దళిత రైతు ఆత్మహత్య

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– 13 గుంటల భూమి రికార్డు చేయడం లేదని మనస్తాపం
సర్పంచ్‌, వీఆర్వో, తహసీల్దారే కారణమని ఆడియో రికార్డు
గజ్వేల్‌ నియోజకవర్గంలోని వేలూరులో ఉద్రిక్తత

వర్గల్‌ : ‘నా పొలం 13 గుంటల లావణి పట్టా నాదినాకు ఇవ్వుమంటే ఇవ్వనని అన్నందుకు, తాతలు సంపాదించిన భూమి దక్కనందుకు నేను మందుతాగి.. వేలూరు గ్రామ సర్పంచ్‌, పట్వారీ, ఎమ్మార్వో పేరు మీద సచ్చిపోతున్నా’ అంటూ ఓ దళిత రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గంలోని వర్గల్‌ మండలం వేలూరులో గురువారం ఈ ఘటన వెలుగుచూడటంతో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు, ఇతర రైతులు సర్పంచ్‌ ఇంటి ఎదుట ఆందోళనకు దిగడంతో పోలీసులు గ్రామంలోకి ఎవర్నీ రానివ్వకుండా మోహరించారు. అయితే రైతువేదిక భవానికి తమ భూమిని అడిగారని బాధిత కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… బ్యాగరి నర్సింలు (40), బాలలక్ష్మి దంపతులకు ఇద్దరు కూతుళ్లుండగా వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్నారు. వారికి తాతల కాలం నుంచి వస్తున్న ఎకరం పొలం నుంచి కొంత అమ్ముకున్నాడు. మిగిలిన 13 గుంటల భూమిని కూడా రికార్డుల నుంచి అధికారులు తొలగించారు.

అయితే రైతు వేదిక భవనం కోసం భూమి తీసుకుంటున్నామని అధికారులు అతనికి తెలియజేయడంతో కుటుంబానికి అదేభూమిని ఆధారమని విన్నవించుకున్నాడు. ఇటీవల ఆ భూమిలోకి అధికారులు సర్వే చేయడానికి వస్తుండగా పట్టా చేయాలని పదేపదే కోరాడు. ఎవరూ పట్టించుకోవడం లేదనే మనస్తాపంతో.. భూమి వదిలేయకపోతే మందు తాగి చనిపోతానని సర్పంచ్‌కు రెవెన్యూ అధికారులకు తెలియజేశాడు. ‘ఇష్టం వచ్చినట్టు చేసుకో..’ అని వారి నుంచి సమాధానం రావడంతో బుధవారం సాయంత్రం పొలం వద్దకు చేరుకుని తన ఫోన్‌లో ఆడియో రికార్డ్‌ చేశాడు. తన చావుకు గ్రామ సర్పంచ్‌, వీఆర్వో, తహసీల్దారే కారణమని పేర్కొని పురుగుల మందు తాగుతూ ఫొటోలు తీయడంతో స్థానికులు గమనించి గజ్వేల్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం సిద్దిపేటకు తరలించగా గురువారం తెల్లవారుజామున ప్రాణం విడిచాడు. ఘటనపై కుటుంబ సభ్యులు, గ్రామ రైతులు సర్పంచ్‌ ఇంటి ఎదుట బైటాయించడంతో పోలీసులు చెదరగొట్టేందుకు యత్నించారు. గ్రామానికి 15 కిలోమీటర్ల దూరంలో చుట్టూ వందలాది మంది పోలీసులు మోహరించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సిద్దిపేట ప్రభుత్వాస్పత్రి నుంచి మృతదేహాన్ని తీసుకురావ డానికి వెళ్లిన బంధువులపైనా పోలీసులు దురుసుగా వ్యవహరించారని మృతుడి బంధువొకరు తెలిపారు.

కన్నీరు మున్నీరైన కూతురు
‘గతంలో సబ్‌స్టేషన్‌ కోసం భూమి లాక్కు న్నారు.. ఇప్పుడు కూడా ఎవరూ న్యాయం చేయలేదు. సర్పంచ్‌ దగ్గరికి వెళ్లి మందు తాగి చచ్చిపోతా అని చెబితే.. తాగుపోరా అన్నారు’ అని మృతుడు కుమార్తె హేమలత కన్నీటి పర్యంతమైంది.
తన తండ్రి బతికి ఉండగా ఎంత మందిని సాయం కోరినా ఎవరూ రాలేదనీ, ఇప్పుడు ఇంత మంది ఎందుకు వచ్చారనీ బోరుమంది. ఈ మరణానికి సర్పంచ్‌, అధికారులే కారణమని ఆరోపించింది.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates