అందరూ కుమ్మక్కైనట్లుంది

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

నివేదికలున్నా గుత్తేదారుపై చర్యలేవీ?
ఇలాంటివాటితో చట్టబద్ధ పాలనపై ప్రజలు విశ్వాసం కోల్పోతారు
తీసుకున్న చర్యలపై వివరాలు సమర్పించండి
నిలోఫర్‌కు ఆహార సరఫరా ఒప్పందంలో అవకతవకలపై హైకోర్టు ఆదేశం

హైదరాబాద్‌: నిలోఫర్‌ ఆస్పత్రిలో ఆహార సరఫరా ఒప్పందానికి సంబంధించిన నిధుల దుర్వినియోగంలో గుత్తేదారుతో అందరూ కుమ్మక్కైనట్లుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. దుర్వినియోగమైన నిధుల్లో సగం మరోచోటికి తరలుతున్నట్లుందని అనుమానం వ్యక్తం చేసింది. గుత్తేదారు కోడూరి సురేష్‌బాబు వ్యవహారంపై రెండు కమిటీలు ఏర్పాటయ్యాయని, రెండూ నివేదికలు సమర్పించినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది. ఇది ఆస్పత్రి సూపరింటెండెంట్‌ అసమర్థతా? లేదా ప్రభుత్వానిదా అన్నది తెలియడం లేదని పేర్కొంది. ఇలాంటి చర్యలతో చట్టబద్ధ పాలనపై ప్రజలు విశ్వాసాన్ని కోల్పోతారని వ్యాఖ్యానించింది.

నిలోఫర్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ సమర్పించిన నివేదిక లోపభూయిష్ఠంగా ఉందని పేర్కొంది. ప్రభుత్వానికి సమర్పించిన రెండు నివేదికలతోపాటు తీసుకున్న చర్యల నివేదికను ఆగస్టు 17లోగా సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను 19వ తేదీకి వాయిదా వేసింది.
కాంట్రాక్టర్‌ కె.సురేష్‌బాబును తొలగించకపోవడంతోపాటు నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపించకపోవడాన్ని సవాలు చేస్తూ డాక్టర్‌ పి.భగవంతరావు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం గురువారం మరోసారి విచారణ చేపట్టింది. ప్రభుత్వ న్యాయవాది రాధివ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ..పిటిషనర్‌ అభ్యర్థించినట్లుగా విచారణ జరిపించి, గుత్తేదారును తొలగించామని, కొత్తవారిని నియమించామని తెలిపారు.

దీనిపై ధర్మాసనం స్పందిస్తూ..ఈ కేసులో సూపరింటెండెంట్‌ ఇచ్చిన నివేదిక చెత్తగా ఉందని, విచారణ జరిపి ప్రభుత్వానికి పంపామని చెప్పి చేతులు దులుపుకొన్నారని పేర్కొంది. నివేదికలో ఏముందో, ఏమి తేల్చారో కోర్టు దృష్టికి తీసుకురాలేదంది. వాస్తవాలను దాచిపెట్టారని, గతంలో 2019లో ఓ కమిటీ ఏర్పాటుచేయగా నివేదిక ఇచ్చినట్లు ప్రస్తుత నివేదికలో పేర్కొందని తెలిపింది. గత కమిటీ నివేదిక ఆధారంగా ఏం చేశారన్నది చెప్పలేదంది. మొదటి నివేదిక ఆధారంగా గుత్తేదారుపై ఎందుకు చర్య తీసుకోలేదని, ఎందుకు కొనసాగించారని ప్రశ్నించింది. నిధులు పక్కదారి పట్టించినా ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని, రూ.లక్షలు దుర్వినియోగమవుతుంటే ప్రతిఒక్కరూ గుడ్డిగా చూస్తున్నారని వ్యాఖ్యానించింది. గుత్తేదారు తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. గుత్తేదారు 30ఏళ్లుగా క్యాటరింగ్‌ విభాగంలో ఉన్నారన్నారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో కాంట్రాక్ట్‌ సైతం ఆయనకే దక్కిందని తెలిపారు. అందులో కాంట్రాక్ట్‌ పొందని వ్యక్తి కేసులు వేయిస్తున్నారన్నారు. వాదనలను విన్న ధర్మాసనం నిధుల దుర్వినియోగంపై రెండు కమిటీలు ఇచ్చిన నివేదికలతోపాటు తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

Courtesy Eenadu

RELATED ARTICLES

Latest Updates