ఒకే చితిపై నాలుగు మృతదేహాలు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • విశాలంగా చితి పేర్చి.. పక్క పక్కన పెట్టి దహనం
  • ఎంజీఎంలోని 9 శవాలకు 4 రోజులకు అంత్యక్రియలు
  • ఇక్కడే ఎందుకు దహనాలంటూ స్థానికుల ఆందోళన

వరంగల్‌ అర్బన్‌ : నాలుగు రోజులుగా వరంగల్‌ ఎంజీఎం మార్చురీలోనే ఉన్న కరోనా రోగుల మృతదేహాలకు ఎట్టకేలకు అంత్యక్రియలు జరిగాయి! మృతదేహాలను గురువారం సమీపంలోని పోతననగర్‌ శ్మశాన వాటికకు తరలించి గ్రేటర్‌ వరంగల్‌ సిబ్బంది అంత్యక్రియలు నిర్వహించారు. అయితే చితిని విశాలంగా పేర్చి.. ఒక మృతదేహం పక్కన, మరొకటి, దాని పక్కన ఇంకోటి ఇలా నాలుగు మృతదేహాలను ఉంచి దహనం చేశారు. ఈ విధంగా అంత్యక్రియలు జరపడం అవమానకరమని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. ‘వరంగల్‌లో కరోనా శవ జాగారం’ శీర్షికతో గురువారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఎంజీఎం మార్చురీలో నాలుగు రోజులుగా 9 కరోనా మృతదేహాలు పడివున్నాయని, వాటిని తీసుకెళ్లేందుకు కుటుంబసభ్యులెవరూ రావడం లేదని, అంత్యక్రియల నిర్వహణ ఏర్పాట్లు జరగడం లేదని కథనంలో వివరించింది. ఈ కథనం ప్రభావంతో కదిలిన జిల్లా యంత్రాంగం, ఆఘమేఘాల మీద అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసింది.  పోతన నగర్‌ శ్మశాన వాటికలో ఉదయం ఐదు మృతదేహాలకు, సాయంత్రం మూడు మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. హన్మకొండకు చెందిన ఒక మృతదేహాన్ని కుటుంబసభ్యులు తీసుకెళ్ళారు. ఒకే చితిపై నాలుగు మృతదేహాలను ఉంచి అంత్యక్రియలు జరిపించడంపై గ్రేటర్‌ వరంగల్‌ మునిసిపల్‌ కమిషనర్‌ పమేలా శత్పతి స్పందించారు. అనివార్య పరిస్థితుల్లోనే ఇలా చేయాల్సి వస్తోందన్నారు. ఇలాంటి మృతదేహాలను తీసుకెళ్ళేందుకు ప్రత్యేక వాహనం, శవ దహనాల కోసం విద్యుత్తు దహనవాటికను త్వరలోనే ఏర్పాటు చేస్తామన్నారు. కాగా అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలో పోతననగర్‌ శ్మశాన వాటిక సమీపంలోని ప్రజలు ఆందోళన నిర్వహించారు. మునిసిపల్‌ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates