గవర్నర్కు ఆ విచక్షణ ఉందా?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

రాజస్థాన్‌ పరిణామాలతో అధికారాలపై చర్చ
పరిమితులు విధించిన రాజ్యాంగం
అదే చెబుతున్న కోర్టులు

న్యూఢిల్లీ : సుమారు ఇరవై రోజులుగా రాజస్థాన్‌లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు పలు ఆసక్తికర చర్చలకు దారి తీస్తున్నాయి. శాసనసభలో తన మెజారిటీని నిరూపించుకుని ప్రస్తుత రాజకీయ సంక్షోభం నుంచి గట్టెక్కాలని అక్కడి ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ విశ్వప్ర యత్నం చేస్తున్నారు. కానీ దీనికి గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రా మోకాలు అడ్డేస్తూనే ఉన్నారు. అసెంబ్లీని ఏర్పాటుచేయాలని మూడుసార్లు సీఎం గవర్నర్‌కు లేఖ రాసినా.. ఆయన దానికి ఏదో ఒక మెలికపెట్టి వెనక్కి పంపించారు. ఈ నేపథ్యంలో మంత్రిమండలి తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా గవర్నర్‌ వ్యవహరించవచ్చా..? ఆయనకున్న విచక్షణ అధికారాలేంటి..? అనేదానిపై దేశవ్యాప్తంగా ముమ్మరంగా చర్చ జరుగుతున్నది.

అయితే కౌన్సిల్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌ నిర్ణ యాలకు విరుద్దంగా వ్యవహరించే అధికారాలు గవర్నర్‌కు లేవని రాజ్యాంగ, రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతు న్నారు. మరి దీనిపై రాజ్యాంగం ఏం చెబుతున్నది..? కోర్టులు ఏం చెప్పాయి..? అనే దానిమీద జోరుగా విశ్లేషణలు వస్తున్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 163 ప్రకారం.. తన కౌన్సిల్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌ నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యవహరించే ‘సాధారణ విచక్షణాధికారం’ గవర్నర్‌కు లేదు. ఇక ‘గవర్నర్‌ ఎప్పటికప్పుడు శాసనసభ లేదా దాని ప్రతిసభను సమావేశపరిచేందుకు సరైన సమయం, ప్రదేశాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలి’ అని అధికరణం 174(1) చెబుతున్నది.

2016 జులై 13న నబం రెబియా వర్సెస్‌ డిప్యూటీ స్పీకర్‌ కేసులో సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పునిస్తూ.. ‘పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో బాధ్యాతయుతంగా ఎన్నికైన ప్రభుత్వంలో రాజ్యాంగబద్ద పదవిలో ఉండే గవర్నర్‌ సొంత కార్యనిర్వాహకుడి (రియల్‌ ఎగ్జిక్యూటివ్‌)గా వ్యవహరించకూడదు’ అని తెలిపింది. మంత్రిమండలి నిర్ణయాలకు విరుద్దంగా వ్యవహరించే అధికారం ఆయనకు లేదని తీర్పునిచ్చింది. షంషేర్‌ సింగ్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ పంజాబ్‌ (1974) కేసులో ఏడుగురు సభ్యుల ధర్మాసనం స్పందిస్తూ.. ‘తన తోటి మంత్రుల మండలి సలహాల మేరకు పనిచేయడానికి నిరాకరించే హక్కు గవర్నర్‌కు లేదు. ఇది బాధ్యాతయుతమైన ప్రభుత్వ భావనకు విరుద్దం’ అని వ్యాఖ్యానించింది.

భారత రాజ్యాంగంలో పేర్కొన్న దాని ప్రకారం రాష్ట్ర ప్రథమ పౌరుడికి ఉండే అధికారాలు చాలా పరిమితం గా ఉంటాయని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు. ముఖ్యమంత్రి, మంత్రిమండలి పంపే బిల్లులకు అంగీకారం తెలపడం.. ప్రభుత్వం విశ్వాసం కోల్పోయినపుడు సభను రద్దు చేయడం లేదా తిరస్కరించడం వంటి వరకే పరిమితమని చెబుతున్నారు. అయితే గవర్నర్‌ తీసుకునే నిర్ణయాలు ఏకపక్షంగా ఉండకూడదని విశ్లేషిస్తున్నారు. ఏదైనా కారణం చేత కౌన్సిల్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌ చర్యలను వ్యతిరేకిస్తే దానికి కచ్చితమైన కారణం ఉండాలని వివరిస్తున్నారు. కాగా, ‘ఒకవేళ ముఖ్యమంత్రి తన మెజారిటీని కోల్పోయారని గవర్నర్‌ నమ్మితే.. తన విచక్షణను ఉపయోగించి సీఎంను తన మెజారిటీని నిరూపించుకోవడానికి అసెంబ్లీని సమావేశపరిచేందుకు తేదీని నిర్ణయించవచ్చు’ అని నబం రెబియా కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనమే తీర్పునివ్వడం గమనార్హం.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates