ఆరోగ్యశ్రీలో చేర్చాల్సిందే

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

రోజురోజుకు పెరుగుతున్న డిమాండ్లు…
పాజిటివ్‌ కేసులు మరింత పెరిగే అవకాశం
చికిత్సకు ప్రభుత్వ ఆస్పత్రులు సరిపోయేది కష్టమే
ఆరోగ్యశ్రీలో చేర్చాల్సిన అవసరం లేదంటున్న సర్కారు
తామే మెరుగైన చికిత్స అందిస్తున్నామని వెల్లడి
సర్కారు ధరలకు చికిత్స కష్టమంటున్న ప్రైవేటు ఆస్పత్రులు

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుండటంతో ఆ వ్యాధి చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్లు కూడా పెరుగుతున్నాయి. కరోనా మహమ్మారి రాష్ట్రంలోని అన్ని జిల్లాలకూ వ్యాపించడంతో చికిత్సను కూడా హైదరాబాద్‌తోపాటు అన్ని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ అందిస్తున్నారు. కరోనా బారిన పడుతున్న వారిలో పేద, మధ్య తరగతి వారే ఎక్కువగా ఉంటున్నారు. బతుకుదెరువు కోసం బయటకు వచ్చే ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో దాని బారిన పడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. కాగా, వైరస్‌ సోకినవారు ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎక్కువ శ్రద్ధతో చికిత్స అందిస్తారనే ఉద్దేశంతో అక్కడికి వెళుతున్నారు. అయితే అవి వసూలు చేస్తున్న ఫీజులు పెద్దమొత్తంలో ఉంటున్నాయి. ఇది పేద ప్రజలు భరించలేనంతగా ఉంటోంది. అందుకే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా చికిత్సను వారి వద్ద అమలవుతున్న ఆరోగ్య పథకాల పరిధిలోకి తీసుకొచ్చారు.

ఏపీలో ఇప్పటికే ఆరోగ్యశ్రీలోకి..
పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో కరోనాను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొస్తూ అక్కడి ప్రభుత్వం ఉత్తర్వ్యులు జారీ చేసింది. దీంతో మన వద్ద కూడా ఆ పథకంలో చేర్చాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య అర లక్ష దాటింది. మరోవైపు రాబోయే నాలుగైదు వారాలు చాలా కీలకమని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. అంటే వైరస్‌ బాధితుల సంఖ్య లక్షలకు చేరే అవకాశం ఉంది. అప్పుడు ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రస్తుతం ఉన్న 17 వేల పడకలు ఏ మూలకూ సరిపోవు. అందరికీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం అందించడం సాధ్యం కాదు. పైగా సర్కారు దవాఖానల్లో 1000 వెంటిలేటర్లు కూడా లేవు. ఆగస్టు చివరి నాటికి రాష్ట్రంలో రెండు లక్షల కేసులు అవుతాయని అంచనా వేస్తుండగా.. ఐదు శాతం మందికి క్రిటికల్‌ కేర్‌ అవసరం అవుతుంది. 10 శాతం మందికి చికిత్స అవసరమవుతుంది. ఈ లెక్కన సర్కారీలో ఉన్న బెడ్లు సరిపోయే పరిస్థితి లేదు. అందుకే కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావాలని విపక్ష పార్టీలతో పాటు పలు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని రాజకీయ పార్టీలు ముఖ్యమంత్రికి లేఖలు కూడా రాశాయి.

అవసరం లేదంటున్న సర్కారు…
కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలో కి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అంత సు ముఖంగా లేదు. కరో నా బాధితులకు ప్రభు త్వం ఉచితంగా చికిత్స అందిస్తోందని, అలాంటప్పుడు దాని చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తోంది. ఇదే విషయాన్ని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ గడల శ్రీనివాస రావు ఇటీవల మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పరిధిలో 336 నెట్‌వర్క్‌ ఆస్పత్రులున్నాయి. వాటిలో అత్యధికం హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లోనే ఉన్నాయి. కరోనా చికిత్సకు సర్కారు ఇచ్చే డబ్బులు ప్రైవేటు ఆస్పత్రులకు ఏ మాత్రం సరిపోవని, వారు కూడా ఆరోగ్యశ్రీ పరిధిలో దీనికి చికిత్స అందించేందుకు ముందుకు రాకపోవచ్చని వైద్యఆరోగ్యశాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.

ఏపీలో ఇలా…
ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ జాబితాలో ఉన్న ప్రైవేటు ఆస్పత్రుల్లో బీపీఎల్‌ కుటుంబాలు, లేదా ఏపీఎల్‌ (దారిద్య్ర రేఖకు ఎగువన)లో ఉన్నవారికి ఉచితంగా కరోనా సేవలు అందిస్తారు. ఇందుకు ఫీజును నిర్దేశించిన రేట్ల ప్రకారం ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఆరోగ్యశ్రీ పరిధిలో లేని ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎవరైనా వైద్యం చేయించుకుంటే ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారమే చార్జీ చేయాలి. అందులో క్రిటికల్‌ కాని రోగులు, క్రిటికల్‌ రోగులకు ఏ మేరకు ఆస్పత్రులు చార్జ్‌ చేయాలన్న విషయాలపై అక్కడి ప్రభుత్వం స్పష్టంగా జీవో జారీ చేసింది. ఇక ఆరోగ్యశ్రీ జాబితాలో చేరదలుచుకున్న ఆస్పత్రులకు అదే రోజు అనుమతులను మంజూరు చేసే అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు అప్పగించారు. కరోనా రోగుల ఆరోగ్య పరిస్థితి విషమిస్తే వాడే ఖరీదైన మందుల వినియోగానికి సంబంధించిన మార్గదర్శకాలను కూడా ఏపీ ప్రభు త్వం విడుదల చేసింది. ప్రధానంగా సైటోకైన్‌ స్టార్మ్‌ సిండ్రో మ్‌ (సీఎ్‌సఎస్‌) ఉన్న దశలో టోసిలిజుమాబ్‌, ఫావిపిరవిర్‌, రెమ్‌డెసివిర్‌, మెరోపెనెం ఇంజక్షన్లను ఇవ్వాలని పేర్కొంది.

ఆరోగ్యశ్రీలో ఎందుకంటే..
ప్రస్తుతం కొంతమంది వరకు సర్కారు చికిత్స అందిస్తోంది. మున్ముందు అందరికీ అలా అందించడం సాధ్యం కాదు.
కరోనా చికిత్స బాగా ఖరీదైన వైద్యంగా ముద్రపడింది. పేదలు దీనిని భరించలేని పరిస్థితి.
ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువస్తే.. తెల్ల రేషన్‌ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ చికిత్స పొందగలుగుతారు.
ఇప్పటికే లాక్‌డౌన్‌ వల్ల పెద్ద ఎత్తున ప్రజలు ఉపాధి కోల్పోయారు. జీత భత్యాల్లో భారీగా కోతలు మొదలయ్యాయి. వ్యాపారాలు బంద్‌ అయ్యాయి. చాలా మంది కోలుకోలేని విధంగా దెబ్బతిన్నారు.

పేదలు చితికిపోతున్నారు
పేదలు ఇప్పటికే లాక్‌డౌన్‌ వల్ల ఆర్థికంగా చితికిపోయి ఉన్నారు. వారికి కరోనా సోకితే ప్రైవేటులో అన్నేసి లక్షలు పోసి చికిత్స తీసుకోవడం కష్టం. ఉన్నవన్నీ అమ్ముకున్నా… ఆ అప్పులు తీరవు. అందుకే ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువస్తే…కొంతమేరకు వారికి ఉపయోగం ఉంటుంది.
జగన్‌, ప్రైవేటు ఆస్పత్రుల బాధితుల సంఘం

అన్ని ఆస్పత్రుల్లో చికిత్సచేయలేం నెట్‌వర్క్‌ ఆస్పత్రుల యాజమాన్యాలు
కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావాలంటే భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) మార్గదర్శకాల ప్రకారం చికిత్సలో ప్రొటోకాల్‌ను కచ్చితంగా పాటించాలని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల యాజమాన్యాలు అంటున్నాయి. ఆ సౌకర్యాలు ఆస్పత్రుల్లో ఉన్నాయా? లేదా? అనేది ముందుగా నిర్ధారించుకోవాలని ఓ ఆస్పత్రి యాజమాన్యం అభిప్రాయపడింది. నెట్‌వర్క్‌ పరిధిలోని అన్ని ఆస్పత్రులు కరోనా చికిత్సకు ఫిట్‌ కావని, కొన్ని మాత్రమే ఆ సేవలను సరిగ్గా అందించగలవని పేర్కొంది. పైగా సర్కారు ఇచ్చే ధరలు తమకు ఏ మాత్రం సరిపోవని తెలిపింది. అందుకే హైదరాబాద్‌లో కరోనా చికిత్సకు 90కి పైగా ఆస్పత్రులకు అనుమతినిస్తే…అందులో సగమే చికిత్స అందిస్తున్నాయని గుర్తు చేసింది.

Courtesy AndhraJyothy

RELATED ARTICLES

Latest Updates