంచి నిష్పక్షపాతంగా సెస్సు వసూలు చేస్తే మరో రూ.2,000 కోట్లు సెస్సు బోర్డులో జమఅవుతాయి. కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాల్సిన కార్మికశాఖ ఎందుకు పట్టించుకోవడం లేదు. సెస్సు వసూలు చేయని అధికారులపై ప్రభుత్వ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు, కార్మికశాఖా మంత్రి, జీహెచ్‌ఎంసీ శాఖా మంత్రులు, ఈ శాఖల అధికారుల పనితీరుపై ఎందుకు సమీక్ష చేయడం లేదు? విజిలెన్స్‌ విభాగం నివేదిక ఇచ్చినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?
గత సంవత్సర కాలంలగా ప్రమాద మరణాలు, సహజ మరణాలు, వివాహ కానుకలు, ప్రసూతి సహాయం, ప్రమాదం జరిగిన సందర్భంగా హాస్పిటల్‌ సహాయాలు తదితర పెండింగ్‌ కేసులు అనేక జిల్లాల్లో ఉన్నాయి. పెండింగ్‌ క్లైమ్స్‌కు నిధులు విడుదల చేయాలని పలు దఫాలుగా నిరసన కార్యక్రమాలు చేసి అధికారులకు రిప్రజెంటేషన్‌ అందజేసినా అనేక కారణాలు చెప్పి కార్మికులకు నష్టపరిహారాలు అందజేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తున్నది. నిర్మాణ కార్మికులకు ఏ సంబంధం లేని సివిల్‌ సప్లయి శాఖకు రూ.1,000 కోట్ల నిధులు మళ్ళించింది, పాపికొండల్లో పడవ ప్రమాదంలో మరణించిన వారికి రూ.6 లక్షల 30 వేలు చొప్పున అందజేసిన ప్రభుత్వం, వెల్ఫేర్‌ బోర్లు కార్డు ఉన్న లబ్ధిదారులకు నష్టపరిహారాలు అందజేయకుండా భవన నిర్మాణ కార్మికుల జీవితాలతో ఆడుకుంటుంది.
ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే కార్మిక సంఘ ప్రతినిధులతో వెల్ఫేర్‌ బోర్డు అడ్వజరీ కమిటీని నియమించి బోర్డులో వస్తున్న సమస్యలు పరిష్కరించాలి. కరోనా కష్టకాలంలో భవన నిర్మాణ కార్మికులకు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు అందజేసినట్లుగా వెల్ఫేర్‌ బోర్డులో పేరు నమోదు చేసుకున్న ప్రతి కార్మికునికి రూ.5,000 నష్టపరిహారం అందించాలి. వెల్ఫేర్‌ బోర్డు నిర్ణయించిన నెలకు రూ.1,500 తక్షణమే అందజేయాలి. దారి మళ్ళించిన రూ.1,000 కోట్లు తిరిగి బోర్డులో జమచేయాలి. ఏడాది కాలంగా పెండింగ్‌లో ఉన్న క్లైమ్స్‌కు నిధులు విడుదల చేయాలి. 2020 మార్చి నుండి ఆగస్టు వరకు రెన్యువల్‌తో నిమిత్తం లేకుండా నష్టపరిహారాలు అందించాలి. కేంద్ర చట్టంలోని అన్ని స్కీమ్‌లను రాష్ట్రంలో అమలుచేయాలి. ఈ సమస్యల పరిష్కారం కోసం భవన నిర్మాణ కార్మికులంతా ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి.

వంగూరు రాములు
సెల్‌: 9490098247

 

RELATED ARTICLES

Latest Updates