ఉద్యోగాల భర్తీ ఏది?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

అల్లు రాజు

కరోనా ఒక్క బాధితులనే కాదు, ఉద్యోగులనూ, ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతనూ భయాందోళన లకు గురిచేస్తోంది. ఐ.టి రంగంలో అత్యధిక జీతాలు పొందిన వారితో సహా వివిధ ప్రయివేటు కంపెనీల్లో పనిచేస్తున్న వివిధ కేటగిరీల ఉద్యోగులు తమ ఉద్యోగ భద్రతపై ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగ భద్రత ప్రభుత్వ ఉద్యోగుల్లో తప్ప ప్రయివేటు కంపెనీల్లో కాదని కరోనాతో మరింత రుజువైంది. ఉన్నత విద్యనభ్యసించి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారి ఆశలు అడియాశలు అవుతున్నాయి. వివిధ శాఖల్లో ఖాళీలను శాశ్వత ప్రాతిపదికన భర్తీకి చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచించకపోవడమే ఇందుకు కారణం. ఆర్థిక మాంద్యానికి తోడు కరోనా సష్టించిన సంక్షోభం కోలుకోలేనంత తీవ్ర స్థాయిలో వుంది. ప్రముఖ ఆర్థికవేత్త, పద్మభూషణ్‌ గ్రహీత కౌశిక్‌ బసు చెప్పినట్లు ఆర్థిక వద్ధిరేటు దెబ్బ తినకుండా చర్యలు చేపట్టాలి. ప్రభుత్వ రంగ పరిశ్రమలు, సంస్థల్ని ప్రయివేటీకరించే తిరోగమన చర్యలు విడనాడి వాటిని బలోపేతం చేసే ఆలోచనలు చేయాలి.

కరోనాతో ఆకస్మిక లాక్‌డౌన్‌ మొదలుకొని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీలేవీ పేద, సామాన్య తరగతులను ఆదుకోలేకపోయాయి సరికదా దిక్కులేనివారిని చేసాయి. రెక్కల కష్టంపై బతుకుతున్న వారంతా వీధిన పడ్డారు. దేశంలో 12.2 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. దేశంలో నిరుద్యోగం తారాస్థాయికి చేరింది. ఉపాధి, నిరుద్యగ సమస్య తీవ్రత పెరుగుతోంది. కరోనా నివారణ చర్యలు సమర్ధవంతంగా అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలం కావడం వల్ల వచ్చిన దుష్ఫలితాలే ఇవన్నీ. లాక్‌డౌన్‌ సడలింపు తరువాత కూడా ఉపాధి సమస్య పోలేదు. వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగంలో ఆశాజనక వాతావరణం లేకపోవడంతో ఉపాధి సమస్య మరింత పెరగనుంది. ప్రస్తుతం దేశంలో 36.2శాతం మంది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. ఉద్యోగాలు చేస్తున్న వారికి తమ ఉద్యోగం ఉంటుందో, ఊడిపోతుందో అనే భయం వెంటాడుతోంది. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఒ) శత వార్షికోత్సవ సదస్సులో కరోనా మహమ్మారి తరువాత వచ్చేది ఆకలి మహమ్మారేనని హెచ్చరించారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 160కోట్ల మంది ఉపాధికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో దెబ్బ తగిలింది. రానున్న కాలంలో మరో వంద కోట్ల మంది ఉపాధి ప్రమాదంలో పడనుంది. బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ (బీసీజీ), ఐఎంఎఫ్‌ అధ్యయన నివేదికలు కూడా ఇంచుమించూ ఇదే అంచనాలను వెల్లడించాయి.

ఇప్పటి వరకు ఐదున్నర లక్షల మంది ప్రాణాలు హరించిన కరోనా మహమ్మారి ఆధునిక యుగంలో అతిపెద్ద మానవ, ఆర్థిక, సామాజిక సంక్షోభానికి దారి తీస్తుందని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి హెచ్చరించారు. హెల్త్‌ ఎమర్జెన్సీ తరువాత ప్రజల జీవనోపాధి, సంక్షేమం తీవ్రంగా ముందుకొస్తాయని ఐఎల్‌ఒ తెలిపింది. నిరుద్యోగిత రేటు రెండంకెలకు చేరుకున్న దేశాల సంఖ్య మూడు డజన్లకు పైగా ఉన్నట్లు తెలిపింది. వాటిలో ప్రధానంగా అమెరికాలో (10.4శాతం), స్పెయిన్‌లో (20.8 శాతం), బ్రెజిల్‌లో (14.7శాతం), అర్జెంటీనాలో (10.9శాతం), దక్షిణాఫ్రికాలో (35.3శాతం) గ్రీస్‌లో (22.3 శాతం), టర్కీలో (17.2శాతం) నిరుద్యోగం వుంది. భారత దేశంలో నిరుద్యోగిత శాతం పెరుగుతోంది. 2020 ఫిబ్రవరి నాటికి 7.78శాతం ఉంటే అది నేటికి 10.99శాతానికి పెరిగి ఆందోళనకర స్థాయికి చేరుకుంది. భారతదేశంలో నిరుద్యోగితను అరికట్టడంలో ప్రభుత్వాల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడుతోంది.

కరోనాతో దేశంలో 86శాతం మంది ఉద్యోగాలపై ప్రభావం పడుతుందని నిపుణులు చెబు తున్నారు. కరోనా వ్యాప్తి ఎక్కువగా వుండడంతో ఉపాధికి ముప్పు ఏర్పడే పరిస్థితులు వున్నాయి. లాక్‌డౌన్‌తో ప్రజల ఆదాయం పడిపోయింది. దేశంలో ప్రతి ముగ్గురిలో ఒకరి ఆదాయం తగ్గిపోయినట్లు అనేక సంస్థల సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. స్వయం ఉపాధిపై ఆధారపడి బతుకుతున్న వారిలో 62శాతం ఆదాయం పోయింది. ఈ పరిస్థితి ఆరు నెలలపాటు ఐటీ, మీడియా, తయారీ రంగాలపై వుంటుందని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. జనాభాలో 90శాతం మందికి ఉద్యోగాలు కల్పించే నిర్మాణ రంగ పనులు ఆగిపోవడంతో ఉపాధి దెబ్బ తిన్నది. చిన్న వ్యాపారులు నష్టపోయి ఉపాధి కోల్పోయారు. సీఎంఐఈ వివరాల ప్రకారం ఉపాధి కోల్పోయిన 12.2 కోట్ల మందిలో 9.13 కోట్ల మంది చిన్న వ్యాపారులు, కార్మికులు ఉన్నారు. అసంఘటిత రంగంలో పని చేసే కార్మికు లంతా నగరాల్లో పనులు కోల్పోవడంతో దిక్కుతోచని స్థితిలోకి నెట్టబడ్డారు. మోడీ ప్రభుత్వం ఉపాధి కోల్పోతున్న కార్మికులు, కూలీలు, యువతను ఆదుకొనే ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకపోవడం విచారకరం. రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రయోజనాలు బడా కంపెనీలకు తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదు. ఉపాధి కోల్పోయి నష్టపోయిన యువతకు ఎటువంటి చేయూత నివ్వలేదు. ఈ కష్టకాలంలో నిరుద్యోగ భతి ఇవ్వడానికి చేతులురాని మోడీ, వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన విజరుమాల్యా, నీరవ్‌ మోడీ వంటి వారికి రుణ మాఫీ చేశారు. ప్రభుత్వాలు ఇప్పటికైనా ఉద్యోగాల భర్తీకి సత్వర చర్యలు చేపట్టాలి. ఉపాధి అవకాశాలు మెరుగు పర్చాలి. కరోనా తరహా విపత్తులు ఎటు వంటివి వచ్చినా ఎదుర్కొని బతిక గలిగే భద్రత కల్పించాలి.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates